ఉద్యోగులు పొదుపు చేసుకున్న ‘సహకార పరపతి’ నిధిని వాడేసుకున్న ఆర్టీసీ
అత్యవసరాలకు రుణం తీసుకునేందుకు వీలు లేకుండా మాయం
బకాయిలు చెల్లించని ఆర్టీసీ.. చేతులెత్తేసిన సీసీఎస్
పిల్లల పెళ్లిళ్లు, చదువులు, వైద్య చికిత్సల కోసం
అధిక వడ్డీతో ప్రైవేట్ అప్పులు తెచ్చుకుంటున్న కార్మికులు..
ఆరు నెలల్లో 7 వేలకు చేరిన దరఖాస్తులు..
జోక్యం చేసుకోని సర్కార్.. మళ్లీ హైకోర్టుకు కార్మికులు!
ఆర్టీసీ కండక్టర్ వెంకటేశ్వర్లు కుమారుడు జేఈఈలో ఆలిండియా స్థాయిలో 265 ర్యాంకు సాధించాడు. ఐఐటీ ఫీజు చెల్లించేందుకు సీసీఎస్ నిధి నుంచి లోన్ కోసం వెంకటేశ్వర్లు దరఖాస్తు చేశాడు. నిధులు లేక సకాలంలో రుణం ఇవ్వలేమని వారు చెప్పడంతో ఇల్లు తాకట్టు పెట్టి ప్రైవేటుగా రూ.10 లక్షలు అప్పు చేశాడు. ఆ వడ్డీ భారంతో సతమతమవుతున్నాడు.
కానికల్ సెక్షన్‌లో పనిచేస్తున్న జుబేర్‌కు కొన్నిరోజులుగా ఒక కాలు, చేతికి స్పర్శ సరిగా ఉండటం లేదు. ఆస్పత్రికి వెళితే త్వరగా శస్త్రచికిత్స చేయాలని, లేకుంటే పక్షవాతానికి గురికావొచ్చని హెచ్చరించారు. ఆర్టీసీ ఆస్పత్రికి వెళ్తే.. తొలుత ట్రీట్‌మెంట్ ఇస్తామని, తగ్గకుంటే ప్రైవేటుకు రిఫర్ చేస్తామన్నారు. దీనితో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం రుణం కావాలని సీసీఎస్‌లో దరఖాస్తు చేశారు. నిధులు లేవనడంతో బయట అధిక వడ్డీకి అప్పు చేయాల్సి వచ్చింది.
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలోని సహకార పరపతి సంఘం (సీసీఎస్) దివాలా దశకు చేరుకోవటంతో సంస్థలోని చిరుద్యోగుల జీవితాలు ఆగమాగం అవుతున్నాయి. పిల్లల చదువుల కోసం కొందరు, పెళ్లిళ్ల కోసం మరికొందరు, అనారోగ్య సమస్యలతో ఇంకొందరు, ఇతర కుటుంబ అవసరాల కోసం మరెందరో.. లోన్ కోసం సీసీఎస్‌లో దరఖాస్తు చేస్తున్నారు. అక్కడ నిధులు లేవని తేల్చిచెప్తుండటంతో తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు ఫైనాన్షియర్ల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు. సిబిల్ స్కోర్(Cibil Score) సరిగా లేదన్న కారణంతో బ్యాంకులు రుణాలకు నిరాకరిస్తుండంతో ప్రైవేటు అప్పులు చేయక తప్పడం లేదు.
వచ్చే జీతంలో ఇంటి ఖర్చులు పోగా మిగతా సొమ్ము వడ్డీలు కట్టేందుకు కూడా సరిపోని దుస్థితి తలెత్తుతోందని, కుటుంబాలు ఆగమవుతున్నాయని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు వాపోతున్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు రూ.లక్షకు నెలకు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రతినెలా జీతంలో 7% కోత పెట్టుకుని నిధి సమకూర్చుకుంటే.. తమ నిధి నుంచి తమకే రుణాలు అందక ఇలా అప్పుల బారినపడటం దారుణమని పేర్కొంటున్నారు.
డ్రైవర్ కొండారెడ్డి కుమార్తె పెళ్లి పెట్టుకున్నాడు. రూ.9 లక్షల లోన్ కోసం సీసీఎస్‌కు దరఖాస్తు చేశాడు. ప్రభుత్వం నుంచి బకాయిలు వచ్చేవరకు లోన్ దొరికే పరిస్థితి లేదని, తొలుత రిటైర్మెంట్ కేసులను పరిష్కరించాకే లోన్ చెల్లింపులు ఉంటాయన్న సమాధానం వచ్చింది. అప్పటిదాకా ఎదురు చూసే పరిస్థితి లేక, డ్రైవర్ కావటంతో వెంటనే అప్పు పుట్టక తిరిగి తిరిగి చివరకు అధిక వడ్డీకి అప్పు తెచ్చుకోవాల్సి వచ్చింది.
జాతీయ స్థాయి గుర్తింపు నుంచి..
ఆర్టీసీలోని (TSRTC) సహకార పరపతి సంఘానికి ఉమ్మడి రాష్ట్రంలో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. ఆర్టీసీ ఉద్యోగుల జీతాల్లో ప్రతినెలా 7 శాతం మొత్తం దీనికి జమ చేయటం ద్వారా నిధి ఏర్పడుతుంది. అందులోంచే ఉద్యోగులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తారు. దాదాపు రూ.3 వేల కోట్ల నిధితో వేల సంఖ్యలో ఉద్యోగులకు రుణాలు ఇస్తూ, కార్మికులను ఆదుకునే సంస్థగా గిన్నిస్ బుక్ రికార్డుతోపాటు పలు పురస్కారాలు దక్కించుకుంది. కానీ ఆర్టీసీ కొన్నేళ్లుగా ఈ నిధిని సొంతానికి వాడేసుకుని ఖాళీ చేసింది. ప్రస్తుతం వడ్డీతో కలిపి రూ.900 కోట్లకుపైగా ఆర్టీసీ చెల్లించాల్సి ఉంది.
చదవండి: ఫోరెన్సిక్ ఆడిటింగ్‌పై రెవెన్యూ శాఖలో గుబులు
సీసీఎస్‌లో నిధులు లేకపోవడంతో... ఆర్టీసీ ఉద్యోగులకు లోన్లు అందని పరిస్థితి నెలకొంది. సీసీఎస్ (CCS) గతంలో ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించడంతో బకాయిలు చెల్లించాలని ఆర్టీసీని ఆదేశించింది. ఈ మేరకు గత జూన్‌లో సీసీఎస్‌కు రూ.200 కోట్లు అందాయి. మరో రూ.150 కోట్లు బ్యాంకు నుంచి రుణం తెచ్చింది. ఈ మొత్తం నుంచి ఉద్యోగులకు లోన్లు ఇచ్చింది. ఇలా జూన్ వరకు పేరుకుపోయిన దరఖాస్తుదారులకు ఊరట లభించింది. ఆ తర్వాత బకాయిల చెల్లింపు లేకపోవటంతో లోన్ దరఖాస్తులు పేరుకుపోతూ వస్తున్నాయి. ప్రస్తుతం 7 వేల మంది రుణాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఎన్నో అవసరాల కోసం..
ప్రస్తుతం ఆర్టీసీలో 40 వేల మంది ఉద్యోగులుంటే... అందులో దాదాపు సగం మంది వరకు వివిధ అవసరాల కోసం సీసీఎస్ రుణాలపై ఆధారపడుతుంటారు. దాన్ని చెల్లించి, మళ్లీ అత్యవసరం పడితే రుణం తీసుకుంటూ ఉంటారు. విద్యా సంవత్సరం ముగియనున్నందున ఫైనల్ సెమిస్టర్ ఫీజులు చెల్లించాల్సి ఉంది. దీంతో చాలా మంది ఉద్యోగులు పిల్లల ఫీజుల కోసం అత్యవసర లోన్లు కావాలని దరఖాస్తులు సమర్పించారు. పిల్లల పెళ్లిళ్లు, ఆస్పత్రి ఖర్చులు, ఇంటి రిపేర్లు.. ఇలా మరెన్నో అవసరాల కోసం దరఖాస్తు చేసినవారు ఉన్నారు. అయితే ఆర్టీసీ ఉద్యోగులు ఇంతగా ఇబ్బందిపడుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
మళ్లీ కోర్టు తలుపుతట్టే ఆలోచన
ఉద్యోగుల ఒత్తిడి భరించలేక బకాయిలు చెల్లించాలంటూ కొన్నిరోజులుగా సీసీఎస్ యంత్రాంగం ఆర్టీసీపై ఒత్తిడి పెంచుతోంది. కనీసం బ్యాంకు నుంచి రుణం పొందేందుకు పూచీకత్తు అయినా ఇవ్వాలని కోరుతోంది. కానీ ఆర్టీసీ యాజమాన్యం నుంచి సానుకూలత రావటం లేదు. సీసీఎస్ బకాయిలు చెల్లించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించి ఉన్నందున... మళ్లీ హైకోర్టు తలుపుతట్టి, కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయాలని సీసీఎస్ యంత్రాంగం భావిస్తున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment