‘‘మహిళా కండక్టర్లను కన్న బిడ్డల తీరుగ చూసుకోవాలె. రాత్రి 8 గంటలలోపు విధులు ముగిసేలా చూడాలె. వాళ్లకు ఏ ఇబ్బందీ రానీయొద్దు.’’ స్వయంగా ముఖ్యమంత్రే ఆదేశించినా కామారెడ్డి ఆర్టీసీ డిపోలో నిబంధనలు అమలు కావడం లేదు. ఉద్యోగినులకు రాత్రి 11 గంటల వరకు డ్యూటీలు కేటాయిస్తున్నారు. దీంతో మహిళా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సాక్షి, కామారెడ్డి: ఆర్టీసీలో మహిళా కండక్టర్లకు డ్యూటీల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాత్రి 8 గంటలలోపు విధులు ముగిసేలా చూడాలి. కామారెడ్డి ఆర్టీసీ డిపోలో మాత్రం విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. రాత్రి 11 గంటల వరకు కూడా పని ఇస్తున్నారు. ఇక్కడ డ్యూటీలు వేసే అధికారి కూడా మహిళే.. ఆమె గతంలో కండక్టర్‌గా పనిచేసి పదోన్నతి పొందారు. కానీ ఆమెనే మహిళా కండక్టర్లకు అర్ధరాత్రి వరకు డ్యూటీలు కేటాయిస్తుండడంతో సిబ్బంది విస్మయపోతున్నారు. జిల్లా కేంద్రమైన కామారెడ్డి బస్ డిపోలో 140 బస్సులున్నాయి. ఆరు వందల మంది కార్మికులు ఉండగా అందులో 70 మంది వరకు మహిళా కండక్టర్లు పనిచేస్తున్నారు. మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటలలోపు విధులు ముగిసే విధంగా డ్యూటీలు ఇవ్వాలన్న ఆదేశాలున్నాయి. అయితే కామారెడ్డి డిపోలో మాత్రం ఇందుకు విరుద్ధంగా రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు డ్యూటీ చేయిస్తున్నారు.
రాత్రి వరకూ డ్యూటీ చేసి....
కామారెడ్డి బస్ డిపో నుంచి వివిధ రూట్లలో ఆయా ట్రిప్పుల సమయాల ప్రకారం రాత్రి 10 తరువాత కొన్ని బస్సులు డిపోకు చేరుకుంటాయని తెలిసినా.. ఆయా రూట్లలో మహిళా కండక్టర్లకు డ్యూటీలు వేస్తున్నారు. గుండారం, నిజాంసాగర్, రామాయంపేట తదితర రూట్లలో డ్యూటీలు రాత్రి వరకు ఉంటాయి. కొందరు కండక్టర్లు తమకు ఆయా రూట్లలో డ్యూటీ వద్దని విన్నవించుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. డ్యూటీ పూర్తయిన తరువాత డిపోకు వెళ్లి డబ్బులు డిపాజిట్ చేయడానికి మరికొంత సమయం పడుతోంది. రాత్రి పూట ఒంటరిగా ఇంటికి చేరాలంటే చాలా మంది భయపడుతున్నారు. కుటుంబ సభ్యులు అందుబాటులో ఉంటే వారు బస్‌డిపోకు వచ్చి తీసుకువెళ్తున్నారు.
ఇక కొందరు మహిళా కండక్టర్లను తీసుకువెళ్లేవారు లేక రాత్రి పూట ఇళ్లకు వెళ్లడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి వేళ ఇంటికి చేరుతున్నామని, సరిగా తినలేకపోతున్నామని, కుటుంబ సభ్యులను పట్టించుకునే పరిస్థితి ఉండడం లేదని ఉద్యోగినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వరకు డ్యూటీలు ఏమిటంటూ కుటుంబ సభ్యులూ అసహనం వ్యక్తం చేస్తుండడంతో మనోవేదనకు గురవుతున్నారు.
పట్టించుకునేవారు లేరు..
గతంలో ఆర్టీసీలో కార్మిక సంఘాలు చురుకుగా పనిచేసేవి. కార్మికులకు ఇబ్బందులు ఎదురైనపుడు వారి తరపున యూనియన్ నాయకులు స్పందించేవారు. అయితే గతేడాది సీఎం కేసీఆర్ కార్మిక సంఘాల అవసరం లేదంటూ ప్రత్యేకంగా కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అప్పటి నుంచి సంఘాలు ఉనికి కోల్పోయాయి. దీంతో తమ తరపున అధికారులతో మాట్లాడేవారు లేకుండాపోయారని, అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అర్ధరాత్రి వరకూ డ్యూటీలు చేయాల్సిన పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న మహిళా కార్మికుల విషయంలో జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment