
ఆర్టీసీ ఈడీకి ఇచ్చిన కొన్ని కార్మిక సంఘాల నేతలు
ఫిబ్రవరి 9వ తేదీలోగా డిమాండ్లు పరిష్కరించాలి
సమ్మెకు దూరంగా మరికొన్ని కార్మిక సంఘాలు
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల విషయంలో ఆర్టీసీ(RTC) యాజమాన్యం, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ ఆర్టీసీలోని కొన్ని సంఘాలు, మరికొన్ని సంఘాల్లోని చీలిక వర్గాలు సోమవారం సాయంత్రం సమ్మె నోటీసు జారీ చేశాయి. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సెలవులో ఉండటంతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్‌ను కలిసి నోటీసు, డిమాండ్ల జాబితాను అందజేశాయి. ఆర్టీసీ యాజమాన్యం స్పందించని పక్షంలో ఫిబ్రవరి 9 నుంచి లేదా, ఆ తర్వాత ప్రకటించే తేదీ నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించాయి. ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ థామస్‌రెడ్డి వర్గం, ఎన్‌ఎంయూ మౌలానా వర్గం, బీకేయూ, బీడబ్ల్యూయూ, కార్మిక పరిషత్‌లు సమ్మె నోటీసు జారీ చేశాయి.
21 డిమాండ్లతో..
పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ, బకాయిల చెల్లింపు, ఖాళీల భర్తీ జరగక ఉన్న సిబ్బందిపై అదనపు భారం, ఆర్టీసీలో అద్దె బస్సులు పెరిగి పోస్టుల సంఖ్య తగ్గిపోతుండటం, అద్దె ప్రాతిపదికన తీసుకునే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వాహకులకు డిపోలు అప్పగించే యోచన, ఆర్టీసీ సొంతానికి వాడుకున్న సహకార పరపతి సంఘం, పీఎఫ్ ట్రస్టు నిధులను తిరిగి చెల్లించకపోవటం... ఇలా మొత్తం 21 డిమాండ్లను సంఘాలు ఆర్టీసీ అధికారుల ముందుంచాయి.
కార్మికుల్లో అయోమయం..
సమ్మె విషయంలో ఆర్టీసీలోని సంఘాలు ఐక్యంగా లేకపోవటం ఇప్పుడు కార్మికుల్లో అయోమయానికి కారణమైంది.
⇒ గతంలో ప్రధాన సంఘాలుగా ఉన్న ఎంప్లాయీస్ యూనియన్ నుంచి ముఖ్యనేత రాజిరెడ్డి వైదొలిగి కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న ఎస్‌డబ్ల్యూయూలో ఉన్నారు. ఇప్పుడు ఆ సంఘం సమ్మెకు దూరంగా ఉంది.
⇒ మరో ప్రధాన సంఘం టీఎంయూలో అశ్వత్థామరెడ్డి, తిరుపతి వర్గం సమ్మెకు దూరంగా ఉంది.
⇒ ఎన్‌ఎంయూలో నరేందర్ వర్గం సమ్మెను వ్యతిరేకిస్తోంది. మిగతా సంఘాలు కూడా సమ్మెకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి.
⇒ ఇప్పుడు సమ్మెకు దూరంగా ఉన్న ఎస్‌డబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌లు ఈనెల 24, 25 తేదీల్లో డిపోల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.
⇒ ప్రస్తుతం సమ్మెకు దూరంగా ఉన్న సంఘాల ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యలను కలుస్తూ డిమాండ్ల పరిష్కారానికి వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. ఇలా రెండు వర్గాలుగా విడిపోయిన సంఘాలు, వాటి చీలిక వర్గాల నేతలు పరస్పరం విమర్శలు, ఆరోపణలతో కార్మికుల్లో కూడా చీలిక ఏర్పడుతోంది.
వచ్చే నెల 9 తర్వాత ఎప్పుడైనా సమ్మె మొదలు
‘చాలాకాలంగా ఉన్న సమస్యల విషయంలో యాజమాన్యం తీరుతో విసిగిపోయి సమ్మె నోటీసు ఇచ్చాం. వచ్చే నెల 9 తర్వాత ఎప్పుడైనా సమ్మె ప్రారంభిస్తాం. ఇప్పటికే సగం డిపోల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాం. మిగతా డిపోల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తాం’అని ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకన్న తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment