సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ సీఎం అదనపు కార్యదర్శి పీవీ రమేష్ తెలిపారు. ఆయన గురువారం ఏపీ సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు గ్రామస్థాయిలో వాలంటీర్లకు శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. దేశంలో అందరికంటే ముందే ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వస్తున్న వారి సమాచారాన్ని ముందే సేకరిస్తున్నామని చెప్పారు. ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నామని.. తిరుపతి, విజయవాడలో ఇప్పటికే ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. త్వరలోనే కాకినాడ, కర్నూలు, విశాఖలో ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడ, అనంతపురంలో 100 పడకలతో అడ్వాన్స్‌డ్ ట్రీట్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. (ఏపీలో మరో కరోనా కేసు నమోదు..)
బాధితుల పరిస్థితి నిలకడగా ఉంది
ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రెండు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు. ఇద్దరి బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్ వస్తువులపై పడితే 5 గంటల నుంచి 3 రోజుల వరకు బతికి ఉంటుందని.. ఏదైనా ముట్టుకున్న తర్వాత చేతులను 30 సెక్షన్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఎవరితోనైనా మూడు అడుగుల దూరంలో ఉండి మాట్లాడాలన్నారు. ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ వ్యక్తిగతంగా ప్రజలు తమను తాము నియంత్రించుకోవడం మంచిదని రమేష్ తెలిపారు. (తల్లి.. బిడ్డలు.. మధ్య కరోనా!)
ఇంటికే పరిమితం కావాలి..
విదేశాల నుంచి వచ్చినవారు 14 రోజులపాటు ఇంటికే పరిమితం కావాలన్నారు. ఎవరినీ కలవకుండా స్వీయ నిర్బంధంలో ఉంటే అందరినీ కాపాడినవాళ్లు అవుతారని పీవీ రమేష్ సూచించారు. పారాసెట్‌మాల్ ట్యాబ్లెట్ వేసుకుని విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వివరించారు. 102 కంటే ఎక్కువ జ్వరం, గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉంటే ఆస్పత్రికి వెళ్లాలన్నారు. 104 కు ఫోన్ చేస్తే ప్రభుత్వాధికారులే ఆస్పత్రులకు చేరుస్తారని తెలిపారు. గురుకుల పాఠశాలలు, హాస్టల్‌లో ఉన్న విద్యార్థులను.. వైద్యశాఖ, ఆర్టీసీ అధికారులతో మాట్లాడి వారి ఇళ్లకు పంపిస్తున్నామన్నారు. అందరం మాస్క్‌లు వేసుకోవాల్సిన అవసరం లేదని పీవీ రమేష్ పేర్కొన్నారు.
(స్వీయ గృహ నిర్బంధమే మేలు)
Comments
Please login to add a commentAdd a comment