బాజిరెడ్డి గోవర్ధన్‌ను సన్మానిస్తున్న ఆర్టీసీ సిబ్బంది
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు డ్రైవర్లు, కండక్టర్లే రథసారథులని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సమష్టికృషితోనే సత్ఫలితాలను సాధించగలమని చెప్పారు. సిబ్బందిలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పునశ్చరణ తరగతులు ఎంతో దోహదంచేస్తాయన్నారు. మంగళవారం ఆయన హకీంపేట్‌లోని ట్రాన్స్‌పోర్టు అకాడమీని సందర్శించారు. జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో సిబ్బందికి ఏర్పాటు చేసిన పునశ్చరణ తరగతులను పరిశీలించారు.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఓఅండ్‌ఏ) యాదగిరి, అకాడమీ ప్రిన్సిపాల్ సుచరితలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రైవర్, కండక్టర్లతో పాటు మెకానికల్ సూపర్‌వైజర్లకు ఇస్తున్న శిక్షణ తీరును చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. అత్యధిక కేఎంపీఎల్ (7) సాధించిన డ్రైవర్ బి.డి. రెడ్డి, మెరుగైన ఈపీకే (38) సాధించిన కండక్టర్ గీతారమణిలను ఆయన అభినందించారు. ప్రయాణికుల ఆదరాభిమానాలను పొందితే నష్టాలను అధిగమించి లాభాల బాటలో పయనించవచ్చని చెప్పారు. ప్రతి బస్సులో ఆక్యుపెన్సీ పెంచుకొనేందుకు కృషి చేయాలన్నారు.
రవాణా రంగంలో నెలకొన్న పోటీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందజేయాలన్నారు. సంస్థ ఆర్థిక స్థితి పుంజుకుంటున్న సంకేతాలు కని్పస్తున్నాయని, సరికొత్త ప్రణాళికలను అమలు చేయడానికి బాట వేయడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి మాట్లాడుతూ, కోవిడ్‌తో కుదేలైన ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment