నా కొడుకునైనా జైలుకు పంపిస్తా: కేజ్రీవాల్
న్యూఢిల్లీ : సీబీఐ దాడులు ఆశ్చర్యాన్ని కలిగించాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వాన్ని సీబీఐ టార్గెట్ చేసిందని ఆయన ఆరోపించారు. అవినీతిని ఏమాత్రం సహించేది లేదని, అవినీతిలో ప్రమేయం ఉంటే తన కొడుకునైనా జైలుకు పంపిస్తానని కేజ్రీవాల్ అన్నారు. వాళ్లకు తానే టార్గెట్ అని, తన కార్యదర్శి రాజేంద్ర కుమార్ కాదని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సంబంధం ఉన్న డీడీసీఏ(ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్) ఫైళ్ల కోసమే సోదాలు నిర్వహించారని ఆయన విమర్శించారు. తన కార్యాలయంలోని ప్రతి ఫైల్ను సీబీఐ సోదాలు చేసిందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తన చివరి శ్వాస వరకూ పోరాడుతూనే ఉంటానని ఆయన అన్నారు.
కాగా సీబీఐ దాడులపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేసే దాడులు జరిపారన్నారు. దీనిపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు సిద్థమేనని ఆయన సవాల్ విసిరారు. మరోవైపు కేజ్రీవాల్ కార్యాలయంలో సీబీఐ దాడులు జరపటాన్ని పశ్చిమ బెంగాల్, బిహార్ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నితీశ్ కుమార్ తప్పుబట్టారు. అలాగే అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉన్నప్పుడు సీఎం కార్యదర్శి సహా ఎవరిపైన అయినా సీబీఐ దాడులు చేయొచ్చని, దీన్ని రాజకీయం చేయడం సరికాదని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు.