విస్తరిస్తున్న ‘వన్‌మ్యాన్‌’ సర్వీసులు | Expanding 'One man' Services | Sakshi
Sakshi News home page

విస్తరిస్తున్న ‘వన్‌మ్యాన్‌’ సర్వీసులు

Published Wed, Jul 11 2018 12:02 PM | Last Updated on Wed, Jul 11 2018 12:02 PM

Expanding 'One man' Services - Sakshi

సింగిల్‌ డ్రైవింగ్‌ సర్వీసులో‘ఒక చేతిన టిమ్‌ – మరో చేతిన స్టీరింగ్‌’  

ఆర్టీసీలో విస్తరిస్తున్న వన్‌మ్యాన్‌ సర్వీసులు ప్రయాణికులను భయపెడుతున్నాయి. డ్రైవింగ్‌ చేసే డ్రైవరే టిక్కెట్‌ కూడా కలెక్ట్‌ చేస్తూ ఉద్యోగం నిర్వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామం ఏమాత్రం మంచిది కాదని, ఇది ప్రయాణికుల భద్రతకే ప్రమాదమని పలువురు పేర్కొంటున్నారు.

విజయనగరం అర్బన్‌: ఆర్టీసీలో వన్‌మ్యాన్‌ (సింగిల్‌ డ్రైవర్‌ బస్సులు) సర్వీసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇటీవలే పలు డిపోలలో కండక్టర్లను పంపకుండా సింగిల్‌ డ్రైవర్‌ సర్వీసులను ఆర్టీసీ నార్త్‌ ఈస్‌కోస్ట్‌ రీజియన్‌ పెంచింది.  జిల్లా పరిధిలోని నాలుగు డిపోలలో గతంలో కేవలం 15 మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఈ సర్వీసులను 28 బస్సులకు పెంచి, సింగిల్‌ డ్రైవర్‌ సర్వీసులుగా నడుపుతున్నారు.

అత్యధికంగా పార్వతీపురం డిపో నుంచి 14, ఎస్‌.కోట డిపో నుంచి 8, సాలూరు డిపో నుంచి 6 బస్సులలో సింగిల్‌ డ్రైవర్‌లు విధులు నిర్వహిస్తున్నారు. మోటార్‌ యాక్ట్‌కు విర్దుదంగా వన్‌మ్యాన్‌ సర్వీసులు నడుపుతున్న అధికారులు సంబంధిత డ్రైవర్‌కి టిక్కెట్‌ ఇష్యూయింగ్‌ మిషన్‌ (టిమ్‌) ఇచ్చి  కండక్టర్‌ వ్యవస్థను నీరుగారుస్తున్నారు. దీంతో కార్మికులపై పనిభారం పెరిగింది.  ప్రయాణికుల భద్రత ప్రశ్నార్ధకంగా మారుతోంది.

ఓటీలో కోతే లక్ష్యంగా...

ఓవర్‌ టైమ్‌ (ఓటీ) సర్వీసుల వేళల్లో కోత విధించి కార్మికుల పొట్టకొట్టాలని చూస్తున్నారనే ఆరోపణలతో కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. ఓటీ సర్వీసులు నెక్‌ రీజియన్‌ పరిధిలో రోజుకు సుమారు వంద వరకు ఉన్నాయి.  మోటార్‌ వాహన నిబంధనల ప్రకారం డ్రైవర్లతో రాత్రి వేళల్లో నాలుగు గంటలు మాత్రమే బస్సులు నడిపించాలి. దీన్ని ఆరు గంటలకు పెంచారు.

కానీ రోడ్డు రవాణ సంస్థ డ్రైవర్లు వెళ్లే దూర ప్రాంత వన్‌మ్యాన్‌ సర్వీసుల్లో ఒకే  డ్రైవర్‌ ఉన్న కారణంగా 8 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే డ్రైవర్‌ బస్సు నడపాల్సిన పరిస్థితి ఉంది. స్పెషల్‌ టైపు (ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌ లగ్జరీ) బస్సులకు ఒక డ్రైవర్‌ చేత 200 కిలో మీటర్ల వరకు మాత్రమే నడిపించాలి.

