టీటీఐలు.. టార్గెట్లు | RTC workers concerned | Sakshi
Sakshi News home page

టీటీఐలు.. టార్గెట్లు

Published Mon, Sep 8 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM

టీటీఐలు.. టార్గెట్లు

టీటీఐలు.. టార్గెట్లు

- చిన్న చిన్న తప్పిదాలకూ కేసులు
- అవసరం లేకపోయినా మెమోలు
- ఆందోళన చెందుతున్న ఆర్‌టీసీ కార్మికులు
- మానసిక ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన
 కామారెడ్డి: ‘దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు’ అన్నట్టుగా తయారైంది ఆర్‌టీసీ కండక్టర్ల పరిస్థితి. యాజమాన్యం టార్గెట్‌లు విధించడంతో కొందరు టీటీఐలు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్న చిన్న తప్పిదాలకు సైతం కేసులు రాస్తూ కండక్టర్లను రోడ్డుపాలు చేస్తున్నారని అంటున్నారు. శనివారం కామారెడ్డిలో టీటీఐ సామయ్య వేధించడంతోనే జీవన్ అనే కండక్టర్ షాక్‌తో ఆస్పత్రి పాలయ్యాడు.

జీవన్‌కు ఇంతకు ముందే టీటీఐలతో రెండుసార్లు ఇబ్బందులపాలై ఇంక్రిమెంట్లు కోల్పో యా  డు. మూడోసారి తీవ్రమైన ఒత్తిడి తేవడంతో షాక్‌కు గురయ్యా డు. ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఎక్కువ సమయం పనిచేస్తున్నా ఆర్‌టీసీలో కార్మికులకు అరకొర వేతనాలే ఉన్నాయి. దానికి తోడు పని భారం, అధికారుల ఒత్తిళ్లూ ఎక్కువే. ఇదే సమయంలో టీటీఐలు తనిఖీల పేరుతో హడలెత్తిస్తుండడంతో కండక్టర్లు ఆందోళనకు గురవుతు న్నారు.  
 
నాలుగు రకాల తనిఖీ బృందాలు
ఆర్‌టీసీ బస్సులలో టిక్కెట్ల తనిఖీలకు సంబంధించి జిల్లా స్క్వాడ్, జోనల్ స్క్వాడ్, విజిలెన్స్ స్క్వాడ్, హెడ్ క్వార్టర్ స్క్వాడ్ అని నాలుగు రకాల బృందాలున్నాయి.  జిల్లా స్క్వాడ్‌లో ఏడుగురు సభ్యులుంటారు. వారికి ఒక వాహనం ఉంటుంది. హెడ్‌క్వార్టర్ స్క్వాడ్‌లో కూడా ఏడుగురు సభ్యులుంటారు. వారికీ ఓ వాహనం ఉంటుంది. కండక్టర్లు, డ్రైవర్లు తప్పిదాలకు పాల్పడకుండా తనిఖీలు ఎంతగానో దోహదపడుతాయి. అయితే, తనిఖీ బృందాలకు యాజమాన్యం టార్గెట్లు విధించడంతో నిత్యం కొన్ని కేసులు రాయడం ద్వారా దానిని భర్తీ చేసుకుంటున్నారు.

చిన్న తప్పిదాలకు సైతం కేసులు రాయడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆయా బృందాలకు నెలకు 90 మెమో లు, పది డిపో స్పేర్‌లు టార్గెట్‌లుగా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో తనిఖీల అధికారులు దూకుడుగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు రాస్తున్నార ని కార్మికులు వాపోతున్నారు. అభద్రత నడుమ, మానసిక ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నామంటున్నారు. కండక్టర్, డ్రైవర్లు సంస్థకు మూల స్తంభాలని యాజమాన్యం పొగడ్తలతో ముంచెత్తుతూనే మరోవైపు సస్పెన్షన్లు, రిమూవల్స్‌ను బహుమానాలుగా అందిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో టీటీఐలు ప్రయాణికుల ముందే కండక్టర్లను నానా మాటలతో వేధిస్తున్నారని పేర్కొంటున్నారు. కార్మికునికి ఏడాదిలో ఒక మెమో వచ్చినా, ఏడాది కష్టం అంతా వృథా అవుతోంది. మెమో మూలంగా ఇంక్రిమెంటుకు దూరమవుతాడు. అధిక శాతం కార్మికులు మెమోలతో ఇంక్రిమెంట్లు కోల్పోతున్నారని పలువురు చెబుతున్నారు.
 
అక్రమ కేసులు రాస్తున్న టీటీఐలు
తనిఖీలకు వచ్చే టీటీఐలు కార్మికులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందుకు శనివారం కామారెడ్డిలో జరిగిన సంఘటననే నిదర్శనంగా చెప్పవచ్చు. కండక్టర్‌కు ఉన్న స్పాట్ ఎక్స్‌ప్లెనేషన్ వ్యవధిని కూడా గుర్తించకుండా కేసులు నమోదు చేస్తున్నారు. టిక్కెట్ తీసుకుని పోగొట్టుకుంటే ప్రయాణికుడికే జరిమానా విధించాల్సి ఉండగా, కండక్టర్లకు మెమోలు ఇస్తున్నారు.

టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే ఐదు వందల వరకు జరిమానా విధించవచ్చన్న విషయాన్ని పట్టించుకోకుండా కండక్టర్లనే టార్గెట్ చేస్తున్నారు. బస్టాండ్ పక్కన ఆపినందుకు, ఇన్‌కమింగ్ గేట్ నుంచి వెళ్లే బదులు ఔట్‌గేట్ నుంచి వెళ్లినందుకు డ్రైవర్లకు మెమో లు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఎస్‌ఆర్ సరి గ్గా రాయలేదని మెమో, బస్సులో వంద మంది ఉంటే ఒక్క ప్యాసింజర్ మిస్ అయినా కేసు, ఏ తప్పు దొరకకున్నా ఒక్కో సారి మెమో ఇచ్చేందుకు టీటీఐలు ఉత్సాహం చూపుతున్నారు. ఇదేమంటే టార్గెట్‌లని చెప్పుకుంటున్నారు.
 
స్థానికులే టీటీఐలుగా పనిచేస్తున్నారు.
టీటీఐలుగా పనిచేస్తున్నవారిలో స్థానికులు ఉండడంతో వారు తమతో స్నేహం చేసేవారి విషయంలో ఒక రకంగా, తమను పట్టించుకోని వారి విషయంలో మరో రకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చిన్న పొరపాట్లకు కూడా మెమోలు ఇవ్వడంతో ఇంక్రిమెంట్లు దూరమవుతుండడం, మానసిక ఒత్తిడికి లోనవుతున్న నేపథ్యంలో టీటీఐల వేదింపుల నుంచి కాపాడాలని కార్మికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement