సాక్షి, హైదరాబాద్: చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్, అత్తాపూర్ తదితర ప్రాంతాల మీదుగా ఉప్పల్ నుంచి మెహిదీపట్నంకు రాకపోకలు సాగించే బస్సు (రూట్ నంబర్ 300)కు భారీ డిమాండ్ ఉంటుంది. ప్రతి అరగంటకు ఒక బస్సు నడిచినా మరో బస్సు కోసం ప్రయాణికులు పడిగాపులు కాస్తూనే ఉంటారు. అలాంటి రద్దీ రూట్లో ఆకస్మికంగా బస్సులు రద్దయితే ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెపాల్సిన పని లేదు. రూట్లో బస్సులు నడిపే బండ్లగూడ డిపోలో కొద్ది రోజులుగా సిబ్బంది కొరత అధికారులను వేధిస్తోంది. కండక్టర్లు, డ్రైవర్ల ఆకస్మిక గైర్హాజరుతో బస్సులు నిలిచిపోతున్నాయి.
చదవండి: ఆర్టీసీపై పాట.. కిన్నెర మొగులయ్యకు సజ్జనార్ బంపర్ ఆఫర్
రోజుకు 15 నుంచి 20 మంది ఏదో ఒకకారణంతో ఉన్నపళంగా సెలవు పెట్టేస్తున్నారు. దీంతో ఒక్క ఉప్పల్–మెహదీపట్నం రూట్లోనే కాదు, డిపో నుంచి శివారు ప్రాంతాలకు రాకపోకలు సాగించే పలు రూట్లలో పెద్ద సంఖ్యలో ట్రిప్పులు రద్దవుతున్నాయి. వందలాది మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ‘70 సొంత బస్సులు, మరో 25 అద్దె బస్సులున్న బండ్లగూడ డిపోలో రోజుకు కనీసం 10 బస్సులు ఆగిపోయినా కష్టమే’ అని ఆర్టీసీ అధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. ఈ ఒక్క డిపోలోనే కాదు. గ్రేటర్‌లోని చాలా డిపోల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
చదవండి: హైదరాబాద్‌లో కిలో టమాట రూ. 50.. ఎగబడ్డ జనం
డ్రైవర్ ఉంటే కండక్టర్ ఉండరు..
గ్రేటర్‌లో మొత్తం 29 డిపోలు ఉన్నాయి. ఒక్కో డిపోలో 100 నుంచి 130 బస్సులు ఉన్నాయి. కొన్ని డిపోల్లో వంద లోపు ఉంటే మరికొన్ని చోట్ల ఎక్కువే ఉన్నాయి. అన్ని డిపోల్లో 10 శాతం స్పేర్ బస్సులను మినహాయించి సుమారు 2,750 బస్సులను నడుపుతున్నారు. ప్రతి డిపోలో 15 శాతం సిబ్బంది సాధారణ సెలవుపై ఉంటారు. వీక్లీ ఆఫ్‌లు, ముందస్తు సమాచారంతో పొందిన సెలవులు, అనారోగ్యం కారణంగా సెలవులో ఉన్నవాళ్లు ఉంటారు. ఈ సిబ్బందిని మినహాయించి మిగతా కండక్టర్లు, డ్రైవర్ల సంఖ్యకు అనుగుణంగా అధికారులు ఆ రోజుకు ప్రణాళికను రూపొందించుకుంటారు. ఆ రోజు విధులు నిర్వహించాల్సిన కండక్టర్లు, డ్రైవర్లలో ఏ ఒక్కరు ఆకస్మిక సెలవు పెట్టినా ఒక బస్సు ఆగిపోవాల్సిందే.
చదవండి: చలాన్ల వేధింపులు తట్టుకోలేక బైక్‌కు నిప్పంటించాడు
రకరకాల కారణాలతో ప్రతి డిపోలో 10 నుంచి 15 మంది ఇలా ఆకస్మిక సెలవులు పెట్టేస్తున్నారు. ‘ఒక బస్సుకు డ్రైవర్ ఉంటే కండక్టర్ ఉండరు. కండక్టర్ ఉన్న బస్సుకు డ్రైవర్ గైర్హాజరవుతాడు, దీంతో మరో గత్యంతరం లేక బస్సులను ఆపేయాల్సి వస్తుంది’. అని ఒక డిపోమేనేజర్ తెలిపారు. మరోవైపు సాధారణంగానే ఆర్టీసీని సిబ్బంది కొరత వెంటాడుతుంది. దీర్ఘకాలిక సమ్మె అనంతరం నగరంలో కొన్ని బస్సులను కార్గోలుగా మార్చారు. మరి కొన్నింటిని తుక్కు కిందకు మార్చారు. కండక్టర్లు, డ్రైవర్లను పెట్రోల్ బంకుల్లో డెలివరీబాయ్‌లుగా, ఆఫీసుల్లో క్లర్కులుగా, ఇతరత్రా విధుల్లో చేర్చారు.
కార్గో బస్సుల కోసం ప్రతి డిపో నుంచి 30 మందికి పైగా సిబ్బందిని బదిలీ చేశారు. ఈ బస్సుల్లో కండక్టర్లు హమాలీలుగా పని చేస్తున్నారు. ఇలా వివిధ రకాల కారణాలతో తగ్గిన సిబ్బందితో బస్సుల నిర్వహణ కష్టంగా మారింది. ఇక ఆకస్మికంగా సెలవులు పెట్టే సిబ్బంది గైర్హాజరు దీనికి మరింత ఆజ్యం పోస్తోంది.
శివార్లు విలవిల
బస్సుల రద్దుతో శివారు ప్రాంతాల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నడిచే ట్రిప్పుల్లో రద్దయ్యేవి ఎక్కువగా ఉంటున్నాయి. ఘట్‌కేసర్, కీసర, హయత్‌నగర్, చేవెళ్ల, శంకరపల్లి, ఇబ్రహీంపట్నం, తదితర ప్రాంతాల్లోని శివారు గ్రామాలు, కాలనీలకు బస్సులు రద్దు కావడంతో ఇటీవల విద్యార్థులు పలు చోట్ల ధర్నాలకు దిగారు. ఉదయం పూట రద్దీకి అనుగుణంగా బస్సులు నడుస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వేళల్లో డిపోల్లో గైర్హాజరీలు పెరగడంతో బస్సులు రద్దవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment