శ్రీవారి వసంతోత్సవాలకు అంకురార్పణ
రాపూరు: మండలంలోని పెంలచకోనలో కొలువైన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి వసంతోత్సవాలకు బుధవారం రాత్రి వేదపండితులు అంకురార్పణ చేశారు. శ్రీవారి నిత్యకల్యాణ మండపంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. దేవస్థాన ప్రధానార్చకులు పెంచలయ్యస్వామి, సీతారామయ్యస్వామి మాట్లాడుతూ స్వామి వారికి వేసవి తాపాన్ని తగ్గించేందుకు చైత్రమాసం వసంత రుతువులో స్వామివారికి వసంతోత్సవాలు నిర్వహించడం ఆచారమన్నారు. శ్రీవారి వసంతోత్సవాలు విజయవంతమయ్యేందుకు వేదపండితులు నందనవనంలోని పుట్టమట్టిని తీసుకువచ్చి అందులో నవధాన్యలు కలిపి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం అనుజ్ఞ, విశ్వక్సేనారాదన, పుణ్యాహావచనం, రక్షాబంధనం, మత్సంగ్రహణం, అంకురార్పణ తదితర కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. అంకురార్పణ కార్యక్రమాన్ని తిలకించేదుకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


