న్యూఢిల్లీ: ప్రపంచమంతా ఒమిక్రాన్ వేగానికి భయపడుతున్న తరుణంలో కరోనా మరో వేరియంట్ బయటపడింది. ఒమిక్రాన్ కన్నా అధిక మ్యుటేషన్లతో కూడిన కొత్త వేరియంట్‌ను ఫ్రాన్స్‌లో కనుగొన్నారు. ఈ నూతన వేరియంట్‌తో 12 కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఇన్‌స్టిట్యూట్ ఐహెచ్‌యూ మెడిటరేరియన్ ఇన్‌ఫెక్షన్ అనే సంస్థకు చెందిన పరిశోధకులు దీన్ని కనుగొన్నారు. దీనికి తాత్కాలికంగా ఐహెచ్‌యూ (బీ. 1. 640.2) అని పేరుపెట్టారు.
ఆఫ్రికాకు చెందిన కామెరూన్ నుంచి వచ్చిన వారివల్ల కొత్త వేరియంట్ వ్యాప్తిలోకి వచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దీని ప్రవర్తనపై ఎలాంటి అంచనాలు లేవని, క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే దీనిపై ఒక అవగాహనకు రావాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనిపై జరిపిన అధ్యయన వివరాలను మెడ్‌ఆర్‌ఎక్స్‌ఐవీలో ప్రచురించారు. ఈ వేరియంట్‌లో 46 మ్యుటేషన్లు జరిగాయని వీటిలో 37 డిలీషన్లు(మ్యుటేషన్లలో ఒకరకం) ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది.
ఈ వేరియంట్‌లో కొత్తగా 30 అమీనో ఆమ్లాల మార్పులు జరగగా, 12 అమీనో ఆమ్లాల డిలీషన్ జరిగిందని తెలిపింది. అమీనో ఆమ్లాల మార్పుల్లో 14, డిలీషన్లలో తొమ్మిది స్పైక్ ప్రొటీన్‌లో జరగడం గమనార్హం. మానవ కణాల్లోకి కరోనా చొచ్చుకుపోవడంలో ఈ స్పైక్ ప్రొటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో జరిగే మ్యుటేషన్లుతో వేరియంట్ వేగంగా వ్యాపించే వీలు కలుగుతుంది. కరోనా టీకాలు ఈ స్పైక్ ప్రొటీన్‌పై పనిచేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటాయి.
వ్యాప్తి ఆరంభం కాలేదు
ఐహెచ్‌యూ వేరియంట్‌ను ఇంకా ఇతర దేశాల్లో గుర్తించలేదు. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సమాఖ్య (డబ్ల్యూహెచ్‌ఓ) ఇంతవరకు దీన్ని వీయూఐ (పరిశీలనలో ఉన్న వేరియంట్– వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్)గా ప్రకటించలేదు. వేరియంట్ తీవ్రతను గుర్తించి ప్రకటించడం, దానికి పేరు పెట్టడం ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తుంది. గతేడాది నవంబర్‌లో జరిపిన ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు ఒకదానిలో ఈ వేరియంట్‌ను తొలిసారి గుర్తించామని పరిశోధకులు తెలిపారు.
అప్పటి నుంచి దీనిపై పరిశీలనలు జరిపి నూతన వేరియంట్‌గా నిర్ధారించామన్నారు. మరోవైపు కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకువస్తూనే ఉంటాయని, అలా వచ్చే అన్ని వేరియంట్లూ ప్రమాదకరమైనవని చెప్పలేమని ప్రముఖ వైద్యనిపుణులు ఎరిక్ ఫిగ్‌డింగ్ అభిప్రాయపడ్డారు. ఒక వేరియంట్ ఎత ప్రమాదకరమనే విషయాన్ని, అది ఎంత ఎక్కువ బలంగా వ్యాపించగలదనే అంశమే నిర్ణయిస్తుందన్నారు.
ఒక వేరియంట్ వేగంగా, భారీగా వ్యాపిస్తుంటే అప్పుడే దాన్ని వీఓసీ(వేరియంట్ ఆఫ్ కన్సెర్న్– ఆందోళన కలిగించే వేరియంట్)గా నిర్ణయిస్తారన్నారు. ప్రస్తుత వేరియంట్ ఏ కేటగిరీలోకి వస్తుందో వేచిచూడాల్సిఉందన్నారు. అదేవిధంగా టీకాలు ఈ వేరియంట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయమై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని నిపుణులు తెలిపారు. ఒకపక్క ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి కొనసాగుతున్న వేళ మరో వేరియంట్ బయటపడడంపై పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
భయపెట్టే ఆ రెండు మ్యుటేషన్లు
ఐహెచ్‌యూ వేరియంట్‌లో దాదాపు 46 మ్యుటేషన్లు (ఉత్పరివర్తనాలు) గుర్తించారు. ఒమిక్రాన్‌లో 37 మ్యుటేషన్లే ఉన్నాయి. ఐహెచ్‌యూ స్పైక్ ప్రొటీన్‌లో గమనించిన మ్యుటేషన్లలో రెండు మ్యుటేషన్లు పరిశోధకులను భయపెడుతున్నాయి. కొత్త వేరియంట్ టీకాలను మరింత సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఉ484 ఓ మ్యుటేషన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా తొందరగా వ్యాపించేందుకు N501 ్గ మ్యుటేషన్ దోహదం చేస్తుంది. ఈ రెండు మ్యుటేషన్లు గత వేరియంట్లలో ఉన్నాయి. ఇవి ప్రస్తుత ఐహెచ్‌యూ వేరియంట్‌లో ఉన్నట్లు పరిశోధన వెల్లడిస్తోంది. ఈ వేరియంట్‌పై డబ్ల్యూహెచ్‌ఓ స్పందించాల్సిఉంది.
Comments
Please login to add a commentAdd a comment