టీకా తీసుకున్నా.. ఒమిక్రాన్‌! | Report Says Omicran More Prevalent People Taken 2 Doses Of Covid Vaccine | Sakshi
Sakshi News home page

టీకా తీసుకున్నా.. ఒమిక్రాన్‌!

Published Mon, Jan 17 2022 3:45 AM | Last Updated on Mon, Jan 17 2022 3:26 PM

Report Says Omicran More Prevalent People Taken 2 Doses Of Covid Vaccine - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: దేశంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న వారిలోనూ ‘ఒమిక్రాన్‌’వ్యాప్తి చెందుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో ఏకంగా 88 శాతం మంది రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్న వారేనని ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బిలియరీ సైన్సెస్‌ (ఐఎల్‌బీఎస్‌) పేర్కొంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌పై దేశంలో తొలిసారిగా ఐఎల్‌బీఎస్‌ పరిశీలన చేపట్టింది. గతేడాది డిసెంబర్‌లో ఢిల్లీలో నమోదైన ఒమిక్రాన్‌ కేసుల తీరును ఐఎల్‌బీఎస్‌ విశ్లేషించింది. మొత్తం 264 పాజిటివ్‌ కేసులను పరిగణనలోకి తీసుకొని అందుకు సంబంధించి లోతైన అధ్యయనం చేసింది. ఒమిక్రాన్‌ బాధితుల్లో వైరస్‌ లక్షణాలు, చికిత్స, వారు కోలుకున్న తీరు, రెండు డోసుల టీకాలు తీసుకున్న తేదీల సమాచారం తదితర వివరాలను పరిశీలించింది. ఢిల్లీలో ఒమిక్రాన్‌ సామాజిక వ్యాప్తి జరుగుతున్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. 

మూడు రకాలు... 
దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ మూడు రకాలుగా ఉన్నట్లు ఐఎల్‌బీఎస్‌ చెబుతోంది. ఒమిక్రాన్‌ 1, 2 3 వేరియంట్లలో ప్రస్తుతం అత్యధికంగా వ్యాప్తి చెందుతున్నది మొదటి రకంగా వివరించింది. ఐఎల్‌బీఎస్‌ చేసిన పరిశీలనలో 264 కేసులను పరిగణనలోకి తీసుకోగా వాటిని ఒక క్రమ పద్ధతిలో ఎంపిక చేసుకొని పరిశీలన చేసినట్లు వెల్లడించింది. కోవిడ్‌–19 ఒమిక్రాన్‌ వేరియంట్‌ దక్షిణాఫ్రికాలో పుట్టగా... భారత్‌లోకి వ్యాప్తి చెందే క్రమం విదేశీ ప్రయాణికుల ద్వారా అని గుర్తించారు. అయితే ఐఎల్‌బీఎస్‌ ఎంపిక చేసుకున్న పాజిటివ్‌ కేసుల్లో 39 శాతం మంది మాత్రమే విదేశీ ప్రయాణ చరిత్ర ఉన్నట్లు గుర్తించగా... మిగతా 61 శాతం మంది ఎలాంటి ప్రయాణాలు చేయలేదు.

ఈ వ్యాప్తి క్రమాన్ని సామాజిక వ్యాప్తిగా ఐఎల్‌బీఎస్‌ అంచనా వేస్తోంది. ప్రస్తుతం పరిశీలనకు తీసుకున్న నమూనాల్లో 18 ఏళ్ల నుంచి 60 ఏళ్లున్న వారు ఏకంగా 68 శాతం మంది ఉన్నారు. ఈ లెక్కన 18–60 ఏళ్ల మధ్య వారిలోనే వైరస్‌ వ్యాప్తి అత్యధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇక ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి చెందిన వారిలో 60 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవు. కేవలం 40 శాతం మందిలో లక్షణాలు గుర్తించినప్పటికీ అవన్నీ దాదాపు స్వల్ప లక్షణాలుగా ఐఎల్‌బీఎస్‌ పరిశీలన చెబుతోంది. 

వ్యాక్సిన్‌తో ప్రొటెక్షన్‌... 
ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అత్యంత వేగంగా సాగుతోంది. రెండు డోసుల పంపిణీ లక్ష్యం దాదాపు దగ్గరపడింది. ఈ క్రమంలో కోవిడ్‌ వ్యాప్తి చెందినా రిస్క్‌ మాత్రం తక్కువగా ఉన్నట్లు ఢిల్లీ ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. జనవరి 9–12 మధ్య కరోనాతో ఢిల్లీలో 89 మంది మరణించగా వారిలో 93 శాతం మంది వ్యాక్సిన్‌ వేసుకోని వారిగా అక్కడి ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్‌ వేసుకోవడంతో వైరస్‌ వ్యాప్తి చెందినా... పెద్దగా ప్రమాదం బారినపడే అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఇక గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)లో ప్రస్తుతం నమోదైన అడ్మిషన్ల విషయానికి వస్తే... ఐసీయూలో చేరిన వారిలో 70% మంది టీకా తీసుకోని వారిగా ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. 

ఒమిక్రాన్‌తో డెల్టాకు చెక్‌... 
ప్రస్తుతం ఒమిక్రాన్‌ వ్యాప్తి వేగంగా ఉంది. ఈ వేరియంట్‌తో పెద్దగా నష్టం లేనప్పటికీ జాగ్రత్తగా ఉండటం మంచిది. మనలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి చెందితే ఇకపై డెల్టా వేరియంట్‌ వ్యాప్తి చెందదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 149 దేశాల్లో ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతోంది. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌ చిన్నపిల్లల్లో దుష్ప్రభావాలు పెద్దగా చూపట్లేదు. 

– డాక్టర్‌ కిరణ్‌ మాదల
క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాల   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement