RTC conductors
-
డ్రైవర్లు, కండక్టర్లే ఆర్టీసీ రథసారథులు
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు డ్రైవర్లు, కండక్టర్లే రథసారథులని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సమష్టికృషితోనే సత్ఫలితాలను సాధించగలమని చెప్పారు. సిబ్బందిలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పునశ్చరణ తరగతులు ఎంతో దోహదంచేస్తాయన్నారు. మంగళవారం ఆయన హకీంపేట్‌లోని ట్రాన్స్‌పోర్టు అకాడమీని సందర్శించారు. జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో సిబ్బందికి ఏర్పాటు చేసిన పునశ్చరణ తరగతులను పరిశీలించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఓఅండ్ఏ) యాదగిరి, అకాడమీ ప్రిన్సిపాల్ సుచరితలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రైవర్, కండక్టర్లతో పాటు మెకానికల్ సూపర్వైజర్లకు ఇస్తున్న శిక్షణ తీరును చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. అత్యధిక కేఎంపీఎల్ (7) సాధించిన డ్రైవర్ బి.డి. రెడ్డి, మెరుగైన ఈపీకే (38) సాధించిన కండక్టర్ గీతారమణిలను ఆయన అభినందించారు. ప్రయాణికుల ఆదరాభిమానాలను పొందితే నష్టాలను అధిగమించి లాభాల బాటలో పయనించవచ్చని చెప్పారు. ప్రతి బస్సులో ఆక్యుపెన్సీ పెంచుకొనేందుకు కృషి చేయాలన్నారు. రవాణా రంగంలో నెలకొన్న పోటీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందజేయాలన్నారు. సంస్థ ఆర్థిక స్థితి పుంజుకుంటున్న సంకేతాలు కని్పస్తున్నాయని, సరికొత్త ప్రణాళికలను అమలు చేయడానికి బాట వేయడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి మాట్లాడుతూ, కోవిడ్‌తో కుదేలైన ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందన్నారు. -
కండక్టర్లు, డ్రైవర్ల ఆకస్మిక సెలవులు.. బస్సుకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్, అత్తాపూర్ తదితర ప్రాంతాల మీదుగా ఉప్పల్ నుంచి మెహిదీపట్నంకు రాకపోకలు సాగించే బస్సు (రూట్ నంబర్ 300)కు భారీ డిమాండ్ ఉంటుంది. ప్రతి అరగంటకు ఒక బస్సు నడిచినా మరో బస్సు కోసం ప్రయాణికులు పడిగాపులు కాస్తూనే ఉంటారు. అలాంటి రద్దీ రూట్లో ఆకస్మికంగా బస్సులు రద్దయితే ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెపాల్సిన పని లేదు. రూట్లో బస్సులు నడిపే బండ్లగూడ డిపోలో కొద్ది రోజులుగా సిబ్బంది కొరత అధికారులను వేధిస్తోంది. కండక్టర్లు, డ్రైవర్ల ఆకస్మిక గైర్హాజరుతో బస్సులు నిలిచిపోతున్నాయి. చదవండి: ఆర్టీసీపై పాట.. కిన్నెర మొగులయ్యకు సజ్జనార్ బంపర్ ఆఫర్ రోజుకు 15 నుంచి 20 మంది ఏదో ఒకకారణంతో ఉన్నపళంగా సెలవు పెట్టేస్తున్నారు. దీంతో ఒక్క ఉప్పల్–మెహదీపట్నం రూట్లోనే కాదు, డిపో నుంచి శివారు ప్రాంతాలకు రాకపోకలు సాగించే పలు రూట్లలో పెద్ద సంఖ్యలో ట్రిప్పులు రద్దవుతున్నాయి. వందలాది మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ‘70 సొంత బస్సులు, మరో 25 అద్దె బస్సులున్న బండ్లగూడ డిపోలో రోజుకు కనీసం 10 బస్సులు ఆగిపోయినా కష్టమే’ అని ఆర్టీసీ అధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. ఈ ఒక్క డిపోలోనే కాదు. గ్రేటర్‌లోని చాలా డిపోల్లో ఇదే పరిస్థితి నెలకొంది. చదవండి: హైదరాబాద్‌లో కిలో టమాట రూ. 50.. ఎగబడ్డ జనం డ్రైవర్ ఉంటే కండక్టర్ ఉండరు.. గ్రేటర్లో మొత్తం 29 డిపోలు ఉన్నాయి. ఒక్కో డిపోలో 100 నుంచి 130 బస్సులు ఉన్నాయి. కొన్ని డిపోల్లో వంద లోపు ఉంటే మరికొన్ని చోట్ల ఎక్కువే ఉన్నాయి. అన్ని డిపోల్లో 10 శాతం స్పేర్ బస్సులను మినహాయించి సుమారు 2,750 బస్సులను నడుపుతున్నారు. ప్రతి డిపోలో 15 శాతం సిబ్బంది సాధారణ సెలవుపై ఉంటారు. వీక్లీ ఆఫ్‌లు, ముందస్తు సమాచారంతో పొందిన సెలవులు, అనారోగ్యం కారణంగా సెలవులో ఉన్నవాళ్లు ఉంటారు. ఈ సిబ్బందిని మినహాయించి మిగతా కండక్టర్లు, డ్రైవర్ల సంఖ్యకు అనుగుణంగా అధికారులు ఆ రోజుకు ప్రణాళికను రూపొందించుకుంటారు. ఆ రోజు విధులు నిర్వహించాల్సిన కండక్టర్లు, డ్రైవర్లలో ఏ ఒక్కరు ఆకస్మిక సెలవు పెట్టినా ఒక బస్సు ఆగిపోవాల్సిందే. చదవండి: చలాన్ల వేధింపులు తట్టుకోలేక బైక్‌కు నిప్పంటించాడు రకరకాల కారణాలతో ప్రతి డిపోలో 10 నుంచి 15 మంది ఇలా ఆకస్మిక సెలవులు పెట్టేస్తున్నారు. ‘ఒక బస్సుకు డ్రైవర్ ఉంటే కండక్టర్ ఉండరు. కండక్టర్ ఉన్న బస్సుకు డ్రైవర్ గైర్హాజరవుతాడు, దీంతో మరో గత్యంతరం లేక బస్సులను ఆపేయాల్సి వస్తుంది’. అని ఒక డిపోమేనేజర్ తెలిపారు. మరోవైపు సాధారణంగానే ఆర్టీసీని సిబ్బంది కొరత వెంటాడుతుంది. దీర్ఘకాలిక సమ్మె అనంతరం నగరంలో కొన్ని బస్సులను కార్గోలుగా మార్చారు. మరి కొన్నింటిని తుక్కు కిందకు మార్చారు. కండక్టర్లు, డ్రైవర్లను పెట్రోల్ బంకుల్లో డెలివరీబాయ్‌లుగా, ఆఫీసుల్లో క్లర్కులుగా, ఇతరత్రా విధుల్లో చేర్చారు. కార్గో బస్సుల కోసం ప్రతి డిపో నుంచి 30 మందికి పైగా సిబ్బందిని బదిలీ చేశారు. ఈ బస్సుల్లో కండక్టర్లు హమాలీలుగా పని చేస్తున్నారు. ఇలా వివిధ రకాల కారణాలతో తగ్గిన సిబ్బందితో బస్సుల నిర్వహణ కష్టంగా మారింది. ఇక ఆకస్మికంగా సెలవులు పెట్టే సిబ్బంది గైర్హాజరు దీనికి మరింత ఆజ్యం పోస్తోంది. శివార్లు విలవిల బస్సుల రద్దుతో శివారు ప్రాంతాల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నడిచే ట్రిప్పుల్లో రద్దయ్యేవి ఎక్కువగా ఉంటున్నాయి. ఘట్కేసర్, కీసర, హయత్‌నగర్, చేవెళ్ల, శంకరపల్లి, ఇబ్రహీంపట్నం, తదితర ప్రాంతాల్లోని శివారు గ్రామాలు, కాలనీలకు బస్సులు రద్దు కావడంతో ఇటీవల విద్యార్థులు పలు చోట్ల ధర్నాలకు దిగారు. ఉదయం పూట రద్దీకి అనుగుణంగా బస్సులు నడుస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వేళల్లో డిపోల్లో గైర్హాజరీలు పెరగడంతో బస్సులు రద్దవుతున్నాయి. -
హతవిధి.. రాత్రి వరకూ డ్యూటీ చేసి..
‘‘మహిళా కండక్టర్లను కన్న బిడ్డల తీరుగ చూసుకోవాలె. రాత్రి 8 గంటలలోపు విధులు ముగిసేలా చూడాలె. వాళ్లకు ఏ ఇబ్బందీ రానీయొద్దు.’’ స్వయంగా ముఖ్యమంత్రే ఆదేశించినా కామారెడ్డి ఆర్టీసీ డిపోలో నిబంధనలు అమలు కావడం లేదు. ఉద్యోగినులకు రాత్రి 11 గంటల వరకు డ్యూటీలు కేటాయిస్తున్నారు. దీంతో మహిళా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాక్షి, కామారెడ్డి: ఆర్టీసీలో మహిళా కండక్టర్లకు డ్యూటీల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాత్రి 8 గంటలలోపు విధులు ముగిసేలా చూడాలి. కామారెడ్డి ఆర్టీసీ డిపోలో మాత్రం విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. రాత్రి 11 గంటల వరకు కూడా పని ఇస్తున్నారు. ఇక్కడ డ్యూటీలు వేసే అధికారి కూడా మహిళే.. ఆమె గతంలో కండక్టర్‌గా పనిచేసి పదోన్నతి పొందారు. కానీ ఆమెనే మహిళా కండక్టర్లకు అర్ధరాత్రి వరకు డ్యూటీలు కేటాయిస్తుండడంతో సిబ్బంది విస్మయపోతున్నారు. జిల్లా కేంద్రమైన కామారెడ్డి బస్ డిపోలో 140 బస్సులున్నాయి. ఆరు వందల మంది కార్మికులు ఉండగా అందులో 70 మంది వరకు మహిళా కండక్టర్లు పనిచేస్తున్నారు. మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటలలోపు విధులు ముగిసే విధంగా డ్యూటీలు ఇవ్వాలన్న ఆదేశాలున్నాయి. అయితే కామారెడ్డి డిపోలో మాత్రం ఇందుకు విరుద్ధంగా రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు డ్యూటీ చేయిస్తున్నారు. రాత్రి వరకూ డ్యూటీ చేసి.... కామారెడ్డి బస్ డిపో నుంచి వివిధ రూట్లలో ఆయా ట్రిప్పుల సమయాల ప్రకారం రాత్రి 10 తరువాత కొన్ని బస్సులు డిపోకు చేరుకుంటాయని తెలిసినా.. ఆయా రూట్లలో మహిళా కండక్టర్లకు డ్యూటీలు వేస్తున్నారు. గుండారం, నిజాంసాగర్, రామాయంపేట తదితర రూట్లలో డ్యూటీలు రాత్రి వరకు ఉంటాయి. కొందరు కండక్టర్లు తమకు ఆయా రూట్లలో డ్యూటీ వద్దని విన్నవించుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. డ్యూటీ పూర్తయిన తరువాత డిపోకు వెళ్లి డబ్బులు డిపాజిట్ చేయడానికి మరికొంత సమయం పడుతోంది. రాత్రి పూట ఒంటరిగా ఇంటికి చేరాలంటే చాలా మంది భయపడుతున్నారు. కుటుంబ సభ్యులు అందుబాటులో ఉంటే వారు బస్‌డిపోకు వచ్చి తీసుకువెళ్తున్నారు. ఇక కొందరు మహిళా కండక్టర్లను తీసుకువెళ్లేవారు లేక రాత్రి పూట ఇళ్లకు వెళ్లడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి వేళ ఇంటికి చేరుతున్నామని, సరిగా తినలేకపోతున్నామని, కుటుంబ సభ్యులను పట్టించుకునే పరిస్థితి ఉండడం లేదని ఉద్యోగినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వరకు డ్యూటీలు ఏమిటంటూ కుటుంబ సభ్యులూ అసహనం వ్యక్తం చేస్తుండడంతో మనోవేదనకు గురవుతున్నారు. పట్టించుకునేవారు లేరు.. గతంలో ఆర్టీసీలో కార్మిక సంఘాలు చురుకుగా పనిచేసేవి. కార్మికులకు ఇబ్బందులు ఎదురైనపుడు వారి తరపున యూనియన్ నాయకులు స్పందించేవారు. అయితే గతేడాది సీఎం కేసీఆర్ కార్మిక సంఘాల అవసరం లేదంటూ ప్రత్యేకంగా కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అప్పటి నుంచి సంఘాలు ఉనికి కోల్పోయాయి. దీంతో తమ తరపున అధికారులతో మాట్లాడేవారు లేకుండాపోయారని, అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అర్ధరాత్రి వరకూ డ్యూటీలు చేయాల్సిన పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న మహిళా కార్మికుల విషయంలో జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
ఆర్టీసీకి నకిలీ నోట్ల బెడద
ఇబ్రహీంపట్నం: ఆర్టీసీని నకిలీ నోట్ల బెడద వెంటాడుతోంది. ఇబ్రహీంపట్నం ఆర్టీసీ బస్సుల్లో ఈ నోట్ల చలామణి ఎక్కువగా జరుగుతోంది. సంతరోజైన బుధవారం జనాల రద్దీ మార్కెట్లో ఎక్కువగా ఉంటుంది. బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసి ఉంటారు. ఇదే అదనుగా భావించి కేటుగాళ్లు కండక్టర్లకు నకిలీనోట్లు ఇస్తున్నారు. ప్రయాణికుల రద్దీతో నోట్లను సరిగా గమనించని కండక్టర్లు వారికి టికెట్లను ఇచ్చి తిరిగి చిల్లర డబ్బులను ఇస్తున్నారు. డ్యూటీ దిగి డిపోలోని క్యాష్ కౌంటర్లో డబ్బులను కండక్టర్లు ముట్టజెప్పి వెళ్తున్నారు. ఆ తర్వాత డిపో క్యాష్ క్లర్క్ డబ్బులను లెక్కించే క్రమంలో ఈ నకిలీ నోట్లు బయటపడుతున్నాయి. బుధ, గురువారల్లో ఈ నోట్ల అధికంగా వస్తున్నట్లు డిపో అధికారి ఒకరు తెలిపారు. ఒకే సిరీస్ నంబర్‌తో మూడు నాలుగు నోట్లు వచ్చినట్లు చెప్పారు. అదేవిధంగా రద్దీగా ఉండే పాన్‌షాపుల్లో కూడా ఈ నోట్లు వస్తున్నట్లు ఓ యాజమాని తెలిపారు. ఓరిజనల్ నోట్లను పోలీనట్లుగానే ఉండటంతో ఈ నోట్లను వెంటనే గుర్తించడం ఇబ్బందిగా మారింది. నకిలీనోట్లు వస్తున్నాయి ఆర్టీసీ బస్సుల్లో నకిలీ నోట్లు వస్తున్నాయి. రద్దీగా ఉండే బస్సుల్లోనే దుండగులు నకిలీ నోట్లను విడిపిస్తున్నారు. బుధ, గురువారల్లో ఇవి ఎక్కువ వస్తున్నాయి. క్యాష్ కౌంటింగ్ మిషన్‌కు కూడా ఈ నోట్లు చిక్కడం లేదు. బ్యాంకుకు వెళ్తే ఫెక్ నోట్ అంటూ చెబుతున్నారు. – యాదయ్య, ఆర్టీసీ డిపో క్లర్కు -
విస్తరిస్తున్న ‘వన్‌మ్యాన్’ సర్వీసులు
ఆర్టీసీలో విస్తరిస్తున్న వన్‌మ్యాన్ సర్వీసులు ప్రయాణికులను భయపెడుతున్నాయి. డ్రైవింగ్ చేసే డ్రైవరే టిక్కెట్ కూడా కలెక్ట్ చేస్తూ ఉద్యోగం నిర్వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామం ఏమాత్రం మంచిది కాదని, ఇది ప్రయాణికుల భద్రతకే ప్రమాదమని పలువురు పేర్కొంటున్నారు. విజయనగరం అర్బన్: ఆర్టీసీలో వన్‌మ్యాన్ (సింగిల్ డ్రైవర్ బస్సులు) సర్వీసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇటీవలే పలు డిపోలలో కండక్టర్లను పంపకుండా సింగిల్ డ్రైవర్ సర్వీసులను ఆర్టీసీ నార్త్ ఈస్‌కోస్ట్ రీజియన్ పెంచింది. జిల్లా పరిధిలోని నాలుగు డిపోలలో గతంలో కేవలం 15 మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఈ సర్వీసులను 28 బస్సులకు పెంచి, సింగిల్ డ్రైవర్ సర్వీసులుగా నడుపుతున్నారు. అత్యధికంగా పార్వతీపురం డిపో నుంచి 14, ఎస్.కోట డిపో నుంచి 8, సాలూరు డిపో నుంచి 6 బస్సులలో సింగిల్ డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారు. మోటార్ యాక్ట్‌కు విర్దుదంగా వన్‌మ్యాన్ సర్వీసులు నడుపుతున్న అధికారులు సంబంధిత డ్రైవర్‌కి టిక్కెట్ ఇష్యూయింగ్ మిషన్ (టిమ్) ఇచ్చి కండక్టర్ వ్యవస్థను నీరుగారుస్తున్నారు. దీంతో కార్మికులపై పనిభారం పెరిగింది. ప్రయాణికుల భద్రత ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఓటీలో కోతే లక్ష్యంగా... ఓవర్ టైమ్ (ఓటీ) సర్వీసుల వేళల్లో కోత విధించి కార్మికుల పొట్టకొట్టాలని చూస్తున్నారనే ఆరోపణలతో కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. ఓటీ సర్వీసులు నెక్ రీజియన్ పరిధిలో రోజుకు సుమారు వంద వరకు ఉన్నాయి. మోటార్ వాహన నిబంధనల ప్రకారం డ్రైవర్లతో రాత్రి వేళల్లో నాలుగు గంటలు మాత్రమే బస్సులు నడిపించాలి. దీన్ని ఆరు గంటలకు పెంచారు. కానీ రోడ్డు రవాణ సంస్థ డ్రైవర్లు వెళ్లే దూర ప్రాంత వన్‌మ్యాన్ సర్వీసుల్లో ఒకే డ్రైవర్ ఉన్న కారణంగా 8 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే డ్రైవర్ బస్సు నడపాల్సిన పరిస్థితి ఉంది. స్పెషల్ టైపు (ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ) బస్సులకు ఒక డ్రైవర్ చేత 200 కిలో మీటర్ల వరకు మాత్రమే నడిపించాలి. దీన్ని కూడా 250 కిలోమీటర్లకు పెంచినా అనధికారికంగా 350 నుంచి 371 కిలోమీటర్ల వరకు నడిపిస్తున్నారు. పాలకొండ నుంచి విశాఖ, పార్వతీపురం నుంచి విశాఖ, శ్రీకాకుళం నుంచి విశాఖ సర్వీసులను ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఇలా కడుపు కొట్టనున్నారు... కార్మిక చట్టం ప్రకారం 8 గంటలకు మించి విధులు నిర్వహించే కార్మికులకు ఓటీ సొమ్ము చెల్లించాలి. 9 గంటల పాటు విధులు నిర్వహిస్తే ఒక గంట ఓటీ ఇవ్వాలి. కార్మికుడు నెల వేతనంలో గంటకు ఎంత మొత్తం అవుతుందో లెక్కించి ఆ మొత్తం కంటే రెట్టింపు డబ్బును కార్మికుడికి ఇవ్వాలి. ఈ క్రమంలో బస్సు ఇన్కమింగ్ సమయాన్ని కుదించారు. ఉదాహరణకు విజయనగరం నుంచి బొబ్బిలికి 97 కిలోమీటర్లు దూరం ఉంది. ఒక సింగిల్ డ్యూటీకి ఇప్పటి వరకు 1.30 గంటలు సమయం ఉండేది. దీనిని 1.15 గంటలకు కుదించనున్నారు. ఈ లెక్కన నాలుగు సింగిల్స్ డ్యూటీ చేస్తే ప్రతి సింగిల్‌కు పావు గంట చొప్పున ఒక గంట శ్రమను కోల్పోవాల్సి వస్తోంది. ఇలా ఓటీ రూపంలో రావాల్సిన ఒక గంట శ్రమను సింగిల్ సర్వీసు రూపంలో కోల్పోతారు. మరోవైపు అనుకున్న సమయానికి గమ్యం చేర్చడం కూడా సాధ్యం కాదని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. పరిమిత స్టాప్ల రూట్లలోనే... పరిమిత సంఖ్యలో స్టాప్‌లున్న రూట్లలోని బస్సుల సర్వీసుల్లోనే ‘వన్‌మ్యాన్’ డ్యూటీ విధులను ఏర్పాటు చేస్తున్నాం. రెండేళ్ల కిందట ప్రయోగాత్మకంగా పెట్టిన ఈ సర్వీసులను ఎప్పటికప్పుడు విస్తరింపజేస్తున్నారు. ఈ విధులు చేయడానికి డ్రైవర్లు ఇష్టపూర్వకంగానే వస్తున్నారు. –ఎన్వీఎస్.వరప్రసాద్, డిప్యూటీ సీటీఎం, ఆర్టీసీ ఒత్తిడితో డ్రైవింగ్ అదుపుతప్పొచ్చు... ఒక చేత్తో టిమ్, మరో చేత్తో స్ట్రీరింగ్ ఒకేసారి రెండు విధులు నిర్వహించడం ప్రమాదకరం. దీంతో మానసిక ఒత్తిడి పెరిగి డ్రైవింగ్‌లో నాణ్యత కొరవడి, ప్రయాణికులకు భద్రత భరోసాను ఇవ్వలేని పరిస్థితి ఎదురవుతుంది. తక్షణమే వన్‌మ్యాన్ సర్వీసులను రద్దు చేయాలి. –జి.రవికాంత్, అధ్యక్షుడు, ఎంప్లాయీస్ యూనియన్ రీజియన్ కమిటీ -
సమ్మెలో సడేమియా..రాజంపేట ఆర్టీసీలో రూ. లక్ష టిక్కెట్లు గల్లంతు
రాజంపేట : రాజంపేట ఆర్టీసీ డిపోలో దాదాపు రూ1.లక్ష విలువ చేసే టిక్కెట్లు గల్లంతయ్యాయి. ఇటీవల నిఘా అధికారుల పరిశీలనలో ఈ విషయం వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మే 6 నుంచి 13 వరకు ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టిన సంగతి విదితమే. 14వ తేదీన సమ్మె విరమించి విధుల్లో చేరారు. అప్పట్లో పనిచేసిన డీఎం ప్రవీణ్‌కుమార్ హయాంలో టిక్కెట్ల గల్లంతు వ్యవహారం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈయన తెలంగాణాకు బదిలీ కాగా కొత్తగా డిపో మేనేజరుగా కె.హరిప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉండగా సమ్మె ముగిసిన అనంతరం కొన్ని రోజులకు డిపోలో నిఘా అధికారులు టిక్కెట్ల విషయంలో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో సుమారు రూ.1లక్ష విలువ చేసే టిక్కెట్లు కనిపించడంలేదు. ఈ విషయం బయటికి పొక్కడంతో కొంతమంది అధికారులు తమకు అనుకూలంగా లేని వారిపై నెట్టే ప్రయత్నాలు కూడా జరిగాయి. కార్మికసంఘాలు ఈ విషయాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. సమ్మెలో భాగంగా విధులకు దూరంగా ఉండిన వారు కాకుండా, సమ్మెలోకి వెళ్లకుండా డిపోలో టిక్కెట్ల విభాగంలో విధులు నిర్వర్తించిన వారిపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఒకరిమీద ఒకరు చెప్పుకోవడంతో ఈ విషయం ఉన్నతాధికారుల వద్దకు వెళ్లింది. ప్రస్తుతం విచారణ గోప్యంగా కొనసాగుతోంది. సమ్మె సమయంలోనే... ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టిన సందర్భంగా ఆర్టీసీ యాజమాన్యం అద్దెబస్సులతో పాటు కొన్ని ఆర్టీసీ బస్సులను తిప్పింది. డిపో పరిధిలో కొంతమంది డ్రైవర్లను, కార్మికులను తాత్కాలికంగా విధుల్లోకి తీసుకున్నారు. ఆర్టీసీ కండక్టర్లు అయితే టిమ్‌లు ఉపయోగించేవారు. కానీ తాత్కాలిక సిబ్బందికి టిక్కెట్ల ఇచ్చి బస్సులను నడిపించారు. ఈ సందర్భంగా సిబ్బందికి ఇచ్చిన టిక్కెట్లు మళ్లీ డిపోకు చేరలేదా? లేక డిపోలోని సిబ్బందే సమ్మెలో సడేమియా అన్న చందాన టిక్కెట్లను మాయం చేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికి రాజంపేట డిపోలో టిక్కెట్ల గల్లంతు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. -
టీటీఐలు.. టార్గెట్లు
- చిన్న చిన్న తప్పిదాలకూ కేసులు - అవసరం లేకపోయినా మెమోలు - ఆందోళన చెందుతున్న ఆర్టీసీ కార్మికులు - మానసిక ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన కామారెడ్డి: ‘దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు’ అన్నట్టుగా తయారైంది ఆర్టీసీ కండక్టర్ల పరిస్థితి. యాజమాన్యం టార్గెట్లు విధించడంతో కొందరు టీటీఐలు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్న చిన్న తప్పిదాలకు సైతం కేసులు రాస్తూ కండక్టర్లను రోడ్డుపాలు చేస్తున్నారని అంటున్నారు. శనివారం కామారెడ్డిలో టీటీఐ సామయ్య వేధించడంతోనే జీవన్ అనే కండక్టర్ షాక్‌తో ఆస్పత్రి పాలయ్యాడు. జీవన్‌కు ఇంతకు ముందే టీటీఐలతో రెండుసార్లు ఇబ్బందులపాలై ఇంక్రిమెంట్లు కోల్పో యా డు. మూడోసారి తీవ్రమైన ఒత్తిడి తేవడంతో షాక్‌కు గురయ్యా డు. ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఎక్కువ సమయం పనిచేస్తున్నా ఆర్టీసీలో కార్మికులకు అరకొర వేతనాలే ఉన్నాయి. దానికి తోడు పని భారం, అధికారుల ఒత్తిళ్లూ ఎక్కువే. ఇదే సమయంలో టీటీఐలు తనిఖీల పేరుతో హడలెత్తిస్తుండడంతో కండక్టర్లు ఆందోళనకు గురవుతు న్నారు. నాలుగు రకాల తనిఖీ బృందాలు ఆర్టీసీ బస్సులలో టిక్కెట్ల తనిఖీలకు సంబంధించి జిల్లా స్క్వాడ్, జోనల్ స్క్వాడ్, విజిలెన్స్ స్క్వాడ్, హెడ్ క్వార్టర్ స్క్వాడ్ అని నాలుగు రకాల బృందాలున్నాయి. జిల్లా స్క్వాడ్‌లో ఏడుగురు సభ్యులుంటారు. వారికి ఒక వాహనం ఉంటుంది. హెడ్‌క్వార్టర్ స్క్వాడ్‌లో కూడా ఏడుగురు సభ్యులుంటారు. వారికీ ఓ వాహనం ఉంటుంది. కండక్టర్లు, డ్రైవర్లు తప్పిదాలకు పాల్పడకుండా తనిఖీలు ఎంతగానో దోహదపడుతాయి. అయితే, తనిఖీ బృందాలకు యాజమాన్యం టార్గెట్లు విధించడంతో నిత్యం కొన్ని కేసులు రాయడం ద్వారా దానిని భర్తీ చేసుకుంటున్నారు. చిన్న తప్పిదాలకు సైతం కేసులు రాయడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆయా బృందాలకు నెలకు 90 మెమో లు, పది డిపో స్పేర్లు టార్గెట్లుగా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో తనిఖీల అధికారులు దూకుడుగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు రాస్తున్నార ని కార్మికులు వాపోతున్నారు. అభద్రత నడుమ, మానసిక ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నామంటున్నారు. కండక్టర్, డ్రైవర్లు సంస్థకు మూల స్తంభాలని యాజమాన్యం పొగడ్తలతో ముంచెత్తుతూనే మరోవైపు సస్పెన్షన్లు, రిమూవల్స్‌ను బహుమానాలుగా అందిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో టీటీఐలు ప్రయాణికుల ముందే కండక్టర్లను నానా మాటలతో వేధిస్తున్నారని పేర్కొంటున్నారు. కార్మికునికి ఏడాదిలో ఒక మెమో వచ్చినా, ఏడాది కష్టం అంతా వృథా అవుతోంది. మెమో మూలంగా ఇంక్రిమెంటుకు దూరమవుతాడు. అధిక శాతం కార్మికులు మెమోలతో ఇంక్రిమెంట్లు కోల్పోతున్నారని పలువురు చెబుతున్నారు. అక్రమ కేసులు రాస్తున్న టీటీఐలు తనిఖీలకు వచ్చే టీటీఐలు కార్మికులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందుకు శనివారం కామారెడ్డిలో జరిగిన సంఘటననే నిదర్శనంగా చెప్పవచ్చు. కండక్టర్‌కు ఉన్న స్పాట్ ఎక్స్ప్లెనేషన్ వ్యవధిని కూడా గుర్తించకుండా కేసులు నమోదు చేస్తున్నారు. టిక్కెట్ తీసుకుని పోగొట్టుకుంటే ప్రయాణికుడికే జరిమానా విధించాల్సి ఉండగా, కండక్టర్లకు మెమోలు ఇస్తున్నారు. టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే ఐదు వందల వరకు జరిమానా విధించవచ్చన్న విషయాన్ని పట్టించుకోకుండా కండక్టర్లనే టార్గెట్ చేస్తున్నారు. బస్టాండ్ పక్కన ఆపినందుకు, ఇన్కమింగ్ గేట్ నుంచి వెళ్లే బదులు ఔట్‌గేట్ నుంచి వెళ్లినందుకు డ్రైవర్లకు మెమో లు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఎస్ఆర్ సరి గ్గా రాయలేదని మెమో, బస్సులో వంద మంది ఉంటే ఒక్క ప్యాసింజర్ మిస్ అయినా కేసు, ఏ తప్పు దొరకకున్నా ఒక్కో సారి మెమో ఇచ్చేందుకు టీటీఐలు ఉత్సాహం చూపుతున్నారు. ఇదేమంటే టార్గెట్లని చెప్పుకుంటున్నారు. స్థానికులే టీటీఐలుగా పనిచేస్తున్నారు. టీటీఐలుగా పనిచేస్తున్నవారిలో స్థానికులు ఉండడంతో వారు తమతో స్నేహం చేసేవారి విషయంలో ఒక రకంగా, తమను పట్టించుకోని వారి విషయంలో మరో రకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చిన్న పొరపాట్లకు కూడా మెమోలు ఇవ్వడంతో ఇంక్రిమెంట్లు దూరమవుతుండడం, మానసిక ఒత్తిడికి లోనవుతున్న నేపథ్యంలో టీటీఐల వేదింపుల నుంచి కాపాడాలని కార్మికులు కోరుతున్నారు.