సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఒమిక్రాన్ దడ.. ముంగిట్లో థర్డ్‌వేవ్ నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం జనం పరుగులు తీస్తున్నారు. ‘ఏం పర్వాలేదు’అని ఇప్పటివరకు అనాసక్తి చూపిన వాళ్లూ టీకా వేయించుకుంటున్నారు.
రాష్ట్రంలో అర్హత గల వ్యక్తుల్లో 100 శాతం (99 శాతం) చేరువలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయింది. రెండో డోస్ వేయించుకున్నవారు కూడా 63 శాతానికి చేరుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వచ్చే నెల మొదటి వారం వరకు రెండో డోస్ అర్హత కలిగిన వ్యక్తులందరికీ కూడా 100 శాతం అందించేలా ప్రత్యేక ప్రణాళిక వేసినట్టు అధికారులు తెలిపారు.
టార్గెట్ 2.7 కోట్లు మంది
కరోనా వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు పైబడినవారికి వేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం 18 ఏళ్లు నిండి వ్యాక్సిన్‌కు అర్హులైన వారు రాష్ట్రంలో 2,77,67,000 మంది ఉన్నారు. వీరందరికీ రెండు డోస్‌లు వ్యాక్సిన్ పూర్తి చేసే దిశగా సర్కారు ప్రణాళిక వేసింది. అర్హత గల వ్యక్తుల్లో ఇప్పటివరకు 2,75,88,003 మందికి వ్యాక్సిన్ వేసినట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో అనేక మంది వలస కూలీలు, కార్మికులు, ఇతర ఉద్యోగులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు.
హైదరాబాద్, మెదక్, ఇతర కొన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి రంగారెడ్డి జిల్లాలో 113 శాతం, హైదరాబాద్‌లో 110 శాతం, మెదక్‌లో 104 శాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ జరిగిందని అధికారులు తెలిపారు. ఇక రెండో డోస్ 1.76 కోట్ల మందికి (63 శాతం) వేశారు. ఇందులో అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 86 శాతం, హైదరాబాద్‌లో 80 శాతం, రంగారెడ్డి, హన్మకొండ జిల్లాల్లో 78 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 76 శాతం రెండో డోస్ వేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యంత తక్కువగా కొమురం భీం జిల్లాలో 33 శాతం, వికారాబాద్ జిల్లాలో 36 శాతం, గద్వాల, ఆదిలాబాద్ జిల్లాల్లో 43 శాతం చొప్పున రెండో డోస్ వేశారు.
వ్యాక్సినేషన్‌లో ముఖ్యాంశాలు
♦మొదటి, రెండో డోస్‌లు కలిపి 4.51 కోట్లు వేశారు. ప్రభుత్వ కేంద్రాల్లోనే ఎక్కువగా వ్యాక్సిన్లు వేస్తున్నారు.
♦రాష్ట్రంలో అందుబాటులో ఉన్న టీకా డోస్‌లు – 33.98 లక్షలు. ఇందులో కోవిషీల్డ్ 19.17 లక్షలు, కోవాగ్జిన్ 14.81 లక్షల డోస్‌లు.
♦ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేసేలా మొబైల్ టీంలను ఏర్పాటు చేశారు.
♦కొన్నిచోట్ల కరోనా టీకాలు వేసుకోకపోతే జీతాలు ఇవ్వొద్దని నిర్ణయాలు కూడా తీసుకున్నారు.
♦పొలాలు, గడ్డివాముల మీదికి కూడా ఎక్కి వైద్య సిబ్బంది టీకాలేస్తున్నారు. పనిచేసే చోట కూడా వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
♦18 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment