Control measures
-
సెల్‌ఫోన్ వదిలితేనే స్టీరింగ్
సాక్షి, హైదరాబాద్: డ్రైవర్లు బస్సు నడిపే క్రమంలో మొబైల్ఫోన్లు వాడుతూ ప్రమాదాలబారిన పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటుండటంతో టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నియంత్రణ చర్యలు ప్రారంభించింది. డ్రైవర్ల ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండే చర్యల్లో భాగంగా వారు విధుల్లో ఉన్నప్పుడు సెల్ఫోన్ల వినియోగాన్ని నియంత్రించాలని నిర్ణయించింది. దీంతోపాటు డ్యూటీలో భాగంగా గమ్యం చేరిన తర్వాత.. తిరిగి మళ్లీ బయలుదేరేలోగా ఉన్న విశ్రాంతి సమయంలోనూ మొబైల్ ఫోన్లు వాడకుండా నిషేధించింది. ఈ చర్యలకు డ్రైవర్లు అలవాటుపడేలా వారికి అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఆ తర్వాత దీన్ని పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. నిబంధనలు ఇలా... హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే టీఎస్ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు బస్టాండ్‌కు చేరుకోగానే అక్కడి టీఎస్ఆర్టీసీ కేంద్రంలోని ఏటీఎం కార్యాలయంలో మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తిరిగి బస్సు బయలుదేరే సమయంలో వాటిని తీసుకోవాలి. ఇతర దూరప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సుల్లో ఉండే అటెండర్‌కు డ్రైవర్ తన మొబైల్ ఫోన్ అప్పగించాలి. ఏవైనా ఫోన్ కాల్స్ వస్తే అటెండరే మాట్లాడి డ్రైవర్‌కు సమాచారం చెప్పాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచో, లేదా ఇతరుల నుంచో వచ్చే ముఖ్యమైన కాల్స్ ఉంటే బస్సును పక్కన ఆపి మాట్లాడిన తర్వాతే బస్సును నడపాల్సి ఉంటుంది. ఇద్దరు డ్రైవర్లు ఉండే నాన్–ఏసీ దూరప్రాంత బస్సుల్లో అయితే రెండో డ్రైవర్‌కు ఫోన్ అప్పగించాల్సి ఉంటుంది. హైదరాబాద్ సిటీ బస్సు సర్వీసుల్లోనూ కఠిన నిబంధనల అమలు ప్రారంభించారు. డిపోనకు రాగానే అక్కడి కంట్రోలర్‌కు డ్రైవర్లు ఫోన్లను అప్పగించాలి. ఈలోగా ముఖ్యమైన ఫోన్ కాల్స్ వస్తే విషయాన్ని తెలుసుకొని కంట్రోలర్లు ఆయా దారుల్లో ఉండే పాయింట్ల మీది కంట్రోలర్ల ద్వారా ఆ సమాచారాన్ని డ్రైవర్లకు చేరవేయాలి. అవగాహన కార్యక్రమాల తర్వాత ఈ నిబంధన పాటించని వారి నుంచి మొబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకుని 2 నెలలపాటు బస్ డిపోల్లోనే ఉంచనున్నారు. అప్పటికీ తీరు మారకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఆ డ్రైవర్లకు భారం తప్పించే ఏర్పాటు.. బస్సు టికెట్లను అడ్వాన్సుగా ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం (ఓపీఆర్ఎస్) ద్వారా బుక్ చేసుకున్నప్పుడు ప్రయాణికుడికి బస్సు డ్రైవర్ సెల్ నంబర్ అందిస్తున్నారు. బస్సును ట్రాక్ చేసే క్రమంలో ప్రయాణికుడు డ్రైవర్‌కు పలుమార్లు ఫోన్లు చేయడం ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఆర్టీసీ రూపొందించిన గమ్యం యాప్‌ను ప్రయాణికులు ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే బస్సును సులభంగా ట్రాక్ చేసుకోవడంతోపాటు ఇతర సమస్త సమాచారం తెలుస్తుంది. ఈ దిశగా ప్రయాణికులకు అవగాహన కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు టికెట్ బుక్ చేసుకుంటే.. డ్రైవర్ నంబర్‌కు బదు లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసే సెంటర్ నంబర్ ఇవ్వనున్నారు. ప్రయాణికుడు ఫోన్ చేయగానే ఆ సెంటర్ సిబ్బంది సిస్టంలో గమ్యం యాప్ తెరిచి బస్సు వివరాలు తెలుసుకుని చేరవేస్తారు. -
కొత్త వేరియంట్ల ముప్పు అధికమే!
జెనీవా: ఒమిక్రాన్ వేరియంట్‌తోనే మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోయినట్లు భావించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు చెందిన కోవిడ్–19 టెక్నికల్ లీడ్ మారియా వాన్ కెర్ఖోవ్ చెప్పారు. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ముప్పు అధికంగానే ఉందని తెలిపారు. ఒమిక్రాన్‌లోని నాలుగు వేర్వేరు వెర్షన్లను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. వైరస్ ఎన్నో రకాలుగా మార్పులకు గురవుతోందని, ఉత్పర్తివర్తనాలు సంభవిస్తున్నాయని, కొత్త వేరియంట్ల పుట్టుకకు అవకాశాలు ఎన్నో రెట్లు ఉన్నట్లు గుర్తించామని వివరించారు. కరోనా కొత్త వేరియంట్ల బారి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే సరిపోదని, నియంత్రణ చర్యలు కచ్చితంగా పాటించాలని సూచించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకొనే చర్యలు కచ్చితంగా చేపట్టాలన్నారు. కరోనా కేసులు 17 శాతం తగ్గాయ్ అంతకుముందు వారంతో పోలిస్తే కోవిడ్–19 పాజిటివ్ కేసులు గత వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 17 శాతం తగ్గాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. కరోనా సంబంధిత మరణాలు 7 శాతం తగ్గిపోయానని తెలిపింది. అమెరికాలో పాజిటివ్ కేసులు ఏకంగా 50 శాతం పడిపోయాయని పేర్కొంది. ఈ మేరకు తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. మొత్తం కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులే 97 శాతం ఉన్నాయని వివరించింది. మిగతా 3 శాతం కేసులు డెల్టా వేరియంట్‌కు సంబంధించినవేనని నివేదికలో ప్రస్తావించింది. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒమిక్రాన్ ఉనికిని గుర్తించారని స్పష్టం చేసింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6 వరకూ ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 1.9 కోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 68,000 మంది మరణించారని తెలియజేసింది. కోవిడ్ నియంత్రణకు కొత్త కాంబో డ్రగ్! కోవిడ్–19 వ్యాప్తి నియంత్రణకు ప్రయోగాత్మక ఔషధం బ్రెక్వినార్ను రెమ్‌డెసివిర్ లేదా మోల్నుపిరవిర్తో కలిపి ఇస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నట్లు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో నిర్వహించిన అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను నేచర్ పత్రికలో ప్రచురించారు. రెమ్‌డెసివిర్ లేదా మోల్నుపిరవిర్‌ను వేర్వేరుగా ఇచ్చినప్పటి కంటే బ్రెక్వినార్ కాంబినేషన్‌తో ఇస్తే వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటున్నట్లు అధ్యయనకర్తలు తేల్చారు. అయితే, ఈ కాం బో డ్రగ్‌పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంది. -
కోవిడ్ కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు భేష్
సాక్షి, అమరావతి: కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కోవిడ్ ప్రతికూల పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు మొక్కవోని ధైర్యంతో వ్యవహరించి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించారని ఆయన ప్రశంసించారు. వైద్యులు, ఇతర వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, రెడ్‌క్రాస్ ఇతర స్వచ్ఛంద సంస్థలు రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో సమర్థవంతమైన సేవలందించారన్నారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించడం ద్వారా ప్రజలతో మమేకమయ్యే అవకాశం తనకు లభించిందన్నారు. సేంద్రియ వ్యవసాయం, మొక్కల పెంపకం, రక్తదాన శిబిరాలు మొదలైన ప్రజోపయోగ కార్యక్రమాల్లో తనకు పాల్గొనే అవకాశం లభించిందని చెప్పారు. ఏపీ రెడ్ క్రాస్ సొసైటీ ఒకేరోజు అత్యధిక సంఖ్యలో వలంటీర్ల ద్వారా రక్తదాన శిబిరాలను నిర్వహించడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నెలకొల్పడం గొప్ప ఘనతగా పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా తీసుకొచ్చిన సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేసి దేశానికి మార్గదర్శిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. -
పక్కాగా తెలంగాణ అంతటా కర్ఫ్యూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగి పోతుండటం, వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం పొద్దున్నే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు, విపత్తుల నిర్వహణ చట్టం-2005కు అనుగుణంగా ఈ ఆదేశాలిస్తున్నట్టు పేర్కొన్నారు. రోజూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని.. మంగళవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు (మే 1న ఉదయం 5 గంటల వరకు) అమల్లో ఉంటుందని ప్రకటించారు. అన్ని వాణిజ్య సముదాయాలు, క్లబ్‌లు, పబ్‌లు, బార్లు, వైన్‌షాప్‌లు, అత్యవసరం కాని అన్ని రకాల వాణిజ్య సంబంధిత దుకాణాలను రాత్రి 8 గంటలలోగా మూసేయాలని.. వాటిలో పనిచేసే సిబ్బంది ఇళ్లకు చేరుకోవడానికి గంటసేపు వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. కరోనా సెకండ్ వేవ్‌తో రాష్ట్రంలో కొద్దిరోజులుగా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం వ్యాక్సినేషన్, టెస్టులు చేయడం, ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణను పట్టించుకోవడం లేదని.. జనం యథేచ్ఛగా తిరగకుండా చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటూ హైకోర్టులో పిల్స్ దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన కోర్టు.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘రాష్ట్రంలో లాక్‌డౌన్‌గానీ, నైట్ కర్ఫ్యూగానీ విధిస్తారా? ఇంకా ఏమేం చర్యలు తీసుకుంటారో 48 గంటల్లో తేల్చి చెప్పండి’అంటూ సోమవారం ఆదేశించింది. దానిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు విన్నవించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం నైట్ కర్ఫ్యూ ఉత్తర్వులు జారీ చేశారు. కర్ఫ్యూ నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని అందులో పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో కఠినంగా నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. కర్ఫ్యూ సమయంలో కొన్ని అత్యసవర, నిరంతరం సేవలు అవసరమైన సంస్థలు, వాటిలో పనిచేసే సిబ్బందికి మినహాయింపులు ఉంటాయని తెలిపారు. గంట ముందే బంద్.. రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు తగిన ఏర్పాట్లు సిద్ధం చేశారు. బారికేడ్లు, పికెట్లు, కా>ర్డన్ ఏరియాలను ఎంపిక చేశారు. కర్ఫ్యూ అమలు కోసం మంగళవారం నుంచి రాత్రి విధుల్లో ఎక్కువ మంది సిబ్బందిని మోహరించనున్నారు. ఇక మినహాయింపు ఉన్నవి మినహా అన్ని కార్యాలయాలు, సంస్థలు, దుకాణాలను రాత్రి 8 గంటలకే మూసేయాలని అధికారులు స్పష్టం చేశారు. అలాగైతేనే వినియోగదారులు, ఉద్యోగులు 9 గంటలకల్లా గమ్యస్థానాలకు, ఇళ్లకు చేరడం సాధ్యమని పేర్కొన్నారు. మినహాయింపు ఉన్నవారు మినహా ఎవరైనా రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మినహాయింపులున్న మరికొన్ని అంశాలు అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల్లో పనిచేసే ఎమర్జెన్సీ సిబ్బంది తగిన గుర్తింపు కార్డులు చూపిస్తే అనుమతినిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు సంబంధించిన డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, పారా మెడికల్ సిబ్బంది తమ గుర్తింపు కార్డులను చూపిస్తే అనుమతిస్తారు. గర్భిణీలు, ఆస్పత్రుల సేవలు అవసరమైన రోగులకు అనుమతి. రాష్ట్రంలోకి వచ్చే, పోయే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు, జిల్లాల నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే బస్సు సర్వీసులపై ఆంక్షలు లేవు. గూడ్స్ వాహనాలకు పర్మిషన్ ఉంటుంది. ఎలాంటి ప్రత్యేక పాసులు అవసరం లేదు. ఉదయం 6.30 నుంచి రాత్రి 7.45 వరకే మెట్రో రైళ్లు రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. పొద్దున 6.30 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకే మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. ప్రయాణికులు విధిగా మాస్కులు ధరించాలని, స్టేషన్లలోకి ప్రవేశించే ముందు థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ వినియోగించాలని.. స్టేషన్లు, రైలుబోగీల్లో భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సురక్షిత ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నామని.. ప్రయాణికులు భయాందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొంది. 8 గంటలకే ’మద్యం’ బంద్ నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ ఆంక్షలు విధించింది. వైన్ షాపులు, బార్లు, క్లబ్బులు, కల్లు దుకాణాలను రాత్రి 8 గంటల కల్లా మూసివేయాలని ఆదేశించింది. వైన్ షాపులు, బార్లు తెరచి ఉన్న సమయంలో కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. బార్లలో ప్రవేశద్వారం వద్దనే థర్మామీటర్లు ఏర్పాటు చేయాలని, సిబ్బంది కచ్చితంగా మాస్కులు ధరించాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, భౌతిక దూరం పాటించేలా వినియోగదారులను కట్టడి చేయాలని పేర్కొంది. చదవండి: హైదరాబాద్‌లో మళ్లీ లాక్డౌన్ రోజులు.. రోడ్లన్నీ వెలవెల -
వద్దంటే వింటారా... పిండుడు మానుతారా..!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇప్పటివరకు ఆరో తరగతి చదివిన విద్యార్థి వార్షిక ఫీజు రూ.1,72,650. ఇప్పుడు అదే విద్యార్థి 7వ తరగతికి వచ్చాడు. అతనికి పాఠశాల యాజమాన్యం నిర్ణయించిన వార్షిక ఫీజు రూ. 2,20,170. ...అంటే అదనంగా 47,520 పెంచారు. దాదాపు 27%పెరిగిందన్నమాట. అదనంగా కన్వేయన్స్ చార్జీలు 50,400. లంచ్ చార్జీలు రూ. 32వేలు అంటూ.. సదరు యాజమాన్యం ఆన్లైన్లోనే తల్లిదండ్రులకు అప్డేట్ చేసింది. ఇక హైదరాబాద్ నగరంలోని మరో ప్రైవేటు స్కూల్లో 8వ తరగతి విద్యార్థి ఫీజు రూ. 42 వేలు. ఆ విద్యార్థి 9వ తరగతికి వచ్చాడు. అతనికి నిర్ణయించిన ఫీజు రూ.47 వేలు. అంటే రూ.5 వేలు (10 శాతానికి పైగా) పెంచేశారు. ఇవే కాదు.. కార్పొరేట్ స్కూళ్లు కూడా 15 శాతం ఫీజు పెంచుతామని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాయి. రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లు ఫీజు దోపిడీకి ఏర్పాట్లు సన్నద్ధమయ్యాయి. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి మానసికంగా సిద్ధం చేస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వం ఫీజులను పెంచవద్దని స్పష్టం చేసినా యాజమాన్యాలు మాత్రం పెడచెవిన పెడుతున్నాయి. కరోనా నేపథ్యంలో స్కూల్ ఫీజులను పెంచడానికి వీల్లేదని, కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే, అదీ నెలవారీగా తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంగా చెప్పినా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు.సీఎం ఆదేశాల మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినా బేఖా తరు చేసి స్కూళ్లు తెరవగానే పెంచిన ఫీజులను దండుకునేందుకు సిద్ధం అయ్యాయి. రెండేళ్లుగా వద్దంటున్నా పట్టింపేదీ రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను పెంచవద్దని ప్రభు త్వం రెండేళ్లుగా చెబుతూనే ఉంది. ఫీజుల నియంత్రణ చర్యలపై మాజీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ తిరుపతి రావు నేతృత్వంలో ప్రభుత్వం 2017 మార్చిలో ఉన్నత స్థాయి కమిటీని వేసింది. ఆ కమిటీ 2018లో నివేదికను అందజేసింది. అందులో పాఠశాలలు ఏటా 10% వరకు ఫీజులను పెంచుకోవచ్చని సిఫారసు ఉండటంతో ప్రభుత్వం ఆ నివేదికను పక్కన పెట్టింది. 2018–19లో పాఠశాలలు ఫీజులను పెంచవద్దని ప్రభుత్వం స్పష్టం చేసినా యాజమాన్యాలు వినిపించుకోలేదు. ఫీజుల నియంత్రణ నివేదిక ప్రభుత్వం పరిశీలనలో ఉందని, దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అందుకే 2019–20 విద్యా ఏడాదిలో ఫీజులను పెంచవద్దని అప్పటి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య జీవో జారీ చేశారు. అయినా యాజమాన్యాలు తల్లిదండ్రులపై భారం మోపాయి. కొద్దిగా పేరున్న స్కూళ్లనుంచి టాప్ స్కూళ్లలో అధిక మొత్తం ఫీజులను పెంచేశాయి. దీనిపై హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామ్‌చంద్రన్‌కు ఫిర్యాదు చేశారు. సగం స్కూళ్లలో ఫీజు పెంపు రాష్ట్రంలో 10,549 ప్రైవేటు పాఠశాలలు ఉండగా వాటిల్లో 31,21539 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ప్రైవేటు స్కూళ్లలో సగం వరకు సాధారణ పాఠశాలలు ఉండగా, మిగతా వాటిలో సగం వరకు మధ్య తరహా పాఠశాలలే. మిగతా వాటిల్లో టాప్, కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లు ఉన్నాయి. ప్రస్తుతం సాధారణ పాఠశాలల్లో పెద్దగా ఫీజుల పెంపు అంశం రాకపోగా, మిగతా వాటిల్లోనే చాలావరకు పెంచుతూ యాజమాన్యాలు నిర్ణయాలు తీసుకున్నాయి. పాఠశాల స్థాయిని బట్టి 10 శాతం నుంచి 28 శాతం వరకు ఫీజులను పెంచేశాయి. ట్యూషన్ ఫీజులే కాదు ఇతరత్రా ఫీజులనూ పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల తల్లిదండ్రులు మండి పడుతున్నారు. -
ఏపీ: కరోనా కట్టడికి పటిష్ట చర్యలు
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ సీఎం అదనపు కార్యదర్శి పీవీ రమేష్ తెలిపారు. ఆయన గురువారం ఏపీ సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు గ్రామస్థాయిలో వాలంటీర్లకు శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. దేశంలో అందరికంటే ముందే ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వస్తున్న వారి సమాచారాన్ని ముందే సేకరిస్తున్నామని చెప్పారు. ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నామని.. తిరుపతి, విజయవాడలో ఇప్పటికే ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. త్వరలోనే కాకినాడ, కర్నూలు, విశాఖలో ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడ, అనంతపురంలో 100 పడకలతో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. (ఏపీలో మరో కరోనా కేసు నమోదు..) బాధితుల పరిస్థితి నిలకడగా ఉంది ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రెండు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు. ఇద్దరి బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్ వస్తువులపై పడితే 5 గంటల నుంచి 3 రోజుల వరకు బతికి ఉంటుందని.. ఏదైనా ముట్టుకున్న తర్వాత చేతులను 30 సెక్షన్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఎవరితోనైనా మూడు అడుగుల దూరంలో ఉండి మాట్లాడాలన్నారు. ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ వ్యక్తిగతంగా ప్రజలు తమను తాము నియంత్రించుకోవడం మంచిదని రమేష్ తెలిపారు. (తల్లి.. బిడ్డలు.. మధ్య కరోనా!) ఇంటికే పరిమితం కావాలి.. విదేశాల నుంచి వచ్చినవారు 14 రోజులపాటు ఇంటికే పరిమితం కావాలన్నారు. ఎవరినీ కలవకుండా స్వీయ నిర్బంధంలో ఉంటే అందరినీ కాపాడినవాళ్లు అవుతారని పీవీ రమేష్ సూచించారు. పారాసెట్మాల్ ట్యాబ్లెట్ వేసుకుని విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వివరించారు. 102 కంటే ఎక్కువ జ్వరం, గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉంటే ఆస్పత్రికి వెళ్లాలన్నారు. 104 కు ఫోన్ చేస్తే ప్రభుత్వాధికారులే ఆస్పత్రులకు చేరుస్తారని తెలిపారు. గురుకుల పాఠశాలలు, హాస్టల్లో ఉన్న విద్యార్థులను.. వైద్యశాఖ, ఆర్టీసీ అధికారులతో మాట్లాడి వారి ఇళ్లకు పంపిస్తున్నామన్నారు. అందరం మాస్క్‌లు వేసుకోవాల్సిన అవసరం లేదని పీవీ రమేష్ పేర్కొన్నారు. (స్వీయ గృహ నిర్బంధమే మేలు) -
జనతా దర్బార్ రసాభాస
కేజ్రీవాల్‌కు సమస్యలు చెప్పుకునేందుకు వెల్లువెత్తిన జనం సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల సమస్యలను స్వయం వారి నుంచి తెలుసుకునేందుకంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఢిల్లీ సచివాలయం వద్ద నిర్వహిం చిన మొట్టమొదటి జనతా దర్బార్‌కు జనం వెల్లువెత్తటంతో రసాభాసగా మారింది. వేలాది మంది ఒక్కసారిగా తరలిరావటంతో ప్రభుత్వం చేసిన ఏరా ట్లు, నియంత్రణ చర్యలు ఏమాత్రం సరిపోలేదు. జనం బారికేడ్లను కూలదోసి ముందుకురావటం, సీఎంను కలవటానికి పోటీపడటంతో పెద్ద ఎత్తున తోపులాట చోటుచేసుకుంది. తీవ్ర గందరగోళం తలెత్తటంతో కేజ్రీవాల్ అర్ధంతరంగా జనతాదర్బార్‌ను నిలిపివేశారు. పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసిన అనంతరం మరో వారం రోజుల్లోపలే మళ్లీ జనతాదర్బార్‌ను నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. అర కిలోమీటరు వరకూ జనం.. ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం.. ఢిల్లీ సచివాలయం ఎదుట రోడ్డుపై ఉదయం తొమ్మిదిన్నర నుంచి 11 గంటల వరకు జనతా దర్బార్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. వెయ్యి మంది ఢిల్లీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసింది. సమస్యలు తెలిపేందుకు వచ్చే ప్రజల కోసం వెయ్యి కుర్చీలు కూడా వేశారు. అయితే తమ సమస్యలను మొరపెట్టుకోవడానికి నగరం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో జనం వచ్చారు. అర కిలోమీటరు కన్నా పొడవు క్యూలో జనం నిలబడ్డారు. మంత్రివర్గ సహచరులతో కలిసి కేజ్రీవాల్ జనతాదర్బార్‌కు రాగానే.. ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి తమ సమస్య వినిపించాలన్న ఆత్రుతతో జనం మధ్య తోపులాట మొదలై పరిస్థితి అదుపుతప్పింది. జనం బారికేడ్లను కూలదోసి మరీ ముందుకు తోసుకెళ్లారు. పోలీసులతో పాటు, సాయంగా ఆప్ కార్యకర్తలు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ప్రజలను నియంత్రించలేకపోయారు. ప్రజల సహాయం కోసం ఏర్పాటుచేసిన హెల్ప్డెస్క్లూ పనికిరాకుండా పోయాయి. ఈ గందరగోళం మధ్య కేజ్రీవాల్ కూడా బారికేడ్ పెకైక్కి ప్రజలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో పాటు.. కేజ్రీవాల్ మధ్యలోనే జనతా దర్బార్ నుంచి పోలీసుల సాయంతో సచివాలయంలోకి వెళ్లిపోయారు. పాఠం నేర్చుకున్నాం...కేజ్రీవాల్ కాసేపటికి సచివాలయంలోని ఒక భవనం పెకైక్కి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇంతమంది వస్తారని తాము అనుకోలేదని, సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల జనతా దర్బార్‌ను కొనసాగించ లేకపోతున్నామని చెప్పారు. జనం తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. సోమ, మంగళవారాలు జనతా దర్బార్ జరగవన్నారు. వారం రోజుల లోపల మెరుగైన ఏర్పాట్లతో మళ్లీ జనతా దర్బార్ నిర్వహిస్తామని చెప్పారు. కేజ్రీవాల్ ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలు అదుపుతప్పటంతో తాను జనతా దర్బార్ నుంచి బయటకు వచ్చేశానని.. లేనట్లయితే తొక్కిసలాట జరిగేదని పేర్కొన్నారు. నిర్వహణా లోపం వల్ల పరిస్థితి గందరగోళంగా తయారైనప్పటికీ పాఠం నేర్చుకున్నామన్నారు. ఇందుకు ప్రజలకు క్షమాపణ చెప్తూ.. ఈసారి మెరుగైన ఏర్పాట్లతో పెద్ద వేదిక వద్ద దర్బార్‌ను నిర్వహిస్తామన్నారు. దర్బార్‌ను అర్థంతరంగా నిలిపివేయటంతో.. నేరుగా సీఎంను కలుసుకుని తమ సమస్యలను విన్నవించుకోవాలని ఆశలతో వచ్చిన వేలాది మంది జనం నిరుత్సాహంతో వెనుదిరిగారు. కొందరు తమ సమస్యలు వినిపించే అవకాశం లభించకపోవడంతో ఆగ్రహానికి గురయ్యారు. మరి కొందరు నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. మంత్రులు సౌరభ్‌భరద్వాజ్, సోమ్‌నాథ్‌భారతి, రాఖీబిర్లా అక్కడే ఉండి ప్రజల సమస్యలను విన్నారు. వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. చాలా మంది తమ సమస్యలను వినిపించకుండానే వెనుదిరిగారు. వినతిపత్రాలు చిందరవందరగా పడిపోయి కనిపించాయి.