దీన్ని కూడా 250 కిలోమీటర్లకు పెంచినా అనధికారికంగా 350 నుంచి 371 కిలోమీటర్ల వరకు నడిపిస్తున్నారు. పాలకొండ నుంచి విశాఖ, పార్వతీపురం నుంచి విశాఖ, శ్రీకాకుళం నుంచి విశాఖ సర్వీసులను ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.

ఇలా కడుపు కొట్టనున్నారు...

కార్మిక చట్టం ప్రకారం 8 గంటలకు మించి విధులు నిర్వహించే కార్మికులకు ఓటీ సొమ్ము చెల్లించాలి. 9 గంటల పాటు విధులు నిర్వహిస్తే ఒక గంట ఓటీ ఇవ్వాలి. కార్మికుడు నెల వేతనంలో గంటకు ఎంత మొత్తం అవుతుందో లెక్కించి ఆ మొత్తం కంటే రెట్టింపు డబ్బును కార్మికుడికి ఇవ్వాలి. ఈ క్రమంలో  బస్సు ఇన్‌కమింగ్‌ సమయాన్ని కుదించారు.

ఉదాహరణకు విజయనగరం నుంచి బొబ్బిలికి 97 కిలోమీటర్లు దూరం ఉంది. ఒక సింగిల్‌ డ్యూటీకి ఇప్పటి వరకు 1.30 గంటలు సమయం ఉండేది. దీనిని 1.15 గంటలకు కుదించనున్నారు. ఈ లెక్కన నాలుగు సింగిల్స్‌ డ్యూటీ చేస్తే ప్రతి సింగిల్‌కు పావు గంట చొప్పున ఒక గంట శ్రమను కోల్పోవాల్సి వస్తోంది.

ఇలా ఓటీ రూపంలో రావాల్సిన ఒక గంట శ్రమను సింగిల్‌ సర్వీసు రూపంలో కోల్పోతారు. మరోవైపు  అనుకున్న సమయానికి గమ్యం చేర్చడం కూడా సాధ్యం కాదని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.

పరిమిత స్టాప్‌ల రూట్లలోనే...

పరిమిత సంఖ్యలో స్టాప్‌లున్న రూట్లలోని బస్సుల సర్వీసుల్లోనే ‘వన్‌మ్యాన్‌’ డ్యూటీ విధులను ఏర్పాటు చేస్తున్నాం. రెండేళ్ల కిందట ప్రయోగాత్మకంగా పెట్టిన ఈ సర్వీసులను ఎప్పటికప్పుడు విస్తరింపజేస్తున్నారు. ఈ విధులు చేయడానికి డ్రైవర్లు ఇష్టపూర్వకంగానే వస్తున్నారు. 

–ఎన్‌వీఎస్‌.వరప్రసాద్, డిప్యూటీ సీటీఎం, ఆర్‌టీసీ  

ఒత్తిడితో డ్రైవింగ్‌ అదుపుతప్పొచ్చు...

ఒక చేత్తో టిమ్, మరో చేత్తో స్ట్రీరింగ్‌  ఒకేసారి రెండు విధులు నిర్వహించడం ప్రమాదకరం. దీంతో మానసిక ఒత్తిడి పెరిగి డ్రైవింగ్‌లో నాణ్యత కొరవడి,  ప్రయాణికులకు భద్రత భరోసాను ఇవ్వలేని పరిస్థితి ఎదురవుతుంది. తక్షణమే వన్‌మ్యాన్‌ సర్వీసులను రద్దు చేయాలి.   –జి.రవికాంత్, అధ్యక్షుడు, ఎంప్లాయీస్‌ యూనియన్‌ రీజియన్‌ కమిటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement