Coronavirus New Variant: Dr Srinath Reddy Says, More Cautious for Another Month - Sakshi
Sakshi News home page

కొత్త వేరియెంట్లు రావని అనుకోవడానికి లేదు

Published Wed, Apr 6 2022 3:27 PM | Last Updated on Wed, Apr 6 2022 8:45 PM

Coronavirus New Variant: More Cautious for Another Month, Says Dr Srinath Reddy - Sakshi

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గిపోయిందని అనుకోవడానికి లేదు. దీన్ని మనం హెచ్చరికగా తీసుకుని భారత్‌కు ఇక ఏమీ కాదనే అతి విశ్వాసాన్ని వీడాలి.

సాక్షి, హైదరాబాద్‌: ‘కొన్ని దేశాల్లో కోవిడ్‌ ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఐరోపా, చైనా, దక్షిణ కొరియా, వియత్నాం తదితర దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గిపోయిందని అనుకోవడానికి లేదు. దీన్ని మనం హెచ్చరికగా తీసుకుని భారత్‌కు ఇక ఏమీ కాదనే అతి విశ్వాసాన్ని వీడాలి. మరో నెలరోజులపాటు అప్రమత్తంగా ఉంటూ ఇతర దేశాల్లోని పరిస్థితులను గమనిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ప్రముఖ వైద్యుడు, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డా.కె. శ్రీనాథ్‌రెడ్డి సూచించారు. ప్రస్తుతం దేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యల్పస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఇంటర్వ్యూలో శ్రీనాథ్‌రెడ్డి వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

ఇతర దేశాల నుంచి ప్రమాదం పొంచే ఉంది
ఒమిక్రాన్‌ వేరే దేశాల్లో ఇంకా పరిభ్రమిస్తోంది. రూపును మార్చుకుంటోంది. ఒమిక్రాన్‌ బీఏ.1, బీఏ.2 కాకుండా ఎక్స్, ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎఫ్‌ అనే కొత్త వేరియెంట్లు అధిక ఇన్ఫెక్షన్లు కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అది కొత్తరూపంలో మళ్లీ మనదేశంలోకి ప్రవేశిస్తుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం. కాబట్టి ఇప్పుడు మనలో ఏర్పడిన రోగనిరోధక శక్తి మూడు, నాలుగు నెలల తర్వాత కూడా ఉంటుందా అన్నది తెలియదు. అంటే ఆ తర్వాత అధికశాతం మందిలో ఇమ్యూనిటీ స్థాయిలు తగ్గాక కొత్త వేరియెంట్లు ప్రవేశిస్తే పరిస్థితి ఏమిటనేది చెప్పలేం. 

వైరస్‌ స్థిమితంగా ఉండటం లేదు
ఇప్పుడు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదని కొందరు చెబుతున్నారు. గతంలోనూ థర్డ్‌వేవ్‌కు ఆస్కారం లేదని చెప్పారు. అయితే, ఒమిక్రాన్‌ వచ్చింది. అందువల్ల ఇక కొత్త వేరియెంట్లు రావనుకోవడానికి లేదు. ఒకవేళ మన దగ్గర 2, 3 నెలల్లోనే కొత్తవి వచ్చినా పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు. ఎప్పుడు ఏ వేరియెంట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పలేం. ఎందుకంటే వైరస్‌ ఇంకా పరిణామ దశలోనే ఉంది. అది ఇంకా పూర్తిగా స్థిమితంగా ఉండటం లేదు. వచ్చే వేరియెంట్లతో తీవ్రత పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. వైరస్‌ తీరు తేలేదాకా అందరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ రక్షణ చర్యలు తీసుకోవడమే మంచిది. 

12 ఏళ్లలోపు వారికి పెద్దగా ప్రమాదం లేదు
ప్రపంచవ్యాప్తంగా 12 ఏళ్ల లోపు వారికి తీవ్రమైన జబ్బు చేసే ఆస్కారం చాలా తక్కువగా ఉంది. అందువల్ల వారికి టీకాలు వేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా రూపుదిద్దుకుంటున్న క్రమంలో ఆ వయసు వారికి కరోనా టీకాలు ఇవ్వడం వల్ల అంతకంటే ప్రమాదకర జబ్బులను ఎదుర్కునే శక్తిని తగ్గించినట్టు అవుతుందా అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది. ఇప్పటికైతే 12 ఏళ్లలోపు వారికి కోవిడ్‌ టీకా ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు.

అన్ని వేరియెంట్లపై పనిచేసేలా టీకాలు
ఏ వేరియెంట్‌పై అయినా ప్రభావవంతంగా పనిచేసే టీకా తయారీలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. అయితే కేవలం టీకాపైనే ఆధారపడకుండా మాస్క్‌లు ధరించడం, వ్యక్తిగత, చేతుల పరిశుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలను కొనసాగించాలి. ఇదివరకు జపాన్, దక్షిణ కొరియాల్లో ఎవరికైనా జలుబు చేస్తే మాస్క్‌లు వేసుకుని వెళ్లే వాళ్లు. అలాంటి అలవాట్లను మనం కూడా అలవరచుకోవాలి. 

వారికి బూస్టర్‌ డోస్‌లు మంచిది
18 ఏళ్లు నిండిన వారందరికీ బూస్టర్‌ డోస్‌లు ఇవ్వడం మంచిదని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సూచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై పునరాలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే 60 ఏళ్లలోపు వయసు వారిలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక జబ్బులున్న వారికి బూస్టర్‌డోస్‌లు ఇవ్వడం మంచిది. ఎందుకంటే ఈ కేటగిరిలోని వారు సులభంగా వైరస్‌ బారిన పడే అవకాశం ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement