సగం నష్టపోనున్న ఆర్టీసీ ఉద్యోగులు
రోజుకు 10వేలమంది ఉద్యోగులకు నష్టం
టీడీపీ కూటమి ప్రభుత్వ తీరుపై సర్వత్రా మండిపాటు
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. నైట్ డ్యూటీ అలవెన్స్‌ల్లో భారీ కోత విధించింది. దీంతో రాష్ట్రంలో సగటున రోజుకు నైట్‌డ్యూటీలు చేసే 10వేలమంది ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోనున్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో భారీగా నైట్ డ్యూటీ అలవెన్స్‌లు తీసుకున్న ఆర్టీసీ ఉద్యోగులకు ప్రస్తుతం అందులో సగానికి పైగా కోత పడనుంది. నైట్ డ్యూటీ అలవెన్స్‌లను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటిస్తూనే టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులను నిండా ముంచిన తీరు ఇలా ఉంది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జీతాలతోపాటే నైట్‌డ్యూటీ అలవెన్స్‌లు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన అనంతరం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బందికి నైట్ డ్యూటీ అలవెన్స్‌లను అమలు చేసింది. అంతేకాదు నైట్ డ్యూటీ అలవెన్స్‌లను ప్రతి నెలా జీతాలతోపాటే చెల్లించింది.
నైట్ డ్యూటీ చేస్తే రోజుకు కనీసం రూ.300 అలవెన్స్‌గా నిర్ణయించింది. గరిష్టంగా రోజుకు రూ.500వరకు కూడా వచ్చేట్టుగా చూసింది. దాంతో నైట్ డ్యూటీ చేసే ఒక్కో డ్రైవర్, కండక్టర్, గ్యారేజీ సిబ్బంది నెలకు రూ.5వేల నుంచి రూ.7వేల వరకు అదనపు ప్రయోజనం చేకూరేది.
కూటమి ప్రభుత్వంలో అలవెన్స్ నిలిపివేత... భారీ కోత
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నైట్ డ్యూటీ అలవెన్స్‌లను నిలిపివేసింది. దాంతో ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, గ్యారేజ్ సిబ్బంది తీవ్రంగా నష్టపోయారు. నైట్‌డ్యూటీ అలవెన్స్‌లను పునరుద్ధరించాలని ఆర్టీసీ యూనియన్లు ఆరు నెలలుగా ప్రభుత్వాన్ని కోరుతునే ఉన్నాయి. దాంతో తప్పక నైట్‌డ్యూటీ అలవెన్స్‌లను పునరుద్ధరించిన టీడీపీ ప్రభుత్వం వాటిలో భారీ కోత విధించి తన అసలు బుద్ధిని ప్రదర్శించింది.
నైట్ డ్యూటీ అలవెన్స్ రోజుకు రూ.150కు పరిమితం చేసింది. అంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో ఏకంగా 50శాతం కోత విధించింది. దాంతో నైట్‌డ్యూటీ చేసే కండక్టర్లు, డ్రైవర్లు, గ్యారేజీ సిబ్బందికి నెలకు రూ.2వేల నుంచి రూ.3వేలే దక్కనుంది.
రోజుకు 10వేలమందికి నష్టం
ఆర్టీసీ 10వేల బస్ సర్వీసులను నిర్వహిస్తోంది. రోజుకు దాదాపు 4వేల బస్‌లు ఇతర ప్రాంతాల్లో నైట్ హాల్ట్‌గా ఉంటాయి. ఒక బస్సుకు ఇద్దరు (కండక్టర్, డ్రైవర్) చొప్పున 4వేల బస్‌లకు 8వేల మంది నైట్ డ్యూటీ చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో 129 ఆర్టీసీ గ్యారేజ్‌ల్లో నైట్ డ్యూటీ సిబ్బందితో కలిపి రోజుకు దాదాపు 10వేలమంది ఉద్యోగులు నైట్‌డ్యూటీలు చేస్తున్నారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం నైట్ డ్యూటీ అలవెన్స్‌లలో 50శాతం కోత విధించడంతో రోజుకు 10వేలమంది ఆర్టీసీ ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు ఆర్థికంగా నష్టకలిగించే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment