అన్ని రంగాల్లో మహిళలకు రాత్రి విధులు
- కార్మిక చట్టాల్లో మార్పులు తెచ్చిన కర్ణాటక ప్రభుత్వం
- రాత్రి విధులు ప్రస్తుతం ఐటీ, ఆరోగ్య రంగాలకు మాత్రమే పరిమితం
- ఇకపై జౌళి, సేవ, రీటైల్ తదితర రంగాలకు కూడా విస్తరణ
- ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు
- ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన
సాక్షి,బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర కార్మిక చట్టాల్లో ప్రభుత్వం మార్పులు తెచ్చింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని రంగాల్లో మహిళలు రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఆరుగంటల వరకూ రాత్రి విధిలు నిర్వహించేలా త్వరలోనే అధికారిక ఉత్తర్వులు విడుదల చేయనుంది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న కార్మిక చట్టాలను అనుసరించి ఐటీ, ఐటీ సంబంధ రంగాలు, వైద్య, ఆరోగ్య తదితర విభాగాల్లో మాత్రమే మహిళలు రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఆరుగంటల వరకూ (నైట్‌షిఫ్ట్‌లో) పనిచేయడానికి అవకాశం ఉంది. మిగిలిన రంగాల్లో ఈ సదుపాయం లేదు.
దీని వల్ల పురుషులతో పోలిస్తే మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయని తేలింది. సమస్య పరిష్కారం కోసం స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎస్‌ఈజెడ్)లోని అన్ని రకాల సంస్థలతో పాటు, జౌళి (వస్త్ర పరిశ్రమ), సేవ, రీటైల్ రంగాల్లోనూ మహిళలు నైట్‌షిఫ్ట్‌లలో పనిచేయడానికి అవకాశం కల్పించనుంది. ఈమేరకు రాష్ట్ర కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకురానుంది. ఇదిలా ఉండగా నైట్‌షిఫ్ట్‌లలో మహిళలను ఉద్యోగులుగా నియమించుకునే సంస్థలు కొన్ని నిబంధనలకు తప్పక పాటించాల్సి ఉంటుంది. ‘నైట్‌షిఫ్ట్‌లో కనీసం ఐదు మందికి తక్కువ కాకుండా మహిళా ఉద్యోగులు ఉండాలి. పనివేళలు ముగిసిన తర్వాత సదరు మహిళా ఉద్యోగులను వారి ఇంటి వద్ద దిగబెట్టడం పూర్తిగా సంస్థయాజమాన్యానిదే బాధ్యత.
ఇందుకు ప్రత్యేక రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు ఒకే వాహనంలో కనీసం ఇద్దరు మహిళలు ఉండాలి. మహిళలు ఇంటి వద్ద దిగబెట్టేంత వరకూ వారికి రక్షణ సిబ్బంది ఉండాలి.’ తదితర నిబంధనలు అందులో ముఖ్యమైనవి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాత మహిళలకు అన్ని రంగాల్లోనూ నైట్‌షిఫ్ట్‌కు అనుమతి ఇస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుందని కార్మికశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ నిర్ణయం వల్ల మహిళలకు పురుషులతో సమానంగా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని కొంతమంది చెబుతుండగా నైట్‌షిఫ్ట్‌లో పనిచేసే మహిళల రక్షణ విషయం పట్ల కార్మికశాఖలోని ఉన్నతాధికారులే ఆందోళ వ్యక్తం చేస్తుండటం గమనార్హం.