
అధికారులతో మంత్రి సమీక్ష
ఎంవీపీకాలనీ: జిల్లాలోని వివిధ కార్పొరేషన్లు, సంక్షేమ శాఖల అధికారులతో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయులు సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ అతిథిగృహంలో బుధవారం ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాల దరఖాస్తు ప్రక్రియ, పర్యవేక్షణపై మంత్రి ఆరా తీశారు. సాంఘిక సంక్షేమశాఖ, బీసీ సంక్షేమశాఖ, ఎస్సీ ఇంజినీరింగ్ విభాగం ద్వారా నిర్వహిస్తున్న పలు ప్రాజెక్టుల పురోగతి, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు తదితర అంశాలపై ఆయా అధికారులతో చర్చించారు. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డీడీ రామారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యపద్మ, ఇంజనీరింగ్ విభాగం ఈఈ రమేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.