పంటల బీమా ప్రీమియం 'తక్షణమే చెల్లించండి': వైఎస్‌ జగన్‌ | YS Jagan demand to Chandrababu for Crop insurance premium | Sakshi
Sakshi News home page

పంటల బీమా ప్రీమియం 'తక్షణమే చెల్లించండి': వైఎస్‌ జగన్‌

Published Mon, Aug 12 2024 4:48 AM | Last Updated on Mon, Aug 12 2024 1:01 PM

YS Jagan demand to Chandrababu for Crop insurance premium

సీఎం చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ డిమాండ్‌

2023–24 ఖరీఫ్‌లో నష్టపోయిన రైతన్నలను వెంటనే ఆదుకోవాలి 

గతంలో ఏటా ఏప్రిల్‌–మే నెలల్లోనే ప్రీమియం చెల్లించి నష్టపోయిన రైతులను జూన్‌లో ఆదుకున్నాం 

54.55 లక్షల మంది రైతులకు రూ.7,802 కోట్లు అందించి అండగా నిలిచాం 

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ ప్రీమియం కట్టకపోవడంతో కేంద్రం తన వాటా ఇవ్వలేదు 

సూపర్‌ సిక్స్‌ హామీ కింద రూ.20 వేలు పెట్టుబడి సాయాన్ని తక్షణమే చెల్లించాలి  

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌ 2023–24 సీజన్‌కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ చెల్లించకపోవడంతో రైతులకు పంటల బీమా పరిహారం చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పంటల బీమా ప్రీమియం చెల్లించి రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సూపర్‌ సిక్స్‌ హామీ కింద పెట్టుబడి సాయంగా సీఎం చంద్రబాబు ఏటా రైతులకు ఇస్తామన్న రూ.20 వేలను వెంటనే చెల్లించాలన్నారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ఆదివారం “ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. అందులో ఇంకా ఏమన్నారంటే.. 

ఉచిత పంటల బీమాలో ఆదర్శంగా నిలిచాం.. 
ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియాన్ని మా ప్రభుత్వ హయాంలో ఏటా ఏప్రిల్‌–మే నెలల్లో చెల్లించి నష్టపోయిన రైతులను జూన్‌లో ఆదుకున్నాం. ఖరీఫ్‌లో పంటలు వేసే సమయానికి రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి సమర్థంగా పథకాన్ని అమలు చేశాం. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన వెంటనే కేంద్రం కూడా తన వాటా విడుదల చేస్తుంది. అనంతరం సుమారు 30 రోజుల్లోగా బీమా కంపెనీ పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తుంది. ఇలా మా ప్రభుత్వ హయాంలో 54.55 లక్షల మంది రైతులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.7,802 కోట్లు అందించి అండగా నిలిచాం. తద్వారా ఉచిత పంటల బీమా విషయంలో మన రాష్ట్రం దేశంలో పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.  

రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతతో రైతులకు తీవ్ర నష్టం.. 
2023–24 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఎన్నికల కోడ్‌ కారణంగా ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మీ ప్రభుత్వం వెంటనే స్పందించి చెల్లించాల్సి ఉన్నప్పటికీ దాని గురించి పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ ప్రీమియం కట్టకపోవడంతో కేంద్రం కూడా తన వాటా ఇవ్వలేదు. ఇప్పటికే జూన్, జూలై మాసాలు గడిచిపోయాయి. 

ఆగస్టులో దాదాపు పక్షం రోజులు పూర్తి కావస్తున్నా మీ ప్రభుత్వంలో ఎలాంటి కదలికలేక పోవడం అత్యంత విచారకరం. ఈ సంవత్సరం కోస్తాలో అతివృష్టి, రాయలసీమలో కరువు వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికైనా మేలుకుని వెంటనే ఉచిత పంటల బీమా ప్రీమియం చెల్లించి రైతులకు బీమా పరిహారం చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాం.  

మళ్లీ వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగే దుస్థితి
రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.20 వేలు చొప్పున ఇస్తామని సూపర్‌ సిక్స్‌ హామీల్లో పేర్కొన్నారు. మీరిచ్చే పెట్టుబడి సహాయం కోసం రైతులంతా ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ దాదాపు పూర్తి కావస్తున్నా ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో కోవిడ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థలన్నీ కుదేలైనా మా ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా అన్నదాతలకు రైతు భరోసా అందించాం. 

ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సీజన్‌లో రైతు భరోసా చెల్లించాం. ఆ విధంగా 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్లు పెట్టుబడి సహాయం అందించాం. ఇప్పుడు మళ్లీ రైతులు పెట్టుబడి డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ, వడ్డీ వ్యాపారులు చుట్టూ మళ్లీ తిరిగే దుస్థితి కల్పించారు. వెంటనే పెట్టుబడి సహాయం కింద రైతులకు మీరు ఇస్తానన్న డబ్బులతో పాటు ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లించి 2023–24 పరిహారం సొమ్ము విడుదలకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం.  రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గుర్తు పెట్టుకోండి చంద్రబాబూ! 

వైఎస్సార్‌ రైతు భరోసాతో పెట్టుబడి సాయం ఇలా
రైతుల సంఖ్య              లబ్ధి రూ.కోట్లలో 
53.58 లక్షలు             34,288    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement