సాక్షి, అమరావతి: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో టీకాల పంపిణీని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారిలో 98.28 శాతం మందికి ఒక డోసు టీకా పూర్తయింది. అంటే టీకా తీసుకోని వారు 1.72 శాతం మాత్రమే ఉన్నారు. 18 ఏళ్లు పైబడిన వారు రాష్ట్రంలో 3,95,22,000 మంది ఉండగా, 3,88,44,166 మందికి తొలి డోసు టీకా వేశారు. 70.51 శాతం అంటే 2,78,67,898 మందికి రెండు డోసుల టీకాను ప్రభుత్వం పూర్తి చేసింది.
ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇంటింటా ఫీవర్ సర్వేను కూడా చేపట్టి, వైరస్ లక్షణాలు ఉన్న వారిని గుర్తిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా ఒమిక్రాన్ వ్యాపిస్తున్న నేపథ్యంలో విదేశీ ప్రయాణికులపై దృష్టి పెట్టింది. ఈ నెలలో ఇప్పటివరకూ 32,762 మంది విదేశాల నుంచి రాష్ట్రానికి రాగా 31,356 మందిని వైద్య, ఆరోగ్య శాఖ గుర్తించింది.
వీరిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచుతూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 30,466 మందికి ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా 44 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీరి సన్నిహితుల్లో 9 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారించారు. 29,926 మందికి నెగెటివ్ వచ్చింది. 496 మంది ఫలితాలు రావాల్సి ఉంది. పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపి పరీక్షించారు. వీరిలో విజయనగరం, చిత్తూరు జిల్లాలకు చెందిన ఇద్దరికి మాత్రమే ఒమిక్రాన్ వైరస్ సోకినట్లు తేలింది. వీరిలో ఒకరు పూర్తిగా కోలుకోగా, మరొకరు చికిత్స పొందుతున్నారు.
వారం రోజుల్లో 6,330 మందికి జరిమానా
వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది. మాస్క్ ధరించని వ్యక్తులు, వీరిని అనుమతించిన వ్యాపార సముదాయాలకు జరిమానా విధిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన 6,330 మందికి సంబంధిత శాఖలు జరిమానా విధించాయి. వీరి నుంచి రూ.9,91,259 వసూలు చేశారు.
135 మందికి పాజిటివ్
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో (బుధవారం ఉదయం 9 నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు) 31,158 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 135 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకరు చొప్పున ముగ్గురు మృతి చెందారు. 164 మంది కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 20,76,212కి చేరింది. వీరిలో 20,60,400 మంది కోలుకోగా, ప్రస్తుతం 1,326 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మృతుల సంఖ్య 14,486కి చేరింది. ఇప్పటి వరకు 3,10,98,568 నమూనాలను పరీక్షించారు.
29 శాతం సర్వే పూర్తి
ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో 34వ విడత ఫీవర్ సర్వేను ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది. గురువారంనాటికి నాలుగు రోజుల్లో 29.02 శాతం ఇళ్లల్లో సర్వే చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.66 కోట్ల గృహాలు ఉండగా ఇప్పటికే 48,22,539 ఇళ్లను ఆరోగ్య సిబ్బంది సందర్శించారు. కరోనా అనుమానిత లక్షణాలున్న 12,814 మందిని గుర్తించారు. వీరికి స్క్రీనింగ్ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment