night duty
-
నైట్ డ్యూటీ అలవెన్స్‌లో కోత
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. నైట్ డ్యూటీ అలవెన్స్‌ల్లో భారీ కోత విధించింది. దీంతో రాష్ట్రంలో సగటున రోజుకు నైట్‌డ్యూటీలు చేసే 10వేలమంది ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోనున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో భారీగా నైట్ డ్యూటీ అలవెన్స్‌లు తీసుకున్న ఆర్టీసీ ఉద్యోగులకు ప్రస్తుతం అందులో సగానికి పైగా కోత పడనుంది. నైట్ డ్యూటీ అలవెన్స్‌లను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటిస్తూనే టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులను నిండా ముంచిన తీరు ఇలా ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జీతాలతోపాటే నైట్‌డ్యూటీ అలవెన్స్లుఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బందికి నైట్ డ్యూటీ అలవెన్స్‌లను అమలు చేసింది. అంతేకాదు నైట్ డ్యూటీ అలవెన్స్‌లను ప్రతి నెలా జీతాలతోపాటే చెల్లించింది. నైట్ డ్యూటీ చేస్తే రోజుకు కనీసం రూ.300 అలవెన్స్‌గా నిర్ణయించింది. గరిష్టంగా రోజుకు రూ.500వరకు కూడా వచ్చేట్టుగా చూసింది. దాంతో నైట్ డ్యూటీ చేసే ఒక్కో డ్రైవర్, కండక్టర్, గ్యారేజీ సిబ్బంది నెలకు రూ.5వేల నుంచి రూ.7వేల వరకు అదనపు ప్రయోజనం చేకూరేది.కూటమి ప్రభుత్వంలో అలవెన్స్ నిలిపివేత... భారీ కోతరాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నైట్ డ్యూటీ అలవెన్స్‌లను నిలిపివేసింది. దాంతో ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, గ్యారేజ్ సిబ్బంది తీవ్రంగా నష్టపోయారు. నైట్‌డ్యూటీ అలవెన్స్‌లను పునరుద్ధరించాలని ఆర్టీసీ యూనియన్లు ఆరు నెలలుగా ప్రభుత్వాన్ని కోరుతునే ఉన్నాయి. దాంతో తప్పక నైట్‌డ్యూటీ అలవెన్స్‌లను పునరుద్ధరించిన టీడీపీ ప్రభుత్వం వాటిలో భారీ కోత విధించి తన అసలు బుద్ధిని ప్రదర్శించింది. నైట్ డ్యూటీ అలవెన్స్ రోజుకు రూ.150కు పరిమితం చేసింది. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో ఏకంగా 50శాతం కోత విధించింది. దాంతో నైట్‌డ్యూటీ చేసే కండక్టర్లు, డ్రైవర్లు, గ్యారేజీ సిబ్బందికి నెలకు రూ.2వేల నుంచి రూ.3వేలే దక్కనుంది.రోజుకు 10వేలమందికి నష్టంఆర్టీసీ 10వేల బస్ సర్వీసులను నిర్వహిస్తోంది. రోజుకు దాదాపు 4వేల బస్‌లు ఇతర ప్రాంతాల్లో నైట్ హాల్ట్‌గా ఉంటాయి. ఒక బస్సుకు ఇద్దరు (కండక్టర్, డ్రైవర్) చొప్పున 4వేల బస్‌లకు 8వేల మంది నైట్ డ్యూటీ చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో 129 ఆర్టీసీ గ్యారేజ్‌ల్లో నైట్ డ్యూటీ సిబ్బందితో కలిపి రోజుకు దాదాపు 10వేలమంది ఉద్యోగులు నైట్‌డ్యూటీలు చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం నైట్ డ్యూటీ అలవెన్స్‌లలో 50శాతం కోత విధించడంతో రోజుకు 10వేలమంది ఆర్టీసీ ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు ఆర్థికంగా నష్టకలిగించే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. -
తొలగించింది వారే... హెచ్చరించింది వారే
సూరత్: నైట్ డ్యూటీలు ఉంటే.. రోజంతా కుటుంబంతో గడపవచ్చని భావించారు రైల్వేలైన్లను తనిఖీ చేసే ముగ్గురు ట్రాక్‌మెన్. దాంతో ఉద్దేశపూర్వకంగా ఫిష్‌ప్లేట్లను తొలగించి.. తామే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పెద్ద ప్రమాదాన్ని అరికట్టారనే పేరు వస్తుందని ఆశించారు. అధికారులు తమ అప్రమత్తతను మెచ్చునొని నైట్‌డ్యూటీలు వేస్తారనేది వారి ఆశ. కానీ రైల్వే నిపుణుల దర్యాప్తులో వారి నిర్వాకం బయటపడి అరెస్టయ్యారు. సూరత్ ఎస్పీ హోతేష్ జాయ్సర్ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. సుభాష్ పొద్దార్, మనీష్ మిస్త్రీ, శుభమ్ జైస్వాల్‌లు ట్రాక్‌మెన్‌గా పనిచేస్తున్నారు. కొసాంబా– కిమ్ స్టేషన్ల మధ్య దుండగులెవరో ఎలాస్టిక్ క్లిప్‌లను, రెండు ఫిష్పేట్లను తొలగించారని, వాటిని పక్కనున్న మరో ట్రాక్‌పై పెట్టి రైలు పట్టాలు తప్పేలా చేయాలని చూశారని ఈ ముగ్గురు శనివారం వేకువజామున 5:30 గంటలకు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. కిమ్ పోలీసుస్టేషన్లో కుట్ర కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. రైల్వే ఉన్నతాధికారులను అప్రమత్తం చేయడానికి ట్రాక్‌మెన్ పట్టాల వీడియోను పంపించారు. అంతకు కొద్ది నిమిషాల ముందు ఆ ట్రాక్ మీదుగా ఒక రైలు వెళ్లిందని రైల్వే అధికారులు పోలీసులకు తెలిపారు. ట్రాక్‌మెన్ ఉన్నతాధికారులను అప్రమత్తం చేసిన సమయానికి, రైలు వెళ్లిన సమయానికి.. మధ్య అవధి చాలా తక్కువగా ఉంది. ఇంత తక్కువ సమయంలో ఫిష్‌ప్లేట్లను, ఎలాస్టిక్ క్లిప్‌లను తొలగించడం సాధ్యం కాదు. దాంతో పోలీసులు ట్రాక్‌మెన్ మొబైల్ ఫోన్లను పరిశీలించారు. శనివారం వేకువజామున 2:50 గంటలనుంచి 4:57 గంటలకు వరకు వీరు ట్రాక్ దృశ్యాలను చిత్రీకరించినట్లు తేలింది. దాంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం బయటపెట్టారు. రైలు ప్రమాదాన్ని నివారిస్తే.. అధికారులు సన్మానించి, ఇకపై కూడా నైట్‌డ్యూటీలో కొనసాగిస్తారని వీరు భావించారు. నైట్‌డ్యూటీలు ఉంటే.. మరుసటి రోజు ఆఫ్ దొరుకుతుందని.. రోజంతా కుటుంబంతో గడపొచ్చని వీరు భావించారు. వర్షాకాలానికి సంబంధించి తమవంతు నైట్‌డ్యూటీలు ముగింపునకు రావడంతో వీరి దుశ్చర్యకు పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరైన సుభాష్ పొద్దారు ఈ ఐడియా ఇచ్చాడు. -
నైట్ షిఫ్టులు వద్దంటారా?
న్యూఢిల్లీ: మహిళా వైద్యులు నైట్ డ్యూటీలు చేయొద్దన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్దేశాలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అలా చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ‘‘పైలట్లుగా, సైనికులుగా మహిళలు రాత్రి విధులు నిర్వహించడం లేదా? మీ నిర్దేశాలు మహిళా వైద్యుల కెరీర్‌పై ప్రభావం చూపుతాయి. రాత్రి విధుల్లో సమస్యలు ఎదుర్కోకుండా వారికి అవసరమైన భద్రత కలి్పంచడం ప్రభుత్వ బాధ్యత. అంతే తప్ప వాటిని మానుకోవాలని చెప్పడం సరికాదు’’ అంటూ సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం మందలించింది. దాంతో సదరు నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటామని బెంగాల్ సర్కారు విన్నవించింది. కోల్‌కతాలో ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రిలో ట్రైనీ వైద్యురాలు రాత్రి విధుల్లో ఉండగా హత్యాచారానికి గురవడం, ఈ ఉదంతం దేశవ్యాప్త ఆందోళనలకు దారితీయడం తెలిసిందే. దాంతో నెల రోజులకు పైగా మమత సర్కారు ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో మహిళా వైద్యుల భద్రత నిమిత్తం సలహాలు, సూచనలతో ‘రాతిరేర్ సాథి’ పేరిట ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. వైద్యురాలి హత్యాచారోదంతంపై విచారణ సందర్భంగా మంగళవారం ఈ అంశం ధర్మాసనం దృష్టికి రావడంతో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆక్షేపించింది. ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది భద్రత నిమిత్తం కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రైవేట్ సెక్యూరిటీని నియమించాలన్న నిర్ణయాన్ని కూడా తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘వైద్యులకు భద్రతే లేని పరిస్థితి నెలకొని ఉంది. కనుక ప్రభుత్వాసుపత్రుల్లో పోలీసు సిబ్బందినైనా నియమించడం రాష్ట్ర ప్రభుత్వ కనీస బాధ్యత. వాటిలో యువ వైద్య విద్యార్థులు, ఇంటర్న్లు పని చేస్తున్నారు’’ అని గుర్తు చేసింది. మా లాయర్లకు బెదిరింపులు: సిబల్ ఈ కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ విజ్ఞప్తి చేశారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది. ‘‘ఇది ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉన్న కేసు. దీని విచారణ ఎలా జరుగుతోందో దేశ ప్రజలంతా తెలుసుకుని తీరాలి’’ అని స్పష్టం చేసింది. ప్రత్యక్ష ప్రసారం తమ లాయర్ల బృందానికి సమస్యలు సృష్టిస్తోందని సిబల్ వాదించారు. ‘‘ఇది విపరీతమైన భావోద్వేగాలతో కూడిన కేసు. మేం వాదిస్తోంది బాధితురాలి తరఫున కాదు గనుక మా బృందంలోని మహిళా లాయర్లకు యాసిడ్ దాడులు, అత్యాచారాలు చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. పైగా మా క్లయింట్ (బెంగాల్ సర్కారు) గురించి ధర్మాసనం ఎలాంటి వ్యాఖ్యలు చేసినా లాయర్లుగా పేరుప్రఖ్యాతు లన్నీ మట్టిలో కలిసిపోతున్నాయి’’ అంటూ ఆందోళన వెలిబుచ్చారు. లాయర్లకు రక్షణ లభించేలా జోక్యం చేసుకుంటామని ధర్మాసనం హామీ ఇచి్చంది. ప్రత్యక్ష ప్రసారాన్ని మాత్రం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. మమత రాజీనామాకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. ఇదేమీ రాజకీయ వేదిక కాదంటూ సదరు న్యాయవాదికి తలంటింది.సీరియస్ అంశాలివి! వైద్యురాలి కేసులో దర్యాప్తు ప్రగతిపై సీబీఐ సమరి్పంచిన స్థాయీ నివేదికను సీజేఐ ధర్మాసనం మంగళవారం పరిశీలనకు స్వీకరించింది. అందులోని అంశాలు తమనెంతగానో కలచివేశాయంటూ ఈ సందర్భంగా ఆవేదన వెలిబుచి్చంది. ‘‘నివేదికలో సీబీఐ పేర్కొన్నవి చాలా సీరియస్ అంశాలు. వాటిని చదివిన మీదట మేమెంతో ఆందోళనకు లోనవుతున్నాం. అయితే వాటిని ఈ దశలో వెల్లడించలేం. అది తదుపరి దర్యాప్తుకు విఘాతం కలిగించవచ్చు’’ అని పేర్కొంది. ‘‘జరిగిన దారుణానికి సంబంధించి మృతురాలి తండ్రి కొన్ని విలువైన అంశాలను కోర్టు దృష్టికి తెచ్చారు. వాటిపైనా దర్యాప్తు చేయండి’’ అని సీబీఐకి సూచించింది. ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రి ఆర్థిక అవకతవకల కేసు దర్యాప్తుపైనా స్థాయీ నివేదిక సమరి్పంచ్సాలిందిగా నిర్దేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.పేరు, ఫొటో తొలగించండి హతురాలి పేరు, ఫొటో ఇప్పటికీ వికీపీడియాలో కనిపిస్తున్నట్టు సీబీఐ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దాంతో వాటిని తక్షణం తొలగించాలని వికీపీడియాను ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంలో తామిచి్చన గత ఆదేశాలకు కట్టుబడాలని స్పష్టం చేసింది. సమ్మె, ఆందోళనలు చేస్తున్న జూనియర్ వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలూ చేపట్టబోమని బెంగాల్ ప్రభుత్వం ఈ సందర్భంగా హామీ ఇచి్చంది. వైద్యురాలిపై అఘాయిత్యం జరుగుతుండగా అక్కడ ఎవరెవరున్నదీ జూనియర్ వైద్యులకు తెలుసని వారి తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ సమాచారాన్ని సీబీఐకి సీల్డ్కవర్లో అందజేస్తామన్నారు. తక్షణం విధుల్లో చేరాల్సిందిగా డాక్టర్లకు ధర్మాసనం మరోసారి సూచించింది. -
100 మందితో గర్ల్స్ హాస్టల్.. రాత్రుళ్లు 89 మంది మిస్సింగ్..
లక్నో: 100 మంది ఉన్నట్లు రిజస్టర్ చేసిన బాలికల రెసిడెన్షియల్ హాస్టల్లో రాత్రిళ్లు 89 మంది మిస్ అయ్యారు. ఈ మేరకు రాత్రిపూట అధికారులు తనిఖీలకు వెళ్లగా.. విషయం వెలుగులోకి వచ్చింది. తప్పిపోయిన బాలికలపై ప్రశ్నించగా.. హాస్టల్ వార్డెన్ సరైన సమాధానం ఇవ్వలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లాలోని పరాస్‌పూర్ ప్రాంతంలో ఉన్న కస్తూర్భా గాంధీ రెసిడెన్షియల్ గర్ల్స్ పాఠశాలలో జిల్లా మెజిస్ట్రేట్ నేహా శర్మా సోమవారం రాత్రి తనిఖీలు చేశారు. రిజిస్టర్లో 100 మంది పేర్లు నమోదు చేయగా.. కేవలం 11 మంది మాత్రమే హాస్టల్లో ఉన్నారు. హాస్టల్ వార్డెన్ సరితా సింగ్ సరైన సమాధానం ఇవ్వేలేకపోయారు. దీంతో దర్యాప్తుకు అధికారులను ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా బేసిక్ శిక్షా అధికారి ప్రేమ్ చంద్ యాదవ్ ఈ వ్యవహారంపై స్పందించారు. జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో ఓ టీచర్, హాస్టల్ వార్డెన్, వాచ్మెన్, ఓ జవాన్ పేర్లను నమోదు చేశారు. డిపార్టెమెంట్ కూడా సదరు వ్యవహారంపై చర్యలు తీసుకుంటోందని ప్రేమ్ చంద్ యాదవ్ తెలిపారు. ఇదీ చదవండి: Onion Price Hike: ఉల్లి ధర పెరుగుదల.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. -
హతవిధి.. రాత్రి వరకూ డ్యూటీ చేసి..
‘‘మహిళా కండక్టర్లను కన్న బిడ్డల తీరుగ చూసుకోవాలె. రాత్రి 8 గంటలలోపు విధులు ముగిసేలా చూడాలె. వాళ్లకు ఏ ఇబ్బందీ రానీయొద్దు.’’ స్వయంగా ముఖ్యమంత్రే ఆదేశించినా కామారెడ్డి ఆర్టీసీ డిపోలో నిబంధనలు అమలు కావడం లేదు. ఉద్యోగినులకు రాత్రి 11 గంటల వరకు డ్యూటీలు కేటాయిస్తున్నారు. దీంతో మహిళా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాక్షి, కామారెడ్డి: ఆర్టీసీలో మహిళా కండక్టర్లకు డ్యూటీల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాత్రి 8 గంటలలోపు విధులు ముగిసేలా చూడాలి. కామారెడ్డి ఆర్టీసీ డిపోలో మాత్రం విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. రాత్రి 11 గంటల వరకు కూడా పని ఇస్తున్నారు. ఇక్కడ డ్యూటీలు వేసే అధికారి కూడా మహిళే.. ఆమె గతంలో కండక్టర్‌గా పనిచేసి పదోన్నతి పొందారు. కానీ ఆమెనే మహిళా కండక్టర్లకు అర్ధరాత్రి వరకు డ్యూటీలు కేటాయిస్తుండడంతో సిబ్బంది విస్మయపోతున్నారు. జిల్లా కేంద్రమైన కామారెడ్డి బస్ డిపోలో 140 బస్సులున్నాయి. ఆరు వందల మంది కార్మికులు ఉండగా అందులో 70 మంది వరకు మహిళా కండక్టర్లు పనిచేస్తున్నారు. మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటలలోపు విధులు ముగిసే విధంగా డ్యూటీలు ఇవ్వాలన్న ఆదేశాలున్నాయి. అయితే కామారెడ్డి డిపోలో మాత్రం ఇందుకు విరుద్ధంగా రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు డ్యూటీ చేయిస్తున్నారు. రాత్రి వరకూ డ్యూటీ చేసి.... కామారెడ్డి బస్ డిపో నుంచి వివిధ రూట్లలో ఆయా ట్రిప్పుల సమయాల ప్రకారం రాత్రి 10 తరువాత కొన్ని బస్సులు డిపోకు చేరుకుంటాయని తెలిసినా.. ఆయా రూట్లలో మహిళా కండక్టర్లకు డ్యూటీలు వేస్తున్నారు. గుండారం, నిజాంసాగర్, రామాయంపేట తదితర రూట్లలో డ్యూటీలు రాత్రి వరకు ఉంటాయి. కొందరు కండక్టర్లు తమకు ఆయా రూట్లలో డ్యూటీ వద్దని విన్నవించుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. డ్యూటీ పూర్తయిన తరువాత డిపోకు వెళ్లి డబ్బులు డిపాజిట్ చేయడానికి మరికొంత సమయం పడుతోంది. రాత్రి పూట ఒంటరిగా ఇంటికి చేరాలంటే చాలా మంది భయపడుతున్నారు. కుటుంబ సభ్యులు అందుబాటులో ఉంటే వారు బస్‌డిపోకు వచ్చి తీసుకువెళ్తున్నారు. ఇక కొందరు మహిళా కండక్టర్లను తీసుకువెళ్లేవారు లేక రాత్రి పూట ఇళ్లకు వెళ్లడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి వేళ ఇంటికి చేరుతున్నామని, సరిగా తినలేకపోతున్నామని, కుటుంబ సభ్యులను పట్టించుకునే పరిస్థితి ఉండడం లేదని ఉద్యోగినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వరకు డ్యూటీలు ఏమిటంటూ కుటుంబ సభ్యులూ అసహనం వ్యక్తం చేస్తుండడంతో మనోవేదనకు గురవుతున్నారు. పట్టించుకునేవారు లేరు.. గతంలో ఆర్టీసీలో కార్మిక సంఘాలు చురుకుగా పనిచేసేవి. కార్మికులకు ఇబ్బందులు ఎదురైనపుడు వారి తరపున యూనియన్ నాయకులు స్పందించేవారు. అయితే గతేడాది సీఎం కేసీఆర్ కార్మిక సంఘాల అవసరం లేదంటూ ప్రత్యేకంగా కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అప్పటి నుంచి సంఘాలు ఉనికి కోల్పోయాయి. దీంతో తమ తరపున అధికారులతో మాట్లాడేవారు లేకుండాపోయారని, అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అర్ధరాత్రి వరకూ డ్యూటీలు చేయాల్సిన పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న మహిళా కార్మికుల విషయంలో జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
నైట్ డ్యూటీలు చేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం !
చాలా మంది చిన్నపిల్లలు అలా టెన్త్ లేదా ఇంటర్ పూర్తి కాగానే పై చదవులకని పక్క ఊళ్లకు వెళ్లడం మామూలే. ఒక్కసారిగా దొరికిన ఆ స్వేచ్ఛతో సిగరెట్లకు అలవాటు కావడం కూడా చాలా సాధారణమే. అలాగే బాగా ఒత్తిడితో ఉండే ఉద్యోగాలూ, కాన్ఫరెన్సులు, మీటింగుల తర్వాత రిలాక్స్ కావడం కోసం పొగతాగడం చాలా మందిలో అలా మెల్లగా అలవాటవుతుంది. ఇలాంటి వ్యవహారాలు అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకు కాస్తంత ఎక్కువ. ఇలా మొదట సరదాగా, టైమ్‌పాస్ కోసం మొదలయ్యే స్మోకింగ్, గుట్కా, ఆల్కహాల్ వంటి దురలవాట్లతోపాటు బయటి తిండి ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ బయటి ఆహారం రుచికరంగా, ఆకర్షణీయంగా కనిపించడం కోసం నూనెలు, ఉప్పుకారాలూ ఎక్కువగా వాడటంతోపాటు దేహానికి, ఆరోగ్యానికి హాని చేసే కొన్ని కృత్రిమరంగులు, రసాయనాలు వాడతారు. వాడిన నూనెలే మళ్లీ మళ్లీ వాడటమూ జరుగుతుంది. ఇవన్నీ క్యాన్సర్‌కు కారణాలయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. దురలవాట్లు, బయటితిండి ఎక్కువగా తీసుకోవడం, వృత్తిపరమైన కారణాలు, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం, వాతావరణ కాలుష్యం, నైట్‌డ్యూటీలు, రాత్రంతా నిద్ర లేకుండా పనిచేయడం, శారీరక శ్రమ చాలా తక్కువగా ఉండటం... ఈ అన్నిరకాల కారణాలతో మహిళలతో పోలిస్తే పురుషులు మరింత ఎక్కువగా క్యాన్సర్‌కు గురవుతున్నారు. పునరుత్పత్తి అవయవాలకు సంబంధించిన క్యాన్సర్లు తప్పితే... మరే క్యాన్సర్లు తీసుకున్నా అవి మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కువ. ఇటీవల పురుషులు కూడా రొమ్ముక్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం పెరిగిపోయింది. ప్రపంచంవ్యాప్తంగా క్యాన్సర్‌కు గురయ్యే వారి సంఖ్య పెరుగుతున్న ధోరణులను చూస్తే 2007 నుంచి 2030 నాటికి ఈ సంఖ్య ఇప్పటికంటే 45% ఎక్కువయ్యే అవకాశం ఉంది. అవగాహన పెంచే కార్యక్రమాలు, జాగ్రత్తలు, ముందుగానే పసిగట్టే స్క్రీనింగ్ పరీక్షలు ఎన్ని వచ్చినా క్యాన్సర్ రాకుండా నివారించగలగడం ఎవరి చేతుల్లోనూ లేదనేది సత్యం. ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధ్యయనాల ప్రకారం 2030 నాటికి ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాల సంఖ్య... అన్ని మరణాల సంఖ్య కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా. సిగరెట్, బీడీలు, పాన్, గుట్కా, ఆల్కహాల్, పొగాకు నమలడం మొదలైనవి నోటి క్యాన్సర్‌కు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే నోటి క్యాన్సర్స్ విషయంలో మన దేశమే మొదటి స్థానంలో ఉంది. ప్రతి ఏడాదీ దాదాపు 80,000 మంది వరకు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఉప్పు, కారాలు, పచ్చళ్లు, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం ఇంకా దురలవాట్లు కూడా చాలా ఎక్కువగా ఉండటం పొట్టకు సంబంధించిన క్యాన్సర్‌కు గురిచేస్తాయి. అందుకే భారతదేశంలోని పురుషులు ఈ క్యాన్సర్‌బారిన ఎక్కువగా పడుతున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. మన దేశంలోని పురుషులు నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్ క్యాన్సర్లకు గురవ్వడం చాలా ఎక్కువగానే గమనిస్తున్నాం. అలవాట్లు, జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం వంటివి క్యాన్సర్‌కు ముఖ్య కారణాలవడటంతోపాటు కొన్ని వృత్తిపరమైన కారణాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఆస్బెస్టాస్, అల్యూమినియం ఉత్పాదన కంపెనీల్లో, ఆల్కహాలిక్ బెవరేజెస్, పొగాకు ఉత్పత్తుల కంపెనీలు, రేడియమ్ ఉత్పత్తులు, రేడియో న్యూక్లియిడ్స్, చెక్కపొడి, గామా రేడియేష్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనిచేసేవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు తల, మెడ భాగాల్లో (హెడ్ అండ్ నెక్) క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అస్సలు ఎండ తగలకుండా ఏసీ రూముల్లో అలా గంటల తరబడి పనిచేయడంతోపాటు నైట్‌డ్యూటీలు, పెస్టిసైడ్స్, కెమికల్స్ వంటి వాటికి పురుషులే ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంటారు. ఇక వారు పనుల కోసం బయటికి వెళ్లినప్పుడు తేలిగ్గా దొరికే జంక్‌ఫుడ్‌ను ఎక్కుగా తీసుకుంటూ ఉంటారు. దాంతో ఊబకాయం, క్యాన్సర్ ముప్పులు పొంచి ఉంటాయి. యాభైఏళ్లు పైబడ్డాక కనిపించే ప్రోస్టేట్క్యాన్సర్ను తెలుసుకునేందుకు పీఎస్ఏ (ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజన్) అనే రక్తపరీక్ష చేయించుకోవడం మంచిది. ఎందుకంటే వీర్యంలో, మూత్రంలో రక్తం కనిపించడం, నడుము, తుంటి, పక్కటెముకల నొప్పులు, మూత్ర సంబంధమైన సమస్యల వంటి ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు కనిపించేసరికి అది ముదిరిపోయి పక్కన ఉండే ఎముకలకూ పాకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పీఎస్ఏ పరీక్షలో యాంటిజన్ పెరగడాన్ని గమనిస్తే ఇతర పరీలైన డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ (డీఆర్ఈ), ప్రోస్టేట్ బయాప్సీతో పాటు అవసరమైతే అల్ట్రాసౌండ్, బోన్‌స్కాన్, సీటీ స్కాన్, ఎమ్మారై, బయాప్సీ వంటి పరీక్షలు చేస్తారు. యాభై ఏళ్లు పైబడిన పురుషుల్లో లక్షణాలు ఉన్నా లేకున్నా పీఎస్ఏ, డీఆర్ఈ పరీక్షలు చేయించుకుని డాక్టర్ సలహా మేరకు మళ్లీ ఎంతకాలం తర్వాత చేయించుకుంటే మంచిది అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అలాగే పీఎస్ఏ పరీక్షలో మార్పులు ఎలా ఉన్నాయి, ఇంకా ఎతర పరీక్షలను ఎలాంటి లక్షణాలు కనిపించనప్పుడు చేయించుకోవాలి వంటి విషయాలపై అవగాహన పెంచుకోవడం తప్పనిసరి. ఈ కింద లక్షణాలు కనిపిస్తే పురుషులు నిర్లక్ష్యం చేయడం తగదు. అవి... తగ్గని దగ్గు, దగ్గుతో పాటు రక్తం ఆకలి, బరువు తగ్గడం నొప్పితో పాటు జ్వరం, మూత్రం ఆగి ఆగి రావడం, రక్తం కనిపించడం మలవిసర్జనలో రక్తస్రావం ,తీవ్రమైన అజీర్తి, గొంతునొప్పి, ఘనపదార్థాలు తీసుకోలేకపోవడం నోటిలో మానని పుండ్లు, ఎముకల్లో నొప్పులు పై లక్షణాలు కనిపించినప్పుడు ఏదో ఇన్ఫెక్షన్ అనో, పైల్స్ అనో, రోగనిరోధక శక్తి తగ్గిందనో, స్మోకింగ్ వల్ల కొద్దిగా దగ్గు వస్తుందనో నిర్లక్ష్యం చేయడం తగదు. ఇక వయసు పైబడ్డ తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. పురుషుల్లో ఎక్కువగా కనిపించే నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్, ప్రోస్టేట్ క్యాన్సర్లకు సంబంధించిన హెచ్చరికలు కావచ్చు. కాబట్టి మంచి జీవనశైలిపై అవగాహన పెంపొందించుకొని, ఆరోగ్యంగా జీవించడం చాలా ముఖ్యం. -
గుడ్... నైట్
రాత్రి నిద్ర లేకపోతే మబ్బుగా ఉంటుంది. మంచి నిద్ర గొప్ప వేకువకు వేకప్ కాల్. నిద్రలేమి జీవితానికి ఒక శాపంలా మారింది. లైఫ్‌లో స్పీడ్ ఎక్కువై నిద్రను మింగేస్తోంది. ఇక కొందరు పిల్లలకు రాత్రి అనేది నిజంగా కాళరాత్రి. ఈ చిన్నారుల సమస్యలు వేరు. పీడకలలతో నైట్ అంటేనే వాళ్లకు టెర్రర్. ఇటు పెద్దలు... అటు పిల్లలు వీళ్లందరిపైనా ప్రభావం చూపే అనేక రాత్రి సమస్యలూ, వాటి పరిష్కారాల సమాహారమే ఈ కథనం. రాక్సీలో నార్మాషేరర్... బ్రాడ్వేలో కాంచనమాలా అని సంధ్యాసమస్యల మీద కవిత రాశాడు శ్రీశ్రీ. అందులో మలిసందె వేళ రకరకాల వ్యక్తులు ఎదుర్కొనే సమస్యలను ప్రస్తావిస్తాడు. అచ్చం అలాగే రాత్రి డ్యూటీలు చేసేవారికి కొన్ని సమస్యలుంటాయి. చీకట్లో చిన్నపిల్లలకు మరికొన్ని ఇబ్బందులుంటాయి. ఆరోగ్యం కోసం ఎన్ఐజీహెచ్టీ ‘నైట్’ తీసుకోవాల్సిన జాగ్రత్తలు... రాత్రిళ్లు చిన్నపిల్లలు ఎదుర్కొనే సమస్యలూ వంటివాటిని అధిగమిస్తే హెల్త్ పరంగానూ వాళ్లు ‘కెఎన్ఐజీహెచ్టీ’ నైట్స్ అంటే ఆరోగ్యవీరులవుతారు. అలాంటి కొన్ని ‘నైట్’ అంశాలపై అవగాహన కల్పించడం కోసమే ఈ కథనం. మీది నైట్ డ్యూటీయా... ఇటీవల నైట్ డ్యూటీలు చేసే వారి సంఖ్య చాలా ఎక్కువ. అమెరికా లాంటి దేశాల పనివేళలు మనకు రాత్రివేళల్లో నడుస్తుంటాయి. మన రాత్రి వాళ్లకు పగలు కావడమే దీనికి కారణం. అందుకే చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు రాత్రంతా పనిచేయాల్సి వస్తుంటుంది. వాళ్లు మాత్రమే కాదు... మన దేశంలోనూ నైట్‌షిఫ్ట్‌ల్లో హాస్పిటల్స్‌లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతరత్రా సిబ్బంది మొదలుకొని సెక్యూరిటీ గార్డుల వరకు రాత్రంతా పనిచేయాలి. పనికి సంబంధించి రాత్రిపగలు వంటి తేడాలు క్రమంగా చెరిగిపోతుండటంతో నైట్‌షిఫ్ట్‌లో పనిచేసే వారు రోజురోజుకూ పెరుగుతున్నారు. నైట్‌షిఫ్ట్‌ల్లో పనిచేసేవారికి వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యలు ఇలా ఉంటాయి. సర్కాడియన్ రిథమ్‌లో మార్పులు : మెదడులో నిద్రకు కారణమయ్యే ప్రత్యేకమైన కణసముదాయాలను ఒక స్విచ్లాంటి దానితో పోల్చవచ్చు. రాత్రి నిద్ర వచ్చేందుకు ‘స్లీప్ స్విచ్’ ఆన్ కావడం, మళ్లీ నిద్ర పూర్తయ్యాక మెలకువ వచ్చే స్విచ్ ఆన్ కావడం ఒక సైకిల్లా జరుగుతుంది. దీనికి మెదడులోపల హైపోథెలామస్లో ఉండే ‘సూప్రా కయాస్మాటిక్ న్యూక్లియస్’ అనే భాగం తోడ్పడుతుంది. ఇది రాత్రికాగానే నిద్ర వచ్చేలా, మళ్లీ ఉదయం మెలకువ వచ్చేలా చేస్తుంది. ఇలా ఈ రెండు కార్యకలాపాలు వరసగా, క్రమబద్ధంగా జరగడాన్ని ‘సర్కాడియన్ రిథమ్’ అంటారు. దీన్నే ఇంగ్లిష్‌లో బయలాజికల్ క్లాక్ అనీ, తెలుగులో జీవగడియారం అంటారు. ఈ గడియారం కారణంగానే మనకు నిర్ణీత వేళల్లో నిద్రరావడం, మెలకువ రావడం జరుగుతుంది. నైట్‌షిఫ్ట్ కారణంగా ఈ రిథమ్ దెబ్బతిని అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిద్ర నాణ్యతా లోపిస్తుంది. ఫలితంగా తీవ్రమైన అలసట (ఫెటీగ్) కలుగుతుంది. ఏకాగ్రత తగ్గుతుంది. ఇది తాము పనిచేసే ప్రదేశాల్లో ప్రమాదాలకూ కారణం కావచ్చు. గుండెజబ్బుల ప్రమాదం : రాత్రివేళల్లో పనిచేసేవారిలో గుండెజబ్బులు వచ్చే ముప్పు పెరుగుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. కరొనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే ముప్పూ ఉంటుంది. ఛాతీ నొప్పి (యాంజైనా) రావచ్చు. హైబీపీ (హైపర్‌టెన్షన్) కూడా రావచ్చు. డయాబెటిస్ ముప్పు: నైట్‌షిఫ్ట్‌ల్లో పనిచేసే వారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు 50% ఎక్కువ. మహిళల్లో: నైట్‌షిఫ్ట్‌ల్లో పనిచేసే మహిళల్లో కాస్త అరుదుగానే అయినా కొన్ని గర్భధారణ సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. పిల్లలు చాలా తక్కువ బరువుతో పుట్టడం, గర్భస్రావం అయ్యే అవకాశాలు పెరగడం వంటి ముప్పులు ఉంటాయి. జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు: నైట్‌షిఫ్ట్‌ల్లో పనిచేసేవారు పగలు మేల్కొని ఉండేవారికి భిన్నంగా తింటూ ఉంటారు. ఉద్యోగాల్లో చేరిన తొలిరోజుల్లో ఇలా తినాల్సి రావడంతో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. తిన్నది జీర్ణం కాదు. కడుపులో మంట రావచ్చు. తినే వేళలు మారడంతో శానిటరీ అలవాట్లు అంటే మలవిసర్జనకు వెళ్లే వేళలూ మారే అవకాశం ఉంది. దాంతో కొందరికి మలబద్దకం వంటి సమస్యలు రావచ్చు. రాత్రివేళ పనిచేసే ఉద్యోగుల్లో సాధారణంగా శారీరక శ్రమ తక్కువగా ఉండటంతో పాటు ఆహారం తీసుకోవడంలో మార్పుల వల్ల స్థూలకాయం వస్తుంది. అందుకే నైట్ షిఫ్ట్‌లలో పనిచేసేవారు తమ ఆహారపు అలవాట్లను కాస్తంత మార్చుకోవడం మంచిది. దాంతో చాలా సమస్యలు తగ్గుతాయి. అలాగే పైన పేర్కొన్న గుండెజబ్బులు, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి ముప్పులూ చాలావరకు తొలగుతాయి. వారి ఆహార నియమాలు ఇలా ఉంటే మంచిది. వీలైనంత తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి. దాంతో ఆహారం జీర్ణమవ్వడం తేలికవుతుంది. ∙సాధారణంగా నైట్‌షిఫ్ట్ వాళ్లు ఆఫీస్ కేఫటేరియాలోనే ఎక్కువగా తింటుంటారు. దీనికి బదులు ఇంట్లో నుంచే ఆహారాన్ని తీసుకెళ్లడం మంచిది. ఇంటి భోజనంలోనూ కొవ్వులు ఎక్కువగా లేకుండా, పీచుపదార్థాలు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి ∙ఒకవేళ తప్పనిసరిగా కాఫెటేరియాలోనే తినాల్సివస్తే... పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అంటే... సలాడ్స్, పళ్లు, మొలకెత్తిన గింజలు, పొట్టుతో ఉన్న పప్పుధాన్యాలు, గింజధాన్యాలు (అంటే... పొట్టుతోనే ఉన్న గోధుమలతో చేసిన రోటీలు, మొక్కజొన్నలతో చేసిన పదార్థాలు, బ్రౌన్‌బ్రెడ్ శాండ్విచ్లు) వంటివి తీసుకోండి. కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, బాగా ఎక్కువగా వేయించిన వేపుళ్లకు (ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు, చిప్స్ వంటివి) దూరంగా ఉండండి. తీపి పదార్థాలు, రిఫైన్డ్ ఫుడ్స్ (అంటే... క్యాండీలు, చాక్లెట్లు, వైట్ బ్రెడ్స్, బన్స్, పాస్తాస్, పిజ్జాలు, కూల్‌డ్రింక్స్) వంటిని చాలా తక్కువగా తీసుకోవాలి. నైట్‌డ్యూటీలు చేసే చాలామంది రాత్రిళ్లు కాఫీ, టీ ఎక్కువగా తీసుకుంటుంటారు. కాఫీ, టీ కంటే నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండటమే మేలు. రోజూ 30–40 నిమిషాల పాటు వ్యాయామం తప్పనిసరి. నైట్‌షిఫ్టుల్లో ఉండేవారి డ్యూటీల్లో వారి శారీరక కదలికలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే వారికి వ్యాయామం చాలా అవసరం. దాంతో బరువు పెరగదు. డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు డాక్టర్‌ను సంప్రదించి తగిన మందులు తీసుకోవాలి. ఆ మందుల వేళలు నిర్ణయించడంలో డాక్టర్ సూచనలు తప్పక తీసుకోవాలి. ఇటీవల మామూలుగానే ప్రజల్లో విటమిన్–డి పాళ్లు చాలా ఎక్కువగా తగ్గిపోతున్నాయి. అలాంటిది ఇక నైట్–డ్యూటీలు చేసేవారి విషయంలో సూర్యరశ్మికి అస్సలు ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల విటమిన్–డి మోతాదులు తగ్గే అవకాశం తప్పక ఉంటుంది. అందుకే నైట్–డ్యూటీలు చేసేవారు ఒకసారి తమ విటమిన్–డి మోతాదులు పరీక్ష చేయించుకొని, అవసరమైతే డాక్టర్ సలహా మీద సప్లిమెంట్లు వాడాల్సి ఉంటుంది. నైట్‌డ్యూటీల వల్ల కుటుంబసభ్యులతో గడిపే క్వాలిటీ సమయం తగ్గడంతో కుటుంబ బంధాలు ప్రభావితమయ్యే అవకాశాలు ఉంటాయి. నైట్డ్యూటీల్లో పనిచేసేవారిలో చిరాకు, పరాకు కూడా పెరగవచ్చు. ఫలితంగా కుంగుబాటుకు లోనయ్యే అవకాశాలూ పెరుగుతాయి. కుటుంబ సంబంధాల్లో విఘాతం కూడా ఒత్తిడికి మరో కారణమయ్యేందుకు అవకాశం ఉంది. అందుకే నైట్‌డ్యూటీల వారు ఈ ఒత్తిడిని అధిగమించాల్సిన అవసరం ఉంటుంది. ధ్యానం వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటిస్తే... రాత్రిళ్లు డ్యూటీ చేసేవారికి అవి మరింతగా ఉపయోగపడతాయి. ఇక్కడ పేర్కొన్న సూచనలు/జాగ్రత్తలు పాటించాక కూడా సమస్యలు తగ్గకపోతే సంబంధిత నిపుణులను కలవాలి. మహిళలైనా, పురుషులైనా నైట్‌షిఫ్టుల్లో పనిచేసేవారు ప్రతి ఆర్నెల్లకో లేదా ఏడాదికోసారో వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. నిద్రలేమి సమస్యను అధిగమించడం ఇలా... నిద్రలేమితో బాధపడుతున్నవాళ్లు ఈ కింది జాగ్రత్తలు తీసుకుంటే మంచి నిద్రపట్టేందుకు అవకాశాలెక్కువ. రాత్రి ఒకే వేళకు నిద్రపోవాలి, ఉదయం మళ్లీ వేళకు నిద్రలేవాలి. బెడ్రూమ్ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. మరీ చల్లగానూ, మరీ వేడిగా కాకుండా ఉండాలి. నిద్రపోతున్న సమయంలో ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి. ఈ మసక చీకట్లోనే నిద్ర వచ్చేందుకు తోడ్పడే మెలటోనిన్ రసాయనం విడుదల అవుతుంది. పొగతాగడం, ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. సాయంత్రం ఏడు దాటాక కాఫీలు, టీలను, కెఫిన్ ఉండే కూల్‌డ్రింక్స్ తీసుకోకూడదు. రాత్రి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. పెందళాడే రాత్రి భోజనం పూర్తి చేయండి. కడుపు నిండుగా తినకండి. నిద్రకు వుుందు టీవీలో ఉద్విగ్నత, ఉద్వేగం కలిగించే దృశ్యాలున్న సినివూలూ, సీరియళ్లు చూడొద్దు. బెడ్రూమ్లో టీవీ లేకుండా చూసుకోండి. బెడ్రూమ్ను వర్క్‌ప్లేస్‌గా మార్చవద్దు. రాత్రి వుంచి నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపయినా పూర్తిస్థాయి పగటి వెలుగులో గడపాలి. నిద్రకు వుుందు ఆహ్లాదకరమైన మ్యూజిక్‌ను వినండి. నిద్రకు వుుందు పుస్తకాలు చదివితే నిద్ర వస్తుంది కానీ... అందులో ఉత్కంఠకు గురిచేసే ఆసక్తికరమైన విషయాలున్న పుస్తకాలు చదవద్దు. కేవలం నిద్రపట్టడానికి ఉపకరించేలా మాత్రమే మీ పుస్తకపఠనం ఉండాలి. ఊపిరితిత్తులు, కిడ్నీల జబ్బులుండి వాటికోసం మందులు ఉపయోగించేవాళ్లు డాక్టర్ సలహామేరకు వాటిని పగటి పూట వాడేలాగా మార్పు చేసుకోవచ్చు. ఇక నొప్పుల సమస్యలు (పెయిన్ డిజార్డర్స్) ఉన్నవాళ్లు డాక్టర్‌ను సంప్రదించి వాటికి సంబంధించిన మందులు వాడాలి. వాకింగ్ వంటి వ్యాయమాలు చేయాలి. అయితే వాటిని ఉదయం వేళ చేయడం మంచిది. ఒకవేళ ఉదయం వీలుకాకపోతే రాత్రి నిద్రపోయే ముందర మాత్రం కఠినమైన వ్యాయామాలు చేయవద్దు. నిద్రకు ముందు చేసే కఠిన వ్యాయామాలు ఒక్కోసారి నిద్రపట్టకుండా చేయవచ్చు. మంచి నిద్ర పట్టడానికి చేసే పైన పేర్కొన్న మంచి అలవాట్లను ‘స్లీప్ హైజీన్’ నిర్వహణగా పేర్కొంటారు. ఈ ‘స్లీప్ హైజీన్’ను నిత్యం ఆచరించడం వల్ల మంచి నిద్ర పడుతుంది. పిల్లల్లో పక్క తడిపే అలవాటు పిల్లల్లో రాత్రి ఇబ్బందుల్లో ముఖ్యమైనది పక్క తడిపే అలవాటు. దీంతో వారు చాలా ఆత్మన్యూనతకు గురవుతుంటారు. ఇతర పిల్లలతో కలిసి బంధువుల ఇంటికీ, ఫంక్షన్లకూ వెళ్లలేరు. కనీసం కంబైన్డ్ స్టడీస్ కూడా చేయలేరు. పిల్లలు రాత్రిపూట నిద్రలో మూత్రవిసర్జన చేసే సమస్యను వైద్యపరిభాషలో నాక్టర్నల్ అన్యురిసిస్ అంటారు. సాధారణంగా 95 శాతం మంది పిల్లల్లో ఐదారేళ్లు వచ్చేసరికి నిద్రలో మూత్రవిసర్జనపై నియంత్రణ (బ్లాడర్ కంట్రోల్) సాధిస్తారు. కానీ 4 శాతం మంది పిల్లల్లో ఇది కొద్దిగా ఆలస్యం కావచ్చు. చాలా కొద్దిమందిలో అంటే 1 శాతం మందిలో పెద్దయ్యాక కూడా నిద్రలో మూత్రవిసర్జనపై నియంత్రణ లేకపోవడం చూస్తుంటాం. అయితే ఇది అబ్బాయిల్లో ఎక్కువ. ఇలాంటి సమస్య ఉన్న 20 శాతం మంది పిల్లల్లో సాధారణంగా యూరినరీ ట్రాక్ అబ్నార్మాలిటీస్ దీనికి కారణం కావచ్చు. ఇంకా నిద్రకు సంబంధించిన రుగ్మతలు (స్లీప్ డిజార్డర్స్), యాంటీ డైయూరెటిక్ హార్మోన్ (ఏడీహెచ్) లోపాలు, మానసికమైన కారణాలు, కొన్ని సందర్భాల్లో అడినాయిడ్స్ వల్ల నిద్ర సంబంధమైన సమస్యలు (స్లీప్ ఆప్నియా) వంటివి ఉన్నప్పుడు కూడా రాత్రివేళల్లో తెలియకుండానే మూత్రవిసర్జన చేస్తుంటారు. పిల్లల్లో ఈ సమస్య ఉంటే మూత్రపరీక్షలతో పాటు హార్మోనల్ ఎస్సే చేయించడం అవసరం. వాటిని బట్టి ఇది హార్మోన్లకు సంబంధించిన సమస్యా, కాదా అని తెలుసుకోవచ్చు. ఈ పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిద్రలో మూత్రవిసర్జన చేసే పిల్లలను కించపరచడం, శిక్షించడం వంటివి అస్సలు చేయకూడదు. సాయంత్రం ఆరు గంటల తర్వాత ద్రవాహారం చాలా తక్కువగా ఇవ్వడం, నాలుగు దాటాక కెఫిన్, చక్కెర ఉన్న పదార్థాలు పూర్తిగా ఇవ్వకపోవడం అవసరం. పడుకునేముందు ఒకసారి మూత్రవిసర్జన చేయించడం, నిద్రపోయిన గంటలోపు లేపి మళ్లీ ఒకసారి మూత్రవిసర్జన చేయించాలి. చికిత్స: ఇటీవల అందుబాటులోకి వచ్చిన అలారం వంటి పరికరాలతో బ్లాడర్‌పై నియంత్రణ సాధించేలా ప్రాక్టీస్ చేయించాలి. దీంతోపాటు డెస్మోప్రెసిన్, ఇమె ప్రమిన్ వంటి కొన్ని మందులు బాగా పనిచేస్తాయి. అలాంటి పిల్లలను కొన్ని స్ప్రేల సహాయంతో సామాజిక ఉత్సవాలకు నిర్భయంగా తీసుకెళ్లవచ్చు. అలాంటి చర్యల వల్ల పిల్లల్లో ఆత్మసై్థర్యం పెరుగుతుంది. ఈ సమస్యకు హార్మోన్ లోపాలు కారణం అయితే 3–6 నెలలపాటు మందులు వాడటం వల్ల ఈ సమస్యను 50 శాతం మందిలో సమర్థంగా అదుపు చేయవచ్చు. సమస్య అదుపులోకి రాకపోతే పిల్లల డాక్టర్ల ఆధ్వర్యంలో చికిత్స చేయించాలి. ఒకింత పెద్ద పిల్లల్లో రాత్రి సమస్యలు... ఇక కాస్తంత పెద్ద పిల్లల అంటే టీనేజ్‌లో ఉండే కౌమార బాలబాలికల్లో నైట్స్లీప్ సమస్యలు మరోలా ఉంటాయి. వాళ్లలో చాలామంది పిల్లలు రాత్రివేళ అకస్మాత్తుగా ఉలిక్కిపడి నిద్రలేస్తుంటారు. లేచాక చాలా భయపడుతుంటారు. ఈ సమస్యను నైట్ టెర్రర్స్ అంటారు. నైట్ టెర్రర్స్కు కారణాలు: సాధారణంగా మనకు కనుపాపలు వేగంగా కదలని (ఎన్‌ఆర్‌ఈఎమ్) దశలోని స్టేజ్ 3, స్టేజ్ 4 లలో మనసులో కలిగే కలల వంటి భావనలు గుర్తుండవు. కానీ ఆ సమయంలో అత్యంత భయంకరమైన కలలు వచ్చి, వాటికి భయపడి మెలకువ వచ్చినందున అవి గుర్తొచ్చి మరింత భయం వేస్తుంది. దీన్ని నైట్ టెర్రర్‌గా పేర్కొనవచ్చు. ఇది ఎన్‌ఆర్‌ఈఎమ్ స్టేజ్3, స్టేజ్4 లలో వచ్చే సమస్య. భయంకరమైన కలలు రావడం (నైట్మేర్) : ఇది కూడా ఎన్‌ఆర్‌ఈఎమ్ స్టేజ్3, స్టేజ్4లో వచ్చే సమస్య. గుర్తుకు రాని భయంకరమైన కలలు రావడం ఈ జబ్బు ప్రత్యేకత. నైట్ టెర్రర్స్ లేదా నైట్‌మేర్స్ సమస్యతో బాధపడే పిల్లల్లో చాలామందిలో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది. అందుకే ఈ సమస్యలు ఉన్నవారిని అటు సైకియాట్రిస్ట్‌లతో పాటు ఇటు స్లీప్ స్పెషలిస్ట్‌లకు చూపించి, తగిన చికిత్స తీసుకోవాలి. నైట్ స్లీప్ డిప్రవేషన్ (రాత్రివేళల్లో నిద్రలేమి) నైట్‌డ్యూటీలు చేసేవారిలో నిద్రలేమి సమస్య అంతకంతకూ పెరుగుతోంది. తగినంత నిద్రలేకపోవడంతో అనేక శారీరక, మానసిక సమస్యలొస్తాయి. నిద్రలేమి వల్ల కలిగే తక్షణ నష్టాలు ఏకాగ్రత లోపించడం అలసట / నిస్సత్తువ గుండె వేగం / గతిలో మార్పు తక్షణం స్పందించలేకపోవడం హుషారు తగ్గడం lమబ్బుగా / దిగులుగా ఉండటం చిరాకు, కోపం మానవ సంబంధాలు దెబ్బతినడం, కుటుంబ కలహాలు పెరగడం ఒళ్లునొప్పులు... ఇలాంటి అనేక సమస్యలు కనిపిస్తాయి. దీర్ఘకాలిక నష్టాలు మతిమరపు మెదడు ఎదుగుదలలో లోపం పిల్లల ఎదుగుదలలో లోపం అధిక రక్తపోటు గుండెజబ్బులు స్థూలకాయం డయాబెటిస్ జీర్ణకోశ సమస్యలు రోగనిరోధక శక్తి తగ్గడం గాయాలు మానే ప్రక్రియ ఆలస్యం కావడం జీవన వ్యవధి (లైఫ్ స్పాన్) తగ్గడం. నిద్రలేమి వల్ల కలిగే / పెరిగే మానసిక సమస్యల్లో కొన్ని... నిద్రలేమి వల్ల మానసిక సమస్యలు పెరుగతాయి. చాలా మానసిక సమస్యల్లో కనిపించే ముఖ్యమైన లక్షణం నిద్రలేమి. ముఖ్యంగా మూడ్ డిజార్డర్స్, యాంగై్జటీ డిజార్డర్స్, సైకోసిస్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) సమస్యల్లో నిద్రలేమి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లల్లో... అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) వంటి లక్షణాలు ∙మెదడు ఎదుగుదలలో లోపం, ∙జ్ఞాపకశక్తి లోపించడం పెద్దల్లో... ∙యాంక్సైటీ డిజార్డర్స్ ∙ డిప్రెషన్ ∙సైకోసిస్ ∙మాదక ద్రవ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి రావడం. నిద్రలేమి సమస్య తగ్గడానికి తగినంత నిద్రపట్టేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలతో తగ్గకపోతే వైద్యనిపుణులను సంప్రదించాలి. -
కేజీబీవీల్లో నైట్‌డ్యూటీ గోల!
అనంతపురం ఎడ్యుకేషన్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయల్లో నైట్‌డ్యూటీ గోల మొదలైంది. ఎప్పుడూ లేని విధంగా కంప్యూటర్ ఆపరేటర్లు, ఒకేషనల్ ఎడ్యుకేషన్ టీచర్లు, అకౌంటెంట్లను నైట్ డ్యూటీలకు నియమించడంపై వారి నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఆడపిల్లలు ఉండే కేజీబీవీల్లో రాత్రిపూట వారికి రక్షణగా ఎస్ఓ, సీఆర్టీలు, పీఈటీ, ఏఎన్ఎంలను నియమిస్తూ ఎస్పీడీ ఉత్తర్వులు జారీ చేశారు. రోజూ ఇద్దరు ఉద్యోగులు నైట్‌డ్యూటీ చేయాల్సి ఉంది. ఇన్ని రోజులూ ఇలానే కొనసాగుతూ వస్తోంది. అయితే జిల్లా అధికారులు మరో అడుగు ముందుకేసి పార్ట్‌టైం ఉద్యోగులనూ నైట్‌డ్యూటీలకు నియమించడం విమర్శలకు తావిస్తోంది. జీతం తక్కువ...పైగా నైట్‌డ్యూటీలు ఎస్ఓలకు రూ. 20 వేలు, సీఆర్టీలకు రూ. 14 వేలు, పీఈటీలకు రూ. 11 వేలు, ఏఎన్ఎంలకు రూ. 9 వేలు జీతాలు ఇస్తున్నారు. మరి తక్కువ వేతనాలు రూ. 5–6 వేలు తీసుకుంటున్న ఒకేషనల్ ఎడ్యుకేషన్ టీచర్లు, కంప్యూటర్ ఆపరేటర్లతోనూ నైట్‌డ్యూటీలు చేయించాలని నిర్ణయించడం బాధాకరమని వారు వాపోతున్నారు. వాస్తవానికి ఒకేషనల్ ఎడ్యుకేషన్ టీచర్లు పార్ట్‌టైం పద్ధతిన పిల్లలకు కుట్టు, అల్లికలు నేర్పించాలనే నిబంధన ఉంది. మరి అలాంటి ఉద్యోగులను రాత్రి విధులకు కేటాయించారు. పరిశీలిస్తున్నాం.. ఒకేషనల్ టీచర్లు, కంప్యూటర్ ఆపరేటర్లను నైట్‌డ్యూటీలకు నియమించలేదు. షెడ్యూలు ప్రకారం నియమించిన వారిలో ఎవరైనా గైర్హాజరైతే వారి స్థానంలో ఒకేషనల్ టీచర్లు, కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించే విషయమై పరిశీలిస్తున్నాం. – దశరథరామయ్య, పీఓ, ఎస్ఏఎస్ -
అన్ని రంగాల్లో మహిళలకు రాత్రి విధులు
- కార్మిక చట్టాల్లో మార్పులు తెచ్చిన కర్ణాటక ప్రభుత్వం - రాత్రి విధులు ప్రస్తుతం ఐటీ, ఆరోగ్య రంగాలకు మాత్రమే పరిమితం - ఇకపై జౌళి, సేవ, రీటైల్ తదితర రంగాలకు కూడా విస్తరణ - ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు - ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన సాక్షి,బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర కార్మిక చట్టాల్లో ప్రభుత్వం మార్పులు తెచ్చింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని రంగాల్లో మహిళలు రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఆరుగంటల వరకూ రాత్రి విధిలు నిర్వహించేలా త్వరలోనే అధికారిక ఉత్తర్వులు విడుదల చేయనుంది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న కార్మిక చట్టాలను అనుసరించి ఐటీ, ఐటీ సంబంధ రంగాలు, వైద్య, ఆరోగ్య తదితర విభాగాల్లో మాత్రమే మహిళలు రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఆరుగంటల వరకూ (నైట్‌షిఫ్ట్‌లో) పనిచేయడానికి అవకాశం ఉంది. మిగిలిన రంగాల్లో ఈ సదుపాయం లేదు. దీని వల్ల పురుషులతో పోలిస్తే మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయని తేలింది. సమస్య పరిష్కారం కోసం స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎస్ఈజెడ్)లోని అన్ని రకాల సంస్థలతో పాటు, జౌళి (వస్త్ర పరిశ్రమ), సేవ, రీటైల్ రంగాల్లోనూ మహిళలు నైట్‌షిఫ్ట్‌లలో పనిచేయడానికి అవకాశం కల్పించనుంది. ఈమేరకు రాష్ట్ర కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకురానుంది. ఇదిలా ఉండగా నైట్‌షిఫ్ట్‌లలో మహిళలను ఉద్యోగులుగా నియమించుకునే సంస్థలు కొన్ని నిబంధనలకు తప్పక పాటించాల్సి ఉంటుంది. ‘నైట్‌షిఫ్ట్‌లో కనీసం ఐదు మందికి తక్కువ కాకుండా మహిళా ఉద్యోగులు ఉండాలి. పనివేళలు ముగిసిన తర్వాత సదరు మహిళా ఉద్యోగులను వారి ఇంటి వద్ద దిగబెట్టడం పూర్తిగా సంస్థయాజమాన్యానిదే బాధ్యత. ఇందుకు ప్రత్యేక రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు ఒకే వాహనంలో కనీసం ఇద్దరు మహిళలు ఉండాలి. మహిళలు ఇంటి వద్ద దిగబెట్టేంత వరకూ వారికి రక్షణ సిబ్బంది ఉండాలి.’ తదితర నిబంధనలు అందులో ముఖ్యమైనవి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాత మహిళలకు అన్ని రంగాల్లోనూ నైట్‌షిఫ్ట్‌కు అనుమతి ఇస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుందని కార్మికశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ నిర్ణయం వల్ల మహిళలకు పురుషులతో సమానంగా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని కొంతమంది చెబుతుండగా నైట్‌షిఫ్ట్‌లో పనిచేసే మహిళల రక్షణ విషయం పట్ల కార్మికశాఖలోని ఉన్నతాధికారులే ఆందోళ వ్యక్తం చేస్తుండటం గమనార్హం. -
జాగరణం
రాత్రి మేల్కొని పగలు నిద్రపోతున్న కొత్త తరం ఇది. బ్రేక్‌ఫాస్ట్‌కు లంచ్ కలుపుకొని బ్రంచ్‌లు చేసి, గుడ్‌మార్నింగ్‌కు బదులు గుడ్‌నైట్ అంటూ విష్ చేసుకునే విచిత్ర ‘కాల’మిది.సిటీలో నైట్ డ్యూటీలు సర్వసాధారణమయ్యాయి. చందమామ అంతకంతకూ కొలీగ్స్‌ను పెంచుకుంటున్నాడు. ప్రతి రాత్రీ ఓ శివరాత్రిలా... నగర జీవనం నిత్య జాగారంలామారిపోతోంది. ..:: ఎస్.సత్యబాబు ఒకప్పుడు రాత్రి డ్యూటీలంటే గూర్ఖాలో, లారీ క్లీనర్‌లో... అందరూ నిద్రపోయే వేళలో పని చేసుకునే వారిని చూసి జాలిపడని వారుంటే ఒట్టు. రాత్రిపూట ఉద్యోగం చేసే అబ్బాయికి పెళ్లి సంబంధం దొరకడం కూడా కష్టమయ్యేది. మరిప్పుడో... ఫైన్ పేమెంట్ ఉంటే.. నైన్ టు ఫైవ్ అనేది పగలైనా, రాత్రయినా ఓకే అంటున్నారు. డ్యూటీస్‌కి మాత్రమేనా డ్యాన్సులకి కూడా డార్క్టైమ్ బెస్ట్ అనుకుంటున్నారు. దీంతో పబ్లూ, క్లబ్‌లూ, ఆఖరికి కాలనీలూ, సినీ స్టార్ల డాబాలు సైతం తెల్లవార్లూ గానా బజానాలకు వేదికలుగా మారిపోతున్నాయి. మొత్తం మీద నిశాచరత్వమే... నిత్యకృత్యం అయిపోయింది. సరదాలకూ సరే... బైక్ రేసింగ్‌ల నుంచి మల్టీఫ్లెక్స్ సినిమా హాళ్ల దాకా రకరకాల యాక్టివిటీస్‌కి రాత్రి వేదికగా మారిపోయింది. ట్రాఫిక్ తక్కువగా ఉండడంతో సెలబ్రిటీస్తోపాటు యూత్ కూడా నైట్ లైఫ్ అనుభూతిని సొంతం చేసుకోవడానికి రోడ్డెక్కుతోంది. ఇక ఇలా వచ్చేవారికోసం కాఫీషాప్‌లు, చాయ్ బండ్లు, సిగరెట్ కొట్లు అందుబాటులో ఉంటున్నాయి. రాత్రి పది పన్నెండింటిదాకా రెండో షిఫ్ట్ ఉద్యోగాలు చేసి ఇంటికి చేరినా వెంటనే నిద్రా దేవి ఒడిలోకి చేరుకోవడం లేదు జనం. టీవీ మొదలుకుని ఇంటర్నెట్లో సోషల్నెట్వర్క్లతో తెల్లవారుజాము దాకా జాగారాలు చేస్తున్నారు. వీటికి తోడు అప్పుడప్పుడు వచ్చే అకేషన్స్‌కి కూడా అర్ధరాత్రి రోడ్లు వేదికలవుతున్నాయి. అంతేనా... ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు రాత్రి సమయంలో షాప్‌లు, నైట్ బజార్లు అందుబాటులోకి వచ్చాయి. రెస్టారెంట్స్‌లో మిడ్నైట్ బిర్యానీలు సరేసరి. మొత్తం మీద అటు కెరీర్, ఇటు కేరింతలు కలిసి నగరజీవిని నిశాచరిగా, నిత్య జాగారమూర్తిగా మార్చేస్తున్నాయి. సూర్యదర్శనం అరుదు... రాత్రివిధులకు సిటిజనులు ఎంతగా అలవాటు పడిపోతున్నారంటే...‘పగలు తప్ప నైట్స్‌లో ఖాళీ దొరికినా నిద్రరాదు. ఆ టైమ్‌లో రోడ్లన్నీ సర్వే చేయడమే పని’అని సతీష్ అనే బీపీఓ ఉద్యోగి చెప్పాడు. ఇదే పరిస్థితి సరదాల కోసం తెల్లార్లూ తిరిగే వారికీ తప్పడం లేదు. సాధారణంగా నైట్షిప్ట్స్ సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతాయి. చివరగా ప్రారంభమయ్యే 12.30 గంటల షిఫ్ట్‌ని ‘దెయ్యాలు తిరిగే టైమ్’ అని మనం ఎలా అంటామో... కార్పొరేట్ ప్రపంచం ‘గ్రేవ్ యార్డ్ షిఫ్ట్’ అని దీన్ని పిలుస్తుంది. నైట్జాబ్స్ చేసేవాళ్లలో చాలామందికి సూర్యదర్శనం అరుదే. ‘రాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ పనిలో ఉంటాను. సూర్యుడు వచ్చేవేళకు ఇంట్లో నిద్రపోతుంటాను. వీకెండ్స్‌లో కూడా పగటి నిద్రే కాబట్టి... సూర్యుడ్ని కలవడం తక్కువే’అంటున్నాడు ఓ పబ్‌లో పని చేసే డీజే వంశీ. ‘మొదట షిఫ్ట్ టైమింగ్స్ చూసి భయం వేసింది. తొలి రోజుల్లో నిద్ర పెద్ద సమస్య అయింది. కాని తప్పదు కదా. మారిన దినచర్యకు అలవాటు పడడానికి 2 నెలలు పట్టింది’అని చెప్పాడు ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంపెనీలో నైట్‌షిఫ్ట్‌లో పనిచేసే సత్యేంద్రసింగ్ ఠాకూర్. జాగ్రత్తలు ప్లీజ్... పగలు పని చేయాలని, రాత్రి విశ్రమించాలని ప్రకృతి నిర్ధ్ధేశించింది. తప్పనిసరిగా రాత్రిళ్లు మేలుకుని ఉండేవాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించి సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ ‘అకాల’విధులు నిర్వహించే తొలిదశలో అలసట, తలనొప్పి, అజీర్తి... వెంటాడతాయి. అందుకే శారీరక మానసిక సమస్యలపై అవగాహన పెంచుకోవాలంటున్నారు వైద్యులు. వ్యాయామం తప్పనిసరని సూచిస్తున్నారు. ‘సరైన సమయానికి నిద్ర లేకపోతే పనిమీద ఏకాగ్రత చూపకపోవడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోలేకపోవడం, లైంగిక సామర్థ్యం తగ్గిపోవడం వంటి సమస్యలు సంభవిస్తాయి. అయితే ఏ పనైనా 20 రోజులు చేస్తే తర్వాతి రోజు నుంచి అలవాటుగా మార్చుకునే శక్తి మన దేహానికి ఉంది. కాబట్టి మరీ బెంబేలెత్తాల్సిన పనిలేకపోయినా... జాబ్ టైమింగ్స్‌కు తగ్గట్టుగా బాడీక్లాక్ని అడ్జెస్ట్మెంట్ చేసుకోవడం, ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త అవసరం’ అని చెబుతున్నారు ఆరెంజ్ క్లినిక్స్‌లో పనిచేస్తున్న ఫిజిషియన్ డాక్టర్ పాపారావు. జాగారపు జాబ్‌లెన్నో... ఒకప్పుడు రాత్రి మేల్కొని ఉండే జాబ్స్ అంటే... పొలీసులు, జైలు అధికారులు, గార్డులు, ైఫైర్ ఫైటర్స్, ప్రైవేట్ సెక్యూరిటీ, ప్రైవేట్ డిటెక్టివ్స్. ఇక హెల్త్‌కేర్‌లో డాక్టర్స్, నర్సుల నుంచి పలు విభాగాల్లో దిగువ స్థాయి సిబ్బంది దాకా రాత్రి విధుల అవసరం ఉంటుంది. హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో బౌన్సర్స్, బార్టెండర్స్, రెస్టారెంట్ కుక్స్, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, మీడియా... ఇలా అనేక రంగాల్లో నైట్ జాబ్స్ చేస్తున్నవారు అనేకం. మరోవైపు సాఫ్ట్వేర్, కాల్‌సెంటర్స్, బీపీఓలు, షాపింగ్ మాల్స్, కల్చరల్ సెంటర్లు... వంటి సరికొత్త, రాత్రి ఆధారిత కెరీర్లు కూడా ఒకటొకటిగా వీటికి జత కలుస్తున్నాయి. కాలానికి ఎదురీదుతూ నిర్వహించే ఈ విధులు కఠినమైనవైనా... మిగతా వాటితో పోల్చితే మెరుగైన ఆదాయం వస్తుండడంతో ఈ జాబ్స్‌పై మోజు పెరుగుతోంది. డే టైమ్‌లో జాబ్ చేసేవారు సైతం రాత్రి సగభాగం నిద్రపోవడం మానేసి, మంచి ఆదాయం కోసం మాల్స్‌లోనో, పబ్స్లోనో రాత్రివేళల్లో పార్ట్‌టైమ్ జాబ్స్ చేస్తున్నారు. -
సాఫ్ట్వేర్ కార్మికుడి హార్డ్‌కోర్ లైఫ్!
పొజెక్ట్ మేనేజర్లు, టీమ్ లీడర్లు మేకవన్నె పులుల్లా, గోముఖ వాఘ్రాల్లా కనిపిస్తారు! సమస్యలకు శ్రీకారం బ్యాక్‌పెయిన్, పాతికేళ్ల వయసుకే కళ్లకింద క్యారీబ్యాగుల టెన్షన్! నైట్ డ్యూటీతోనే జుట్టూడుతోందనే విశ్లేషణలు! కాలేజీ ఉన్నన్ని రోజులూ...ఎప్పుడెప్పుడు ఉద్యోగాలు సాధిద్దామా, డబ్బులు సంపాదిద్దామా అనే ఆరాటం! పర్సెంటీజీల గొడవలు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ల ఫేక్ ల అనంతరం... ఇంటర్వ్యూకు అదృష్టాన్ని కూడా తోడు తీసుకెళ్లి ఉద్యోగం సాధించి, అందులో జాయిన్ అవ్వడం... అక్కడ నుంచి మొదటి నెల- పనితక్కువ, ఎంజాయ్మెంట్ ఎక్కువ! రెండో నెల- పని ప్లస్ ఎంజాయ్మెంట్...ఓకే! మూడో నెల- ఆఫీస్ రాజకీయాలు, పని ఎక్కువవుతోందనే ఫీలింగ్ స్టార్ట్! పక్కటీమ్లో మేనేజర్ మంచి వాడయ్యుంటాడు! అదే టీమ్‌లో అమ్మాయిలు కూడా బాగుంటారు! జీతాలు కూడా బాగా పెరుగుతాయంట! పనికూడా పెద్దగా ఉండదట! మన టీమ్‌లో ఇలాంటి ఊసే లేదే! ఎప్పుడూ తోముడు కార్యక్రమమే! జాబ్ వదిలేద్దామనే ఆలోచన మొదలు! ఆన్సైట్ నుంచి అర్ధరాత్రి వాయింపులు! ప్రొజెక్ట్మేనేజర్లు, టీమ్ లీడర్లు మేకవన్నె పులుల్లా, గోముఖ వ్యాఘ్రాల్లా కనిపిస్తారు! సమస్యలకు శ్రీకారం బ్యాక్‌పెయిన్, పాతికేళ్ల వయసుకే కళ్లకింద క్యారీబ్యాగుల టెన్షన్! నైట్ డ్యూటీతోనే జుట్టూడుతోందనే విశ్లేషణలు! ఇంటికి ఒక చుట్టం అయిపోయినట్టే! ఊరెళ్లేది ఎప్పుడో! జీతంపడుతూ ఉంటుంది, సంపాదనను ఖర్చులకు ధారపోయగా మిగిలినదాంట్లో తెలివైన వాడు ఐతే హోమ్లోన్ల మీద, మనలాంటోడు అయితే మందు, సిగరెట్, గాలి తిరుగుడు మీద తగలేస్తాడు ఇలా జీవితం బీభత్సమైన ప్రశాంతతతో కొనసాగుతుండగానే ఒక రోజు... కొలీగ్ పెళ్లి సెటిలయ్యిందని పిలుస్తాడు. మనకూ ఒక గాల్‌ఫ్రెండ్ ఉంటే బావుండననే కోరిక మదిలో మెదులుతుంది. మన వర్కింగ్ స్పాట్లో 95 శాతం నార్తిండియన్స్, పెళ్లైన కేటగిరి!మిగిలిన ఐదు మందిలో నలుగురిని ఫ్రెండ్స్ లేదా అక్క అంటేనే బెటరనేలా ఉంటారు. మిగిలిన ఒక్క అమ్మాయి కోసం టీమ్ అంతా ఊరకుక్కళ్లా కొట్టేసుకుంటాం! ఆ అమ్మాయి మాత్రం ఎవరితోనూ కమిటవ్వకుండా, అందరితోనూ చక్కటి అనుబంధాలను గడుపుతూ ఒకరోజు తన బావతో పెళ్ళి అని పెండ్లిపత్రికలు తెచ్చిస్తుంది! ఇంకేముంది.. అందరూ కలిసి కూర్చుని మందు కొట్టేసి ఆ అమ్మాయి మంచిది కాదు అని తీర్మానించి, ఇంకో అమ్మాయి గురించి వేట మొదలు...! ఇంతలోనే... ఉద్యోగ సమీక్షలు వస్తాయి...‘నువ్వు ఎక్సలెంట్, నువ్వు లేనిదే కంపెనీ లేదు, కత్తి కమాల్... ఇలాంటి ఎగస్ట్రాలు ఎన్నో చెప్పి, ఊరించి చివర్లో ‘బట్’ అంటారు. తీరా చూస్తే నీ జీతంలో ఇంకో సెనక్కాయ పెంచాం పో... అంటారు! ఆ రాత్రికి రెజ్యూం అప్డేట్ చేయాలి అని గత ఆరు నెలలుగా తీసుకుంటున్న నిర్ణయాన్ని మరోసారి స్మరించి...అలా వచ్చిన సెనక్కాయల మీదే అలా అలా బతికేస్తుంటాము! అప్పుడప్పుడనిపిస్తూ ఉంటుంది... మరపురావు కాలేజీ రోజులూ అని... (ఫేస్బుక్లో సర్క్యులేట్ అవుతున్న ఒక పోస్ట్) -
నేను, మా బుడ్డోడూ... నా నైట్‌డ్యూటీల కథ!
‘‘అందరూ నిద్రపోయే వేళల్లో మీరు మేల్కొని పని చేస్తుంటారు. అందరూ మేల్కొనే టైమ్‌లో నిద్రపోతుంటారు. ఎందుకండీ పాపం అలా’’ అని నన్నడుగుతుంటారు చాలా మంది. పైగా నేను ఇంటికొచ్చే టైమ్‌కు మా బుడ్డోడు నిద్రపోతుంటాడనీ, వాడితో ఆడుకునేందుకు నాకు టైమే ఉండదనీ జాలి పడుతుంటారు. పైకి వాళ్ల మాటలతో ఏకీభవిస్తున్నట్లు నటిస్తుంటా. నేనెంతో అమితంగా బాధపడుతున్నట్లు ఫేసు పెడుతూ, పోజు కొడుతూ... లోలోన మాత్రం నా టైమింగ్స్ పట్ల అనంతంగా ఆనందపడుతుంటా. జర్నలిస్టునై రాత్రి డ్యూటీలు చేస్తూ బతికిపోతున్నాను గానీ... అలాక్కాకుండా అందరిలా మామూలు టెన్ టు ఫైవ్ డ్యూటీ చేస్తే అదెంత నరకమో కదా అనుకుంటూ ఉంటా. కారణం బయటకు వెల్లడించాలని లేకపోయినా, మనసాగదు కాబట్టి రహస్యంగా మీకు చెబుతున్నా. మీరెక్కడా దీన్ని బయటపెట్టొద్దు... నా గుట్టు విప్పొద్దు. మాటివ్వండి ప్లీజ్. ********* పిల్లలకు కథలు చెప్పే రోజులవీ పోతున్నాయని బాధపడుతుంటారు మేధావులు. ఆ రోజులన్నీ మళ్లీ రావాలన్నది బోల్డుమంది సాహిత్యవేత్తల కోరిక. పెద్దల మాట చద్ది మూట కదా. అందుకే పాటిద్దామని మా బుడ్డోడి దగ్గర ప్రయత్నం మొదలుపెట్టా. మనం ఏదో ఉద్ధరించేస్తున్నాం... చాలా గొప్పపని చేస్తున్నాం అన్న ఫీలింగ్‌తో మా ఎనిమిదేళ్ల బుడ్డోడికి కథ చెప్పడం మొదలుపెట్టా. దాహంగా ఉన్న కాకి కుండలో రాళ్లు వేసి, నీళ్లు పైకొచ్చేలా చేసి ఎలా దాహం తీర్చుకుందో చెప్పా. కథతో పాటు యుక్తి కూడా నేర్చుకోవాలని చిన్న సైజు ఉపన్యాసం కూడా ఇచ్చా. రాయి ఆక్రమించిన చోటు మేరకు నీళ్లు పైకి లేస్తాయనీ, ఈ సత్యాన్ని అప్పట్లో ఆర్కిమెడిస్సూ, ఈ కథలో సైన్సు ఉందన్న సంగతిని నేను మాత్రమే కనిపెట్టాననీ, ఇలా పిల్లల కథల్లో సైన్సు సంగతులు కూడా ఉంటాయని బోధించా. ఒక్క కాకి కథలోనే కాస్త యుక్తి, కొంచెం సైన్సు, బోలెడంత సమయస్ఫూర్తి ఉన్నాయనీ... అందుకే ఈ కాకి కథ తరతరాలుగా అలా కొనసాగుతోందని చెప్పా. వాడు ఈ కథను తన పిల్లలకూ చెప్పాలన్న ఆశాభావం వ్యక్తం చేశా. మా బుడ్డోడికి కథ చెబుతూ ఏదో దేశ సేవ చేస్తున్నానన్న ఫీలింగ్‌ను ఓ ప్రశ్నతో ఒక్కసారిగా దెబ్బకొట్టాడు మావాడు. అదేంటంటే... ‘‘నాన్నా... కాకి ఇంటెలిజెంటా? లేక నీలాగే మొద్దా?’’ అని అడిగాడు వాడు. ‘‘ఎందుకురా... నీకలాంటి డౌటెందుకు వచ్చింది’’ నోరెండిపోతుండగా అడిగా. ‘‘మరి మా ఈవీఎస్ (ఎన్విరాన్మెంట్ స్టడీస్) బుక్‌లో ‘బిజీమంత్’ అనే ఒక లెసన్ ఉంది. అందులో ఏ పక్షి ఎలాంటి గూడు కడుతుందో ఉంది. కోయిల గూడు కట్టదట. కాకి గూట్లో అది తన గుడ్లు పెడుతుందట. కాకి వాటిని కూడా గుర్తుపట్టక పొదిగి, పిల్లలు పుట్టాక కూడా కొంతకాలం పెంచుతుందని ఉంది. మరి అప్పుడు కాకి ఇంటెలిజెంట్ అంటూ నువ్వు చెప్పిన కథ రాంగ్ కదా? అది నీలాగే మొద్దే కదా’’ అంటూ లాజిక్ పాయింట్ తీశాడు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. మళ్లీ వాడే అందుకున్నాడు. ‘‘నీకు మ్యాథ్స్ రావని చెబుతుంటావు కదా. అలాగే తాను ఎన్ని గుడ్లు పెట్టిందో... ఎగస్ట్రా మరెన్ని గుడ్లు తోడయ్యాయనే అడిషన్స్ తెలియనప్పుడు, కాకి కూడా నీలాగే డల్ అన్నట్టే కదా’’ అన్నాడు వాడు. దాంతో నన్నూ, కాకినీ ఒకే చేత్తో విదిలించేసినట్లుగా ఫీలై ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయా. నా బిక్కమొహం చూసి వాడికే జాలేసినట్లుంది. అందుకే మళ్లీ నన్ను ఓదార్చుతున్నట్లు వాడే ఒక మాట అన్నాడు. ‘‘నువ్వు చెప్పిందాన్ని బట్టి నాకొకటి అనిపిస్తోంది నాన్నా...’’ సాలోచనగా అంటున్నట్లు ఒక పోజు పెట్టి... ‘‘కుండ అడుగుకు చేరిన రాయి పరిమాణమూ ఈజీక్వొల్ టూ పైకి లేచిన నీళ్ల పరిమాణమూ అని గుర్తుపట్టింది. గూట్లో టోటల్ గుడ్లు ఎన్నున్నాయనేది మాత్రం లెక్కపెట్టలేకపోయింది కాబట్టి... కాకి సైన్సులో సమ్వాట్ బెటర్. కానీ మ్యాథ్స్‌లో పూర్ నాన్నా’’ అంటూ తేల్చాడు. హమ్మయ్య! మరీ నన్ను కాకిలా తీసిపారేయలేదంటూ నిట్టూర్చేలోపు ఫినిషింగ్ టచ్ ఇలా ఇచ్చాడు... ‘‘కాబట్టి... లెక్కలూ, కూడికలూ చక్కగా రాకపోయినా కాకి ఎంతో కొంత ఇంటెలిజెంటే... నీలాగ మొద్దు కాదు’’ అంటూ తేల్చిపారేశాడు. దానికీ కారణం ఉంది. ********* ‘‘కాకుల రంగు మారి అవి తెల్లగా కావాలంటే ఏం చేయాలో తెలుసా నాన్నా?’’ అడిగాడు వాడు. కాకి అంటేనే నాలాగే కారునలుపుగా ఉంటుందని, నలుపు నాణ్యమైనది కాబట్టి ఒక పట్టాన వదిలిపోదని అని వాడికి అర్థమయ్యేలా శాస్త్రీయంగా చెప్పాలని అనుకున్నా. కానీ ఈలోపే వాడు బాంబు పేల్చాడు. ‘‘సింపుల్... కాకికి ఫెయిర్ అండ్ లౌలీ రాస్తే సరి’’ అన్నాడు. దాంతో నేను ఒకటి నిశ్చయించుకున్నా. ఇకపై మా బుడ్డోడికి కాకమ్మ కథలు చెప్పొద్దని. ********* ‘‘నీ తలలో అంతా చెత్తే ఉంది కదా నాన్నా’’ అన్నాడు మా బుడ్డోడు. ఆ దెబ్బకే నేను అద్దిరిపోతుంటే... ‘‘అన్నట్టు నాన్నా ఆ చెత్తనంతా అక్కడికి వెళ్లేలా ఎలా మేనేజ్ చేశావు?’’ అంటూ మళ్లీ ఇంకోప్రశ్న. ‘‘ఎందుకురా ఇలా అడిగావు’’ అంటే దానికి ఓ ఫ్లాష్‌బ్యాక్ చెప్పాడు వాడు. ఓరోజున... ‘అవ్మూ...! కడుపు నొప్పి’ ఏడుస్తూ వచ్చాడు మావాడు. ‘అన్నం తినవు. నేను చేత్తో కలిపి పెడతానన్నా వినవు. ఉంచితే కడుపును ఖాళీగా ఉంచుతావు. లేదంటే... అడ్డమైన చెత్తాచెదారం అందులో పడేస్తావు. ఆ చెత్త వల్లనే నీకు ఆ నొప్పి’ అంది మా ఆవిడ మా బుడ్డోడికి కడుపునొప్పి మందు తాగిస్తూ విసుగ్గా. ఇదంతా తెలియని నేను మామూలుగా వచ్చేసి ‘అబ్బా... తలనొప్పి, కాస్తంత కాఫీ ఇవ్వు’ అన్నా మా ఆవిడతో. అంతే... ‘తల్లోని ఆ ఖాళీ ప్లేస్‌కి చెత్తా చెదారాన్ని ఎలా పంపించగలిగావు నాన్నా.?’ అంటూ బోలెడంత క్యూరియస్‌గా అడిగాడు. అక్కడితో ఆగలేదు వాడు... ‘కాకి స్కావెంజర్ అన్నావు కదా... నీ తల మీద పొడిచి లోపలి చెత్తను క్లీన్ చేసే అవకాశం ఉంటుందంటావా?’’ అని అడిగాడు. దాంతో అసలు తలనొప్పికి తోడు.. మా బుడ్డోడి షాక్‌తో తగిలిన తలబొప్పితో కణతలూ, తలా ఇత్యాది అవయవాలన్నింటినీ ఏకకాలంలో తడుముకున్నా. ఇకపై ఒక విషయంలో భీషణ ప్రతిజ్ఞ చేసుకున్నా. ఎక్కడ, ఎంతగా నొప్పి వచ్చినా మా బుడ్డోడి ముందు అస్సలు బయట పడొద్దని. ఇలాంటి ఎన్నో సంఘటనల తర్వాత నాకు అర్థమైన విషయం ఒక్కటే... అవును. నేను నేననుకున్నంత తెలివైన వాడిని కాదు. పైగా ఆ విషయాన్ని పసిగట్టగల పసివాడు కాని పసివాడు మా బుడ్డోడు. అందుకే వాడికి కథలూ, కబుర్లూ చెబితే అవి నా పట్ల కాకరకాయలవుతున్నాయి. అందుకే వాడికి కాకమ్మ కథలూ, కబుర్లూ, పాఠాలు, గీఠాలూ చెప్పకుండా ఉండేందుకు వీలుగా, నేను ఇంటికి వెళ్లేసరికి వాడు పడుకుని ఉండేలా... రాత్రి డ్యూటీలున్న జర్నలిస్టు ఉద్యోగం చేస్తున్నందుకు లోలోపల హ్యాపీగా ఫీలవుతుంటా. బయటకు మాత్రం ‘‘అదేం ఉద్యోగం లెండి. పెళ్లాం పిల్లలతో గడుపుదామంటే టైమే ఉండదు. మా బుడ్డోడికి లెసన్స్ చెబుదామంటే వీలే ఉండదు’’ అంటూ పత్తిత్తు కబుర్లు చెబుతూ ఉంటా. - యాసీన్