సాక్షి, అమరావతి: కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కోవిడ్ ప్రతికూల పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు మొక్కవోని ధైర్యంతో వ్యవహరించి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించారని ఆయన ప్రశంసించారు. వైద్యులు, ఇతర వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, రెడ్‌క్రాస్ ఇతర స్వచ్ఛంద సంస్థలు రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో సమర్థవంతమైన సేవలందించారన్నారు.
గత రెండేళ్లలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించడం ద్వారా ప్రజలతో మమేకమయ్యే అవకాశం తనకు లభించిందన్నారు. సేంద్రియ వ్యవసాయం, మొక్కల పెంపకం, రక్తదాన శిబిరాలు మొదలైన ప్రజోపయోగ కార్యక్రమాల్లో తనకు పాల్గొనే అవకాశం లభించిందని చెప్పారు. ఏపీ రెడ్ క్రాస్ సొసైటీ ఒకేరోజు అత్యధిక సంఖ్యలో వలంటీర్ల ద్వారా రక్తదాన శిబిరాలను నిర్వహించడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నెలకొల్పడం గొప్ప ఘనతగా పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా తీసుకొచ్చిన సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేసి దేశానికి మార్గదర్శిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment