COVID-19: Corona Virus New Variant Centaurus - Sakshi
Sakshi News home page

COVID-19: కరోనా సరికొత్త వేరియెంట్‌.. సెంటారస్‌!.. మనదేశంలోనూ ఉందా?

Published Sun, Jul 17 2022 1:21 AM | Last Updated on Sun, Jul 17 2022 10:36 AM

COVID-19: Corona Virus New Variant Centaurus - Sakshi

ఒకప్పుడు బాగా సైన్స్‌ తెలిసిన వాళ్లకే కొన్ని గ్రీకు, రోమన్‌లాంటి పారిభాషిక పదాలు తెలిసేవి. కానీ కరోనా పుణ్యమా అని చాలా చాలా కొత్త కొత్త పేర్లు అందరికీ తెలిసి వస్తున్నాయి. ఆ కోవలో ఇప్పుడు సరికొత్తగా మరో పదం తెలిసివచ్చింది. దాని పేరే ‘సెంటారస్‌’. ఇది కూడా కరోనాకు చెందిన సరికొత్త వేరియెంట్‌. అయితే ఇది ఒమిక్రాన్‌ తాలూకు ఒక సబ్‌ వేరియెంట్‌గా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

ఒక వైరస్‌ తాలూకు వేరియెంట్‌కు మనుషులు నిరోధకత సాధించగానే... తన మనుగడ కోసం కొత్త కొత్త వేరియెంట్లు పుట్టుకొస్తాయన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ కోవిడ్‌కు సంబంధించి... ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, డెల్టా ప్లస్, ఒమిక్రాన్‌ వంటి అనేక పేర్లు విన్నాం. ఆ తర్వాత వాటిల్లోనే డెల్టా, ఒమిక్రాన్‌ కలిసిపోయి... డెల్‌మిక్రాన్‌ వంటివీ, ఒమిక్రాన్‌ ఫ్లూతో కలవడంతో ఫ్లూరాన్‌ వంటి మరికొన్ని సబ్‌వేరియెంట్లూ పుట్టుకొచ్చాయి. ఇదే వరసతో కోవిడ్‌కు సంబంధించి ఇప్పుడు తాజాగా మరో సబ్‌–వేరియెంట్‌ ఆవిర్భవించింది. దాని పేరే ‘సెంటారస్‌’.

ఈ పేరుకు ఇంకా కొన్ని ప్రాధాన్యాలున్నాయి. ‘సెంటారస్‌’ అనే పేరును ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అధికారికంగా పెట్టలేదు. అయితే... మనకు (భూమికి) చాలా దూరంలో ఉన్న సెంటారస్‌ అనే గ్యాలక్సీ పేరు దీనికి పెట్టారనీ... గ్రీకు మైథాలజీ ప్రకారం సగం గుర్రం, సగం మానవ దేహం ఉన్న గ్యాలక్సీ పేరు దీనికి ఇచ్చారనీ... గుర్రం పరుగులా వేగంగా విస్తరించే స్వభావం ఉన్నందునే ఈ పేరు పెట్టారంటూ ‘గ్సేబియర్‌ ఆస్టేల్‌’ అనే కోవిడ్‌ పరిశీలకుడి మాట. అయితే ఇప్పటివరకైతే దాని తీవ్రత అంతగా కనిపించడం లేదు.

తొలిసారిగా ‘నెదర్లాండ్‌’లో
అవును ఉంది. సెంటారస్‌ (బీఏ 2.75) సబ్‌–వేరియెంట్‌ను ఈ ఏడాది మే నెలలోనే మన దేశంలోనూ ఉన్నట్లు గుర్తించారు. అయితే తొలిసారిగా దీన్ని ‘నెదర్లాండ్‌’లో కనుగొన్నారు. ఇప్పుడు ఈ వేరియెంట్‌ యూఎస్‌ఏ, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియాల్లో సోకుతోంది. ఇప్పుడీ వేరియెంట్‌ పై దేశాలు కలుపుకుని దాదాపు పది దేశాల్లో విస్తరిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  

అంత తీవ్రమైనదేమీ కాదు...
ఈ సెంటరాస్‌ వేరియెంట్‌ చాలా వేగంగా పాకుతుందంటూ కొంతమంది శాస్త్రవేత్తలు తొలుత ఆందోళన పడ్డారు. ఒమిక్రాన్‌ విషయంలో ఆందోళన పడ్డట్టుగానీ ఇది కూడా అంత తీవ్రమైనది కాదని తొలి పరిశీలనల్లో తేలింది. పైగా ఇది ఒమిక్రాన్‌ తర్వాత వచ్చిన సబ్‌–వేరియెంట్‌ కావడం... కొత్త కొత్త వేరియెంట్లు వస్తున్నకొద్దీ వాటి తీవ్రత తగ్గుతూ పోతుండటం వల్ల... ఇది శాస్త్రవేత్తలు అంచనా వేసినంత  తీవ్రంగా లేకపోవడం ఓ సానుకూల అంశం.

జెనీవాలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ హెల్త్‌ యూనివర్సిటీ డైరెక్టర్‌ ఆంటోనీ ఫ్లాహాల్ట్‌ మాట్లాడుతూ... ‘‘ఇలా వేరియెంట్లు రూపు మార్చుకుంటున్న కొద్దీ ఈ కొత్త కొత్త స్ట్రెయిన్ల కారణంగా కరోనాలోని ఫలానా వేరియెంట్‌కు అంటూ నిర్దిష్టంగా వ్యాక్సిన్‌ కనుగొనడం కష్టమవుతుంది’’ అంటూ వ్యాఖ్యానించారు. డచ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మరో నిపుణుడు మాట్లాడుతూ ‘‘మనం సార్స్‌–సీవోవీ–2 కోసం రూపొందించిన వ్యాక్సిన్‌ కోటగోడను దాటుకుని ఇవి లోనికి ప్రవేశించగలవా లేదా అన్న అంశం ఇంకా తెలియద’’ని పేర్కొన్నారు. 

యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ యాంగ్లియాకు చెందిన ప్రొఫెసర్‌ పాల్‌ హంటర్‌ మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకూ ఇది చాలా నెమ్మదిగానే ఉంది. పెద్దగా విధ్వంసకారిలా అనిపించడం లేదు’’ అని తెలిపారు. ఇంకా మనదేశానికి చెందిన ‘సార్స్‌–సీవోవీ–2’ జీనోమిక్‌ కన్సార్షియమ్‌ కో–ఛైర్‌ పర్సన్‌ డాక్టర్‌ ఎన్‌.కె. అరోరా మాట్లాడుతూ ‘‘ఇది మన దేశంలో కొత్తగా, అరకొరగా మరికొన్ని కేసులకు కారణమవుతున్నప్పటికీ, తీవ్రమైనదేమీ కాదు. దీనివల్ల కొత్తగా నాలుగో వేవ్‌ రాదు’’ అంటూ భరోసా ఇస్తున్నారు.

ఇప్పటికే మన దేశవాసుల్లోని చాలామంది డబుల్‌ వ్యాక్సినేషన్‌ తీసుకుని ఉండటం, మరికొందరు బూస్టర్‌ డోసుకూడా తీసుకోవడం, మూడో వేవ్‌లో ఒమిక్రాన్‌ చాలామందికి స్వాభావికమైన నిరోధకత ఇచ్చి ఉండటంతో పాటు...  తాజాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మూడో డోసు బూస్టర్‌ను కూడా ఉచితంగా ఇవ్వనుండటంతో ఇకపై ఈ వేరియెంట్‌ ఓ పెద్ద సమస్య కాబోదనేది చాలా మంది నిపుణుల భావన.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement