
ప్రభుత్వానికి మరో జేఏసీ అల్టిమేటం
ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చిన ఒక జేఏసీ
మార్చి 7 వరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్
కార్మికులు సమ్మెకు సిద్ధంగా లేరని ఇంటెలిజెన్స్ నివేదిక
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సంస్థ యాజమాన్యంపై పోరుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ఒక కార్మిక జేఏసీ సమ్మె నోటీసు ఇవ్వగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సమ్మె నోటీసు ఇవ్వాలని మరో జేఏసీ తాజాగా నిర్ణయించింది. మొదటి జేఏసీ నిరవధిక సమ్మెకు మొగ్గు చూపుతుండగా, రెండో జేఏసీ మాత్రం ఐదారు రోజులపాటు సమ్మె చేయాలని భావిస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసేలోపు తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో సమ్మె అనివార్యమని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. అయితే, కార్మికుల్లో సమ్మెపై ఒకింత భయం కనిపిస్తుండగా, సంఘాల నాయకులు మాత్రం సమ్మెకు సిద్ధమని ప్రకటిస్తున్నారు.
ప్రైవేటు సంస్థల పెత్తనంతో..
ఇటీవల ఆర్టీసీ పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతోంది. అవన్నీ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేటు సంస్థ నుంచి అద్దెకు తీసుకుంటోంది. ఆ బస్సుల నిర్వహణ కోసం కొన్ని డిపోలను సదరు సంస్థకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేయటంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇది ఆర్టీసీలో ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేయటమేనని మండిపడుతున్నారు. దీంతో అధికారులు వెనక్కు తగ్గి డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతోపాటు సాధారణ సొంత బస్సులు కూడా కొనసాగుతాయని స్పష్టత ఇచ్చారు. అయినా ఉద్యోగుల్లో అనుమానాలు తొలగిపోలేదు. ఈ అంశంతోపాటు చాలా కాలంగా పెండింగులో ఉన్న ఇతర సమస్యలను తెరపైకి తెచ్చి కార్మిక సంఘాలు సమ్మెకు సై అంటున్నాయి.
విలీనం, పీఆర్సీనే ప్రధాన ఎజెండాగా..
గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించింది. అంతలోనే ప్రభుత్వం మారటంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పెండింగులో పెట్టింది. 2017 వేతన సవరణ బకాయిలు కూడా చెల్లించలేదు. 2021 వేతన సవరణపై ప్రభుత్వం స్పందించటంలేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రద్దుచేసిన గుర్తింపు యూనియన్ల పునరుద్ధరణ జరగలేదు. సీసీఎస్, పీఎఫ్‌లకు భారీగా బకాయిలు పేరుకుపోయాయి. వీటి సాధనే లక్ష్యంగా కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యాయి.
ఎవరికి వారే..
ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ చీలికవర్గం, బీడబ్ల్యూయూ, బీకేయూ, ఎన్‌ఎంయూ చీలిక వర్గం, కేపీ సంఘాలతో కూడిన తొలి జేఏసీ గత నెల 27న యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. ఫిబ్రవరి 3న ఆ యూనియన్ల ప్రతినిధులను కార్మిక శాఖ చర్చలకు పిలిచి, తర్వాత ఎన్నికల కోడ్ కారణం చూపి సమావేశం రద్దు చేసింది. దీంతో, ఎన్నికల నోటిఫికేషన్ నుంచి ఆర్టీసీ సమ్మెకు మినహాయింపు ఇవ్వాలని ఆయా సంఘాల నేతలు ఎన్నికల కమిషనర్‌కు విన్నవించారు.
టీఎంయూ, ఎన్‌ఎంయూ వర్గాలు, బీఎంఎస్, ఎస్‌టీ ఎంయూలతో కూడిన మరో జేఏసీ తదుపరి సమావేశం ఏర్పాటు చేసుకుని, ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రభు త్వానికి గడువు ఇస్తున్నట్టు ప్రకటించింది. కోడ్ ముగిసిన తర్వాత సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. మార్చి 7 వరకు కోడ్ అమలులో ఉంటుంది.
ఐదారు రోజులపాటు సమ్మె చేసి, కొద్ది రోజుల గడువు ఇచ్చి మళ్లీ సమ్మె చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఆర్టీసీ కార్మికుల్లో 10 వేల మంది మాత్రమే సమ్మెకు సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment