విశాఖపట్నం: 93వ వార్డు పరిధి గోపాలపట్నం ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న బాలాజీ గార్డెన్స్‌లోని ఎన్‌ఎస్‌టీఎల్ కాలనీలో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. డీసీపీ ఆనంద్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొడుకుల రాధాగాయత్రి(45), ఆమె భర్త నరేంద్ర ఎన్‌ఎస్‌టీఎల్ కాలనీలో అద్దె ఇంట్లో గత ఆరు నెలల నుంచి ఉంటున్నారు. నరేంద్ర వీఎస్‌పీఈజెడ్‌లో పనిచేస్తున్నారు. నరేంద్ర అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి వెళ్తుండటంతో ఆమె ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు.
రాధాగాయత్రికి శ్రీనివాసనగర్‌లో ఉంటున్న కల్పన అనే బ్యూటీషియన్‌తో కొంతకాలంగా స్నేహం ఉంది. రాధాగాయత్రి, కల్పన గతంలో బాలాజీ గార్డెన్స్‌లోనే అద్దె ఇళ్లలో ఉండేవారు. ఈనెల 21వ తేదీన ఒంట్లో బాగోలేదని రాధాగాయత్రి కల్పనకు చెప్పింది. దీంతో ఆరోజు ఉదయం తన కూతురు గీతికతో కలిసి రాధాగాయత్రి ఇంటికి వచ్చి టిఫిన్ ఇచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఆదివారం సాయంత్రం వరకు పలుమార్లు కల్పన ఫోన్ చేసినా రాధాగాయత్రి లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆదివారం సాయంత్రం కల్పన తన కూతురు గీతికతో కలిసి రాధాగాయత్రి ఇంటికి వచ్చింది. గీతిక బయటి నుంచి పిలవగా ఎంతకీ పలకలేదు. ఇంటి పెరటివైపు ఉన్న డోరు తీసి ఉండటంతో లోపలకి వెళ్లి చూసింది.
ఇంట్లో రాధాగాయత్రి మృతి చెంది ఉండటాన్ని చూసి భయంతో బయటకి వచ్చేసింది. వెంటనే విషయాన్ని స్థానిక వలంటీర్ సత్యశ్రీకి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి వచ్చిన సత్యశ్రీ పెందుర్తి పోలీసులకు సమాచారం ఇచ్చింది. రాత్రి 8 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్న డీసీపీ ఆనంద్‌రెడ్డి, ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, పెందుర్తి సీఐ శ్రీనివాసరావు పరిశీలన జరిపారు. డాగ్‌స్క్వాడ్‌తో కూడా పరిశీలించారు. విషయం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ కూడా సంఘటన స్థలానికి వచ్చి పరిశీలన జరిపారు.
చుట్టుపక్కల ఉన్న వాళ్లను, కల్పన కూతురు గీతికని, వలంటీర్ సత్యశ్రీలను విచారించారు. ఆమె భర్త నరేంద్రకి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో నరేంద్ర పనిచేస్తున్న ఆఫీసుకి పోలీసులను పంపిస్తున్నట్టు డీసీపీ తెలిపారు. విచారణలో అన్ని విషయాలు తేలుతాయని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కాగా రాధాగాయత్రి ఒక్కరే ఇంట్లో ఉంటోందని, నరేంద్ర ఆమె భర్త కాదేమో అన్న అనుమానాలు సంఘటన స్థలంలో చోటుచేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment