TTI
-
రైలు నుంచి మహిళా టీటీఐ తోసివేత
కాజీపేట రూరల్ : పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో నుంచి మహిళా ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్ (టీటీఐ)ని ప్రయాణికులు కోచ్‌లో నుంచి బయటికి తోసేశారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట జంక్షన్లో జరిగింది. కాజీపేట జంక్షన్ రైల్వే కమర్షియల్ విభాగంలో టీటీఐగా పనిచేస్తున్న నీలిమ సికింద్రాబాద్ నుంచి ధానాపూర్ వెళ్లే పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో కాజీపేటకు చేరుకుంది. స్లీపర్‌క్లాస్–1 బోగిలోకి వెళ్లి టికెట్ తనిఖీ చేస్తుండగా.. కొందరు ప్రయాణికులు జనరల్ టికెట్ తీసుకుని స్లీపర్‌క్లాస్ కోచ్‌లోకి రావడంతో పరిశీలించి జరిమానా చెల్లించాలని చెప్పింది. అప్పటికే కోచ్ రద్దీగా ఉంది. టీటీఐ మాట వినిపించుకోకుండా వారు బయటికి తోసి వేయడంతో నీలిమ ప్లాట్‌ఫాంపై పడింది. ఆమె కాలు ప్లాట్‌ఫాం సందులోకి వెళ్లడంతో జనరల్ బోగి ప్రయాణికులు గమనించి బయటికి తీశారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని నీలిమను రైల్వే ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రోహిణి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో పాట్నా ఎక్స్‌ప్రెస్ కొన్ని నిమిషాల పాటు కాజీపేటలో ఆగింది. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికారా ఐతే ఇది షేర్ చెయ్యండి
సాక్షి, సిటీబ్యూరో: ‘నాకు థాంక్స్ చెప్పొద్దు. అవకాశం వచ్చినప్పుడు మీరు ఓ ముగ్గురికి సహాయం చెయ్యండి. వారిలో ఒక్కొక్కరినీ మరో ముగ్గురి చొప్పున చెయ్యమని చెప్పండి’.. స్టాలిన్ సినిమాలో తన వద్ద సాయం పొందిన వారితో చిరంజీవి చెప్పే డైలాగ్ ఇది.. ‘మాకు సారీ చెప్పవద్దు. మరోసారి ఇలాంటి పొరపాటు చెయ్యకండి. ఈ షార్ట్‌ఫిల్మ్‌లను కనీసం మూడు గ్రూపుల్లో షేర్ చెయ్యండి. అందులోని వారినీ అలానే చెయ్యమనండి’.. కౌన్సెలింగ్‌కు హాజరైన ఉల్లంఘనులతో టీటీఐ అధికారులు చెబుతున్న మాట ఇది. నగర ట్రాఫిక్ విభాగం ఆధీనంలోని గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (టీటీఐ) అధికారులు మంగళవారం నుంచి ఓ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్ నిబంధనలపై ఉల్లంఘనులతో పాటు సోషల్ మీడియాల్లోని సభ్యులకు అవగాహన కలిగేలా షేరింగ్ విధానం ప్రారంభించారు. సిగ్నల్ జంపింగ్ చేయవద్దని, హెల్మెట్ వినియోగించమంటూ ఇటీవల రూపొందించిన షార్ట్ఫిల్మస్ను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఉల్లంఘనుల్నే ప్రచారకర్తలుగా వినియోగించుకుంటున్నారు. ఆ రెండింటిపై లఘు చిత్రాలు... ట్రాఫిక్ విభాగం అధికారులు ఉల్లంఘనలను ప్రధానంగా మూడు కేటగిరీలుగా పరిగణిస్తారు. వాహనచోదకుడికి ప్రాణహాని కలిగించేవి, ఎదుటి వ్యక్తికి ముప్పుగా మారేవి, వాహనచోదకుడితో పాటు ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీసేవి. సిగ్నల్ జంపింగ్ ఉల్లంఘన అత్యంత ప్రమాదకరమైన మూడో కేటగిరీ కిందికు వస్తుంది. దీని వల్ల అనేక జంక్షన్లలో ట్రాఫిక్ జామ్స్ సైతం ఏర్పడి ఎన్నో పని గంటలు, ఇంధనం వృథా అవుతున్నాయి. దీంతో పాటు నగరంలో ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాతపడుతున్న, క్షతగాత్రులుగా మారుతున్న వారిలో ద్విచక్ర వాహనచోదకులే ఎక్కువగా ఉంటున్నారు. హెల్మెట్ వినియోగించకపోవడమే దీనికి ప్రధాన కారణంగా ట్రాఫిక్ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిం చేందుకు రెండు షార్ట్‌ఫిల్మ్స్ రూపొందించారు. ఇప్పటి వరకు పరిమితంగా... సెలబ్రిటీలతో సందేశం ఇప్పిస్తేనే ప్రజలకు హత్తుకుంటుందనే ఉద్దేశంతో టాలీవుడ్ తారలు లావణ్య త్రిపాఠి, నేహ శెట్టి, ఆకాష్ పూరిలతో ఈ ఫిల్మŠస్ రూపొందించారు. ఈ లఘు చిత్రాలను ట్రాఫిక్ విభాగం చీఫ్ అనిల్ కుమార్ గత శుక్రవారం ఆవిష్కరించారు. సోమవారం వరకు ఈ రెండు చిత్రాలు ట్రాఫిక్ పోలీసుల అధికారిక ఫేస్బుక్, వెబ్‌సైట్స్‌తో పాటు యూ ట్యూబ్‌ల్లో మాత్రమే అందుబాటులో ఉంచారు. అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసే చోట వీటిని ప్రదర్శించనున్నారు. సినిమా హాళ్లల్లో ప్రదర్శింపజేయడానికి సెన్సార్ సర్టిఫికెట్ జారీ కావాల్సి ఉంది. ప్రస్తుతం ఇవి ఎక్కువ సంఖ్యలో వాహనచోదకులకు చేరట్లేదని భావించిన అధికారులు వీటిని విస్తృతంగా సోషల్ మీడియాలోకి తీసుకువెళ్లడం ద్వారా నగర వాసులు... ప్రధానంగా యువతకు దగ్గర చేయవచ్చని నిర్ణయించారు. తీవ్రమైన ఉల్లంఘనుల ఫోన్లకు.. మంగళవారం నుంచి ‘షేరింగ్’ విధానానికి శ్రీకారం చుట్టారు. మద్యం తాగి వాహనాలు నడపటం, లైసెన్స్ లేకు ండా వాహనాలు నడపటం, మైనర్ డ్రైవింగ్ తదితర తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన వారిని ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్న వెంటనే జరిమానా విధించి పంపేయరు. వారి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకునే అధికారులు టీటీఐలో కౌన్సిలింగ్, న్యాయస్థానంలో హాజరు, శిక్ష తదితరాలు పూర్తయిన తర్వాతే వాహనాలను రిలీజ్ చేస్తారు. వీరు టీటీఐలో కౌన్సిలింగ్‌కు వచ్చినప్పుడు అక్కడి అధికారులు ఈ షార్ట్‌ఫిల్మŠస్ ప్రదర్శిస్తున్నారు. సెషన్ ముగిసిన తర్వాత వారిలో స్మార్ట్‌ఫోన్స్ ఉన్న వారి వాట్సాప్‌కు ఈ రెండు లఘు చిత్రాలను షేర్ చేస్తున్నారు. ప్రతి ఉల్లంఘనుడు కనీసం మూడు గ్రూపుల్లో ఇవి షేర్ చేసేలా ప్రోత్సహిస్తున్నారు. స్వచ్ఛందంగా అంగీకరిస్తేనే రహదారి భద్రతలో అత్యంత కీలకమైన ఎడ్యుకేషన్‌లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. నిబంధనలపై అవగాహన పెంచడానికి ఉద్దేశించిన రెండు షార్ట్‌ఫిల్స్ ను ఉల్లంఘనులకు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తున్నాం. వారు మరో మూడు గ్రూపుల్లోకి పంపేలా ప్రోత్సహిస్తున్నాం. ఆ గ్రూపుల్లోని సభ్యులతోనూ ఇలానే షేర్ చేయించేలా కోరమని చెబుతున్నాం. ఇదంతా ఉల్లంఘనులు స్వచ్ఛందంగా అంగీకరిస్తే మాత్రమే చేస్తున్నాం. ఎవరైనా తాము ఎవరికీ షేర్ చేయమనో, అసలు తమకే షేర్ చెయ్యవద్దనో కోరితే వీటిని పంపడం లేదు. – టీటీఐ అధికారులు -
రకుల్ ‘హెల్మెట్’ పాఠాలు!
-
ఒకరి తప్పు... మరొకరికి ముప్పు
సినీ నటి రకుల్‌ప్రీత్ సింగ్ కలెక్టరేట్: రహదారి భద్రత నిబంధనలు ఉల్లంఘిస్తూ ఒకరు తప్పు చేస్తే మరి కొందరికి ముప్పుగా మారే ప్రమాదం ఉందని సినీ నటి రకుల్‌ప్రీత్ సింగ్ అన్నా రు. గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ( టీటీఐ) ‘ట్రాఫిక్ నియంత్రణ-నిబంధనలు’ అనే అంశం పై మంగళవారం జరిగిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ... ‘టీటీఐకి వస్తున్నప్పుడు రహదారిలో వాహనచోదకుల్ని పరిశీలించాను. అందరూ హెల్మెట్ కలిగి ఉన్నా... ధరిస్తున్న వారు తక్కువగా ఉన్నారన్నా రు. హెల్మెట్‌ను వెనుకసీటులో ఉన్న వ్యక్తి కో, పక్కనో పెట్టుకుని ట్రాఫిక్ పోలీసులు కనిపించినప్పుడే తలకు ధరిస్తున్నారన్నారు.హెల్మెట్ నిబంధన మన భద్రత కోసమే అని గుర్తుంచుకోవాలన్నారు. నేను కారు నడపడం తక్కువే అయినా లెసైన్స్ నిత్యం నా వెంటే ఉంటుంది‘ అంటూ దాన్ని తీసి చూపించారు. ‘రెడ్’ ఉన్నా హారన్ ఎందుకు? నగరంలోని అవసరం లేకుండా హారన్లు మోగిస్తూ ధ్వని కాలుష్యాన్ని పెంచుతున్నారన్నారు. ట్రాఫిక్ జంక్షన్లలో సైతం రెడ్ సిగ్నల్ పడి వాహనాలు ఆగినా వెనుక వాహనాల వారు పదేపదే హారన్లు మోగిస్తారన్నారు. మద్యం తాగి వాహనా లు నడపటం, పరిమితికి మించిన వేగం తో దూసుకుపోవడం, స్టాప్ లైన్లను క్రాస్ చేయడం మానుకోవాలని సూచించారు. అవగాహనే ముఖ్యం: జితేందర్ ట్రాఫిక్ చీఫ్ జితేందర్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ విభాగంలో పారదర్శకతను పెంచేందుకే క్యాష్ లెస్ ఎన్ఫోర్స్మెంట్ విధానాలు అవలంభిస్తున్నామన్నారు. ప్రభు త్వ ఆశయాలకు అనుగుణంగా హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు పోలీస్‌శాఖ కృషి చేస్తోందన్నారు. చలాన్లు విధించేది జరిమానాల వసూలు కోసం కాదని, నిబంధనలపై ప్రజలకు అవగాహన పెరగాలన్నదే తమ లక్ష్యమన్నారు. విదేశాల తరహాలో నగరంలో ట్రాఫిక్ పోలీసు లేని కూడళ్లుగా మార్చాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, ఇందుకు వాహనచోదకుల్లో క్రమశిక్షణ పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ట్రాఫిక్ డీసీపీ-2 ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి హెల్మెట్ నిబంధన నుంచి మినహాయిం పు ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సుంకర సత్యనారాయ ణ, టీటీఐ ఇన్స్పెక్టర్ ఎం.శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్లు కె.శ్రీనివాస్, పీజీ రెడ్డి, ఈవెంట్ మేనేజర్ నవీన్ పాల్గొన్నారు. -
టీటీఐలు.. టార్గెట్లు
- చిన్న చిన్న తప్పిదాలకూ కేసులు - అవసరం లేకపోయినా మెమోలు - ఆందోళన చెందుతున్న ఆర్టీసీ కార్మికులు - మానసిక ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన కామారెడ్డి: ‘దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు’ అన్నట్టుగా తయారైంది ఆర్టీసీ కండక్టర్ల పరిస్థితి. యాజమాన్యం టార్గెట్లు విధించడంతో కొందరు టీటీఐలు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్న చిన్న తప్పిదాలకు సైతం కేసులు రాస్తూ కండక్టర్లను రోడ్డుపాలు చేస్తున్నారని అంటున్నారు. శనివారం కామారెడ్డిలో టీటీఐ సామయ్య వేధించడంతోనే జీవన్ అనే కండక్టర్ షాక్‌తో ఆస్పత్రి పాలయ్యాడు. జీవన్‌కు ఇంతకు ముందే టీటీఐలతో రెండుసార్లు ఇబ్బందులపాలై ఇంక్రిమెంట్లు కోల్పో యా డు. మూడోసారి తీవ్రమైన ఒత్తిడి తేవడంతో షాక్‌కు గురయ్యా డు. ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఎక్కువ సమయం పనిచేస్తున్నా ఆర్టీసీలో కార్మికులకు అరకొర వేతనాలే ఉన్నాయి. దానికి తోడు పని భారం, అధికారుల ఒత్తిళ్లూ ఎక్కువే. ఇదే సమయంలో టీటీఐలు తనిఖీల పేరుతో హడలెత్తిస్తుండడంతో కండక్టర్లు ఆందోళనకు గురవుతు న్నారు. నాలుగు రకాల తనిఖీ బృందాలు ఆర్టీసీ బస్సులలో టిక్కెట్ల తనిఖీలకు సంబంధించి జిల్లా స్క్వాడ్, జోనల్ స్క్వాడ్, విజిలెన్స్ స్క్వాడ్, హెడ్ క్వార్టర్ స్క్వాడ్ అని నాలుగు రకాల బృందాలున్నాయి. జిల్లా స్క్వాడ్‌లో ఏడుగురు సభ్యులుంటారు. వారికి ఒక వాహనం ఉంటుంది. హెడ్‌క్వార్టర్ స్క్వాడ్‌లో కూడా ఏడుగురు సభ్యులుంటారు. వారికీ ఓ వాహనం ఉంటుంది. కండక్టర్లు, డ్రైవర్లు తప్పిదాలకు పాల్పడకుండా తనిఖీలు ఎంతగానో దోహదపడుతాయి. అయితే, తనిఖీ బృందాలకు యాజమాన్యం టార్గెట్లు విధించడంతో నిత్యం కొన్ని కేసులు రాయడం ద్వారా దానిని భర్తీ చేసుకుంటున్నారు. చిన్న తప్పిదాలకు సైతం కేసులు రాయడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆయా బృందాలకు నెలకు 90 మెమో లు, పది డిపో స్పేర్లు టార్గెట్లుగా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో తనిఖీల అధికారులు దూకుడుగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు రాస్తున్నార ని కార్మికులు వాపోతున్నారు. అభద్రత నడుమ, మానసిక ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నామంటున్నారు. కండక్టర్, డ్రైవర్లు సంస్థకు మూల స్తంభాలని యాజమాన్యం పొగడ్తలతో ముంచెత్తుతూనే మరోవైపు సస్పెన్షన్లు, రిమూవల్స్‌ను బహుమానాలుగా అందిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో టీటీఐలు ప్రయాణికుల ముందే కండక్టర్లను నానా మాటలతో వేధిస్తున్నారని పేర్కొంటున్నారు. కార్మికునికి ఏడాదిలో ఒక మెమో వచ్చినా, ఏడాది కష్టం అంతా వృథా అవుతోంది. మెమో మూలంగా ఇంక్రిమెంటుకు దూరమవుతాడు. అధిక శాతం కార్మికులు మెమోలతో ఇంక్రిమెంట్లు కోల్పోతున్నారని పలువురు చెబుతున్నారు. అక్రమ కేసులు రాస్తున్న టీటీఐలు తనిఖీలకు వచ్చే టీటీఐలు కార్మికులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందుకు శనివారం కామారెడ్డిలో జరిగిన సంఘటననే నిదర్శనంగా చెప్పవచ్చు. కండక్టర్‌కు ఉన్న స్పాట్ ఎక్స్ప్లెనేషన్ వ్యవధిని కూడా గుర్తించకుండా కేసులు నమోదు చేస్తున్నారు. టిక్కెట్ తీసుకుని పోగొట్టుకుంటే ప్రయాణికుడికే జరిమానా విధించాల్సి ఉండగా, కండక్టర్లకు మెమోలు ఇస్తున్నారు. టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే ఐదు వందల వరకు జరిమానా విధించవచ్చన్న విషయాన్ని పట్టించుకోకుండా కండక్టర్లనే టార్గెట్ చేస్తున్నారు. బస్టాండ్ పక్కన ఆపినందుకు, ఇన్కమింగ్ గేట్ నుంచి వెళ్లే బదులు ఔట్‌గేట్ నుంచి వెళ్లినందుకు డ్రైవర్లకు మెమో లు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఎస్ఆర్ సరి గ్గా రాయలేదని మెమో, బస్సులో వంద మంది ఉంటే ఒక్క ప్యాసింజర్ మిస్ అయినా కేసు, ఏ తప్పు దొరకకున్నా ఒక్కో సారి మెమో ఇచ్చేందుకు టీటీఐలు ఉత్సాహం చూపుతున్నారు. ఇదేమంటే టార్గెట్లని చెప్పుకుంటున్నారు. స్థానికులే టీటీఐలుగా పనిచేస్తున్నారు. టీటీఐలుగా పనిచేస్తున్నవారిలో స్థానికులు ఉండడంతో వారు తమతో స్నేహం చేసేవారి విషయంలో ఒక రకంగా, తమను పట్టించుకోని వారి విషయంలో మరో రకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చిన్న పొరపాట్లకు కూడా మెమోలు ఇవ్వడంతో ఇంక్రిమెంట్లు దూరమవుతుండడం, మానసిక ఒత్తిడికి లోనవుతున్న నేపథ్యంలో టీటీఐల వేదింపుల నుంచి కాపాడాలని కార్మికులు కోరుతున్నారు. -
టీటీఐలకు భద్రత కల్పించాలి
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: రైళ్లలో పనిచేసే టీటీఐలు, టీటీఈలకు భద్రత కల్పించాలని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ బ్రాంచి సెక్రటరీ కుప్పాల గిరిధర్‌కుమార్ డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన టీటీఐ విజయకుమార్‌ను టికెట్లు లేని ప్రయాణికులు నడుస్తున్న రైల్లో నుంచి తోసేసిన ఘటనకు నిరసనగా బుధవారం తిరుపతిలో యూనియన్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిరిధర్‌కుమార్ మాట్లాడుతూ రైల్వే శాఖలోని కమర్షియల్ విభాగంలో వేలాది ఖాళీలను భర్తీ చేయకుండా టీటీఐలకు వసూలు లక్ష్యాలను పెంచడంతోనే ఇలాంటి సంఘటనలకు దారి తీస్తోందన్నారు. గతంలో ఒక్కో టీటీఐ నెలకు రూ.40 వేలు టికెట్లు లేని ప్రయాణికుల నుంచి వసూలు చేయాల్సి ఉండగా ప్రస్తుతం ఆ లక్ష్యాన్ని రూ.1.65 లక్షలకు పెంచడం విడ్డూరమన్నారు. లక్ష్యాలను పెంచడంతో రైళ్లలో టికెట్లు లేకుండా ప్రయాణించే వారిపై కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందన్నారు. దీంతో టికెట్లు లేని ప్రయాణికులు టీటీఐలను నడుస్తున్న రైళ్లలో నుంచి తోసేస్తూ ఆందోళనకర వాతావరణాన్ని సృష్టిస్తున్నారని వాపోయారు. వసూలు లక్ష్యాల కోసం రాత్రింబవళ్లు మానసిక వేధనలకు కూడా టీటీఐలు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇకనైనా రైల్వే శాఖ టీటీఐల సమస్యలను పరిష్కరించి, రైళ్లలో విధుల నిర్వహణ సమయంలో భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ చైర్మన్ ఎన్వీ రమణరావు, సీటీటీఐ కృష్ణానాయక్, నాయకులు టీవీ రావు, ఎస్.విజయకుమార్, వేణుమాధవ్, బుకింగ్ సిబ్బంది వేణు, ఏఎస్ రావు, పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.