పక్కాగా తెలంగాణ అంతటా కర్ఫ్యూ | Telangana Implements Night Curfew Upto May First Morning | Sakshi
Sakshi News home page

పక్కాగా తెలంగాణ అంతటా కర్ఫ్యూ

Published Wed, Apr 21 2021 2:03 AM | Last Updated on Wed, Apr 21 2021 7:06 AM

Telangana Implements Night Curfew Upto May First Morning - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగి పోతుండటం, వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం పొద్దున్నే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు, విపత్తుల నిర్వహణ చట్టం-2005కు అనుగుణంగా ఈ ఆదేశాలిస్తున్నట్టు పేర్కొన్నారు. రోజూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని.. మంగళవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు (మే 1న ఉదయం 5 గంటల వరకు) అమల్లో ఉంటుందని ప్రకటించారు. అన్ని వాణిజ్య సముదాయాలు, క్లబ్‌లు, పబ్‌లు, బార్లు, వైన్‌షాప్‌లు, అత్యవసరం కాని అన్ని రకాల వాణిజ్య సంబంధిత దుకాణాలను రాత్రి 8 గంటలలోగా మూసేయాలని.. వాటిలో పనిచేసే సిబ్బంది ఇళ్లకు చేరుకోవడానికి గంటసేపు వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు.

కరోనా సెకండ్‌ వేవ్‌తో రాష్ట్రంలో కొద్దిరోజులుగా పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం వ్యాక్సినేషన్, టెస్టులు చేయడం, ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణను పట్టించుకోవడం లేదని.. జనం యథేచ్ఛగా తిరగకుండా చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటూ హైకోర్టులో పిల్స్‌ దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన కోర్టు.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘రాష్ట్రంలో లాక్‌డౌన్‌గానీ, నైట్‌ కర్ఫ్యూగానీ విధిస్తారా? ఇంకా ఏమేం చర్యలు తీసుకుంటారో 48 గంటల్లో తేల్చి చెప్పండి’అంటూ సోమవారం ఆదేశించింది. దానిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు విన్నవించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం నైట్‌ కర్ఫ్యూ ఉత్తర్వులు జారీ చేశారు. కర్ఫ్యూ నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని అందులో పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో కఠినంగా నైట్‌ కర్ఫ్యూ అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. కర్ఫ్యూ సమయంలో కొన్ని అత్యసవర, నిరంతరం సేవలు అవసరమైన సంస్థలు, వాటిలో పనిచేసే సిబ్బందికి మినహాయింపులు ఉంటాయని తెలిపారు.

గంట ముందే బంద్‌..
రాష్ట్ర ప్రభుత్వం నైట్‌ కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో హైదరాబాద్‌ సిటీ పోలీసులు తగిన ఏర్పాట్లు సిద్ధం చేశారు. బారికేడ్లు, పికెట్లు, కా>ర్డన్‌ ఏరియాలను ఎంపిక చేశారు. కర్ఫ్యూ అమలు కోసం మంగళవారం నుంచి రాత్రి విధుల్లో ఎక్కువ మంది సిబ్బందిని మోహరించనున్నారు. ఇక మినహాయింపు ఉన్నవి మినహా అన్ని కార్యాలయాలు, సంస్థలు, దుకాణాలను రాత్రి 8 గంటలకే మూసేయాలని అధికారులు స్పష్టం చేశారు. అలాగైతేనే వినియోగదారులు, ఉద్యోగులు 9 గంటలకల్లా గమ్యస్థానాలకు, ఇళ్లకు చేరడం సాధ్యమని పేర్కొన్నారు. మినహాయింపు ఉన్నవారు మినహా ఎవరైనా రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




మినహాయింపులున్న మరికొన్ని అంశాలు

  • అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు, మున్సిపల్, పంచాయతీరాజ్‌ శాఖల్లో పనిచేసే ఎమర్జెన్సీ సిబ్బంది తగిన గుర్తింపు కార్డులు చూపిస్తే అనుమతినిస్తారు.
  • అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులకు సంబంధించిన డాక్టర్లు, నర్సింగ్‌ స్టాఫ్, పారా మెడికల్‌ సిబ్బంది తమ గుర్తింపు కార్డులను చూపిస్తే అనుమతిస్తారు.
  • గర్భిణీలు, ఆస్పత్రుల సేవలు అవసరమైన రోగులకు అనుమతి.
  • రాష్ట్రంలోకి వచ్చే, పోయే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు, జిల్లాల నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు వెళ్లే బస్సు సర్వీసులపై ఆంక్షలు లేవు.
  • గూడ్స్‌ వాహనాలకు పర్మిషన్‌ ఉంటుంది. ఎలాంటి ప్రత్యేక పాసులు అవసరం లేదు.

ఉదయం 6.30 నుంచి రాత్రి 7.45 వరకే మెట్రో రైళ్లు
రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. పొద్దున 6.30 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకే మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సంస్థ ప్రకటించింది. ప్రయాణికులు విధిగా మాస్కులు ధరించాలని, స్టేషన్లలోకి ప్రవేశించే ముందు థర్మల్‌ స్క్రీనింగ్, శానిటైజర్‌ వినియోగించాలని.. స్టేషన్లు, రైలుబోగీల్లో భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా సురక్షిత ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నామని.. ప్రయాణికులు భయాందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొంది.

8 గంటలకే ’మద్యం’ బంద్‌
నైట్‌ కర్ఫ్యూ నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఎక్సైజ్‌ శాఖ ఆంక్షలు విధించింది. వైన్‌ షాపులు, బార్లు, క్లబ్బులు, కల్లు దుకాణాలను రాత్రి 8 గంటల కల్లా మూసివేయాలని ఆదేశించింది. వైన్‌ షాపులు, బార్లు తెరచి ఉన్న సమయంలో కోవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. బార్లలో ప్రవేశద్వారం వద్దనే థర్మామీటర్లు ఏర్పాటు చేయాలని, సిబ్బంది కచ్చితంగా మాస్కులు ధరించాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, భౌతిక దూరం పాటించేలా వినియోగదారులను కట్టడి చేయాలని పేర్కొంది.

చదవండి: హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ రోజులు.. రోడ్లన్నీ వెలవెల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement