12–14 సంవత్సరాల పిల్లల కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, దానం నాగేందర్, శ్రీనివాసరావు తదితరులు
ఖైరతాబాద్(హైదరాబాద్): కోవిడ్ ప్రభావం తగ్గిందే తప్ప వైరస్ పూర్తిగా తగ్గలేదని, ప్రతి ఒక్కరు ముందస్తుగా టీకాలు వేయించుకుంటేనే మన ఆరోగ్యానికి భరోసా ఉంటుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా బుధవారం ఖైరతాబాద్‌లోని వెల్‌నెస్ సెంటర్‌లో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 12 నుంచి 14 ఏళ్ల వయస్సున్న పిల్లలకు కోవిడ్ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా తొలి రోజు 16,555 మంది టీకాలు తీసుకున్నారు. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. కరోనా థర్డ్ వేవ్ ముగిసిందనో, పెద్దగా ప్రభావం చూపలేదనో కొత్త వేరియెంట్ ఇప్పుడే వస్తుందా, రాదా అనే అనుమానాలతో టీకాలు తీసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం చేయవద్దన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12–14 ఏళ్ల వయస్సు వారు 17,23,000 మంది ఉంటారని అంచనా వేశామని వారందరికీ టీకాలు వేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలకు నేరుగా వెళ్లి లేదా ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని మంత్రి కోరారు.
20 వేల పోస్టుల భర్తీ
కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రపం చానికి తెలంగాణ రెండు టీకాలను అందించిందని, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ మొదటిదయితే, బయోలాజికల్ –ఈ తయారుచేసిన కార్బొవ్యాక్స్ రెండోదని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రపంచానికే తెలంగాణ వ్యాక్సిన్‌హబ్‌గా మారిందన్నారు. రాబోయే రోజుల్లో 20వేల మందిని వైద్య ఆరోగ్య శాఖలో భర్తీ చేయబోతున్నామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నాగేష్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రమేష్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రాజేంద్రనగర్‌లోని టీఎస్ పార్డ్ లో 33 జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు,ఉద్యోగులతో ఏర్పాటు చేసిన ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా, దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణను నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ సారథ్యంలో పనిచేస్తున్నామన్నారు.
రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో మందులను ఆన్‌లైన్ చేస్తామని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వైద్యాధికారులకు, ఉద్యోగులకు నగదు పురస్కారాలు ఇచ్చి గౌరవిస్తామని వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో కొత్తగా 75 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,90,574కు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment