ఫాస్ట్‌గా ‘బూస్టర్‌’ | CM Jagan decided to write a letter to Central Govt On Corona Booster dose | Sakshi
Sakshi News home page

ఫాస్ట్‌గా ‘బూస్టర్‌’

Published Tue, Jan 18 2022 2:54 AM | Last Updated on Tue, Jan 18 2022 12:13 PM

CM Jagan decided to write a letter to Central Govt On Corona Booster dose - Sakshi

సాక్షి, అమరావతి: వరుసగా వస్తున్న వేవ్‌లు.. పెరుగుతున్న కోవిడ్‌ కేసులు.. విస్తరిస్తున్న కొత్త వేరియంట్లను దృష్టిలో ఉంచుకుని బూస్టర్‌ డోసు తీసుకునే వ్యవధి తగ్గించటాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరనున్నారు. ఈమేరకు త్వరలో కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు, నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా థర్డ్‌ వేవ్‌ ముగిసిపోయిన తరువాత టీకాలు ఇవ్వడం కంటే వెంటనే ప్రికాషన్‌ డోసులు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుందని సమావేశంలో సీఎం పేర్కొన్నారు.

ప్రికాషన్‌ డోసు తీసుకునేందుకు ప్రస్తుతం 9 నెలలు ఆగాల్సి వస్తోందని, అన్ని రోజులు నిరీక్షించాల్సిన అవసరం లేకుండా మూడు లేదా నాలుగు నెలలకే ఇవ్వడం ద్వారా ఆస్పత్రుల పాలు కాకుండా రక్షించుకునే అవకాశం ఉంటుందన్నారు. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు లాంటి అత్యవసర సేవలందిస్తున్న వారితోపాటు సమస్యలతో బాధపడే పెద్ద వయసు వారికి కూడా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. అమెరికాలో సైతం మోడర్నా, ఫైజర్‌ టీకాలను బూస్టర్‌ డోసుల కింద మూడు లేదా నాలుగు నెలలకే ఇస్తున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. రాష్ట్రంలో 15 లక్షల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, ఐదు లక్షల మంది హెల్త్‌ వర్కర్లు, 60 ఏళ్లు దాటిన వారు 58 లక్షల మంది వరకు ఉన్నట్లు అంచనా. వెంటనే బూస్టర్‌ డోసులు ఇవ్వడం ద్వారా మొత్తం 78 లక్షల మందికి టీకాలతో రక్షణ లభిస్తుంది. ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరాన్ని నివారించవచ్చు. వ్యాక్సిన్ల వ్యయంతో పోలిస్తే అది చాలా ఎక్కువ.

మిగతా జిల్లాల్లోనూ వేగం పెరగాలి
పెరుగుతున్న కోవిడ్‌ కేసులకు అనుగుణంగా వైద్య అవసరాలను గుర్తించి ఆక్సిజన్, ఔషధాలు తదితరాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వ్యాక్సినేషన్‌లో వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.   

ఆస్పత్రుల్లో 1,100 మంది మాత్రమే..
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు సమీక్షలో అధికారులు తెలిపారు. రెండో వేవ్‌తో పోల్చితే ఆస్పత్రుల్లో కోవిడ్‌ పడకల సంఖ్యను కూడా పెంచామని, అన్ని జిల్లాల్లో కలిపి 53,184 బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. దాదాపు 27 వేల యాక్టివ్‌ కేసుల్లో 1,100 మంది మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని,  ఇందులో ఆక్సిజన్‌ అవసరమైన వారి సంఖ్య సుమారు 600 మాత్రమేనని వివరించారు. కోవిడ్‌ బాధితులు గతంలో 14 రోజులకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతుండగా ఇప్పుడు వారం రోజులకే ఇంటికి వెళ్లిపోతున్నారని చెప్పారు.

కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 28 వేల బెడ్లు 
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నియోజక వర్గానికి ఒక కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను గుర్తించామని అధికారులు తెలిపారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో సుమారు 28 వేల బెడ్లను సిద్ధం చేశామని వెల్లడించారు. 

పటిష్టంగా 104 కాల్‌సెంటర్‌
104 కాల్‌సెంటర్‌ వ్యవస్థ పటిష్టంగా పని చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. కాల్‌ చేసిన వారికి టెలిమెడిసిన్‌ ద్వారా తగిన వైద్యం అందించాలని ఆదేశించారు.

రెండు జిల్లాల్లో వంద శాతం 
రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌లో కొద్దిగా వెనుకబడ్డ ఐదు జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. 15 నుంచి 18 ఏళ్ల వారికి వంద శాతం వ్యాక్సినేషన్‌ను నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు సాధించగా మరో ఐదు జిల్లాల్లో 90 శాతానికిపైగా పూర్తైంది. ఈ వయసు వారికి నాలుగు జిల్లాల్లో 80 శాతానికిపైగా వ్యాక్సినేషన్‌ జరిగింది. మిగిలిన చోట్ల కూడా ఉద్ధృతంగా చేపట్టాలని సీఎం ఆదేశించారు. 
 
కేంద్రం కొత్త మార్గదర్శకాలపై చర్చ
కోవిడ్‌ పరీక్షలపై కేంద్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాలపై సమీక్షలో చర్చించారు. కరోనా లక్షణాలు లేనివారికి ఎలాంటి పరీక్షలు చేయవద్దని ఐసీఎంఆర్‌ నూతన మార్గదర్శకాల్లో పేర్కొందని అధికారులు తెలిపారు. పాజిటివ్‌గా తేలినవారి కాంటాక్టŠస్‌లో కేవలం హైరిస్క్‌ ఉన్నవారికే పరీక్షలు చేయాలని స్పష్టం చేసిందని చెప్పారు. 

ఆరోగ్యశ్రీలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ 
ఆరోగ్యశ్రీ రిఫరల్‌ వ్యవస్థలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వినియోగంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పేషెంట్‌ రిఫరల్‌ వ్యవస్థపై రూపొందించిన స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ను ముఖ్యమంత్రి సమీక్షించారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులు, సచివాలయాలు, పీహెచ్‌సీల్లో ఆరోగ్య మిత్రలతోపాటు 104, 108 వైద్యాధికారులకు రూపొందించిన ఎస్‌ఓపీలను ముఖ్యమంత్రి పరిశీలించారు. 104, 108, పీహెచ్‌సీలు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో ఉండే డాక్టర్లు కూడా ఈ ప్రక్రియలో పాలు పంచుకుని మంచి సేవలు అందించేలా రిఫరల్‌ విధానం ఉండాలని, ఆరోగ్య మిత్రలు కీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సమన్వయంతో యాప్‌ ద్వారా సేవలు అందించాలన్నారు. 108కి కాల్‌ చేసినా, ఆరోగ్య మిత్ర రిఫర్‌ చేసినా ఈ యాప్‌ దగ్గరలో ఉన్న నెట్‌వర్క్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేస్తుందని అధికారులు వివరించారు. పేషెంట్‌ వివరాలతో పాటు ఫోటో కూడా డౌన్‌లోడ్‌ చేయడం వల్ల బాధితుల పరిస్థితి తెలుస్తుందని ముఖ్యమంత్రి సూచించారు. ఆరోగ్యశ్రీ రిఫరల్‌ వ్యవస్థలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వినియోగంతో మరింత పారదర్శకంగా మెరుగైన సేవలు అందుతాయన్నారు.

ఇంటికెళ్లిన పేషెంట్‌ను పరామర్శించాలి
నెట్‌వర్క్‌ ఆస్పత్రిలో చికిత్సతో పాటు ఆరోగ్య ఆసరా అందించిన అనంతరం ఇంటికి వెళ్లిన పేషెంట్‌ ఆరోగ్య పరిస్థితిపై ఏఎన్‌ఎం వాకబు చేయాలని సీఎం ఆదేశించారు. ఎలాంటి సమస్య వచ్చినా అందుబాటులో ఉంటామనే విషయాన్ని తెలియ చేయాలన్నారు. ఇది పేషెంట్‌కు గొప్ప ధైర్యాన్నిస్తుందన్నారు.
 
శాశ్వతంగా హోర్డింగ్స్‌
ఆరోగ్యశ్రీపై పూర్తి వివరాలు తెలియచేసేలా విలేజ్, వార్డ్‌ క్లినిక్స్‌లో, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెద్ద హోర్డింగ్స్‌ శాశ్వతంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ రిఫరల్‌ పాయింట్‌గా వ్యవహరిస్తూ వైద్యం కోసం ఎక్కడకు వెళ్లాలో, ఎవరిని సంప్రదించాలో  క్లినిక్స్‌లో పూర్తి సమాచారం ఉండాలని స్పష్టం చేశారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలలో కూడా హోర్డింగ్స్‌ అమర్చాలని సూచించారు. ఆరోగ్యశ్రీ చికిత్స కోసం రోగులు వస్తే ఆరోగ్య వివరాలను వెంటనే తెలుసుకుని ఎక్కడకు పంపాలనే విధానం చాలా పటిష్టంగా ఉండాలని సీఎం జగన్‌ నిర్దేశించారు. కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణ ప్రగతిపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు.

ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, సీఎస్‌ సమీర్‌శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, 104 కాల్‌ సెంటర్‌ ఇన్‌చార్జ్‌ ఏ.బాబు, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జీఎస్‌ నవీన్‌కుమార్, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్‌చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి.మురళీధర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement