కొత్త వేరియంట్ల ముప్పు అధికమే! | COVID-19: WHO says new omicron BA.2 subvariant will rise globally | Sakshi
Sakshi News home page

కొత్త వేరియంట్ల ముప్పు అధికమే!

Published Thu, Feb 10 2022 4:20 AM | Last Updated on Thu, Feb 10 2022 12:26 PM

COVID-19: WHO says new omicron BA.2 subvariant will rise globally - Sakshi

జెనీవా: ఒమిక్రాన్‌ వేరియంట్‌తోనే మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోయినట్లు భావించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు చెందిన కోవిడ్‌–19 టెక్నికల్‌ లీడ్‌ మారియా వాన్‌ కెర్ఖోవ్‌ చెప్పారు. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ముప్పు అధికంగానే ఉందని తెలిపారు. ఒమిక్రాన్‌లోని నాలుగు వేర్వేరు వెర్షన్లను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

వైరస్‌ ఎన్నో రకాలుగా మార్పులకు గురవుతోందని, ఉత్పర్తివర్తనాలు సంభవిస్తున్నాయని, కొత్త వేరియంట్ల పుట్టుకకు అవకాశాలు ఎన్నో రెట్లు ఉన్నట్లు గుర్తించామని వివరించారు. కరోనా కొత్త వేరియంట్ల బారి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వ్యాక్సినేషన్‌ ఒక్కటే సరిపోదని, నియంత్రణ చర్యలు కచ్చితంగా పాటించాలని సూచించారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొనే చర్యలు కచ్చితంగా చేపట్టాలన్నారు.

కరోనా కేసులు 17 శాతం తగ్గాయ్‌
అంతకుముందు వారంతో పోలిస్తే కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు గత వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 17 శాతం తగ్గాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. కరోనా సంబంధిత మరణాలు 7 శాతం తగ్గిపోయానని తెలిపింది. అమెరికాలో పాజిటివ్‌ కేసులు ఏకంగా 50 శాతం పడిపోయాయని పేర్కొంది. ఈ మేరకు తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది.

మొత్తం కేసుల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులే 97 శాతం ఉన్నాయని వివరించింది. మిగతా 3 శాతం కేసులు డెల్టా వేరియంట్‌కు సంబంధించినవేనని నివేదికలో ప్రస్తావించింది. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒమిక్రాన్‌ ఉనికిని గుర్తించారని స్పష్టం చేసింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6 వరకూ ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 1.9 కోట్ల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, 68,000 మంది మరణించారని తెలియజేసింది.

కోవిడ్‌ నియంత్రణకు కొత్త కాంబో డ్రగ్‌!
కోవిడ్‌–19 వ్యాప్తి నియంత్రణకు ప్రయోగాత్మక ఔషధం బ్రెక్వినార్‌ను రెమ్‌డెసివిర్‌ లేదా మోల్నుపిరవిర్‌తో కలిపి ఇస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నట్లు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలో నిర్వహించిన అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను నేచర్‌ పత్రికలో ప్రచురించారు. రెమ్‌డెసివిర్‌ లేదా మోల్నుపిరవిర్‌ను వేర్వేరుగా ఇచ్చినప్పటి కంటే బ్రెక్వినార్‌ కాంబినేషన్‌తో ఇస్తే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుంటున్నట్లు అధ్యయనకర్తలు తేల్చారు. అయితే, ఈ కాం బో డ్రగ్‌పై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించాల్సి ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement