పెండింగ్ బిల్లులు సిద్ధం చేయండి
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరు రూరల్: జిల్లాలో డ్వామా, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి పెండింగ్ బిల్లుల వివరాలు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందింలో ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. 2017–18, 2018–19 సంవత్సరాల కాలంలో డ్వామా ఆధ్వర్యంలో చేపట్టిన ఉపాధి హామీ, ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు కాంక్రీట్ పనులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, అప్‌లోడ్‌లో సాంకేతిక సమస్యలపై కలెక్టర్ చర్చించారు. ఈ శాఖలకు సంబంధించి గతంలో చేపట్టిన పనులు, రివైజ్డ్ ఎస్టిమేట్లు, పెండింగ్ బిల్లుల పూర్తి సమాచారాన్ని అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో రూ.38 కోట్ల నీటి తీరువా పన్నుల బకాయిలు ఉన్నాయని, సాగునీటి కాలువల పరిధిలోని నీటి సంఘాల అధ్యక్షులు, డిస్ట్రిబ్యూటరీ, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు రైతులకు అవగాహన కల్పించి పన్నులు చెల్లించేలా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఎస్‌ఈ దేశ్‌నాయక్, సోమశిల ఎస్‌ఈ వెంకటరమణ, పంచాయతీరాజ్ ఎస్‌ఈ అశోక్‌కుమార్, డ్వామా పీడీ గంగాభవాని, ఈఈలు నాగరాజు, మల్లికార్జున, ఐ శ్రీనివాసరావు, కె శ్రీనివాసరావు, డీఐ కె సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


