జనతా దర్బార్ రసాభాస
కేజ్రీవాల్‌కు సమస్యలు చెప్పుకునేందుకు వెల్లువెత్తిన జనం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల సమస్యలను స్వయం వారి నుంచి తెలుసుకునేందుకంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఢిల్లీ సచివాలయం వద్ద నిర్వహిం చిన మొట్టమొదటి జనతా దర్బార్‌కు జనం వెల్లువెత్తటంతో రసాభాసగా మారింది. వేలాది మంది ఒక్కసారిగా తరలిరావటంతో ప్రభుత్వం చేసిన ఏరా ట్లు, నియంత్రణ చర్యలు ఏమాత్రం సరిపోలేదు. జనం బారికేడ్లను కూలదోసి ముందుకురావటం, సీఎంను కలవటానికి పోటీపడటంతో పెద్ద ఎత్తున తోపులాట చోటుచేసుకుంది. తీవ్ర గందరగోళం తలెత్తటంతో కేజ్రీవాల్ అర్ధంతరంగా జనతాదర్బార్‌ను నిలిపివేశారు. పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసిన అనంతరం మరో వారం రోజుల్లోపలే మళ్లీ జనతాదర్బార్‌ను నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.
అర కిలోమీటరు వరకూ జనం.. ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం.. ఢిల్లీ సచివాలయం ఎదుట రోడ్డుపై ఉదయం తొమ్మిదిన్నర నుంచి 11 గంటల వరకు జనతా దర్బార్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. వెయ్యి మంది ఢిల్లీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసింది. సమస్యలు తెలిపేందుకు వచ్చే ప్రజల కోసం వెయ్యి కుర్చీలు కూడా వేశారు. అయితే తమ సమస్యలను మొరపెట్టుకోవడానికి నగరం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో జనం వచ్చారు.
అర కిలోమీటరు కన్నా పొడవు క్యూలో జనం నిలబడ్డారు. మంత్రివర్గ సహచరులతో కలిసి కేజ్రీవాల్ జనతాదర్బార్‌కు రాగానే.. ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి తమ సమస్య వినిపించాలన్న ఆత్రుతతో జనం మధ్య తోపులాట మొదలై పరిస్థితి అదుపుతప్పింది. జనం బారికేడ్లను కూలదోసి మరీ ముందుకు తోసుకెళ్లారు. పోలీసులతో పాటు, సాయంగా ఆప్ కార్యకర్తలు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ప్రజలను నియంత్రించలేకపోయారు. ప్రజల సహాయం కోసం ఏర్పాటుచేసిన హెల్ప్‌డెస్క్‌లూ పనికిరాకుండా పోయాయి. ఈ గందరగోళం మధ్య కేజ్రీవాల్ కూడా బారికేడ్ పెకైక్కి ప్రజలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో పాటు.. కేజ్రీవాల్ మధ్యలోనే జనతా దర్బార్ నుంచి పోలీసుల సాయంతో సచివాలయంలోకి వెళ్లిపోయారు.
పాఠం నేర్చుకున్నాం...కేజ్రీవాల్ కాసేపటికి సచివాలయంలోని ఒక భవనం పెకైక్కి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇంతమంది వస్తారని తాము అనుకోలేదని, సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల జనతా దర్బార్‌ను కొనసాగించ లేకపోతున్నామని చెప్పారు. జనం తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. సోమ, మంగళవారాలు జనతా దర్బార్ జరగవన్నారు. వారం రోజుల లోపల మెరుగైన ఏర్పాట్లతో మళ్లీ జనతా దర్బార్ నిర్వహిస్తామని చెప్పారు. కేజ్రీవాల్ ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలు అదుపుతప్పటంతో తాను జనతా దర్బార్ నుంచి బయటకు వచ్చేశానని.. లేనట్లయితే తొక్కిసలాట జరిగేదని పేర్కొన్నారు. నిర్వహణా లోపం వల్ల పరిస్థితి గందరగోళంగా తయారైనప్పటికీ పాఠం నేర్చుకున్నామన్నారు.
ఇందుకు ప్రజలకు క్షమాపణ చెప్తూ.. ఈసారి మెరుగైన ఏర్పాట్లతో పెద్ద వేదిక వద్ద దర్బార్‌ను నిర్వహిస్తామన్నారు. దర్బార్‌ను అర్థంతరంగా నిలిపివేయటంతో.. నేరుగా సీఎంను కలుసుకుని తమ సమస్యలను విన్నవించుకోవాలని ఆశలతో వచ్చిన వేలాది మంది జనం నిరుత్సాహంతో వెనుదిరిగారు. కొందరు తమ సమస్యలు వినిపించే అవకాశం లభించకపోవడంతో ఆగ్రహానికి గురయ్యారు. మరి కొందరు నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. మంత్రులు సౌరభ్‌భరద్వాజ్, సోమ్‌నాథ్‌భారతి, రాఖీబిర్లా అక్కడే ఉండి ప్రజల సమస్యలను విన్నారు. వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. చాలా మంది తమ సమస్యలను వినిపించకుండానే వెనుదిరిగారు. వినతిపత్రాలు చిందరవందరగా పడిపోయి కనిపించాయి.