14 లిక్కర్ బాటిళ్లు.. 26 లక్షల నగదు!
న్యూఢిల్లీ: కేంద్ర సర్కార్‌కు కేజ్రీవాల్ ప్రభుత్వానికి మధ్య రాజకీయ యుద్ధానికి తెరలేపిన రాజేంద్రకుమార్ కేసులో సీబీఐ మరిన్ని అనూహ్య విషయాలు వెల్లడించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన కార్యదర్శి అయిన రాజేంద్రకుమార్ ఇంట్లో 14 మద్యం బాటిళ్లు లభించాయని తెలిపింది. అదేవిధంగా ఆయన బ్యాంకులో రూ. 28 లక్షల నగదు లభించిందని, దానిని స్వాధీనం చేసుకున్నామని సీబీఐ వివరించింది.
ఢిల్లీ సెక్రటేరియట్‌లోని రాజేంద్రకుమార్ కార్యాలయంలో సీబీఐ సోదాలు జరుపడం రాజకీయ దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. తనను రాజకీయంగా ఎదుర్కొనలేకనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ చర్యకు పాల్పడ్డారని, ఆయనో పిరికిపంద, సైకో అంటూ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ఈ కేసుతో తమకు రాజకీయంగా ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సీబీఐ కూడా సోదాలపై వివరణ ఇచ్చింది.
కేజ్రీవాల్ ప్రభుత్వం రాకముందే రాజేంద్రకుమార్ అవినీతి చర్యలకు పాల్పడ్డారని, ఆయన వివిధ కంపెనీలకు టెండర్లు నిర్వహించకుండా కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి నష్టం చేకూర్చారని, అందుకే ఆయన ఇల్లు, కార్యాలయంపై దాడులు జరిపినట్టు సీబీఐ తెలిపింది. ఆయన బ్యాంకులో 28 లక్షల నగదు దొరికిందని, అదేవిధంగా పరిమితికి మించి 14 మద్యం బాటిళ్లు ఆయన నివాసంలో లభించాయని, వీటిని స్వాధీనం చేసుకున్నామని సీబీఐ తెలిపింది. అయితే రాజేంద్రకుమార్‌కు వ్యతిరేకంగా సీబీఐ వద్ద తగినంత సాక్ష్యాధారాలు లేవని కేజ్రీవాల్ ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీ అంటున్నాయి.