Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP President YS Jagan Mohan Reddy Tweets For Party Victory1
‘ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా’

తాడేపల్లి : స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ మేరకు వైఎస్ జగన్ తన సోషల్ మీడియా అకౌంట్‘ఎక్స్’ ద్వారా వైఎస్సార్‌సీపీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు.‘స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు పనిచేయటం హర్షించదగ్గ విషయం. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా.. చంద్రబాబు గారు అధికార అహంకారాన్ని చూపి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా..కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని..జీవనోపాథి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారు.విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులను చూసి గర్వపడుతున్నాను. క్లిష్ట సమయంలో వీరు చూపించిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ ఎన్నికలను సమన్వయ పరుస్తూ గెలుపునకు బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కో-ఆర్డినేటర్లు మరియు పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందర్నీ అభినందిస్తున్నాను. పార్టీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వెన్నుముకలా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా, @ncbn గారు అధికార అహంకారాన్ని చూపి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా, కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాథి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 28, 2025 స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం

AP Govt Released Payment of Rs 2 86 crore to Siddharth Luthra2
AP Govt: లాయర్ సిద్ధార్థ్‌ లూథ్రాకు రూ.2.86 కోట్లు చెల్లింపు

విజయవాడఛ కూటమి సర్కారు కేసులు వాదిస్తున్న అత్యంత ఖరీదైన సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రాకు ఏపీ ప్రభుత్వం రూ. 2.86 కోట్లు చెల్లించింది. ఏపీ ప్రభుత్వం కేసులు వాదించిందుకు గాను ఈ మొత్తాన్ని చెల్లించింది. హైకోర్టులో నాలుగు కేసులు వాదించినందుకు రూ. 2.86 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ఈ మేరకు నిధులు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. గతంలో అవినీతి కేసులను సిద్థార్థ్ లూథ్రా వాదించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు స్కిల్ స్కామ్, అమరావతి స్కామ్ కేసులు వాదించారు సిద్ధార్థ్ లూథ్రా.. చంద్రబాబు సీఎం అయ్యాక ప్రభుత్వం తరఫున కేసులకు ఆయన్ను నియమించుకుంది కూటమి సర్కారు.సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా ప్రస్తుతం ఆంధ్ర­ప్రదేశ్‌లో యావత్‌ రాష్ట్ర ప్రభుత్వ వ్య­వస్థకు సూపర్‌ బాస్‌గా అవతరించారు. గతంలో చంద్ర­బాబు స్కిల్‌ కేసులో అరెస్టు కాగానే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడలో వాలి­పోయిన ఆ సీనియర్‌ న్యాయ­వాది వ్యవహారం అప్పట్లోనే తీవ్ర చర్చనీయాంశమైంది. రోజుకు రూ.కోటి ఫీజుతోపాటు అదనపు ఖర్చులు వసూలు చేసే లూథ్రా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తరఫున కేసులు వాదిస్తున్నారు.

SC asks HC CJ not to assign judicial work to Justice Varma3
జస్టిస్ యశ్వంత్‌కు ఏ పనీ ఇవ్వొద్దు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలతో చిక్కుల్లో పడ్డ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాసేపటికి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ కేవలం బదిలీపై మాత్రమే అలహాబాద్ హైకోర్టుకు వస్తున్నారని, ఆయనకు ప్రస్తుతానికి ఏ విధమైన జ్యుడిషియల్ వర్క్ అప్పచెప్పవద్దని సీజేఐ సంజీవ్ ఖన్నా కోరారు. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జస్టిస్ యశ్వంత్ పై విచారణ పెండింగ్ లో ఉన్న క్రమంలోనే ఆయనకు ఏ పనీ అప్పచెప్పవద్దని సీజేఐ సూచించారు. అంతకుముందు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఈ తరహా ఆదేశాలనే జారీ చేశారు సీజేఐ.కేంద్రానికి సిఫార్సు.. గ్రీన్ సిగ్నల్‌జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీ అంశానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే క్రమంలో కేంద్రానికి ప్రతిపాదన పంపింది సీజేఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం. దీనికి ఈరోజు(శుక్రవారం) గ్రీన్ సిగ్నల్ లభించడంతో యశ్వంత్ వర్మ.. అలహాబాద్ హైకోర్టుకు వెళ్లనున్నారు. 2021లో అలహాబాద్ హైకోర్టు నుంచి బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చిన యశ్వంత్ మళ్లీ అక్కడికే వెళ్లనున్నారు.ఆరు రాష్ట్రాల బార్ అసోసియేన్స్ తో సీజేఐ భేటీఅయితే యశ్వంత్ వర్మ సచ్ఛీలురుగా బయటకొచ్చేవరకూ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయొద్దంటూ అక్కడ బార్ అసోసియేషన్ తో పలు రాష్ట్రాల బార్‌ అసోయేషన్స్‌ కూడా కోరాయి. గుజరాత్ హైకోర్టు బార్ అసోసియేషన్, కేరళ హైకోర్టు బార్ అసోసియేషన్, కర్ణాటక హైకోర్టు బార్ అసోసియేషన్, లక్నో బార్ అసోసియేషన్స్‌ డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సీజేఐ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పలు బార్ అసోసియేషన్ హెడ్స్ తో సీజేఐ సంజీవ్ ఖన్నా నిన్న(గురువారం)ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రస్తుతానికి జస్టిస్ యశ్వంత్ బదిలీని నిలుపుదల చేయాలని సదరు బార్‌ అసోసియేషన్స్‌ కోరిన తరుణంలో వారితో సీజేఐ భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులతో సీజేఐ సమావేశమై వారితో చర్చించారు. వారి డిమాండ్‌ ను పరిగణలోకి తీసుకుంటామని సీజేఐ సంజీవ్ ఖన్నా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇంట్లో నోట్ల కట్టలు..!కాగా, ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాని విలువ సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని అంచనాలు కూడా వేశారు. ఒక న్యాయమూర్తి వద్ద అంత డబ్బు ఎలా వచ్చిందంటూ చర్చ మొదలైంది. అదే సమయంలో ఇది కచ్చితంగా అవినీతి చేసే కూడపెట్టిందని వాదన బలంగా వినిపించింది.ఈ క్రమంలోనే ఆరు రాష్ట్రాలకు చెందిన బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సీజేఐ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీని కొన్నాళ్లపాటు నిలుపుదల చేయడమే సమంజసమా?, బదిలీ చేసి అక్కడ జ్యుడిషియల్ వ్యవహారాలు అప్పగించకుండా ఉండేలా చేయడమే కరెక్టా అనే కోణంలో వీరు చర్చించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే జస్టిస్ యశ్వంత్ పై విచారణ పూర్తయ్యేవరకూ ఎటువంటి బాధ్యతలు కేటాయించవద్దని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించినట్లు సమాచారం.

Ramajogayya sastry and Anantha sriram Talks About ugadi festival4
కొత్త తరానికి చెబుదాం

తెలుగువారి తొలి పండగ వచ్చేస్తోంది. నూతనోత్సాహంతో ఉగాదిని ఆహ్వానించడానికి సిద్ధమవుతున్న వేళ... కొత్త తరానికి పండగల అర్థం తెలుస్తోందా? అంటే... ‘పెద్దవాళ్లు చెబితేనే తెలుస్తుంది’ అంటున్నారు ప్రముఖ రచయితలు రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్‌. ఉగాది ప్రత్యేకంగా ఇంకా ఈ ఇద్దరూ చెప్పిన విశేషాలు తెలుసుకుందాం.పండగలు జరుపుకోవడం ఎవరూ మానేయలేదు. పిండివంటలు చేసుకోవడానికైనా పండగలు చేసుకుంటున్నాం. పండగ పూట తల స్నానం చేసి, ఉగాది పచ్చడి తిన్న తర్వాతే మిగతా పనులు చేయాలని పిల్లలకు పెద్దలు చెప్పాలి. ఎప్పటికప్పుడు కొత్త తరానికి పాత తరంవాళ్లు చెబుతుండాలి. ఎందుకంటే పండగలన్నీ ముందు తరంవాళ్లు చేసుకుంటూ వచ్చారు కాబట్టి చెప్పడం వారి బాధ్యత. కొత్త తరాన్ని పాజిటివ్‌గా స్వాగతించాలి. వారూ వెల్‌కమింగ్‌గానే ఉంటారు. మన తానులో పెరిగిన ముక్కలు వేరేలా ఎలా ఉంటారు? కొత్త తరానికి పద్ధతులన్నీ కొత్తే. పోనీ ఇవాళ్టి పాత తరం అనుకున్నవారికి ఎవరు చెప్పారు? వారి ముందు తరంవారు చెబితేనే కదా వీరికి తెలిసింది. ఇది రిలే పందెంలాంటిది. ఒక తరానికి ఒక తరానికి సక్రమంగా విషయాలను అందజేయాల్సిన బాధ్యత ముందు తరానికి ఉంటుంది. యువతని నిందించడం సరికాదు: ప్రపంచాన్ని రెండు రకాలుగా చూడొచ్చు. మంచి కోణంలో... దుర్గార్మపు కోణంలో... ఎప్పుడూ మొదటి కోణంలో చూస్తే మంచిది. అది కాదనుకుని యువత పెడదారి పట్టిందని, ఏదేదో జరిగిపోతోందని యువతరాన్ని నిందించడం సరికాదు. ఏదీ వక్రీకరించిన కోణంలో చూడొద్దు. ఫారిన్‌ కల్చర్‌ అంటున్నాం... విదేశాలు వెళ్లి చూస్తే ఇక్కడికన్నా ఎక్కువ అక్కడ పండగలు బాగా జరుపుకుంటున్నారు. అన్నమాచార్యుల కీర్తనలు కూడా పాడుతున్నారు. ఇక్కడితో పోల్చితే అమెరికా ఫాస్ట్‌ ఫార్వార్డ్‌ అనుకోవాలి కదా. కానీ అక్కడ మన సంప్రదాయాలు బతికే ఉన్నాయి. ఇక ఎప్ప టికీ ఇండియా రామని తెలిసిన కుటుంబాలు కూడా తమ పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారు... మన సంప్రదాయాల గురించి చెబుతున్నారు. పిల్లలూ నేర్చుకుంటున్నారు. యువతరం బాధ్యతగా ఉంటోంది: సారవంతమైన నేల అది (యువతరాన్ని ఉద్దేశించి). బీజం వేయడం అనేది మన చేతుల్లో ఉంది. ముందు తరం బాధ్యతగా ఉండి, తర్వాతి తరానికి దగ్గరుండి అన్నీ నేర్పించి, అన్నీ ఆచరించేలా చేయాలి. వీళ్లు పాటిస్తూ వాళ్లు పాటించేలా చేయాలి. పొద్దున్నే వీళ్లు స్నానం చేయకుండా... పిల్లలను స్నానం చేసి, పూజలు చేయమంటే ఎందుకు చేస్తారు? నువ్వు చేయడంలేదు కదా? అంటారు. ఒకవేళ మాటల రూపంలో చెప్పకపోయినా... ముందు తరం ఆచారాలు పాటిస్తుంటే వీళ్లు చూసి, నేర్చుకుంటారు... అనుసరించడానికి ఇష్టపడతారు. బోధించే విధానం సక్రమంగా ఉండాలి. ఫైనల్‌గా చెప్పేదేంటంటే... మనం అనుకున్నంతగా యువతరం ఏమీ దిగజారిపోలేదు. చెప్పాలంటే మనకన్నా ఇంకా బాధ్యతగా ఉంటూ, పాతా కొత్తా బ్యాలెన్స్‌ చేసుకుంటూ వెళుతున్నారు. ఈ కాలపు పిల్లలు ఇంటికీ, బయటికీ పర్ఫెక్ట్‌ బ్యాలెన్స్‌ తెలిసినవాళ్లు. వాళ్లలో ఏదైనా లోపం ఉందీ అంటే... చెప్పేవాళ్లదే కానీ వాళ్లది కాదు. సో... ఏ పండగని ఎందుకు జరుపుకోవాలో విడమర్చి యువతరానికి చెప్పాల్సిన బాధ్యత ముందు తరానిదే. సంవత్సరాది ఎందుకు జరుపుకుంటున్నాం? ఉగాది పచ్చడి విశిష్టత వంటివి చెప్పి, పండగ అర్థం తెలియజేయాలి.పండగ‘రుచి’చూపాలి– అనంత శ్రీరామ్‌పండగలు జరుపుకునే తీరు మారింది. పెళ్లిళ్లల్లో ఎప్పుడైతే మనకు లేని రిసెప్షన్‌ అని మొదలుపెట్టామో అలానే పండగలు జరుపుకునే తీరులోనూ మార్పు వచ్చింది. ఉగాది గురించి చెప్పాలంటే... మా ఊరులో ఐదు రోజులు ఉగాది జాతర జరుగుతుంది. మాది వెస్ట్‌ గోదావరి, యలమంచిలి మండలం, దొడ్డిపట్ల గ్రామం. జాతర సందర్భంగా ఊరేగింపులు అవీ చేస్తుంటారు. ఇప్పుడూ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు జాతరలో భాగంగా మేజిక్‌ షోస్‌ అంటూ వెస్ట్రన్‌ కల్చర్‌ మిక్స్‌ అయిపోయింది. ఉగాది అంటే కవి సమ్మేళనాలు విరివిగా జరిగేవి. ఇప్పుడలా లేదు. ఎవరైనా విద్యావంతులు లేదా శాంతి సమాఖ్యలు వాళ్లు ఏదో టౌన్‌ హాలులో కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసినా ఓ ఇరవై ముప్పైమంది ఉంటున్నారు... అంతే. ఉగాది ప్రత్యేకం అమ్మవారి జాతర: ఇక మా ఊరి ఉగాది గురించి చెప్పాలంటే... మాణిక్యాలమ్మ మా గ్రామ దేవత. ఉగాది సమయంలో మాకు ఆ అమ్మవారి జాతర ఉంటుంది. ఉగాది ప్రత్యేకం అంటే ఆ జాతరే. ఐదు రోజులు ఘనంగా చేస్తారు. ఐదో రోజు అయితే అమ్మవారిని బాగా అలంకరించి, ఊరేగించి, తెప్పోత్సవం చేస్తారు. నేను ప్రతి ఏడాది దాదాపు మిస్‌ కాకుండా వెళతాను. ఈసారి కుదరదు. ఆరు రుచులను సమానంగా ఆస్వాదించాలి: ఉగాది పచ్చడిలోని షడ్రుచుల గురించి చెప్పాలంటే... నేను ‘ఒక్కడున్నాడు’ సినిమాలో ‘ఇవ్వాళ నా పిలుపు... ఇవ్వాలి నీకు గెలుపు... సంవత్సరం వరకు ఓ లోకమా...’ అని పాట రాశాను. అది పల్లవి. పాట మొదటి చరణంలో రుచుల గురించి రాశాను. ‘కొంచెం తీపి... కొంచెం పులుపు పంచే ఆ ఉల్లాసమూ... కొంచెం ఉప్పు... కొంచెం కారం పెంచే ఆ ఆవేశమూ... చేదూ వగరూ చేసే మేలూ... సమానంగా ఆస్వాదించమని ఇవ్వాళ నా పిలుపు’ అని రాశాను. ఆరు విభిన్నమైన రుచులను సమానంగా ఆస్వాదిస్తేనే జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలమని చెప్పడమే ఆ పాట ఉద్దేశం. అంటే... జీవితంలో ఎదురయ్యే పరిస్థితులన్నింటినీ సమానంగా స్వీకరించగలగాలి.ఆ బాధ్యత పెద్దవాళ్లదే: ఇక నేటి తరం గురించి చెప్పాలంటే... ఇప్పుడు కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలతో హాలోవెన్‌ అంటూ రకరకాల వేషాలు వేయిస్తున్నారు. వేలంటైన్స్‌ డే అనీ ఇంకా వేరే ఎక్కడెక్కడనుంచో తెచ్చిపెట్టుకున్న పండగలను జరుపుతున్నారు. అయితే పిల్లలకు మన పండగల గురించి చెప్పాలి. వేరే సంబరాలు ఎలా ఉన్నా కూడా మన పండగలకు ఎక్కువప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా పాత తరం ఆచరిస్తే కొత్త తరానికి అర్థం అవుతుంది. వాళ్లు మన సంస్కృతీ సంప్రదాయాలను ముందుకు తీసుకెళతారు. మా గ్రామంలో ఉగాది అంటే... ఇంట్లో పిల్లలకు వేప పూత, మామిడికాయలు, చెరుకు గడలు తెమ్మని టాస్కులు ఇచ్చేవారు. అవి తెచ్చే క్రమంలో మాకు పండగలు అర్థమయ్యేవి. అలా మా ముందు తరంవాళ్లు మాకు నేర్పించారు. కొత్త తరానికి మనం అలా నేర్పిస్తే వాళ్లు పాటిస్తారు. ముందు తరాలకు సంస్కృతీ సంప్రదాయాలను నేర్పించే బాధ్యత పెద్దవాళ్లదే.– డి.జి. భవాని

BJP criticizes Stalin for inciting linguistic arrogance5
భాషా రాజకీయాల ఆట

తమిళనాడు తన బడ్జెట్‌ ప్రమోషనల్‌ లోగోలో భారత కరెన్సీ సింబల్‌కు బదులుగా తమిళ అక్షరం ‘రూ’ వాడి దేశవ్యాప్తంగా దుమారం లేవనెత్తింది. ఈ చర్య కేవలంసింబల్‌ వివాదం కాదనీ, ఇది భారత సమైక్యతను బలహీనపరుస్తుందనీ, ప్రాంతీయ అభిమానం మాటున వేర్పాటువాద సెంటిమెంటును రెచ్చగొడుతుందనీ విమ ర్శిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే మాజీ చట్టసభ్యుడి తనయుడు, గువాహటి ఐఐటీలో డిజైనర్‌ అయిన ఒక తమిళ వ్యక్తి రూపకల్పన చేసిన సింబల్‌ను తిరస్కరించడం డీఎంకే ‘మందబుద్ధి’ని బయటపెడుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై అభివర్ణించారు. తమిళంలో రూపాయి గుర్తుకు తమిళ అక్షరం ‘రూ’ వాడటం సహజమే. మూడు భాషలను ప్రతిపాదించిన ఎన్‌ఈపీ 2020 పట్ల అసమ్మతిని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే బడ్జెట్‌ పత్రాల్లో రూపాయి సింబల్‌కు బదులుగా తమిళ ‘రూ’ అక్షరం వాడటం వెనుక డీఎంకే ఉద్దేశం. ఏడాదిలో రాష్ట్ర ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి స్టాలిన్‌ భాషాదురహంకారాన్ని రెచ్చగొడుతున్నారని బీజేపీ విమర్శిస్తోంది. తమిళ సెంటిమెంట్‌ ఆందోళనహిందూ అహంకారం పతాకస్థాయికి చేరిన తరుణంలో అస్తిత్వ పోరుకు నడుం బిగించిన రాజకీయ నాయకుడు నిజానికి డీఎంకే అధినేత ఒక్కరే కాదు. అయితే ఒక్క డీఎంకే మీద మాత్రమే బీజేపీ నేతలు శ్రుతి మించిన ఆగ్రహావేశాలు ప్రదర్శించడం చూస్తే, ఆ పార్టీని టార్గెట్‌ చేస్తున్నారని అనుకోవాలి. మతం ప్రాతిపదికగా వ్యక్తులను అవమానించడం, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం దేశ సమైక్యతకు ముప్పుగా భావించే రోజు ఎప్పుడు వస్తుంది? రెండోసారి అధికారం చేజిక్కించుకోవడానికి స్టాలిన్‌ సన్నద్ధం అవుతున్నారు, వాస్తవమే! ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని మార్చేయడం తమిళనాడు అలవాటు. ఈ సింగిల్‌ టర్మ్‌ ఆనవాయితీని భగ్నంచేసింది జయలలిత ఒక్కరే! 2016లో ఆమె ఏఐఏడీఎంకేను రెండో టర్మ్‌ అధికారంలోకి తెచ్చారు. ఈ సెంటిమెంటుతో పాటు నటుడు విజయ్‌ నాయకత్వంలో ఏర్పడిన తమిళగ వెట్రి కళగం పార్టీ సైతం డీఎంకేకు ఆందోళన కలిగిస్తోంది. బీజేపీ లేదా మరో ఇతర పార్టీ రానున్న ఎన్నికలకు అజెండా సెట్‌ చేసేవరకూ డీఎంకే వేచి చూడదలచుకోలేదు. భాష, నియోజకవర్గాల పునర్విభజన అస్త్రాలను బయటకు తీసింది. రాష్ట్రంలో ఏ మూలైనా ఈ అంశాల మీదే మాట్లాడుకుంటున్నారు. ప్రతిపక్ష ఏఐఏడీఎంకే, విజయ్‌లు... ఈ రెండు అంశాల మీద డీఎంకే పార్టీకి మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. గ్రహస్థితులు అనుకూలిస్తే, రానున్న ఎన్నికల్లో బీజేపీతో మళ్లీ కూటమి కట్టే అవకాశాలున్న ఏఐఏడీఎంకే ఇప్పుడు పులుసులో పడింది. 2020లో అధికారంలో ఉన్నప్పుడు ఎన్‌ఈపీకి వ్యతిరేకంగా తొలి శంఖం పూరించిన పార్టీ ఇదే. హిందీని నిర్దేశించకపోయినా...హిందీ వ్యతిరేక రాజకీయాల్లో తమిళనాడుకు వందేళ్ల చరిత్రఉంది. మూడు భాషల సూత్రానికి అంగీకరిస్తేనే రాష్ట్రానికి కేంద్ర విద్యానిధులు విడుదల చేస్తామని ప్రకటించి, నిద్రాణంగా పడి ఉన్న ఒక జటిల సమస్యకు బీజేపీ ఎందుకు తిరిగి ప్రాణం పోసింది? ఇది అంతుచిక్కని విషయం. ‘హిందీకరణ’ ఇండియా పట్ల తన మక్కు వను వెల్లడిస్తూ ఆ పార్టీ సంకేతాలపై సంకేతాలు ఇస్తోంది. వలసవాద అవశేషాలు తుడిచిపెట్టాలన్న మిషతో ఇండియన్‌ పీనల్‌ కోడ్, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ పేర్లను హిందీలోకి మార్చడం ఇందుకు ఉదాహరణ. ఇంతా చేసి ఇప్పుడు వెనకడుగు వేస్తే రాజకీయ బలహీ నత అవుతుందేమో అన్నది బీజేపీ డైలమా. మూడో భాష హిందీయే అవ్వాలని ఎన్‌ఈపీ ఆంక్ష పెట్టని మాట నిజమే. ఆచరణలో మాత్రం మూడో భాష హిందీనే అవుతుంది. లెక్కలేనన్ని మూడో భాషలను బోధించే టీచర్లను నియమించడం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా తలకు మించిన భారం. పైగా ఎక్కడెక్కడి నుంచో వారిని తీసుకురావడం మరీ కష్టం. స్కూళ్లలో హిందీ బోధించడం తప్ప గత్యంతరం లేదు. ఇదో దుఃస్థితి. తమిళనాడులో కూడా మలయాళం, కన్నడం, తెలుగు టీచర్ల కంటే హిందీ బోధించేవారిని నియమించుకోవడం సులభం.సరికొత్త ప్రచారకర్తఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ‘వాళ్లు ఆర్థిక లాభాలు ఆశించి ఎందుకు తమిళ చిత్రాలను హిందీలోకి డబ్‌ చేస్తు న్నారు?’ అంటూ ఒక తప్పు ప్రశ్న వేస్తున్నారు. దక్షిణాదిన హిందీకి, హిందుత్వకు సరికొత్త ప్రచారకర్తగా మారిన ఈయన డీఎంకేది ‘హిపో క్రసీ’ అని కూడా నిందిస్తున్నారు. ఒక్కమాటలో ఈ ప్రశ్నకు సమా ధానం చెప్పవచ్చు. తమిళనాడు హిందీకి వ్యతిరేకం కాదు. దాని వ్యతిరేకత అంతా హిందీని బలవంతంగా రుద్దడం మీదేఆశ్చర్యం ఏమిటంటే, తమిళనాడులో లక్షల మంది స్వచ్ఛందంగా హిందీ నేర్చుకుంటారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడూ వారిని అడ్డుకోడు. హిందీ తప్ప మరో భాష మాట్లాడని లక్షల మంది ఉత్తర భారతీయలు ఉపాధి కోసం తమిళనాడు రావడం నాణానికి రెండో పార్శ్వం. ఉత్తరప్రదేశ్‌ లేదా బిహార్‌ స్కూళ్లలో తమిళం నేర్చుకోరు. తమిళనాడులో ఉపాధి కోసం తమిళం నేర్చుకోవాలని వారిని ఎవరూ ఒత్తిడి చేయరు. హిందీ మాట్లాడటానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆంక్షా లేదు. అందరూ వారికి అర్థమయ్యేలా చెప్పడానికి వచ్చీరాని హిందీలో ప్రయత్నించి సహకరిస్తారు.చెన్నైలో ఏ రెస్టారెంటుకి వెళ్లినా మీకో దృశ్యం కనబడుతుంది. ఉత్తరాది వెయిటర్, తమిళ కస్టమర్‌ పరస్పరం ఎదుటి వారి భాషలో మాట్లాడుతారు. ఆ సంభాషణ ఎలా ఉన్నా ఆర్డర్‌ చేసిన ఆహారం రాకుండా పోదు. అదే తరహాలో హిందీ, తమిళ సినిమా పరిశ్రమల నడుమ విలసిల్లుతున్న చిరకాల సహకారం పవన్‌ పేర్కొంటున్నట్లు హిపోక్రసీ కాదు. ఆర్థికం కావచ్చు, సామాజిక కారణాలు కావచ్చు... ప్రజలు స్వచ్ఛందంగా చేరువ అవుతారనడానికి ఇదో ఉదాహరణ.దొడ్డిదారినో మరో అడ్డదారినో ఒక భాషను బలవంతంగా రుద్దడం ఎప్పుడూ, ఎక్కడా సుఖాంతం కాలేదు. తమిళనాడు హిందీ వ్యతిరేక ఉద్యమాలు ఈ విషయంలో తగినంత గుణపాఠం నేర్ప లేదు. పొరుగు దేశాల పరిణామాలు దీన్ని రుజువు చేస్తాయి. ఒకే భాష ద్వారా జాతీయ సమైక్యత సాధించాలన్న రాజకీయాలు చావు దెబ్బ తిన్నాయి. పాకిస్తాన్‌ ఇందుకు చక్కటి ఉదాహరణ. 1947లో ఏర్పాటై సంబరాలు జరుపుకొన్న కొద్ది నెలల్లోనే ఉర్దూను జాతీయ భాషగా ప్రకటించింది. ఆనాడే వాస్తవంగా ఆ దేశం తన తూర్పు ప్రాంతాన్ని కోల్పోయింది. ఉర్దూకి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం 1971లో, ఇండియా తోడ్పాటు లభించి, దేశవిభజనతో సమసింది. ‘సింహళ ఒక్కటే’ శాసనంతో... సింహళీయులకు తమిళు లకు నడుమ ఉన్న విభేదాలు ఒక్కసారిగా పతాకస్థాయికి చేరాయి. అదే 30 ఏళ్ల సుదీర్ఘ అంతర్యుద్ధానికి దారితీసింది. డీఎంకే అన్ని అంశాల్లోనూ, ఎన్‌ఈపీతో సహా, కేంద్రంతో సంప్ర దింపుల ధోరణితోనే వ్యవహరిస్తోంది. ‘రూ’ తమిళ అక్షరం వాడిందన్న సాకుతో ఆ పార్టీని ‘వేర్పాటువాది’గా అభివర్ణించడంతో బీజేపీ నైజం వెల్లడైంది. సర్వం కేంద్రం అధీనంలోకి తెచ్చుకోవాలన్న వీరావేశం, తనను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల పట్ల దాని వైఖరి బట్టబయలు అయ్యాయి. చరిత్ర పట్ల ఆ పార్టీ నిర్లక్ష్య భావం కూడా బయటపడింది. ఇదే అన్నిటి కంటే ప్రమాదకరం.-వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ (‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)-నిరుపమా సుబ్రమణియన్‌

Series of earthquakes hit Myanmar and Thailand hard6
పెను ఉత్పాతం

భూమిని గురించి చెబుతూ ప్రఖ్యాత కవి దేవిప్రియ అది ‘మధ్యమధ్యలో మతిభ్రమించే/ మమతానురాగాల మాతృమూర్తి’ అంటారు. సకల సంపదలకూ పుట్టిల్లయిన నేలతల్లి ఎందుకనో ఆగ్రహించింది. శుక్రవారం మధ్యాహ్నం రిక్టర్‌ స్కేల్‌పై 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపాల పరంపర మయన్మార్, థాయ్‌లాండ్‌లను తీవ్రంగా దెబ్బతీయగా... మయన్మార్‌ ఇరుగు పొరుగు నున్న భారత్, చైనాలను భూప్రకంపనలు వణికించాయి. ఈశాన్య భారత్, బెంగాల్, ఢిల్లీ తదితర చోట్ల ప్రకంపనలు కనబడగా, చైనాలో యునాన్, సిచువాన్‌ ప్రాంతాలు దీని బారినపడ్డాయి. ఈ భూప్రళయం ఒక్కసారిగా జనజీవనాన్ని తలకిందులు చేసింది. మృతులెందరన్న లెక్క వెంటనే తేలడం కష్టం. ఎందుకంటే కోటి 70 లక్షల జనాభాగల థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో ఆకాశా న్నంటే భవనాలు చాలా వున్నాయి. వాటిల్లో అనేకం నేలమట్టమయ్యాయి. వేలాదిమంది ఇరుక్కు పోయారు. వర్తక, వాణిజ్య, ఉత్పాదక కార్యకలాపాలు ముమ్మరంగా సాగే వేళ భూకంపం రావటం ప్రాణనష్టాన్ని పెంచివుండొచ్చన్న అంచనాలున్నాయి. మయన్మార్‌లో సైనిక పాలనవల్ల పరిస్థితి తీవ్రత తెలియటం లేదంటున్నారు. అయితే భూకంప కేంద్రం ఆ దేశంలోని రెండో పెద్ద నగరమైన మాండలేకు సమీపంలో వుండటం, భూగర్భంలో 20– 30 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభ వించటాన్నిబట్టి నష్టం ఎక్కువుంటుందన్నది భూభౌతిక శాస్త్రవేత్తల అంచనా. నిరంతర ఘర్షణలతో అట్టుడుకుతున్న ఆ దేశంలో ఇప్పటికే 30 లక్షలమంది కొంపా గోడూ వదిలి అత్యంత దుర్భరమైన స్థితిలో బతుకీడుస్తున్నారు. ఒక్కో పట్టణం ఒక్కో సాయుధ ముఠా గుప్పిట్లో వుంది. ఇవిగాక సైన్యం అడపా దడపా వైమానిక దాడులు చేస్తోంది. ఈ భూకంపం ఆ దేశ జనాభాలో మూడోవంతుమందిని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం వున్నదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ప్రకటించింది. మిగిలిన వైపరీత్యాలు విరుచుకుపడే ముందు ఏదో రకమైన సూచనలందిస్తాయి. జాగ్రత్త పడటానికి కాస్తయినా వ్యవధినిస్తాయి. కానీ భూకంపాలు చెప్పా పెట్టకుండా విరుచుకుపడతాయి. రెప్పపాటులో సర్వం శిథిలాల కుప్పగా మారుతుంది. అపార ప్రాణనష్టం వుంటుంది. తప్పించు కున్నవారిని సైతం తీవ్ర భయోత్పాతం వెన్నాడుతుంది. భూమి లోలోతు పొరల్లో అనునిత్యం మార్పులు సంభవిస్తూనే వుంటాయి. భూభౌతిక శాస్త్రవేత్తలు చెబుతున్నదాన్నిబట్టి భూగర్భం ఏడు పలకలుగా విడివడి వుంటుంది. వీటిల్లో వచ్చే కదలికలూ, అవి తీసుకొచ్చే రాపిడులూ పర్యవసానంగా ఆకస్మికంగా శక్తి విడుదలవుతుంటుంది. ఆ శక్తి తరంగాల రూపంలో భూ ఉపరితలానికి చేరుతుంది. అది భూకంపం రూపంలో వ్యక్తమవుతుంది. భూకంపం మనిషి జ్ఞానాన్ని పరిహసించే ప్రకృతి విపత్తు. ఖగోళంలో మానవుడు సాధించిన ప్రగతి అంతా ఇంతా కాదు. అక్కడ జరిగే పరిశోధనలు అన్నీ ఇన్నీ కాదు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2018లో ప్రయోగించిన పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ నిరుడు డిసెంబర్‌ 24న సూర్యుడి ఉపరితలానికి 60 లక్షల కిలోమీటర్ల దూరంలో పరిభ్రమించింది. ఇది అత్యంత సమీపం వరకూ వెళ్లినట్టు లెక్క. కానీ కాళ్లకింద పరుచుకున్న భూమి లోలోతు పొరల్లో ఏం జరుగుతున్నదో ఆరా తీయటంలో వైఫల్యాలే ఎదురవుతున్నాయి. భూకంపాలపై సాగుతున్న పరిశోధనలు గతంతో పోలిస్తే ఎంతో కొంత ప్రగతి సాధించాయనే చెప్పాలి. ఫలానాచోట భూకంపం రావొచ్చని చెప్ప గలిగే స్థాయి వచ్చింది. కానీ అది నిర్దిష్టంగా ఎప్పుడు, ఎక్కడ వస్తుందో చెప్పటం మటుకు సాధ్యం కావటం లేదు. ఏడెనిమిదేళ్ల క్రితం దక్షిణ కాలిఫోర్నియా, దక్షిణమధ్య అలస్కా ప్రాంతాల్లో చాలా తక్కువస్థాయి ప్రకంపనలు నమోదైనప్పుడు భూ పొరల్లో ఏదో జరుగుతున్నదని, భూకంపం వచ్చే ప్రమాదమున్నదని శాస్త్రవేత్తలు ఊహించారు. ఆ తర్వాత ఉత్పాతం చోటుచేసుకుంది. అయితే సంభావ్యతను 85 శాతం వరకూ ఊహించవచ్చని, నిర్దిష్ట సమయాన్ని చెప్పటం అసాధ్యమనిఅంటున్నారు. ఇందులో చిక్కేమంటే... ముందే చెబితే జనం భయాందోళనల్లో కాలం వెళ్లదీస్తారు. ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆ తర్వాత అంచనాలు తప్పితే అనవసర భయాందోళనలు సృష్టించారని శాస్త్రవేత్తలను తప్పుబడతారు. ప్రకృతిని గౌరవించటం నేర్చుకోనంతవరకూ ఇలాంటి వైపరీత్యాలు తప్పవు. వాతావరణ కాలుష్యం, నానాటికీ పెరుగుతున్న భూతాపం, అడవుల విధ్వంసం, అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా కొండలు తొలిచి రైలు, రోడ్డు మార్గాలు నిర్మించటం, జలవిద్యుత్‌ కేంద్రాల నిర్మాణం వంటివి ప్రకృతిని నాశనం చేస్తున్నాయి. ఇవన్నీ సముద్ర మట్టాలు పెరగటానికీ, వరదలకూ దారితీసి భూమి లోలోపలి పొరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముప్పును వేగవంతం చేస్తున్నాయి. ఎంఐటీ శాస్త్రవేత్తలు జపాన్‌లోని నోటో ద్వీపకల్పంలో సాగించిన పరిశోధనల ఫలితాలు దీన్నే చాటు తున్నాయి. 2020కి ముందు అక్కడ ఒకటీ అరా వచ్చే భూకంపాలు స్వల్పస్థాయిలోవుంటే... ఆ తర్వాతి కాలంలో వాటి సంఖ్య పెరగటంతోపాటు తీవ్రత ఎక్కువ కావటాన్ని వారు గమనించారు. ఇదంతా అక్కడి వాతావరణ మార్పులవల్లేనని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిశోధనలు ప్రభు త్వాల కళ్లు తెరిపించాలి. అభివృద్ధి పేరుతో అమలవుతున్న నమూనాలను మార్చుకోవాలి. అలాగే భూకంపాలు వాటికవే ప్రాణాలు తీయవు. బలహీనమైన కట్టడాలు, బహుళ అంతస్తుల భవనాలు ముప్పునుంచి బయటపడే మార్గాలను మూసేస్తున్నాయి. ఇలాంటి నిర్మాణాలకు అనుమతు లిచ్చేటపుడు ప్రభుత్వాలు ఈ అంశాలను గమనంలోకి తీసుకోవటం అవసరం.

RCB beat Chennai Super Kings by 50 runs7
చెన్నైని గెలిచారు...

ఎప్పుడో 2008లో తొలి ఐపీఎల్‌లో చెపాక్‌ మైదానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు గెలిచింది. ఆ తర్వాత ఈ మైదానంలో తలపడిన ఎనిమిది మ్యాచుల్లోనూ చెన్నై చేతిలో ఓటమిపాలైంది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఎట్టకేలకు చెన్నై గడ్డపై సీఎస్‌కేపై ఆర్‌సీబీ పైచేయి సాధించింది. ముందుగా బ్యాటింగ్‌లో మెరుగైన స్కోరు సాధించిన బెంగళూరు, ఆపై పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని పూర్తిగా కట్టిపడేసింది. స్పిన్నర్ల రాజ్యం సాగే నెమ్మదైన తన సొంత మైదానంలో చెన్నై జట్టు ప్రభావం చూపించ లేకపోగా...స్ఫూర్తిదాయక బౌలింగ్‌ ప్రదర్శనతో ఆర్‌సీబీ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. చెన్నై: ఐపీఎల్‌ సీజన్‌లో బెంగళూరు వరుసగా రెండు ప్రత్యర్థి వేదికలపై వరుస విజయాలు అందుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 50 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రజత్‌ పాటీదార్‌ (32 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా...ఫిల్‌ సాల్ట్‌ (16 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లి (30 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులకే పరిమితమైంది. రచిన్‌ రవీంద్ర (31 బంతుల్లో 41; 5 ఫోర్లు), ఎమ్మెస్‌ ధోని (16 బంతుల్లో 30 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. పాటీదార్‌ అర్ధ సెంచరీ... ఓపెనర్‌ సాల్ట్‌ దూకుడుగా ఇన్నింగ్స్‌ ప్రారంభించగా, మరో ఎండ్‌లో కోహ్లి మాత్రం కాస్త తడబడ్డాడు. తన స్థాయికి తగినట్లుగా వేగంగా ఆడలేకపోయాడు. ఖలీల్‌ వేసిన తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన సాల్ట్‌...అశి్వన్‌ వేసిన తర్వాత ఓవర్లో సిక్స్, 2 ఫోర్లు బాదాడు. అయితే ధోని అద్భుత స్టంపింగ్‌కు సాల్ట్‌ వెనుదిరగ్గా, దేవ్‌దత్‌ పడిక్కల్‌ (14 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజ్‌లో ఉన్నంత సేపు ధాటిని ప్రదర్శించాడు.జడేజా ఓవర్లోనే అతను 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టాడు. ఎట్టకేలకు పతిరణ ఓవర్లో కోహ్లి వరుసగా సిక్స్, ఫోర్‌ కొట్టినా...నూర్‌ బౌలింగ్‌లో అవుటై నిరాశగానే వెనుదిరిగాడు. మరో వైపు జడేజా ఓవర్లో సిక్స్, 2 ఫోర్లతో పాటీదార్‌ తన జోరును కొనసాగించాడు. ఈ క్రమంలో 30 బంతుల్లో అతని హాఫ్‌ సెంచరీ పూర్తయింది. ఇలాంటి స్థితిలో ఐదు పరుగుల వ్యవధిలో జితేశ్‌ శర్మ (12), పాటీదార్, కృనాల్‌ పాండ్యా (0) వికెట్లు తీసి బెంగళూరును కొద్ది సేపు చెన్నై నిలువరించగలిగింది. అయితే స్యామ్‌ కరన్‌ వేసిన ఆఖరి ఓవర్లో టిమ్‌ డేవిడ్‌ (8 బంతుల్లో 22 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) వరుసగా మూడు సిక్సర్లు బాది స్కోరును 200కు చేరువగా తీసుకొచ్చాడు. సమష్టి వైఫల్యం... ఛేదనలో చెన్నై తీవ్రంగా ఇబ్బంది పడింది. రచిన్‌ కొన్ని చక్కటి షాట్లు ఆడటం మినహా ఒక్క బ్యాటర్‌ కూడా కనీస ప్రదర్శన ఇవ్వలేదు. చెప్పుకోదగ్గ భాగస్వామ్యం కూడా లేకుండా తక్కువ వ్యవధిలో సీఎస్‌కే వరుసగా వికెట్లు కోల్పోయింది. ఒకే స్కోరు వద్ద రాహుల్‌ త్రిపాఠి (5), రుతురాజ్‌ గైక్వాడ్‌ (0) వెనుదిరగ్గా, దీపక్‌ హుడా (4), స్యామ్‌ కరన్‌ (8) పూర్తిగా విఫలమయ్యారు. శివమ్‌ దూబే (15 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్‌), రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఆర్‌సీబీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ చెన్నైపై ఒత్తిడిని కొనసాగించారు. ఆరంభంలో పవర్‌ప్లే ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 30 పరుగులు మాత్రమే చేసిన చెన్నై ఆ తర్వాత కోలుకోలేకపోయింది. ఆఖర్లో 28 బంతుల్లో 98 పరుగులు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన ధోని అభిమానులను అలరించే కొన్ని షాట్లు కొట్టడం మినహా అవి జట్టుకు ఏమాత్రం ఉపయోగపడలేదు. కృనాల్‌ వేసిన చివరి ఓవర్లో ధోని 2 సిక్స్‌లు, ఫోర్‌ కొట్టడానికి చాలా ముందే ఓటమి ఖాయమైపోయింది! స్కోరు వివరాలు: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (స్టంప్డ్‌) ధోని (బి) నూర్‌ 32; కోహ్లి (సి) రచిన్‌ (బి) నూర్‌ 31; పడిక్కల్‌ (సి) గైక్వాడ్‌ (బి) అశ్విన్‌ 27; పాటీదార్‌ (సి) కరన్‌ (బి) పతిరణ 51; లివింగ్‌స్టోన్‌ (బి) నూర్‌ 10; జితేశ్‌ (సి) జడేజా (బి) అహ్మద్‌ 12; డేవిడ్‌ (నాటౌట్‌) 22; కృనాల్‌ (సి) హుడా (బి) పతిరణ 0; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–45, 2–76, 3–117, 4–145, 5–172, 6–176, 7–177. బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 4–0–28–1, రవిచంద్రన్‌ అశ్విన్‌ 2–0–22–1, స్యామ్‌ కరన్‌ 3–0–34–0, నూర్‌ అహ్మద్‌ 4–0–36–3, రవీంద్ర జడేజా 3–0–37–0, పతిరణ 4–0–36–2. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రచిన్‌ రవీంద్ర (బి) దయాళ్‌ 41; త్రిపాఠి (సి) సాల్ట్‌ (బి) హాజల్‌వుడ్‌ 5; గైక్వాడ్‌ (సి) (సబ్‌) భాందగే (బి) హాజల్‌వుడ్‌ 0; హుడా (సి) జితేశ్‌ (బి) భువనేశ్వర్‌ 4; స్యామ్‌ కరన్‌ (సి) కృనాల్‌ (బి) లివింగ్‌స్టోన్‌ 8; శివమ్‌ దూబే (బి) దయాళ్‌ 19; జడేజా (సి) సాల్ట్‌ (బి) హాజల్‌వుడ్‌ 25; అశ్విన్‌ (సి) సాల్ట్‌ (బి) లివింగ్‌స్టోన్‌ 11; ధోని (నాటౌట్‌) 30; నూర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–8, 2–8, 3–26, 4–52, 5–75, 6–80, 7–99, 8–130. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3–0–20–1, హాజల్‌వుడ్‌ 4–0–21–3, యశ్‌ దయాళ్‌ 3–0–18–2, లివింగ్‌స్టోన్‌ 4–0–28–2, సుయాశ్‌ శర్మ 4–0–32–0, కృనాల్‌ పాండ్యా 2–0–26–0. ఐపీఎల్‌లో నేడుగుజరాత్‌ X ముంబైవేదిక: అహ్మదాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Local body by elections postponed again due to TDP leaders activities8
అదే దౌర్జన్యం.. అడుగడుగునా బెదిరింపుల పర్వం

సాక్షి, పుట్టపర్తి/సాక్షి, భీమవరం/నరసరావుపేట రూరల్‌/కారంపూడి/ప్రొద్దుటూరు: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అధికార కూటమి నేతలు బెదిరింపులు, దౌర్జన్యాలు, అడ్డగింతలను నమ్ముకునే ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు, హెచ్చరి­కలు, గొడవల కారణంగా గురువారం ఏడు చోట్ల వాయిదా పడిన ఎన్నికలు... శుక్రవారం కూడా వాయిదా పడ్డాయి. అధికార పార్టీ నేతల నిర్వాకంతో ఉమ్మడి అనంతపురం జిల్లా గాండ్లపెంట, రామగిరి, పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి, యలమంచిలిలో ఎంపీపీ, పల్నాడు జిల్లా నరసరావుపేట, కారంపూడిలో వైస్‌ ఎంపీపీ, వైఎస్సార్‌ జిల్లా గోపవరంలో ఉప సర్పంచ్‌ పదవులకు శుక్రవారం ఎన్నిక నిర్వహించలేకపో­యారు.గురువారం రాష్ట్రవ్యాప్తంగా 50 చోట్ల జరిగిన ‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 40 స్థానాల్లో (ఒక రెబల్‌తో కలిపి) తన హవాను చాటుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాయిదా పడిన ఏడు చోట్ల శుక్రవారం ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు ఎన్నిక నిర్వహించే కార్యాలయం వద్దకు రాకుండా ఎక్కడికక్కడ టీడీపీ నేతలు అడ్డుకున్నారు. పోలీ­సులు ఇందుకు వారికి సహకరించారు. వాస్తవానికి కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే తిరిగి నిర్వహిస్తున్న నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టంగా ఎన్నికలు సాగాల్సి ఉంది. అయితే ఈ స్థానాలు కూడా వైఎస్సార్‌సీపీ వశమైతే ప్రజల్లో కూటమి పట్ల వ్యతి­రేకత మరింత ప్రబలుతుందని అధికార పార్టీ పెద్దలు బెంబేలెత్తిపోయారు. అడ్డుకో­వా­లంటూ స్థానిక నేతలకు కనుసైగ చేశారు. దీంతో శుక్రవారం కూడా ఉప ఎన్నికలు నిర్వహించలేకపోయారు. టీడీపీ నేతల దౌర్జన్యకాండ..టీడీపీ నేతల దాష్టీకంతో శ్రీసత్యసాయి జిల్లాలోని రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలు తిరిగి వాయిదా పడ్డాయి. నిర్ణీత సమయంలోగా మూడింట రెండు వంతుల సభ్యులు హాజరు కాకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలంలో ఏడుగురు సభ్యులకు గాను ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. రామగిరిలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు రెండు రోజులుగా టీడీపీ నేతల దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రక­టిం­చారు. దీంతో రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అధికా­రులు ప్రకటించారు. ఎన్నిక సజావుగా జరిగితే వైఎస్సార్‌సీపీకి ఎంపీపీ పదవులు దక్కుతా­యని భావించి గాండ్లపెంటలో టీడీపీ కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, రామగిరిలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తన­యుడు శ్రీరామ్‌ ఎన్నిక జరగకుండా గురువా­రం ఆటంకాలు సృష్టించిన విషయం తెలిసిందే.ఉప ఎన్నికల వాయిదా.. ఎంపీపీ: 4 వైస్‌ ఎంపీపీ: 2 ఉప సర్పంచ్‌: 1 మొత్తం: 7 పశ్చిమలో కూటమి అధికార మదంపశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్‌సీపీకి ఏకపక్షం కావాల్సిన అత్తిలి, యలమంచిలి ఎంపీపీ ఎన్నికలను రెండో రోజైన శుక్రవారం కూడా కూటమి నేతలు తమ అధికార మదాన్ని చూపించి అడ్డుకున్నారు. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు, అత్తిలిలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెరవెనుక నుంచి తంతు నడిపించారు. సమావేశం ఉందని చెప్పి మండలంలోని ఉపాధి హామీ పథకం కూలీలు, డ్వాక్రా మహిళలను అత్తిలికి తరలించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇంటి వద్ద మహిళలను మోహరించారు. ఒక్కొక్కరికి రూ.500 నగదు, బిర్యానీ ప్యాకెట్‌ ఇస్తామని చెప్పి ఉంచారు. కొందరు టీడీపీ కార్యకర్తలు కారుమూరి నివాసం చుట్టూ మోటారు సైకిళ్లపై హల్‌చల్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులను కవ్వించే ప్రయత్నాలు చేశారు. 13 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులు గురువారం రాత్రి రహస్య ప్రదేశంలో ఉండిపోయారు. శుక్రవారం ఉదయం మండల పరిషత్‌ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల్లో పాల్గొనా­లని భావించారు. అయితే ఎంత ప్రయ­త్నించినా వైఎస్సార్‌సీపీ సభ్యులు ఎక్కడున్నదీ తెలియకపోవడంతో ఏ రోడ్డు నుంచైనా వచ్చే­స్తారని ఉదయం నుంచి అత్తిలి గ్రామానికి వచ్చే రోడ్లన్నింటినీ కూటమి నేతలు దిగ్బంధించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామానికి వచ్చే బస్సులు, ఆటోలు, ఇతర అన్ని వాహనాలను తనిఖీ చేసి వైఎస్సార్‌సీపీ సభ్యులు లేరని నిర్ధారించుకున్న తర్వాతే వదిలారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు కూటమి మూకలు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు చేష్టలుడిగి చూడటం గమనార్హం. ఈ నేపథ్యంలో తమ సభ్యులను పోలీసు రక్షణతో ఎన్నికలకు హాజరు పర్చేందుకు మాజీ మంత్రి కారుమూరి పోలీస్‌ అధికారులను ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా వేసినట్టు అధికారులు ప్రకటించారు.పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల నిర్వాకంపల్నాడు జిల్లా నరసరావు­పేట, కారంపూడి మండల పరిషత్‌ ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక రెండోసారీ వాయిదా పడింది. టీడీపీ నేతల దౌర్జన్యం కారణంగా కోరం లేకపోవడంతో ఈ రెండు చోట్ల ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. నరసరావుపేటలో కేవ­లం నలుగురు ఎంపీటీసీ సభ్యులు, కారంపూడిలో ఒకే ఒక్కరు హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు రాకుండా టీడీపీ నేతలు ఎక్కడికక్కడ భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించారు. దీంతో కోరం లేదన్న విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబుకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించి ఎన్నికను వాయిదా వేశారు. తదుపరి ఎన్నికల తేదీని తర్వాత ప్రకటిస్తారని అధికారులు తెలిపారు. బలం లేకపోయినా సరికొత్త నాటకంపశ్చిమగోదావరి జిల్లా యలమంచిలిలో ఎన్నిక ప్రారంభానికి ముందే కూటమి నాయ­కులు నాటకీయ పరిణా­మాలకు తెరలేపారు. గుంపర్రు ఎంపీటీసీ సభ్యురాలు కంభాల సత్యశ్రీ కనిపించడం లేదని ఆమె కుమార్తె ఫిర్యాదు చేసిందంటూ పోలీసులు వచ్చి సత్యశ్రీని స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడ కూటమి నాయకులు ఆమె కుమార్తె ద్వారా సత్యశ్రీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. తాను ప్రాణం పోయినా వైఎస్సార్‌సీపీని వీడేది లేదని ఆమె స్పష్టం చేయడంతో పోలీసులు తిరిగి ఆమెను మండల పరిషత్‌ కార్యాలయా­నికి తీసుకు వచ్చి దించడం గమనార్హం.అనంతరం నిర్ణీత సమ­యానికి మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నికకు వైఎస్సార్‌సీపీ నుంచి 12 మంది, కూటమికి చెందిన నలుగురు సభ్యులు హాజ­రయ్యారు. అటెండెన్స్‌ ప్రక్రియ పూర్త­య్యాక కూటమి సభ్యులు లేచి తమను వైఎస్సార్‌సీపీ సభ్యులు భయభ్రాంతులకు గురి­చే­స్తున్నారని, ఎన్నిక ఏ విధంగా జరిపిస్తారంటూ వాగ్వాదానికి దిగారు. సంగతి తేల్చాలంటూ ఘర్షణ వాతావరణం, గందరగోళ పరిస్థితులు సృష్టించారు. ఈ నేపథ్యంలో తనకు గుండెల్లో దడగా ఉందంటూ రిటర్నింగ్‌ అధి­కారి ఎం.శ్రీనివాస్‌ బయటకు వెళ్లిపో­యారు. శాంతిభద్రతల దృష్ట్యా ఎన్నిక నిర్వహించడానికి సరైన వాతావరణం లేనందున వాయిదా వేస్తున్నట్టు ఎంపీడీఓ ఎ.ప్రేమా­న్విత్‌ ప్రకటించారు. తమకు పూర్తి సంఖ్యాబలం ఉండగా కూటమి సభ్యులను భయపెట్టాల్సిన అవసరం ఏముందని వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రశ్నించినా వారు స్పందించలేదు. వాళ్లలో వాళ్లే గొడవ పడుతూ హైడ్రామావైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులపై దౌర్జన్యం, దాడులకు దిగటంతో ఎన్నిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో రోజైన శుక్రవారం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో టీడీపీ సభ్యులు హైడ్రామాకు తెర తీశారు. ఎన్నికల కార్యాలయంలో.. పథకం ప్రకారం టీడీపీకి చెందిన 7వ వార్డు సభ్యురాలు కాచన రామలక్షుమ్మ, ఉప సర్పంచ్‌ అభ్యర్థి మండ్ల రమాదేవి వాగ్వాదానికి దిగారు.ఒకరినొకరు ద్వేషించుకున్నారు. వీరు గొడవ పడుతుండగానే 8వ వార్డు సభ్యురాలు గాయత్రి ఎన్నికల అధికారి వద్ద ఉన్న మినిట్స్‌ బుక్‌ను లాక్కొని చించేశారు. ఈ సందర్భంగా 5వ వార్డు సభ్యుడు ఆదినారాయణరెడ్డి కుర్చీలు విసిరేశాడు. టీడీపీ సభ్యులైన వీరంతా కలిసి పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చేశారు. ఇంతలోనే ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి తనకు గుండెపోటు వచ్చిందని కుర్చీలో కూర్చుండిపోయారు. అంబులెన్స్‌ను పిలిపించి ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. దీంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కాగా, స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆదేశాల మేరకే ఇక్కడ ఈ హైడ్రామా చోటుచేసుకుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Huge earthquake topples buildings in Myanmar, Thailand9
పేక మేడల్లా కుప్పకూలాయి

భారీ భూకంపం థాయ్‌లాండ్, మయన్మార్‌లను అతలాకుతలం చేసింది. 7.7 తీవ్రతతో మయన్మార్‌లో సంభవించిన ప్రకంపనల ధాటికి ఇరు దేశాల్లో అపార ఆస్తి నష్టం సంభవించింది. భారీ భవనాలు కుప్పకూలాయి. నిర్మాణాలన్నీ పగుళ్లిచ్చాయి. మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విధ్వంస తీవ్రత దృష్ట్యా ప్రాణ నష్టమూ భారీగానే ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇప్పటిదాకా మయన్మార్‌లో 180 మందికి పైగా మరణించగా 750 మందికి పైగా గాయపడ్డారు. బ్యాంకాక్‌లో 10 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న మయన్మార్‌లో సహాయక, పునరావాస చర్యలు సవాలుగా మారాయి. బ్యాంకాక్‌/కోల్‌కతా: ప్రకృతి ప్రకోపానికి థాయ్‌లాండ్, మయన్మార్‌ చిగురుటాకుల్లా వణికిపోయాయి. శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇరు దేశాల్లోనూ భారీ విధ్వంసం మిగిల్చింది. కాసేపటికే 6.4 తీవ్రతతో మరోసారి భూమి కంపించగా తర్వాత కూడా మరో నాలుగైదు ప్రకంపనాలు వణికించాయి. భారీ భవనాలు కళ్లముందే పేకమేడల్లా కుప్పకూలాయి. పురాతన బ్రిడ్జిలు నేలమట్టమయ్యాయి. మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. చాలాచోట్ల విద్యుత్‌ సరఫరా లైన్లు తదితరాలు దెబ్బతిన్నాయి. ఇరుదేశాల్లో ఇప్పటిదాకా 200 మందికి పైగా మరణించారు. మయన్మార్‌లోనే 180 మందికి పైగా మరణించారు. 750 మందికి పైగా గాయపడ్డారని సైనిక ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ సమాజం తక్షణం ఆదుకోవాలని కోరింది. భవనాల శిథిలాల కింద చాలామంది చిక్కుకోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగేలా ఉంది. మయన్మార్‌ రాజధాని నేపిడాలో వెయ్యి పడకల ఆస్పత్రి కుప్పకూలింది. అందులో అత్యధికులు మరణించి ఉంటారంటున్నారు. భూకంప కేంద్రాన్ని సెంట్రల్‌ మయన్మార్‌లో రెండో అతి పెద్ద నగరమైన మాండలేకు సమీపంలో మొన్య్‌వా సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. కేవలం 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించడంతో ప్రమాద తీవ్రత చాలా పెరిగింది. థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో భారీ భవనాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. చటూచాక్‌ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 33 అంతస్తుల భారీ భవంతి నేలమట్టమైంది. దానికింద కనీసం 90 మందికి పైగా చిక్కుకున్నట్టు తెలుస్తోంది. భూకంప తీవ్రతకు భవనాలు అటూ ఇటూ ఊగిపోతున్న దృశ్యాలు, అత్యంత ఎత్తైన ఓ భవనం తాలూకు పై అంతస్తులోని స్విమింగ్‌పూల్‌ నుంచి నీళ్లన్నీ కిందకు పడుతున్న వీడియోలు వైరల్‌గా మారాయి. ఒకట్రెండు రోజుల్లో మరిన్ని భూకంపాలు తప్పకపోవచ్చన్న హెచ్చరికలు వణికిస్తున్నాయి. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న మయన్మార్‌లో సహాయక, పునరావాస చర్యలు సవాలుగా మారాయి. ఆరు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించారు. బ్యాంకాక్‌లోనూ ఎమర్జెన్సీ ప్రకటించారు. రెండేళ్ల క్రితం తుర్కియేలో 50 వేల మందికి పైగా భూకంపానికి బలవడం తెలిసిందే. ఆ తర్వాత అతి తీవ్ర భూకంపం ఇదే. మయన్మార్‌లో... సైనిక పాలనలో మగ్గుతున్న మయన్మార్‌లో 1946 తర్వాత ఇదే అతి తీవ్రమైన భూకంపం. నేపిడాలో రాజప్రసాదాలు, భవనాలు దెబ్బ తిన్నాయి. ఎక్కడ చూసినా రోడ్లు చీలిపోయి కన్పిస్తున్నాయి. ఐకానిక్‌ వంతెన, ఆలయాలు తదితరాలు కుప్పకూలాయి. ఇప్పటిదాకా 90 మందికి పైగా మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రుల సంఖ్య క్షణక్షణానికీ పెరుగుతోంది. చాలామందికి తీవ్ర గాయాలు కావడంతో రక్తానికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. మాండలేలో మసీదు కూలి 20 మంది మరణించారు. నగరానికి ఆగ్నేయాన సగాయింగ్‌ ప్రాంతంలో 90 ఏళ్ల నాటి బ్రిడ్జి కుప్పకూలింది. మా సో యానే బౌద్ధారామం కూడా నేలమట్టమైంది. మృతులు భారీగా పెరగవచ్చని సైనిక నియంత జనరల్‌ మిన్‌ ఆంగ్‌ లయాంగ్‌ చెప్పారు. థాయ్‌లాండ్‌లో... భూకంపం ధాటికి ఇళ్లు, కార్యాలయాల నుంచి జనం ఉన్నపళంగా పరిగెత్తుకొచ్చారు. భవనాలు కళ్లముందే కుప్పకూలుతుంటే నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. బ్యాంకాక్‌లోని 1.7 కోట్ల జనాభాలో అత్యధికులు భారీ అపార్ట్‌మెంట్లలోనే నివసిస్తారు. భూకంపం దెబ్బకు భయాందోళనలకు లోనై కార్లు, ఇతర వాహనాల్లో రోడ్లెక్కడంతో తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌ చోటుచేసుకుంది. ర్యాపిడ్‌ ట్రాన్సిల్, సబ్‌వే వ్యవస్థలను తాత్కాలికంగా మూసేయడంతో భారీ జననష్టం తప్పింది. నగరం మొత్తాన్నీ ప్రమాద ప్రాంతంగా పేర్కొన్నారు. కుప్పకూలిన నిర్మాణంలోని భవన శిథిలాలు ఏ క్షణమైనా పూర్తిగా పడిపోయేలా కన్పిస్తున్నాయి. దాంతో శిథిలాల కింద చిక్కిన వారికోసం పోలీసు శునకాలతో వెదుకుతున్నారు. ఆ ప్రాంతాన్ని ప్రధాని షినవత్రా సందర్శించారు. భద్రత దృష్ట్యా ప్రతి భవనాన్నీ క్షుణ్నంగా తనిఖీ చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అత్యవసర కేబినెట్‌ సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. బ్యాంకాక్‌లో 10 మందికి పైగా మరణించినట్టు ధ్రువీకరించారు. చాలా భవనాలకు పగుళ్లు రావడంతో లోనికి వెళ్లేందుకు జనం జంకుతున్నారు.హృదయ విదారకం మయన్మార్, థాయ్‌లాండ్‌ల్లో భూకంప దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. పలుచోట్ల కుప్పకూలిన భవనాలు, నిర్మాణాల కింద చిక్కినవారు హాహాకారాలు చేస్తున్నారు. శిథిలాల నడుమ తమవారి కోసం కన్నీటి మధ్యే జనం వెదుక్కుంటున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.అన్నివిధాలా సాయం: మోదీ న్యూఢిల్లీ: భూకంప విపత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘జరిగిన ఘోరం చూసి చలించిపోయా. బాధితుల క్షేమం కోసం ప్రారి్థస్తున్నా. థాయ్‌లాండ్, మయన్మార్‌లకు అన్నివిధాలా సాయం అందించేందుకు భారత్‌ పూర్తిగా సిద్ధంగా ఉంది’’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. రెండు దేశాలకూ భారత్‌ సహాయ తదితర సామగ్రి పంపుతోంది. థాయ్‌లాండ్‌లోని భారతీయుల కోసం బ్యాంకాక్‌లో భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్‌ (+66 618819218) ఏర్పాటు చేసింది. భూకంప మృతుల్లో భారతీయులెవరూ లేరని పేర్కొంది. బ్యాంకాక్‌లో ఏప్రిల్‌ 4న బిమ్స్‌టెక్‌ ప్రాంతీయ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భూటాన్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్‌ అధినేతలు భేటీలో పాల్గొంటారు. సగాయింగ్‌ ‘ఫాల్ట్‌’ వల్లే... టిబెట్‌ పీఠభూమి ప్రాంతంలో సంక్లిష్టమైన టెక్టానిక్‌ ఫలకాలపై ఉన్నందున మయన్మార్‌కు భూకంప ముప్పు ఎక్కువే. ఇక్కడ హెచ్చు తీవ్రతతో కూడిన భూకంపాలు పరిపాటి. భూమి పై పొరలోని ఇండో, బర్మా టెక్టానిక్‌ ఫలకాలు సమాంతరంగా కదలడమే తాజా భూకంపానికి కారణమని సైంటిస్టులు తేల్చారు. భూ ఫలకాల అంచులను ఫాల్ట్‌గా పిలుస్తారు. లక్షలాది ఏళ్ల కింద భారత ఉపఖండం ఆసియాను ఢీకొట్టడం వల్ల ఏర్పడ్డ సాగయింగ్‌ ఫాల్ట్‌గా పిలిచే పగుళ్ల వెంబడే తాజా భూకంపం చోటుచేసుకుంది. ఇక్కడ టెక్టానిక్‌ ఫలకాలు ఏటా 0.7 అంగుళాల చొప్పున పరస్పర వ్యతిరేక దిశలో కదులుతున్నాయి. ఫలితంగా పుట్టుకొచ్చే ఒత్తిడి భూకంపాలుగా మారుతుంటుంది. ఇక్కడ దశాబ్దానికి ఒక్క భారీ భూంకంపమన్నా నమోదవుతుంటుంది. మయన్మార్‌లో గత వందేళ్లలో 6కు మించిన తీవ్రతతో 14కు పైగా భూకంపాలు నమోదయ్యాయి. 1946లో 7.7, 1956లో 7.1 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. 1988 నాటి భూకంపానికి వేలాది మంది బలయ్యారు. 2011, 2016ల్లో కూడా 6.9 తీవ్రతతో భూకంపాలొచ్చాయి. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న మయన్మార్‌ పాలిట ఈ విపత్తు గోరుచుట్టుపై రోకటిపోటుగా మారింది.కోల్‌కతా నుంచి ఈశాన్యం దాకా...భూకంపం తాలూకు ప్రకంపనలు భారత్‌లోనూ కన్పించాయి. కోల్‌కతాతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో శుక్రవారం మధ్యాహ్నం భూమి 2.5 తీవ్రతతో స్వల్పంగా కంపించింది. ఎక్కడా ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు. వాయవ్య చైనాలోని యునాన్, సీచుయాన్‌ ప్రావిన్సుల్లో కూడా భారీ ప్రకంపనలు నమోదయ్యాయి. మాంగ్షీ తదితర నగరాల్లో భూకంప తీవ్రత హెచ్చుగా ఉంది. ఇల్లు, నిర్మాణాలు బాగా దెబ్బతిన్నాయి.బతుకుతామనుకోలేదుభూకంపం నుంచి ప్రాణాలతో బయట పడతామనుకోలేదు. మేమంతా ఆఫీసులో ఉండగా అలజడి రేగింది. భూకంపమంటూ అరుపులు విన్పించడంతో వెంటనే బయటికి పరుగెత్తుకెళ్లాం. నిర్మాణంలోని భారీ భవనాలు కూలిపోయాయి. ఇళ్లు పగుళ్లివ్వడంతో వాటిని ఖాళీ చేయించి జనాన్ని పార్కులు, ఖాళీ స్థలాల్లోకి పంపుతున్నారు. మేం యూనివర్సిటీ క్యాంపస్‌లో తలదాచుకున్నాం.– ‘సాక్షి’తో ఫోన్‌లో బ్యాంకాక్‌ తెలుగు అసోసియేషన్‌ ప్రతినిధి రమేశ్‌చాలామంది చనిపోయారు బ్యాంకాక్‌లో ఇంతటి భూకంపం ఎన్నడూ చూడలేదు. 40, 50 అంతస్తులున్న నాలుగైదు భవనాలు కూలిపోయాయి. వాటిలోని చాలామంది చనిపోయే ఉంటారు. భారత పర్యాటకులు బస చేసే ప్రాంతాల్లో విధ్వంస తీవ్రత ఎక్కువగా ఉంది. తెలుగు వారందరినీ గ్రూపుల్లో అప్రమత్తం చేస్తున్నాం.– వెంకటేశ్‌ యాదవ్,బ్యాంకాక్‌లోని ఆంధ్రా రెస్టారెంట్‌ ఎండీ

Abnormal decline in campus selections across all 23 IITs in the country10
ఐఐటియన్‌లకు అందని జాబ్‌!

సాక్షి, అమరావతి: దేశంలోని ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యా సంస్థలైన ఇండియన్‌ ఇన్‌స్టి­ట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో అసాధారణ క్షీణత కనిపిస్తోంది. కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే సగానికి పైగా ఐఐటీల్లో సగటున 10% మేర తగ్గుదల నమో­దవడం గమనార్హం. తొలి తరం ఐఐటీల్లో ఒక­టైన ఐఐటీ–ఖరగ్‌పూర్‌లో మాత్రమే స్వ­ల్పంగా 2.28% తగ్గుదల కనిపించింది. మిగిలిన అన్నింటిలోనూ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల పరిస్థితి దారు­ణంగా ఉంది. మొత్తం 23 ఐఐటీలు ఉండగా.. చాలా ఐఐటీల్లో 2022–23లో మొదలైన తగ్గుదల... 2023–24లోనూ కొనసాగింది. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లోనూ ప్లేస్‌మెంట్ల క్షీణతపై పార్లమెంట్‌ స్టాడింగ్‌ కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది. దీనిని అసాధారణ తగ్గుదలగా గుర్తించింది. దేశంలో విద్యపై ఖర్చు భూటాన్, మాల్దీవుల కంటే తక్కువగా ఉందని అభిప్రాయపడింది. తొలి తరం ఐఐటీల్లోనూ ఎదురుగాలే..» తొలి తరం ఐఐటీల్లోనూ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల తగ్గుదల నమోదవుతోంది. ప్లేస్‌మెంట్ల కోసం నమోదు చేసుకునేవారు తగ్గుతుంటే.. అందులోనూ ఉద్యోగాలు పొందేవారు మరింత తగ్గిపోతున్నారు.» తాజా గణాంకాల ప్రకారం ఐఐటీ రూర్కీలో ప్లేస్‌మెంట్లు గణనీయంగా పడిపోయాయి. 2021–22లో 98.54 శాతం ఉన్న ప్లేస్‌మెంట్లు... 2023–24కు వచ్చేసరికి 79.66 శాతానికి తగ్గాయి. అంటే ఏకంగా 18.88 శాతం తగ్గిపోయాయి. ఐఐటీ ఢిల్లీలో 15 శాతం, ఐఐటీ బొంబాయిలో 12.72 శాతం మేర క్షీణత నమోదైంది. ఐఐటీ మద్రాస్‌లో 12.42 శాతం, ఐఐటీ కాన్పూర్‌లో 11.15 శాతం ప్లేస్‌మెంట్లు పడిపోయాయి.» ఐఐటీ భువనేశ్వర్‌లో 2021–22తో పోలిస్తే 2022–23లో ప్లేస్‌మెంట్లు మెరుగైనప్పటికీ.. 2023–24లో మాత్రం 7.58 శాతం తగ్గుదల నమోదైంది. » రెండో తరం ఐఐటీల్లోనూ పరిస్థితి చెప్పుకోతగ్గట్టు లేదు. 2008–09 మధ్య స్థాపించిన ఐఐటీల్లో హైదరాబాద్‌ అత్యంత ఎక్కువ క్షీణతను (17.17 శాతం) నమోదు చేసింది. ఆ తర్వాత స్థానాల్లో ఐఐటీ మండీ (14.1శాతం), రోపర్‌ (13.15శాతం), ఇండోర్‌ (11.03శాతం) ఉన్నాయి. » ఇక 2015–16 మధ్య స్థాపించిన మూడో తరం ఐఐటీల్లోనూ ప్లేస్‌మెంట్ల పరిస్థితి ఏమీ బాగాలేదు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2023–24లో ఐఐటీ జమ్మూలో 21.83 శాతం ప్లేస్‌మెంట్లు తగ్గిపోయాయి.ఆర్థిక మందగమనం ఓ కారణం..కోవిడ్‌ తర్వాత కూడా ఐఐటీల్లో క్యాంపస్‌ నియామకాలు ఆశాజనకంగానే ఉన్నాయి. కానీ, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగనమనం కారణంగా రెండేళ్లుగా ప్లేస్‌మెంట్‌లపై ప్రభావం పడుతోందని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు ఉన్నత విద్య వైపు వెళ్లడం, స్టార్టప్‌లపై దృష్టి సారించడం వంటి కారణాల వల్ల కూడా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు తగ్గుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. క్యాంపస్‌ కొలువులు మార్కెట్‌ ట్రెండ్‌లపై ఆధారపడి ఉన్నప్పటికీ, విభాగాల వారీగా కొత్త మార్గాలను కనుగొని తదనుగుణంగా ఉపాధి పొందే అవకాశాలను పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని సూచిస్తున్నారు. గత సంవత్సరం చాలా ఐఐటీలు తమ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు వెల్లడించలేదు. అయితే, సెప్టెంబర్‌లో ఐఐటీ బొంబాయి విడుదల చేసిన నివేదిక ప్రకారం... గత పరిస్థితులతో పోలిస్తే తక్కువ మంది విద్యార్థులు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు పొందారని, ఇందులోనూ అత్యల్ప ప్యాకేజీ ఏడాదికి రూ.4లక్షలకు పడిపోయిందని పేర్కొంది. దీనిని బట్టి చూస్తే ఉద్యోగ మార్కెట్‌లో ఆందోళనకర మార్పు కనిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఐఐటీల్లో ప్లేస్‌మెంట్స్‌ శాతంలో తగ్గుదల ఇలా...ఐఐటీ 2021–22 2023–24ఖరగ్‌పూర్‌ 86.79 83.91బొంబాయి 96.11 83.39మద్రాస్‌ 85.71 73.29కాన్పూర్‌ 93.63 82.48ఢిల్లీ 87.69 72.81గౌహతి 89.77 79.10రూర్కీ 98.54 79.66వారణాసి 83.15 88.04ధన్‌బాద్‌ 87.89 75.38గాంధీనగర్‌ 91.85 82.39భువనేశ్వర్‌ 94.78 86.07హైదరాబాద్‌ 86.52 69.33జోద్‌పూర్‌ 96.59 92.98రోపర్‌ 88.49 75.34పాట్నా 97.65 90.03ఇండోర్‌ 96.74 85.71మండీ 98.13 84.03పాలక్కాడ్‌ 97.27 82.03తిరుపతి 94.57 86.57జమ్మూ 92.08 70.25భిలాయ్‌ 89.92 72.22గోవా 98.65 92.73ధార్వాడ్‌ 90.20 65.56––––––––––––––––––––––––––––– మొత్తం 449/410

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement