AP: అప్రమత్తతే ఆయుధం: సీఎం జగన్‌ | CM Jagan orders to officers on Covid new variant Omicron | Sakshi
Sakshi News home page

AP: అప్రమత్తతే ఆయుధం: సీఎం జగన్‌

Published Wed, Dec 15 2021 3:12 AM | Last Updated on Wed, Dec 15 2021 8:19 AM

CM Jagan orders to officers on Covid new variant Omicron - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌కు విస్తృతంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉంటూ కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రాక్‌ చేయడం, ట్రేస్‌ చేయడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. దీనిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు. ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా మరోదఫా  మహమ్మారికి అవకాశం ఇచ్చినట్లవుతుందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి రాకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ‘స్పందన’లో భాగంగా సీఎం జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై పలు సూచనలు చేశారు. 

అధికార యంత్రాంగానికి అభినందనలు
కోవిడ్‌ నియంత్రణపై అధికార యంత్రాంగం అద్భుతంగా పని చేస్తోంది. 32 దఫాలు ఇంటింటి సర్వే చేసి డేటా సేకరించారు. కోవిడ్‌ అనుమానితులకు పరీక్షలు చేస్తున్నారు. దేశంలో కోవిడ్‌ రికవరీ రేటు 98.36 శాతం కాగా రాష్ట్రంలో 99.21 శాతం ఉంది. మరణాల రేటు దేశంలో 1.37 శాతం అయితే మన దగ్గర 0.7 శాతం మాత్రమే ఉంది.

సంపూర్ణ వ్యాక్సినేషన్‌ దిశగా...
రాష్ట్రంలో అందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేవరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఈ నెలాఖరులోగా నూటికి నూరు శాతం సింగిల్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి. డబుల్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ కూడా వీలైనంత త్వరగా పూర్తవ్వాలి. డోసుల మధ్య విరామాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందా? ఉంటే.. ఎలా చేయాలి? అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని అధికారులను ఆదేశించాం. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేయడమే దీని ఉద్దేశం. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మొదటి డోసు వంద శాతం పూర్తయింది. కలెక్టర్, సిబ్బంది అందరికీ అభినందనలు.  వ్యాక్సినేషన్‌లో వెనకబడ్డ జిల్లాలపై ధ్యాస పెట్టాలి. శ్రీకాకుళం, తూర్పు గోదావరి, చిత్తూరు, విశాఖ కలెక్టర్లు వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలి.
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఈ తరహా మరెక్కడా లేదు..
వంద పడకలు దాటిన ప్రైవేట్‌ ఆస్పత్రులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశాం. పీఎస్‌ఏ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులిచ్చాం. వారికి సబ్సిడీ కూడా అందించాం. దీనిపై కలెక్టర్లు సమీక్ష చేయాలి. డీ–టైప్‌ సిలిండర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు తగినన్ని అందుబాటులో ఉంచాలి. రాష్ట్ర ప్రభుత్వం 144 పీఎస్‌ఏ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ నెలాఖరున వీటిని ప్రారంభించబోతున్నాం. మరే రాష్ట్రంలోనూ ఈ తరహా ఏర్పాటు లేదు. ఇంత పెద్ద సంఖ్యలో ఎవరూ ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లను నెలకొల్పలేదు. కోవిడ్‌ ఆస్పత్రుల సన్నద్ధతపై కూడా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. 

104 వన్‌ స్టాప్‌ సెంటర్‌ 
104 కాల్‌ సెంటర్‌పై మరోసారి అధికారులు సమీక్ష చేయాలి. కాల్‌ చేయగానే వెంటనే స్పందన ఉండాలి. కోవిడ్‌ నివారణ చర్యలు, చికిత్సకు 104 వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌. నిర్దేశించుకున్న సమయంలోగా కాల్‌ చేసిన వారికి సహాయం అందాలి. కాల్‌ చేస్తే స్పందన లేదనే మాట ఎక్కడా వినిపించకూడదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement