కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలి
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అరవింద్ కేజ్రీవాల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని పిరికిపంద, సైకో అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా సీఎంవో కార్యాలయంపై సీబీఐ దాడుల ఘటనకు సంబంధించి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
సీబీఐ దాడులకు ముఖ్యమంత్రి అనుమతి అవసరం లేదన్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని కేజ్రీవాల్ సమర్థించడం సరికాదన్నారు. అవినీతి ఆరోపణలు ఉంటేనే సీబీఐ దాడులు చేస్తుందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కేజ్రీవాల్ కార్యాలయంలో సీబీఐ దాడులు చేయలేదని, తప్పుడు విమర్శలు చేస్తున్న కేజ్రీవాల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని అన్నారు. మరోవైపు కేజ్రీవాల్ కార్యాలయంలో దాడులు జరిపినట్లు వచ్చిన వార్తలను సీబీఐ ఖండించింది. దాడులు జరపినట్లు వచ్చిన వార్తలు నిరాధారమైనవంటూ సీబీఐ అధికారులు కొట్టిపారేశారు.