రాజంపేట : రాజంపేట ఆర్టీసీ డిపోలో దాదాపు రూ1.లక్ష విలువ చేసే టిక్కెట్లు గల్లంతయ్యాయి. ఇటీవల నిఘా అధికారుల పరిశీలనలో ఈ విషయం వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మే 6 నుంచి 13 వరకు ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టిన సంగతి విదితమే. 14వ తేదీన సమ్మె విరమించి విధుల్లో చేరారు. అప్పట్లో పనిచేసిన డీఎం ప్రవీణ్‌కుమార్ హయాంలో టిక్కెట్ల గల్లంతు వ్యవహారం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈయన తెలంగాణాకు బదిలీ కాగా కొత్తగా డిపో మేనేజరుగా కె.హరిప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు.
ఇదిలా ఉండగా సమ్మె ముగిసిన అనంతరం కొన్ని రోజులకు డిపోలో నిఘా అధికారులు టిక్కెట్ల విషయంలో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో సుమారు రూ.1లక్ష విలువ చేసే టిక్కెట్లు కనిపించడంలేదు. ఈ విషయం బయటికి పొక్కడంతో కొంతమంది అధికారులు తమకు అనుకూలంగా లేని వారిపై నెట్టే ప్రయత్నాలు కూడా జరిగాయి. కార్మికసంఘాలు ఈ విషయాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. సమ్మెలో భాగంగా విధులకు దూరంగా ఉండిన వారు కాకుండా, సమ్మెలోకి వెళ్లకుండా డిపోలో టిక్కెట్ల విభాగంలో విధులు నిర్వర్తించిన వారిపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఒకరిమీద ఒకరు చెప్పుకోవడంతో ఈ విషయం ఉన్నతాధికారుల వద్దకు వెళ్లింది. ప్రస్తుతం విచారణ గోప్యంగా కొనసాగుతోంది.
సమ్మె సమయంలోనే...
ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టిన సందర్భంగా ఆర్టీసీ యాజమాన్యం అద్దెబస్సులతో పాటు కొన్ని ఆర్టీసీ బస్సులను తిప్పింది. డిపో పరిధిలో కొంతమంది డ్రైవర్లను, కార్మికులను తాత్కాలికంగా విధుల్లోకి తీసుకున్నారు. ఆర్టీసీ కండక్టర్లు అయితే టిమ్‌లు ఉపయోగించేవారు. కానీ తాత్కాలిక సిబ్బందికి టిక్కెట్ల ఇచ్చి బస్సులను నడిపించారు. ఈ సందర్భంగా సిబ్బందికి ఇచ్చిన టిక్కెట్లు మళ్లీ డిపోకు చేరలేదా? లేక డిపోలోని సిబ్బందే సమ్మెలో సడేమియా అన్న చందాన టిక్కెట్లను మాయం చేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికి రాజంపేట డిపోలో టిక్కెట్ల గల్లంతు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
సమ్మెలో సడేమియా..రాజంపేట ఆర్టీసీలో రూ. లక్ష టిక్కెట్లు గల్లంతు
Published Wed, Jun 17 2015 3:19 AM | Last Updated on Sun, Sep 3 2017 3:50 AM
Advertisement
Advertisement