Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

ప్రధాన వార్తలు

How Chandrababu Nara Lokesh Target Peddireddy Family1
టార్గెట్‌ పెద్దిరెడ్డి.. నారావారి వికటాట్టహాసాలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ‘పెద్దాయన’గా పేరు ప్రతిష్టలు.. ప్రజా సేవే పరమావధిగా సేవలందించే కుటుంబసభ్యులు.. పేదలతో మమేకమై చేసే రాజకీయాలు.. జిల్లావ్యాప్తంగా భారీ సంఖ్యలో అనుయాయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంతం. దశాబ్దాలుగా ఆయన సంపాదించుకుంది జనాభిమానం. ఇదే చంద్రబాబుకు మింగుడుపడని అంశం. అందుకే స్టూడెంట్‌ పాలిటిక్స్‌ నుంచి తనకు కొరకరాని కొయ్యగా తయారైన పెద్దిరెడ్డిని లక్ష్యం చేసుకుని కుట్రలకు తెరతీశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కక్షగట్టి వేధింపులకు దిగుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేందుకు తెగబడుతున్నారు. అందులో భాగంగానే నిరాధార ఆరోపణలతో ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేయించారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబమే సీఎం చంద్రబాబు నాయుడుకు అడ్డు. తనకంటే పెద్దిరెడ్డి కుటుంబానికే ఆదరణ పెరుగుతోందని, అందుకే ఆ ఫ్యామిలీ లక్ష్యంగా చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదలు నేటి వరకు పెద్దిరెడ్డి కుటుంబంపై చేపట్టిన వేధింపులే నిదర్శనం అనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో అందరూ పెద్దిరెడ్డిని ‘పెద్దాయన’ అని పిలుస్తుండడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో పెద్దిరెడ్డి కుటుంబంపై ఏడాదిగా సాగుతున్న అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలే ఇందుకు సాక్ష్యంగా చూపుతున్నారు.● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటన వెనుక మాజీ మంత్రి, ఎమ్మె ల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హస్తం ఉందంటూ అప్పట్లో హడావుడి చేశారు. ఏదో జరిగిపోయిందని సీఎం చంద్రబాబు హుటాహుటిన హెలికాప్టర్‌ ఏర్పాటు చేసి డీజీపీ, రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీని మదనపల్లెకు పంపించారు. తర్వాత ఆ ఘటనపై కేసులు నమోదు చేశారు. పెద్దిరెడ్డి అనుచరులు కొందరిని అరెస్టు చేశారు. అయితే అవేవీ ఇప్పటి వరకు రుజువు కాకపోవడంతో చివరకు ప్రభుత్వం వెనుకడుగు వేసింది.● రాజంపేట పార్లమెంట్‌ పరిధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి అనుచరులు అనేక మందిని నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. ఆస్తులు ధ్వంసం చేశారు. వ్యవసాయ పంటలను నాశనం చేశారు. ఇటుక బట్టీల్లోకి చొరబడి వాటిని విక్రయించి సొమ్ముచేసుకున్నారు. సోమల మండలం కమ్మపల్లెలో వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులందరినీ నెలలపాటు చిత్రహింసలకు గురిచేశారు. కొంత మంది ఊరొదిలి వెళ్లేలా దౌర్జన్యాలకు తెగబడ్డారు. అనేక మందిపై దాడులు చేసి ఆస్పత్రుల పాలు చేశారు. ప్రధానంగా పుంగనూరులో భయానక వాతావరణం సృష్టించారు. తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్‌లు చేసి రిమాండ్‌ తరలించి పెద్దిరెడ్డి వర్గాన్ని భయాందోళనకు గురిచేసేందుకు యత్నించారు.● రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గత ఏడాది జూలై 18న పుంగనూరు పర్యటనలో భాగంగా చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకుని టీడీపీ గూండాలు మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసంపై రాళ్ల దాడి చేశారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను కర్రలు, రాడ్లతో దారుణంగా తరిమికొట్టారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిని ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. మరికొన్ని వాహనాలను ఎందుకూ పనికిరాకుండా నాశనం చేశారు. దాడి చేసింది టీడీపీ గూండాలైతే.. ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు మొత్తం 115 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఎంపీ మిథున్‌రెడ్డితో పాటు పలువురికి కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో కూటమి నేతలు కంగుతిన్నారు.● పులిచెర్ల మండలం మంగళంపేట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన మామిడి తోటలలో అటవీశాఖకు చెందిన భూములు ఉన్నాయంటూ పచ్చమీడియాను అడ్డుపెట్టి ప్రభుత్వం నానా యాగీ చేసింది. డ్రోన్‌ కెమెరాలు, అధికారులను రంగంలోకి దింపి హంగామా సృష్టించింది.● తిరుపతిలోపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం ఉన్న ప్రాంతం బుగ్గమఠానికి చెందిన భూముల్లోనే అని ఆరోపించి కూటమి ప్రభుత్వం కోర్టులో కేసులు దాఖలు చేసింది. అదే విధంగా కార్పొరేషన్‌ నిధులతో దారి ఏర్పాటు చేసుకున్నారని, అది కూడా ఆక్రమణేనంటూ ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేసింది.జలయజ్ఞంపై బాబు విషంకృష్ణమ్మ జలాలను పుంగనూరుకు తీసుకొచ్చి నిల్వ చేయడానికి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి సంకల్పించారు. నాటి పాదయాత్రలో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి సమస్యను వివరించారు. అధికారంలోకి రాగానే ప్రాజెక్టులతో పడమటి ప్రాంతాలకు నీరు ఇచ్చే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లోని ముదివేడు, నేతిగుట్లపల్లె, ఆవులపల్లెలో రూ.1200 కోట్ల వ్యయంతో ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ మూడు ప్రాజెక్టులతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి గుర్తింపు లభిస్తుందని, ఎన్నికల సమయంలో దీనిని అడ్డుకోవాలని చంద్రబాబునాయుడు ప్రాజెక్టులపై విషం చిమ్మారు. చోటా నేతలచే గ్రీన్‌ ట్రిబ్యూనల్‌లో తప్పుడు కేసులు వేసి పనులు అడ్డుకున్నారు. దీని కారణంగా పడమటి నియోజకవర్గాలకు జీవజలం లేక విలవిల్లాడే పరిస్థితి నెలకొంది.ఇప్పుడు తప్పుడు కేసులో..తాజాగా లిక్కర్‌ కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేసి కూటమి ప్రభుత్వం అరెస్టు చేయించింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా చేసిన ఈ అక్రమ అరెస్ట్‌ను వైఎస్సార్‌సీపీ శ్రేణులతో పాటు సామాన్యులు సైతం తీవ్రంగా ఖండిస్తున్నారు.బాబు అరాచకాలు ప్రజలు చూస్తున్నారుకూటమి ప్రభుత్వం ఏడాదిగా చేస్తున్న అరాచకాలను ప్రజలు చూస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఇది కుట్రపూరితంగా పెట్టిన అక్రమ కేసు. ఎన్ని కుట్రలు చేసినా, కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.– భరత్‌, ఎమ్మెల్సీ, కుప్పంకుట్రలకు పెద్దిరెడ్డి కుటుంబం వెరవదుపెద్దిరెడ్డి కుటుంబ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఆ దిదశగా ఓ బూటకపు మద్యం కుంబకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. అందులోకి ఎలాంటి సంబంధం లేని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి విచారణ పేరుతో సిట్‌ కార్యాలయానికి పిలిపించి అరెస్టు చేసింది. ప్రజాభిమానం కలిగిన మిథున్‌రెడ్డి విలువలతో కూడిన రాజకీయం చేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారు. అలాంటి నాయకుడిపై మద్యం కేసు నమోదు చేయడం దుర్మార్గం.-నూకతోటి రాజేష్‌, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తఎలాంటి ఆధారాలు లేకుండా..లిక్కర్‌ కేసులో గతంలోనే సిట్‌ ముందు ఎంపీ మిథున్‌రెడ్డి వాస్తవాలను చెప్పారు. కానీ ఆయన పీ ఎల్‌ఆర్‌ కంపెనీకి ఎవరో పెట్టుబడిగా పెట్టిన రూ.5 కోట్లపై ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు పెట్టి ఆయన్ను అరెస్ట్‌ చేయడం చాలా బాధాకరం. చంద్రబాబు ఎందుకు వీరిని టార్గెట్‌ చేశారో జిల్లా ప్రజలందరికీ తెలుసు. న్యాయమే గెలుస్తుంది.– వెంకటేగౌడ, పలమనేరు మాజీ ఎమ్మెల్యేప్రశ్నిస్తుండడంతోనే అక్రమ కేసులుఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రశ్నిస్తున్నామనే ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్ష పూరితంగా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. లేని మద్యం కేసును సృష్టించి అన్యాయంగా అరెస్టులు చేయడం దారుణం. దీనికి పచ్చమూక మూల్యం చెల్లించుకోక తప్పదు.– కృపాలక్ష్మి, గంగాధరనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కక్షగట్టి అరెస్ట్‌ చేశారుమాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారనే నెపంతో ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారు. కూటమి పాలన లో కక్షసాధింపులు తారస్థాయికి చేరాయి. ఉద్యోగులను బెదిరించి, బ్లాక్‌ మె యిల్‌ చేసి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. కక్ష సాధింపులో భాగంగానే అరెస్టుల పరంపర జరుగుతోంది. 2014–19 పాలనాకాలానికి సంబంధించి చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, సన్నిహితులపై 13 అవినీతి కేసులు ఉన్నాయి. ఇందులో మద్యం కుంభకోణం కేసు కూడా కీలకమైంది. ఈ కేసులను నిర్వీర్యం చేసేందుకు సీఎం పదవి ని అడ్డం పెట్టుకుని ఇలా చేస్తున్నారు.– విజయానందరెడ్డి, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్తలోకేష్‌ నీకు చిప్పకూడే గతికూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా ఎంపీ మిథు న్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయడం బాధాకరం. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ పాలన నడుస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా తమ స్వార్థం కోసం వైఎస్సార్‌సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. యువగళం పాద యాత్రలో ప్రజలకు న్యాయం చేస్తామని మాట ఇచ్చిన నారా లోకే ష్‌ పక్షాన ప్రశ్నిస్తే అరెస్టు చేయడం దుర్మార్గం. కూ టమి ప్రభుత్వ పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారు. రానున్న కాలంలో కూటమి ప్రభుత్వానికి మూల్యం చెల్లించే సమయం ఆసన్నమైంది.– వీ.హరిప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శిసాక్షి టాస్క్‌ఫోర్స్‌

Donald Trump Post Barack Obama AI Video Backlash Details2
సంచలన ఆరోపణల వేళ.. ఒబామా అరెస్టు అంటూ ఏఐ వీడియో

సంచలన ఆరోపణల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పోస్ట్‌ చేసిన ఓ వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. ‘చట్టానికి ఎవరూ అతీతులు కాదని’ సందేశంతో ఆయన ఆ పోస్ట్‌ చేశారు. అయితే మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అరెస్ట్‌ అయిన నేపథ్యంతో ఉన్న ఏఐ వీడియోను తన ట్రూత్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్‌ చేయడం గమనార్హం. ఓవల్ ఆఫీసులో ట్రంప్‌తో భేటీ అయిన సందర్భంలో మాజీ అధ్యక్షుడు ఒబామాను ఎఫ్‌బీఐ అరెస్టు చేసినట్లుగా ఆ వీడియో ఉంది. ఒబామా చేతుల్ని వెనక్కి విరిచి మరీ అధికారులు బేడీలు వేశారు. ఆ సమయంలో నవ్వుతూ కనిపించారు ట్రంప్‌. అటుపై ఒబామా కటకటాల్లో ఉన్నట్లు ఆ వీడియోలో ఉంది. అంతకంటే ముందు ఈ వీడియోలో.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని పలువురు నేతలు చెప్పిన సందేశాన్ని దానికి జత చేశారు. ఆ నేతల్లో ముందుగా ఉంది ఒబామానే కావడం గమనార్హం. Donald #Trump reposts AI-generated video depicting Barack #Obama being arrested.#MAGA | #USApic.twitter.com/crkL8bew9l— Shivanshi Singh (@Shivansshi) July 21, 2025 అమెరికా నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ తులసీ గబ్బార్డ్‌ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాపై సంచలన ఆరోపణలకు దిగారు. 2016లో ట్రంప్‌ విజయం టైంలో ఒబామా ప్రభుత్వం కుట్రలకు తెర తీసిందని.. రష్యా ఎన్నికల జోక్యంపై కల్పిత ఇంటెలిజెన్స్‌ నివేదికలు తయారు చేయించారని, తద్వారా ట్రంప్‌ అధ్యక్ష పదవికి అర్హత లేదని చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారామె. ఈ క్రమంలో ఆమె అమెరికా న్యాయవిభాగానికి US Department of Justiceకి కొన్ని డాక్యుమెంట్లు సమర్పించినట్లు సమాచారం. Treason, Tulsi & Trump! Gabbard has accused #BarackObama of 'weaponizing intelligence' against #DonaldTrunp in 2016 - I explain why timing and intention of this huge claim is being questioned 👇#EpsteinFiles #TulsiGabbard pic.twitter.com/orQbiEICNK— Shreya Upadhyaya (@ShreyaOpines) July 20, 2025 ఈ వ్యవహారంపై రిపబ్లికన్ నేతలు గబ్బార్డ్‌కు మద్దతు తెలుపుతూ.. ఆమెపై ప్రశంసలు గుప్పించారు. అయితే డెమోక్రట్లు మాత్రం ఈ ఆరోపణలను రాజకీయ ప్రేరణతో కూడినవిగా, ఆధారాలు లేనివిగా అభివర్ణించారు. మరోవైపు Obama ఇంకా ఈ ఆరోపణలపై స్పందించలేదు. అయితే ఈ ఆరోపణలు వెల్లువెత్తిన మరుసటిరోజే ట్రంప్‌ ఇలా ఓ ఏఐ వీడియో తన అధికారిక ఖాతాలో పోస్ట్‌చేయడం గమనార్హం.

Tamil Nadu Tiruvallur Incident Suspect Images Latest News Updates3
బరితెగించిన మానవ మృగం! తప్పించుకుని మరో బాలికను రక్షించి..

పట్టపగలే ఓ మానవ మృగం రెచ్చిపోయింది. తన అమ్మమ్మ ఇంటికి వెళ్తు‍న్న ఓ చిన్నారిని ఎత్తుకెళ్లి కాటేసింది. చిన్నారి పారిపోయేందుకు ప్రయత్నించగా.. తీవ్రంగా గాయపరిచింది. అయినా ఆ చిన్నారిని వణికిపోలేదు. ధైర్యం తెచ్చుకుని.. ఎలాగోలా తప్పించుకుంది. అదే దారి వెంట వస్తున్న మరో చిన్నారిని ఆ కిరాతకుడి బారిన పడకుండా రక్షించగలిగింది. తమిళనాడులో హృదయవిదారకమైన ఘటన జరిగింది. తిరువళ్లూరులో పదేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఓ వ్యక్తి ఆ చిన్నారిని వెంబడించి మరీ ఎత్తుకెళ్లి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. తీవ్ర కలకలం రేపిన ఈ పోక్సో కేసులో అనుమానితుడి ఫొటోలను, ఓ వీడియోను జిల్లా పోలీసులు విడుదల చేశారు. అతనికి సంబంధించిన సమాచారం అందించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జులై 12వ తేదీ జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. పదేళ్ల చిన్నారి తన అమ్మమ్మ ఇంటికి ఒంటరిగా వెళ్తోంది. ఆ సమయంలో ఆమెను వెంబడించిన ఓ వ్యక్తి ఎత్తుకెళ్లి సమీపంలోని మామిడి తోటల్లో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, అతను మళ్లీ లాక్కెళ్లి కొట్టాడు. అయితే, ఈలోపు ఆ వ్యక్తికి ఫోన్ కాల్ రావడంతో అతని దృష్టి మరలింది. ఈ అవకాశాన్ని ఉపయోగించి చిన్నారి తప్పించుకుంది. కాస్త ముందుగా వెళ్లగా అదే దారిలో కిడ్నాప్‌ వైపు వెళ్తూ మరో చిన్నారి కనిపించింది. బాధిత చిన్నారి ఆ బాలిక వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి.. అటు వెళ్లొద్దంటూ అక్కడి నుంచి ఊరిలోకి తీసుకెళ్లింది. ఆపై ఇంటికి చేరి అమ్మమ్మకు జరిగినదాన్ని వివరించింది. బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చిన్నారిని వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తమిళనాట దుమారం రేపుతోంది. పౌర సంఘాలతో పాటు విపక్ష పార్టీలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. డీఎంకే పాలనలో మహిళలకే కాదు.. చిన్నారులకూ రక్షణ లేకుండా పోతోందంటున్నాయి. అన్నామలై వర్సిటీ ఘటన, కదిలే రైలులో గర్బిణిపై జరిగిన దారుణాలను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంకోవైపు తిరువళ్లూరు ఘటనలో నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. రన్నింగ్‌ ట్రైన్‌లో వచ్చిన నిందితుడు.. బాలికను వెంబడించాడని, ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో నమోదు అయ్యాయని అన్నారు. అతని ఫోన్‌ రింగ్‌ టోన్‌ హిందీ పాట ఉందని బాధిత బాలిక చెప్పిన ఆచూకీతో ఉత్తరాధి నుంచి వచ్చిన వలస కూలీ అయి ఉంటాడని పోలీసులు ఓ అంచనాకి వచ్చారు.The suspect in the photos/video is involved in a heinous crime of sexually assaulting a child. It is requested to communicate any information pertaining to him on 9952060948 pic.twitter.com/QBCdi5mQ2K— Thiruvallur District Police (@TNTVLRPOLICE) July 20, 2025

Priya Saroj's video went viral, she was seen planting paddy in the field4
జమీన్‌ కీ బేటీ.. వరినాట్లతో యువ ఎంపీ బిజీ బిజీ

రాజకీయ నాయకులు ఎలా ఉంటారో తెలిసిందే. అందులోనూ పదవీ, అధికారం చేతిలో ఉంటే..వాళ్లు ప్రవర్తించే తీరే వేరెలెవెల్‌ అన్నట్లు ఉంటుంది. కానీ ఈ ఎంపీగారు మాత్రం ప్రజలతో మమేకమయ్యేలా వ్యవహరించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే కొందరు ఇది పబ్లిసిటీ స్టంట్ అపి విమర్శలు కురిపించగా కొందరు మాత్రం గ్రామీణ జీవన విధానంతో కనెక్ట్‌ అయ్యే తీరు ఇదేనని, ప్రజలకు చేరువవ్వాలంటే ఇలానే చేయాలంటూ ఆ మహిళా ఎంపీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ మహిళా ఎంపీ ఎవరంటే..ఉత్తరప్రదేశ్‌ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, భారత క్రికెటర్ రింకు సింగ్ కాబోయే భార్య ప్రియా సరోజ్ రైతు మాదిరిగా స్వయంగా పొలంలో వరి నాట్లు నాటుతూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోని ఎంపి ప్రియా తన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగానే క్షణాల్లో వైరల్‌ అయ్యింది. ఆ వీడియోలో జౌన్‌పూర్‌లోని మచ్లిషహర్ నుంచి ఎంపీగా ఎన్నికైన ప్రియా సరోజ్‌, పొలంలో పనిచేస్తున్న మహిళా రైతు కూలీలతో కలిసి ఆమె కూడా వరి నాట్లు వేస్తూ బిజీగా కనిపించారు. నిజానికి ఆమె వారణాసిలోని పింద్రా తహసీల్ ప్రాంతంలోని కార్ఖియాన్‌లో నివసిస్తున్నారు. అయితే ఆదివారం వాతావరణం చాలా బాగుండటంతో తన గ్రామం వైపుగా వాకింగ్‌కి వెళ్తూ..అటుగా తన పొలానికి కూడా వెళ్లారు. అక్కడ పొలంలో పనిచేస్తునన్న ఇతర మహిళలు, తన స్నేహితులతో కలిసి ఆమె కూడా వరి నాటారు. ఏదో తూతూ మంత్రంగా చేసినట్లుగా కాకుండా సుమారు ఐదు ఎకరాల భూమిలో ఆమె స్వయంగా పనిచేశారు. అది ఒక రకంగా శ్రామిక జీవుల పట్ల ఆమెకున్న గౌరవాన్ని తేటతెల్లం చేయడమే గాక ప్రజలకు మరింతగా చేరువయ్యేలా చేసింది. అంతేగాదు ఆ వీడియోని చూసిన ప్రజలు ఆమెను “జమీన్‌ కీ బేటీ” అని ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రియా సరోజ్‌ తండ్రి తుఫానీ సరోజ్‌ కూడా రైతే. ఆమె కుటుంబానికి వ్యవసాయంతో చాలా అవినాభావ సంబంధం ఉంది. అందువల్ల ఆమెకు పొలంలో పనిచేయడం ఏమి కొత్త కాదని చెబుతున్నారు స్థానిక ప్రజలు. కాగా, ప్రియా రైతు మాదిరిగా వరి నాట్లు వేయడమే గాక రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సరఫరా సమస్యల గురించి కూడా విద్యుత్‌ శాఖ మంత్రికి లేఖ రాసినట్లు సమాచారం. समाजवादी पार्टी की सांसद एवं रिंकू सिंह की होने वाली पत्नी की सादगी तो देखो मजदूरों के साथ धान लगवा रही हैं pic.twitter.com/70WBXfFbYJ— Bhanu Nand (@BhanuNand) July 20, 2025(చదవండి: ఫీల్‌ యువర్‌ ఫీలింగ్‌.. ఆర్ట్‌ ఆఫ్‌ హీల్‌.. ! వ్యాధులను నయం చేయడంలో..)

Producer Naga Vamsi Comments On Bookmyshow And PRO Team5
'బుక్‌మైషో' వాడికి డబ్బులిచ్చి ఇలాంటి పని చేపిస్తున్నాం: నాగవంశీ

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం 'కింగ్‌డమ్‌'.. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు. జులై 31న పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. అనిరుధ్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా నిర్మాత నాగవంశీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో 'బుక్‌మైషో'లో కనిపించే రేటింగ్స్‌, లైక్స్‌తో పాటు రివ్యూలు అన్నీ ఫేక్‌ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అదంతా డబ్బులిచ్చే తామే చేపిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.కొత్తగా విడుదలయ్యే సినిమాకు ఒక నిర్మాత ఏలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో నాగవంశీ ఓపెన్‌గా చెప్పారు.'మీడియాతో సరైనా సత్సంబంధాలు లేకుంటే ఒక సినిమా కిల్‌ అయిపోతుందనే భయం ప్రతి నిర్మాతలో ఉంటుంది. గత 15ఏళ్లుగా మేమే దానిని అలా క్రియేట్‌ చేసుకున్నామనిపిస్తుంది. ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్‌ చేసే వారిలో కొందరు పీఆర్‌ (పబ్లిక్ రిలేషన్స్) టీమ్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్స్‌ కూడా ఉన్నారు. సినిమా విడుదలకు ముందు డబ్బులు ఖర్చు చేయకుంటే నష్టపోతామని మమ్మల్ని ఏకంగా పీఆర్‌ టీమ్‌ వారు బెదిరిస్తున్నారు. మూవీ విడుదల తర్వాత రేటింగ్‌, లైకులు, మంచి రివ్యూల కోసం ఏకంగా రూ. 30 లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కోట్లు ఖర్చు పెట్టి భయంతో ఉన్న మాకు రూ. 30 లక్షలే కదా అని ఒప్పుకోవాల్సిన పరిస్థితిలో మేము ఉన్నాం.తాజాగా కింగ్‌డమ్‌ ప్రోమో విడుదలైంది. ప్రేక్షకుల నచ్చింది. ప్రైమ్‌ మీడియాతో పాటు అందరూ బాగా రాశారు. అయితే, ఆ ప్రోమె కంటెంట్‌ నిజంగానే బాగుందని రాశారా..? లేదా పీఆర్‌ టీమ్‌ వారు టాలెంట్‌ చూపించి రాపించారా..? అనేది ఎవరికీ తెలియదు. కానీ, పీఆర్‌ టీమ్‌ మాత్రం తమ వల్లే వారందరూ మంచిగా రాశారని దర్శకుడు, ప్రోడ్యూసర్స్‌ దగ్గరికి వచ్చి గొప్పలు చెప్పుకుంటారు. అలా గొప్పగా మనమే రాపించామండి.. మనం చెప్పకపోతే వారు అసలు అలా రాయరని చెబుతారు. ఇలాంటి పరిస్థితి ప్రితి నిర్మాతకు ఎదురౌతుంది. 'బుక్‌మైషో'లో మీకు కనిపించే రేటింగ్స్‌, లైక్స్‌ కూడా మేము డబ్బులు ఇచ్చే చేపిస్తున్నాం. బుక్‌మైషోలో ఒక సినిమాకు ఎక్కువ లైకులు ఉంటే మరో సినిమా నిర్మాత ఇలా డబ్బులు ఇచ్చి చేపించడమే.. ఓపెన్‌గా చెబుతున్నాను ఇదే నిజం. ఇలాంటి తప్పుడు ప్రమోషన్‌ చేయకూడదని గిల్డ్‌లో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. బుక్‌మైషో వాడికి సినిమా టికెట్‌ ద్వారా వచ్చే కమీషన్‌తో పాటు ఇలా అదనంగా డబ్బు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇక నుంచి ఇలాంటి పని ఎవరూ చేయకూడదని నిర్ణయం తీసుకున్నాం.' అని ఆయన అన్నారు.@vamsi84 intha open ga PRO la gurinchi cheppinodu evad ledu industry lo🔥🔥 nuvu thaggaku Absolutely 💯 correct ayana cheppindhi 🥵🥵🥵#KingdomCredits @greatandhranews pic.twitter.com/IO7HH9qyf5— 𝙏𝙝𝙚𝙢𝙨𝙠😉 (@saikiranM8721) July 20, 2025

BAN vs PAK 1st T20I: Parvez Fifty Bangladesh Beat Pakistan By 7 Wickets6
BAN vs PAK: పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్‌ షాక్‌

మిర్పూర్‌: బౌలర్లు విజృంభించడంతో సొంతగడ్డపై పాకిస్తాన్‌తో జరిగిన తొలి టీ20 (BAN vs PAK)లో బంగ్లాదేశ్‌ ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి పోరులో బంగ్లాదేశ్‌ 7 వికెట్ల తేడాతో గెలిచి 1–0తో ఆధిక్యంలో నిలిచింది. 110 పరుగులకే ఆలౌట్‌టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 19.3 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ (34 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా... అబ్బాస్‌ అఫ్రిది (22; 3 సిక్స్‌లు), ఖుష్‌దిల్‌ షా (17; 1 ఫోర్, 1 సిక్స్‌) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. బంగ్లాదేశ్‌ బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా (3)తో పాటు సయీమ్‌ అయూబ్‌ (6), హరీస్‌ (4), హసన్‌ నవాజ్‌ (0), మొహమ్మద్‌ నవాజ్‌ (3) పెవిలియన్‌కు వరుస కట్టారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో తస్కీన్‌ అహ్మద్‌ 3, ముస్తఫిజుర్‌ రహమాన్‌ 2 వికెట్లు పడగొట్టారు. పర్వేజ్‌ ఫిఫ్టిముఖ్యంగా ముస్తఫిజుర్‌ పాక్‌ బ్యాటర్లను వణికించాడు. 4 ఓవర్లలో కేవలం 6 పరుగులే ఇచ్చి 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్‌ ఆటగాళ్లలో ముగ్గురు రనౌట్‌ రూపంలో వెనుదిరిగారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్‌ 15.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పర్వేజ్‌ హుసేన్‌ (Parvez Hossain Emon) (39 బంతుల్లో 56 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో అదరగొట్టగా... తౌహిద్‌ హృదయ్‌ (37 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. పాకిస్తాన్‌ బౌలర్లలో సల్మాన్‌ మీర్జా 2 వికెట్లు పడగొట్టాడు. నాలుగో విజయంటీ20 ఫార్మాట్‌లో పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్‌ నెగ్గిన మ్యాచ్‌లు. ఇప్పటిదాకా పాక్‌తో 23 టీ20 మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్‌ నాలుగింటిలో మాత్రమే నెగ్గింది. 2015, 2016లలో మిర్పూర్‌లోనే జరిగిన మ్యాచ్‌ల్లో గెలిచిన బంగ్లాదేశ్‌... 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో చివరిసారి టీ20ల్లో పాక్‌ను ఓడించింది. చదవండి: IND vs PAK: పాక్‌తో మ్యాచ్‌ బహిష్కరణ

Internal Fight In Police Department At Andhra Pradesh7
‘సుహృద్భావం’ క్లీన్‌బౌల్డ్‌

సాక్షి, అమరావతి: డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాపై సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల తిరుగుబాటు బావుటా పోలీసు శాఖతోపాటు ఉన్నతస్థాయి అధికారవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల మధ్య సుహృద్భావపూర్వకంగా నిర్వహించిన క్రికెట్‌ మ్యాచ్‌పై కూడా ఈ ఆధిపత్య పోరు ప్రభావం పడింది. డీజీపీ గుప్తాతో వేదిక పంచుకునేందుకు ఇతర డైరెక్టర్‌ జనరల్‌(డీజీ)లు ససేమిరా అనడం గమ­నా­ర్హం. దీంతో క్రికెట్‌ మ్యాచ్‌ ముఖ్య అతిథులుగా హాజర­వ్వాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కె.విజయానంద్, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా ముఖం చాటేయాల్సి వచ్చింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన సీనియర్‌ ఐఏఎస్, ఇతర ఐపీఎస్‌ అధికారులు ఎవరూ క్రికెట్‌ మ్యాచ్‌ వైపు తొంగి చూడనే లేదు. యావత్‌ ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కలకలం రేపుతున్న ఈ తాజా పరిణామం ఇదిగో ఇలా ఉంది.. ఐఏఎస్, ఐపీఎస్‌ అ«ధికారుల మధ్య సుహృద్భావపూర్వక సంబంధాలు కొనసా­గించేందుకు ఏటా క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రికెట్‌ మ్యాచ్‌కు సీఎస్, డీజీపీ ముఖ్య అతిథులుగా హాజరవుతారు. క్రికెట్‌ మ్యాచ్‌ ఆడే అధికారులే కాకుండా సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు కుటుంబాలతోసహా వచ్చి మ్యాచ్‌ను వీక్షిస్తారు. కోవిడ్‌ వ్యాప్తితో 2020, 2021లో ఈ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించ లేదు. అనంతరం మూడేళ్లపాటు వివిధ కారణాలతో క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించ లేకపోయారు. దీంతో ఈ ఏడాదికిగాను ఆదివారం క్రికెట్‌ మ్యాచ్‌ ఘనంగా నిర్వహించాలని ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల ఉమ్మడిగా నిర్ణయించారు. ఆదివారం మూలపాడు స్టేడియంలో మ్యాచ్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేశారు. సీఎస్‌ విజయానంద్, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరవుతారని కూడా షెడ్యూల్‌ ప్రకటించారు. ఇరుజట్ల తరపున క్రికెట్‌ మ్యాచ్‌ ఆడే 11 మంది చొప్పున అధికారులతోపాటు ఇతర సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు హాజరువుతామని చెప్పారు.డీజీపీతో వేదిక పంచుకునేదే లేదన్న డీజీలుకాగా రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా ఒంటెత్తు పోకడలపై డీజీలు తీవ్ర ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. అసలు పోలీసు శాఖలో ఉన్నతస్థాయి అధికారుల మధ్యే ఎలాంటి సహృద్భావం లేనప్పుడు ఈ క్రికెట్‌ మ్యాచ్‌ ఎందుకని వారు తేల్చి చెప్పారు. మనసులో సామరస్య భావన లేకుండా కేవలం ముఖస్తుతి కోసం తాము వచ్చి మ్యాచ్‌ను వీక్షించలేమని స్పష్టం చేశారు.ముఖం చాటేసిన సీఎస్, డీజీపీడీజీల నిర్ణయంతో సీఎస్‌ విజయానంద్, డీజీపీ గుప్తా కంగు తిన్నారు. పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు సీఎస్‌ చేసిన యత్నాలను డీజీలు ఇప్పటికే తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో డీజీలు హాజరుకాని క్రికెట్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు తాను వెళితే వారు మరింత అవమానంగా భావించే అవకాశం ఉంటుందని సీఎస్‌ భావించారు. అందుకే తాను క్రికెట్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు రావడం లేదని కబురు పంపారు. సీఎస్‌ రానప్పుడు తాను మాత్రం ఎందుకు వెళ్లడమని డీజీపీ గుప్తా భావించారు. తన ఉనికే డీజీలకు గిట్టనప్పుడు తానెందుకు మ్యాచ్‌కు వెళ్లడమని ఆయన భావించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీంతో తాను కూడా మ్యాచ్‌కు రావడం లేదని గుప్తా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.స్టేడియంవైపు తొంగి చూడని ఇతర ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు సీఎస్, డీజీలే రాలేమన్న క్రికెట్‌ మ్యాచ్‌కు తామెందుకు వెళ్లాలని ఇతర సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు భావించారు. ఈ ఆధిపత్య పోరు పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్‌ మ్యాచ్‌కు దూరంగా ఉండటమే సరైందని వారు నిర్ణయానికి వచ్చారు. దీంతో ముఖ్య కార్యదర్శి స్థాయి ఐఏఎస్‌ అధికారులు, ఇతర సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు ఎవరూ కూడా మూలపాడు స్టేడియం వైపు ఆదివారం కనీసం తొంగి చూడనే లేదు. ముందుగా ప్రకటించాం తప్పదు కాబట్టి కేవలం ఇరు జట్ల ఆటగాళ్లు మాత్రమే తూతూ మంత్రంగా క్రికెట్‌ మ్యాచ్‌ ఆడారు. మొత్తం ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, వారి కుటుంబ సభ్యులు వీక్షిస్తుండగా కోలాహలంగా నిర్వహించాల్సిన క్రికెట్‌ మ్యాచ్‌ కాస్త ... పోలీసు శాఖలో ఆధిపత్య పోరుతో నిస్తేజంగా ముగిసింది.

Key changes in H 1B visa rules: Visas issued based on salary and status8
హెచ్‌–1బీ వీసాకు కొలువుతో లింకు!

వాషింగ్టన్‌: డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారిగా అధ్యక్షునిగా పాలించిన కాలంలో అమలై తర్వాత బైడెన్‌ హయాంలో బుట్టదాఖలైన ఒక విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ట్రంప్‌ తొలివిడత అమెరికా అధ్యక్షునిగా పరిపాలించిన కాలంలో హెచ్‌–1బీ వీసాల కోసం లాటరీ విధానాన్ని పక్కనబెట్టి ఆయా కంపెనీలు ఉద్యోగానికి ఇచ్చే జీతభత్యాల ఆధారంగా వీసాలను జారీచేయాలని నిర్ణయించారు. ఆ విధానాన్నే ఆనాడు అమలుచేశారు. దీంతో కంపెనీలు మరింత మంది ఉద్యోగులను ఉన్నత ఉద్యోగాలకు తీసుకుంటాయని, తక్కువ స్థాయి ఉద్యోగాలు అమెరికన్లకే దక్కుతాయని ట్రంప్‌ సర్కార్‌ భావించింది. అయితే విదేశాల నుంచి వచ్చే నిపుణులైన ఉద్యోగులకు అన్ని స్థాయిల ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో జో బైడెన్‌ సర్కార్‌ ఈ విధానాన్ని రద్దుచేసి మళ్లీ లాటరీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ లాటరీ విధానానికి స్వస్తిపలికి ఉద్యోగి జీతం, హోదా, పొజిషన్‌ ఆధారంగా హెచ్‌–1బీ వీసాలు ఇవ్వాలని అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం భావిస్తోంది. ఇందులోభాగంగా సంబంధిత ప్రతిపాదనను సమీక్షించాలంటూ శ్వేతసౌధంలోని ఇన్ఫర్మేషన్‌ అండ్‌ రెగ్యులేటరీ అఫైర్స్‌ ఫర్‌ రివ్యూ విభాగానికి తన ప్రతిపాదనలను పంపింది.వాస్తవానికి ప్రతి సంవత్సరం ఎన్ని హెచ్‌–1బీ వీసాలు జారీ చేయాలనే పరిమితిని అమెరికా కాంగ్రెస్‌(పార్లమెంట్‌) నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ప్రతి సంవత్సరం 85,000 హెచ్‌–1బీ వీసాలను జారీచేస్తున్నారు. వీటిలో 20,000 వీసాలను మాస్టర్స్‌ డిగ్రీ పట్టా ఉన్న ఉద్యోగులు ప్రత్యేకంగా కేటాయించారు. వీటిలో అత్యధికం అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్‌ వంటి పెద్ద కంపెనీలే సాధిస్తున్నాయి. ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేసి తమ ఉద్యోగుల్లో ఎక్కువ మందికి వీసా దక్కేలా చేస్తున్నాయి. ఇక ఎలాంటి పరిమితి లేని వీసాలను విశ్వవిద్యాలయాల్లోని పరిశోధన విభాగాల కోసం కేటాయించారు.2026 ఏడాదికి జారీచేయాల్సిన వీసాల కోసం స్వీకరించాల్సిన దరఖాస్తులు సరిపడా రావడంతో వాటి ప్రాసెస్‌ను నిలిపివేశారు. అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సరీ్వసెస్‌ విభాగం శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ లెక్కన 2026 సంవత్సరానికి లాటరీ విధానం ఉండకపోవచ్చని స్పష్టమైంది. పొజిషన్‌ ఆధారంగా వీసాల జారీ ప్రక్రియలను అమెరికాలోని ఆర్థికరంగ నిపుణులు స్వాగతిస్తున్నారు. అత్యధిక వృత్తి నైపుణ్యాలున్న వ్యక్తులకే అత్యధికంగా హెచ్‌–1బీ వీసాలు దక్కే అవకాశం ఉండటంతో వారి కృషి, పని ద్వారా అమెరికా ఆర్థికవ్యవస్థ మరింత మెరుగుపడుతుందని వారు ఆశిస్తున్నారు.

Shashi Tharoor Row: Thiruvananthapuram Congress rift deepens9
‘శశిథరూర్‌ మాతో లేరు.. మీటింగ్‌లకు పిలవం’

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ వ్యవహార శైలిపై సొంత పార్టీలో.. అదీ సొంత రాష్ట్రంలోనే తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది. ఆయన్ను తమలో ఒకరిగా పరిగణించడం లేదంటూ తాజాగా పార్టీ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. దేశ భద్రత అంశంపై థరూర్‌ తన వైఖరిని మార్చుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు ఆయన్ను ఆహ్వానించేది లేదన్నారు మాజీ ఎంపీ కే మురళీధరన్. పార్టీ ప్రయోజనాల కంటే దేశానికే ప్రాధాన్యం ఇవ్వాలని శశిథరూర్‌ వ్యాఖ్యానించిన వేళ.. కేరళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కే మురళీధరన్‌ మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘శశిథరూర్‌ తన తీరును మార్చుకునే వరకు.. తిరువనంతపురంలో నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించబోం. ఆయన మాతో కలిసి లేరు. కాబట్టి.. ఆయన్ను బహిష్కరించే ప్రశ్నే పుట్టదు. అయితే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుంది’’ అని మురళీధరన్ అన్నారు. ఇదిలా ఉంటే.. కే మురళి శశిథరూర్‌పై మండిపడ్డడం ఇదే తొలికాదు. ఎమర్జెన్సీ రోజులపై థరూర్‌ రాసిన వ్యాసంపైనా ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌లో ఆయనకు(శశిథరూర్‌ పేరును ప్రస్తావించకుండా) ఏమైనా ఆంక్షలు ఉన్నట్లు అనిపిస్తే.. స్పష్టమైన రాజకీయ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఇంకోవైపు కేరళలోని యూడీఎఫ్‌ నేతల్లో సీఎం అభ్యర్థిగా శశిథరూర్‌ వైపే మొగ్గు ఉందంటూ ఓ సర్వేకు సంబంధించిన పోస్టుపైన మురళీధరన్‌ గతంలో విరుచుకుపడ్డారు. ఆయన ఏ పార్టీకి చెందినవారో ముందుగా నిర్ణయించుకోవాలన్నారు.గత కొంతకాలంగా శశిథరూర్‌కు కాంగ్రెస్‌ అధిష్టానాకి మధ్య పొసగడం లేదు. ఈ క్రమంలో మోదీ ప్రభుత్వ అనుకూల వ్యాఖ్యలు చేస్తూ సొంత పార్టీ నుంచి శశిథరూర్‌ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఎవరేమనుకున్నా తాను బీజేపీలో చేరేది లేదని.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానంటూ థరూర్‌ చెబుతూ వస్తున్నారు.

Chandrababu govt Conspiracy exposed in illegal liquor case Mithun Reddy10
బాబు కుతంత్రం..‘అప్రూవర్‌’ తంత్రం

భయపెట్టి.. ప్రలోభపెట్టి.. మద్యం అక్రమ కేసులో తిమ్మినిబమ్మి చేసేందుకు కూటమి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఇంతా చేసి.. కోర్టుకు సమరి్పంచిన చార్జ్‌షీట్, రిమాండ్‌ రిపోర్ట్‌లో ఒక్క ఆధారమూ చూపలేదు. ఒకరిద్దరిని అప్రూవర్లుగా మార్చుకోవడమే తమ ముందున్న దారి అని చెప్పకనే చెప్పింది. ఫేక్‌ ఇన్వాయిస్‌లు అంటూ తనకు తానే స్వీయ ధ్రువీకరణ ఇచ్చుకుంది. ఫలానా సమయంలో ఫలానా సెల్‌ టవర్‌ పరిధిలో ఉండటమే ఆధారమని చెప్పుకు రావడం విడ్డూరం. సిట్‌ దర్యాప్తు తీరు చూస్తుంటే సీఎం చంద్రబాబునాయుడు కక్ష సాధింపు తప్ప ఈ కేసులో మరేమీ లేదని తేటతెల్లమవుతోంది. సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ కుట్ర మరోసారి బట్టబయలైంది. బెదిరించి, వేధించి అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సాగిస్తున్న అక్రమ కేసు కుతంత్రాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వమే మరోసారి బయట పెట్టుకుంది. చంద్రబాబు ప్రభుత్వం రచించిన ‘అప్రూవర్‌ కుట్ర’ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమ కేసులో బెవరేజెస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌ను ఇప్పటికే తీవ్రంగా వేధించి, మరీ అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించిన కూటమి ప్రభుత్వం.. తాజాగా వారి ద్వారా అప్రూవర్‌ కుట్రకు తెగబడేందుకు యత్నించడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో సిట్‌ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఈ కుతంత్రాన్ని చక్కబెట్టేందుకు యత్నించిన వ్యవహారం బయటపడింది. తద్వారా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పారదర్శకంగా మద్యం విధానాన్ని అమలు చేసినట్టు చంద్రబాబు ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించింది. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు తాము అబద్ధపు వాంగ్మూలాలపైనే ఆధార పడ్డామని నిస్సిగ్గుగా వెల్లడించింది. ఆ ఇద్దరూ సిట్‌ చీఫ్‌తో భేటీరాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతోగానీ, మద్యం విధానంతో గానీ ఏమాత్రం సంబంధం లేని వారిని కూడా ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు ఏ30 నుంచి ఏ40 వరకు నిందితులుగా పేర్కొని సిట్‌ అరెస్టు చేసింది. వారిలో ప్రపంచ స్థాయి సిమెంట్‌ దిగ్గజ సంస్థ వికాట్‌ కంపెనీ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్పతోపాటు పలువురు ఉన్నారు. ఇదే కేసులో నిందితులైన వాసుదేవరెడ్డి(ఏ2), సత్య ప్రసాద్‌(ఏ3)­లను బెదిరించి, అప్రూవర్‌లుగా మారేందుకు అనుమతించాలని, వారిద్దరితో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ వేయించాలని పన్నాగం పన్నింది. ఇందులో భాగంగా శనివారం వారు విజయవాడ ఏసీబీ న్యాయస్థానానికి వచ్చారు. ముందుగా సిట్‌ కార్యాలయానికి వెళ్లారు. సిట్‌ చీఫ్‌ ఎస్వీ రాజ­శేఖర్‌బాబుతోపాటు ఇతర అధికారులతో సమావేశ­మయ్యారు. అనంతరం కొందరు సిట్‌ అధికారు­ల­తో కలసి న్యాయస్థానంలో అప్రూవర్‌ పిటిషన్‌ దాఖలు చేసేందుకు వెళ్లారు. ఇలా వారిద్దరితో మరిన్ని అబద్ధపు వాంగ్మూలాలు న్యాయస్థానంలో నమోదు చేయించాలన్నది ప్రభుత్వ పెద్దల ఎత్తుగ­డగా స్పష్టమైంది. అయితే న్యాయ వర్గాలతో చర్చించిన వారు అప్రూవర్‌ పిటిషన్‌ దాఖలు చేయకుండా వెనక్కి తీసుకుని వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ నాటకం వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌ అప్రూవర్‌ పిటిషన్లు వేయకుండా వెనుదిరగడంపై సిట్‌ అధికారులు ఆందోళనకు గురైనట్లు సమాచారం. వీరిద్దరూ ఎదురు తిరిగితే ఈ అక్రమ కేసు పూర్తిగా నీరుగారి పోతుందని బెంబేలెత్తిన సిట్‌ అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. వారి ఆదేశాలతో కొత్త ఎత్తుగడ వేశారు. వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌తో హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేయించారు. ఆ ముందస్తు బెయిల్‌ పిటిషన్లను న్యాయస్థానంలో వ్యతిరేకించకుండా సహకరిస్తామని సిట్‌ అధికారులు వారికి చెప్పినట్టు సమచారం. కాగా హడావుడిగా అప్పటికప్పుడు దాఖలు చేసిన ఆ పిటిషన్లకు తగిన పత్రాలు జతపరచ లేదు. దాంతో సాంకేతిక కారణాలతో న్యాయస్థానం ఆ పిటిషన్లను వెనక్కి పంపింది.అబద్ధపు వాంగ్మూలాలు ఇలా...⇒ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పూర్తి పారదర్శకంగా అమలైందని చంద్రబాబు ప్రభు­త్వమే పరోక్షంగా అంగీకరించినట్లయిందని ఈ తాజా పరి­ణా­­మా­లు మరోసారి స్పష్టం చేశాయి. రెడ్‌బుక్‌ కక్ష సాధింపు కోసం తాము నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు కోసం పూర్తిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల­పైనే ఆధార పడ్డామని ప్రభుత్వమే బయట పెట్టుకుంది.⇒ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డితో­పాటు ఇప్పటి వరకు ఇతర అధికారులు, సాక్షులతో తాము నమోదు చేయించినవన్నీ అబద్ధపు వాంగ్మూలాలే అన్నది స్పష్టమైంది. వాసుదేవరెడ్డిని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్‌ అధికారులు వేధించారు. సిట్‌ వేధింపులపై ఆయన మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే ప్రభుత్వం ఆయన్ను వెంటాడి వేధించింది. డెప్యుటేషన్‌ ముగిసినా రిలీవ్‌ చేయకుండా అడ్డుకుంది. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసింది. దీంతో చివరికి సిట్‌ చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే వాసుదేవరెడ్డిని రిలీవ్‌ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.⇒ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది. అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చేందుకు సమ్మతించని వారిపై సిట్‌ తన ప్రతాపం చూపించింది. కొన్ని డిస్టిలరీల ప్రతినిధులు వృద్ధులని కూడా చూడకుండా విచారణ పేరుతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ తీసుకువచ్చి వేధించింది. దాంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో వారిని హైదరాబాద్‌లోని వారి నివాసంలోనే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. ⇒ ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని రాజ్‌ కేసిరెడ్డి తండ్రిని బలవంతంగా తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించింది. మరో నిందితుడి తండ్రి, రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ను అక్రమంగా నిర్బంధించి మరీ వేధించడంతో ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.⇒ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పని చేసిన గిరి, మదన్‌ రెడ్డిలను అక్రమంగా నిర్బంధించి అబద్ధపు వాంగ్మూలం కోసం వేధించారు. బెంబేలెత్తిన గిరి సిట్‌ అధికారులు చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. అందుకు సమ్మతించని మదన్‌ రెడ్డిపై సిట్‌ అధికారులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం విభ్రాంతి కలిగించింది. సిట్‌ అధికారులు తనపై భౌతికంగా దాడి చేశారని ఆయన న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు కూడా.⇒ అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్‌ పదవి ఇవ్వడంతోపాటు రూ.2 కోట్లు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు సిట్‌ అధికారుల ద్వారా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్నేహితుడు వెంకటేశ నాయుడు దంపతులను ప్రలోభ పెట్టారు. అందుకు వారు తిరస్కరించడంతోనే ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. ప్రభుత్వ పెద్దల అండతో ఈ అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్‌ బరితెగించి సాగిస్తున్న అధికారిక గూండాగిరీకి ఈ పరిణామాలే నిదర్శనం.అబద్ధాలూ.. వక్రీకరణలే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు కుట్రలో ప్రభుత్వం తన కుతంత్రాలకు మరింతగా పదును పెడుతోంది. పూర్తిగా అవాస్తవాలు, వక్రీకరణలతో నిబంధనలను ఉల్లంఘిస్తోంది. సిట్‌ దాఖలు చేసిన చార్జ్‌షీట్, ఎంపీ మిథున్‌ రెడ్డి రిమాండ్‌ నివేదికలే ఆ విషయాన్ని మరోసారి బయటపెట్టాయి. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు సిట్‌ యత్నిస్తోందని ఎంపీ మిథున్‌ రెడ్డి రిమాండ్‌ నివేదిక వెల్లడించింది. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు సృష్టించలేకపోయిన సిట్‌ అధికారులు వక్రభాష్యాలతో కనికట్టు చేసేందుకు యత్నించారు. ఈ కేసులో ఇతర నిందితులతోపాటు ఎంపీ మిథున్‌ రెడ్డి సమావేశమై అక్రమాలకు కుట్ర పన్నారని సిట్‌ రిమాండ్‌ నివేదికలో పేర్కొంది. అందుకు సిట్‌ చూపించిన ఆధారం ఏమిటో తెలుసా.. సెల్‌టవర్‌ లొకేషన్‌! హైదరాబాద్‌లో సమావేశం జరిగిందని చెబుతున్న రోజున ఎంపీ మిథున్‌ రెడ్డి, ఇతర నిందితుల సెల్‌ ఫోన్లు అన్ని ఒకే చోట ఉన్నట్టు సెల్‌ టవర్‌ లొకేషన్‌ ద్వారా తెలుసుకున్నామని సిట్‌ పేర్కొనడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే సెల్‌ టవర్‌ పరిధి 200 చ.మీటర్లు ఉంటుంది. అంత పరిధిలో హైదరాబాద్‌ వంటి కాంక్రీట్‌ జంగిల్‌ వంటి మహానగరంలో వేలాది సెల్‌ ఫోన్లు ఉంటాయి. అంత మాత్రాన ఆ వేలాది మంది కూడా ఒక గదిలో సమావేశమైనట్టు భావించాలా? ఎక్కడ న్యాయం? ఎక్కడ ధర్మం?ఎంపీ మిథున్‌ రెడ్డి ఈ కేసుకు సంబంధించిన పలువురితో సెల్‌ ఫోన్‌లో మాట్లాడినట్టు కాల్‌ డేటా వివరాలు వెల్లడిస్తున్నాయని సిట్‌ అధికారులు రిమాండ్‌ నివేదికలో పేర్కొనడం విడ్డూరంగా ఉంది. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఎంపీ. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ నేతగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. అటువంటి క్రియాశీల ప్రజాప్రతినిధి రోజూ ఎందరో నేతలు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలతో ఫోన్లో మాట్లాడుతునే ఉంటారు. అంత మాత్రాన వారిందరితో కలసి కుట్ర పన్నినట్టు ఎలా భావిస్తారు? ఎలాంటి ఆధారాలు లేనందునే సిట్‌ అధికారులు సెల్‌ టవర్‌ లొకేషన్, కాల్‌ డేటాలను వక్రీకరిస్తూ న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారన్నది స్పష్టమవుతోంది. దర్యాప్తు పేరిట సిట్‌ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని చార్జ్‌షీట్‌ వెల్లడిస్తోంది. కేంద్ర జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మరీ సిట్‌ అధికారులు తమ పరిధిని అతిక్రమించారు. మద్యం సరఫరా చేయకుండానే చేసినట్టు ఫేక్‌ ఇన్వాయిస్‌లు సమర్పించినట్టు తమ దర్యాప్తులో వెల్లడైనట్టు సిట్‌ అధికారులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అవి ఫేక్‌ ఇన్వాయిస్‌లని ఎలా గుర్తించారో మాత్రం వెల్లడించనే లేదు. కేంద్ర జీఎస్టీ అధికారులు నిర్ధారించకుండా అవి ఫేక్‌ ఇన్వాయిస్‌లనీ సిట్‌ అధికారులు ఏకపక్షంగా ఎలా తుది నిర్ణయానికి వచ్చారో అర్థం కావడం లేదు. అంటే లేని ఆధారాలు ఉన్నట్టుగా సిట్‌ అధికారులు న్యాయస్థానాన్నే తప్పుదారి పట్టించేందుకు తెగిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. కుట్రపూరితంగానే కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఈ కేసులో సిట్‌ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ ఆధారంగానే నిగ్గు తేలింది. ఈ లెక్కన ఈ కేసులో ఎక్కడ న్యాయం ఉన్నట్లు? ఎక్కడ ధర్మం ఉన్నట్లు? ప్రభుత్వం కుట్రతోనే వ్యవహరిస్తున్నదని అడుగడుగునా స్పష్టమవుతోంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement