నెల్లూరు ఆర్టీసీ మెయిన్ బస్టాండ్‌లో నిరసన తెలుపుతున్న ఉద్యోగ సంఘాల నాయకులు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: పట్టణంలో రౌడీమూకలు చెలరేగిపోయి విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌పై నడిరోడ్డులో అమానుషంగా దాడి చేసి కాళ్లు, చేతులతో దారుణంగా తన్నడం పాశవిక చర్య అని కావలి ఆర్టీసీ ఉద్యోగులు అన్నారు. కావలిలో రోడ్డుపై వాహనాన్ని ఆపి ఉంటే హారన్ కొట్టి సైడ్ ఇవ్వమని అడిగిన విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ రామ్‌సింగ్‌పై రౌడీమూకలు దాడి చేశాయని, బస్సును మద్దూరుపాడు వద్ద హైవేలో ఆపి డ్రైవర్‌ను చితకబాదడం విచారకరమని అన్నారు. రౌడీమూకల చర్యలను నిరసిస్తూ కావలి ఆర్టీసీ ఉద్యోగులు శనివారం ఆందోళన చేపట్టారు.
కావలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి, పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ, డీఎస్పీ కార్యాలయాలకు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు ర్యాలీగా వెళ్లి లిఖిత పూర్వక వినతిపత్రాలు అందజేశారు. రౌడీమూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ ఉద్యోగులమైన తమపై రౌడీమూకల దాడులను ప్రజలందరూ ఖండించాలని కోరారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
నెల్లూరు సిటీ: విజయవాడ ఆర్టీసీ డిపో డ్రైవర్‌పై దాడి అమానుషమని, దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎన్‌ఎంయూఏ జిల్లా కార్యదర్శి జానా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని ఆర్టీసీ ప్రధాన బస్టాండ్ వద్ద ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలిలో ఆర్టీసీ డ్రైవర్ బత్తుల రామ్‌సింగ్‌పై కొందరు విచక్షణారహితంగా దాడి చేశారన్నారు.
రాత్రి, పగలు నిరంతరం ప్రజల కోసం విధులు నిర్వహించే ఆర్టీసీ ఉద్యోగులపై దౌర్జన్యానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నిరూపించేలా నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్‌ఎంయూఏ రాష్ట్ర కార్యదర్శి పీఎస్‌రెడ్డి, జోనల్ కార్యదర్శి కె.లుక్సన్, డిపో–1 కార్యదర్శి చెంచయ్య, అధ్యక్షుడు బీఆర్ ప్రసాద్, డిపో–2 ఎన్‌ఎంయూ అధ్యక్షుడు సునీల్, కార్యదర్శి శివయ్య, అసోసియేషన్ సభ్యులు బాబూ శామ్యూల్, ప్రసాద్, కట్టా సుబ్రహ్మణ్యం, జిలానీ, దశరథ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment