సాక్షి, అమరావతి: కరోనా టీకా వేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మైలురాయి దాటింది. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన 3,95,22,000 మందికి టీకా వేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. ఇందులో భాగంగా 100.11 శాతం అంటే 3,95,65,253 మందికి రాష్ట్ర ప్రభుత్వం తొలిడోసు టీకా పంపిణీ పూర్తిచేసింది. నిజానికి.. తొలి నుంచి వ్యాక్సినేషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం దూకుడు ప్రదర్శించింది. స్పెషల్ డ్రైవ్‌లు పెట్టిమరీ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టింది. టీకా వేసుకోని వారిని గుర్తించి వారికి టీకాలు వేసేందుకు ఇంటింటి సర్వేలను సైతం ప్రభుత్వం చేపట్టింది. దీంతో పంపిణీ ప్రారంభించి ఏడాది కూడా తిరగకముందే తొలిడోసు పంపిణీని 100 పూర్తిచేసింది.
10 జిల్లాల్లో కేంద్రం నిర్దేశించిన లక్ష్యం వంద శాతం పూర్తికాగా.. అదనంగా ఇంకా టీకా పంపిణీ నడుస్తోంది. వైఎస్సార్ కడప జిల్లాలో 99.92 శాతం, విశాఖపట్నంలో 99.77, కృష్ణా జిల్లాలో 98 శాతం మందికి తొలిడోసు టీకా వేశారు. కొందరు అందుబాటులో లేకపోవడంతో వ్యాక్సినేషన్ ఆలస్యమైంది. కానీ, వీరు ఎక్కడున్నారో గుర్తించి టీకా వేసేలా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. తొలి డోసు వేసుకున్న వారిలో 74.08 శాతం మందికి అంటే 2,93,11,443 మందికి రెండో డోసు టీకా వేశారు.
విదేశీ ప్రయాణికులపట్ల అప్రమత్తం
ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో విదేశీ ప్రయాణికులపట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. వీరి నుంచే ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో.. వీరి వివరాలను ముందే సేకరించి ఆయా జిల్లాలకు వివరాలను పంపుతున్నారు. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది విదేశీ ప్రయాణికులను గుర్తించి హోమ్ ఐసోలేషన్‌లో ఉంచడంతో పాటు, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేపడుతున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ 43,539 మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారు. వీరిలో 41,654 మందిని గుర్తించారు. 40,937 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా 40,175 మందికి నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. 671 ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఇప్పటికి విదేశీ ప్రయాణికులు, వారి సన్నిహితులు 106 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా వీరిలో 16 మందికి ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది.
వేగంగా 35వ ఫీవర్ సర్వే
ఇక రాష్ట్రవ్యాప్తంగా 35వ విడత ఫీవర్ సర్వే వేగంగా జరుగుతోంది. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 1,22,57,110 మందిని వైద్య సిబ్బంది సర్వేచేశారు. వీరిలో కరోనా అనుమానిత లక్షణాలున్న 4,219 మందిని గుర్తించారు. 1,260 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ప్రజలు జాగ్రత్తలు పాటించాలి
ఒమిక్రాన్ కట్టడికి ప్రభుత్వం అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. న్యూ ఇయర్ పార్టీల పేరుతో గుంపులుగా చేరి వైరస్ వ్యాప్తికి దోహదపడొద్దు. జనవరి 3 నుంచి పిల్లలకు టీకా పంపిణీ చేస్తాం. 15–18 ఏళ్ల పిల్లలందరూ టీకాలు వేయించుకోవాలి. పిల్లలకు టీకాలు వేయించే విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి.
– డాక్టర్ హైమావతి, ప్రజారోగ్య సంచాలకులు
Covid Vaccination-Andhra Pradesh: తొలిడోసు 100% పూర్తి
Published Fri, Dec 31 2021 4:00 AM | Last Updated on Fri, Dec 31 2021 4:32 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment