ఉల్లంఘనులకు షార్ట్‌ఫిల్మ్ షేర్ చేస్తున్న పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: ‘నాకు థాంక్స్ చెప్పొద్దు. అవకాశం వచ్చినప్పుడు మీరు ఓ ముగ్గురికి సహాయం చెయ్యండి. వారిలో ఒక్కొక్కరినీ మరో ముగ్గురి చొప్పున చెయ్యమని చెప్పండి’.. స్టాలిన్ సినిమాలో తన వద్ద సాయం పొందిన వారితో చిరంజీవి చెప్పే డైలాగ్ ఇది..
‘మాకు సారీ చెప్పవద్దు. మరోసారి ఇలాంటి పొరపాటు చెయ్యకండి. ఈ షార్ట్‌ఫిల్మ్‌లను కనీసం మూడు గ్రూపుల్లో షేర్ చెయ్యండి. అందులోని వారినీ అలానే చెయ్యమనండి’..
కౌన్సెలింగ్‌కు హాజరైన ఉల్లంఘనులతో టీటీఐ అధికారులు చెబుతున్న మాట ఇది.
నగర ట్రాఫిక్ విభాగం ఆధీనంలోని గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (టీటీఐ) అధికారులు మంగళవారం నుంచి ఓ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్ నిబంధనలపై ఉల్లంఘనులతో పాటు సోషల్ మీడియాల్లోని సభ్యులకు అవగాహన కలిగేలా షేరింగ్ విధానం ప్రారంభించారు. సిగ్నల్ జంపింగ్ చేయవద్దని, హెల్మెట్ వినియోగించమంటూ ఇటీవల రూపొందించిన షార్ట్‌ఫిల్మస్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఉల్లంఘనుల్నే ప్రచారకర్తలుగా వినియోగించుకుంటున్నారు.
ఆ రెండింటిపై లఘు చిత్రాలు...
ట్రాఫిక్ విభాగం అధికారులు ఉల్లంఘనలను ప్రధానంగా మూడు కేటగిరీలుగా పరిగణిస్తారు. వాహనచోదకుడికి ప్రాణహాని కలిగించేవి, ఎదుటి వ్యక్తికి ముప్పుగా మారేవి, వాహనచోదకుడితో పాటు ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీసేవి. సిగ్నల్ జంపింగ్ ఉల్లంఘన అత్యంత ప్రమాదకరమైన మూడో కేటగిరీ కిందికు వస్తుంది. దీని వల్ల అనేక జంక్షన్లలో ట్రాఫిక్ జామ్స్ సైతం ఏర్పడి ఎన్నో పని గంటలు, ఇంధనం వృథా అవుతున్నాయి. దీంతో పాటు నగరంలో ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాతపడుతున్న, క్షతగాత్రులుగా మారుతున్న వారిలో ద్విచక్ర వాహనచోదకులే ఎక్కువగా ఉంటున్నారు. హెల్మెట్ వినియోగించకపోవడమే దీనికి ప్రధాన కారణంగా ట్రాఫిక్ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిం చేందుకు రెండు షార్ట్‌ఫిల్మ్స్ రూపొందించారు.
ఇప్పటి వరకు పరిమితంగా...
సెలబ్రిటీలతో సందేశం ఇప్పిస్తేనే ప్రజలకు హత్తుకుంటుందనే ఉద్దేశంతో టాలీవుడ్ తారలు లావణ్య త్రిపాఠి, నేహ శెట్టి, ఆకాష్ పూరిలతో ఈ ఫిల్మŠస్ రూపొందించారు. ఈ లఘు చిత్రాలను ట్రాఫిక్ విభాగం చీఫ్ అనిల్ కుమార్ గత శుక్రవారం ఆవిష్కరించారు. సోమవారం వరకు ఈ రెండు చిత్రాలు ట్రాఫిక్ పోలీసుల అధికారిక ఫేస్‌బుక్, వెబ్‌సైట్స్‌తో పాటు యూ ట్యూబ్‌ల్లో మాత్రమే అందుబాటులో ఉంచారు. అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసే చోట వీటిని ప్రదర్శించనున్నారు. సినిమా హాళ్లల్లో ప్రదర్శింపజేయడానికి సెన్సార్ సర్టిఫికెట్ జారీ కావాల్సి ఉంది. ప్రస్తుతం ఇవి ఎక్కువ సంఖ్యలో వాహనచోదకులకు చేరట్లేదని భావించిన అధికారులు వీటిని విస్తృతంగా సోషల్ మీడియాలోకి తీసుకువెళ్లడం ద్వారా నగర వాసులు... ప్రధానంగా యువతకు దగ్గర చేయవచ్చని నిర్ణయించారు.
తీవ్రమైన ఉల్లంఘనుల ఫోన్లకు..
మంగళవారం నుంచి ‘షేరింగ్’ విధానానికి శ్రీకారం చుట్టారు. మద్యం తాగి వాహనాలు నడపటం, లైసెన్స్ లేకు ండా వాహనాలు నడపటం, మైనర్ డ్రైవింగ్ తదితర తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన వారిని ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్న వెంటనే జరిమానా విధించి పంపేయరు. వారి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకునే అధికారులు టీటీఐలో కౌన్సిలింగ్, న్యాయస్థానంలో హాజరు, శిక్ష తదితరాలు పూర్తయిన తర్వాతే వాహనాలను రిలీజ్ చేస్తారు. వీరు టీటీఐలో కౌన్సిలింగ్‌కు వచ్చినప్పుడు అక్కడి అధికారులు ఈ షార్ట్‌ఫిల్మŠస్ ప్రదర్శిస్తున్నారు. సెషన్ ముగిసిన తర్వాత వారిలో స్మార్ట్‌ఫోన్స్ ఉన్న వారి వాట్సాప్‌కు ఈ రెండు లఘు చిత్రాలను షేర్ చేస్తున్నారు. ప్రతి ఉల్లంఘనుడు కనీసం మూడు గ్రూపుల్లో ఇవి షేర్ చేసేలా ప్రోత్సహిస్తున్నారు.
స్వచ్ఛందంగా అంగీకరిస్తేనే
రహదారి భద్రతలో అత్యంత కీలకమైన ఎడ్యుకేషన్‌లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. నిబంధనలపై అవగాహన పెంచడానికి ఉద్దేశించిన రెండు షార్ట్‌ఫిల్స్ ను ఉల్లంఘనులకు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తున్నాం. వారు మరో మూడు గ్రూపుల్లోకి పంపేలా ప్రోత్సహిస్తున్నాం. ఆ గ్రూపుల్లోని సభ్యులతోనూ ఇలానే షేర్ చేయించేలా కోరమని చెబుతున్నాం. ఇదంతా ఉల్లంఘనులు స్వచ్ఛందంగా అంగీకరిస్తే మాత్రమే చేస్తున్నాం. ఎవరైనా తాము ఎవరికీ షేర్ చేయమనో, అసలు తమకే షేర్ చెయ్యవద్దనో కోరితే వీటిని పంపడం లేదు. – టీటీఐ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment