Labor Laws
-
బంగ్లాదేశ్ నోబెల్ గ్రహీతకు 6 నెలల జైలు
ఢాకా: బంగ్లాదేశ్ ఆర్థిక వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్(83)కు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మరో ముగ్గురితో కలిసి ఆయన స్థాపించిన గ్రామీణ్ టెలికం సంస్థలో కార్మికుల సంక్షేమ నిధిని నెలకొల్పడంలో విఫలమైనట్లు మూడో కార్మిక న్యాయస్థానం జడ్జి షేక్ మరీనా సుల్తానా సోమవారం యూనస్‌కు ఆరు నెలల జైలు శిక్ష విస్తూ తీర్పు వెలువరించారు. అంతేకాదు, తలా రూ.19 వేల జరిమానా విధించారు. అనంతరం వారు పెట్టుకున్న పిటిషన్ల మేరకు నలుగురికీ బెయిల్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ తీర్పును వీరు హైకోర్టులో సవాల్ చేసుకునే వీలుంటుంది. ఈ నెల 7న బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. -
వారంలో 4 రోజుల పని.. మూడు వీకాఫ్‌లు!
2022-23 ఆర్ధిక సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కేంద్రం కార్మిక శాఖ తన ప్రతి పాదనల్ని కేంద్రానికి పంపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే జరిగితే మనదేశంలో వారానికి నాలుగు రోజులు వర్కింగ్ డేస్, మూడు వీక్ ఆఫ్‌లు వర్తించనున్నాయి. పీటీఐ కథనం ప్రకారం..కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది ప్రారంభం నుంచి నాలుగు కొత్త లేబర్ కోడ్లను అమలు చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు పీటీఐ తన కథనంలో పేర్కొంది. ముఖ్యంగా వేతనాలు, సోషల్ సెక్యూరిటీ, ఇండస్ట్రీయల్ రిలేషన్స్, ఆక్యుపంక్షనల్ సేఫ్టీ అనే ఈ నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయనుంది. ఎంప్లాయిమెంట్, వర్క్ కల్చర్, టేక్ హోమ్ శాలరీ, వర్కింగ్ అవర్స్, నెంబర్ ఆఫ్ వీక్ ఆఫ్ అంశాలు లేబర్ కోడ్ కిందకి రానున్నాయి. కొత్త లేబర్ కోడ్ అమలైతే.. కేంద్రం లేబర్ కోడ్లను అమలు చేస్తే దేశంలో ఉద్యోగులు వారానికి ఐదురోజులకు బదులు 4 రోజుల పనితో పాటు 3రోజులు వీక్ ఆఫ్ తీసుకునే అవకాశం రానుంది. అయితే నాలుగురోజుల పనిదినాలతో పాటు 3రోజుల వీక్ ఆఫ్ తీసుకోనే సౌలభ్యం పొందాలంటే రోజుకు 12గంటల పనిచేయాల్సి ఉంటుంది. అంటే నాలుగు రోజుల పాటు 48గంటలు పనిచేసేలా కేంద్ర కార్మికశాఖ ప్రతిపాదనలతో వస్తున్నట్లు తెలుస్తోంది. తక్కువ జీతం, ఎక్కువ పీఎఫ్ కేంద్ర కార్మిక శాఖ ప్రతిపాదిస్తున్న నాలుగు కొత్త లేబర్ కోడ్ల కారణంగా శాలరీ, పీఎఫ్‌లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా ఉద్యోగి చేతికి వచ్చే జీతం తక్కువ, పీఎఫ్ ఎక్కువ కట్ అవుతుందని అంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేసే అవకాశం..!? కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నాలుగు లేబర్ కోడ్ల క్రింద నియమాలను ఖరారు చేసినట్లు సమాచారం.ఈ నాలుగు లేబర్ కోడ్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2022-23లో అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం ఈ కోడ్లకు సంబంధించిన ముసాయిదా నిబంధనల కేంద్రం పూర్తి చేసింది. అయితే ఈ అంశం కార్మిక విభాగానికి చెందింది కాబట్టి రాష్ట్రాలు కూడా వీటిని ఒకేసారి అమలు చేయాలని కేంద్రం కోరుతుందని సీనియర్ ప్రభుత్వ అధికారి వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ పీటీఐ పేర్కొంది. కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ ఏం చెప్పారు కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ ఈ వారం ప్రారంభంలో రాజ్యసభకు ఇచ్చిన ప్రత్యుత్తరంలో వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల గురించే ఈ లేబర్ కోడ్ ను అమలు చేయనున్నట్లు తెలిపారు. చదవండి: భారతీయ విద్యార్ధులకు జాక్ పాట్, ఏడాదికి శాలరీ రూ.2.16 కోట్లు..! -
సంస్కరణలంటే కార్మిక చట్టాల రద్దు కాదు
న్యూఢిల్లీ: సంస్కరణలంటే కార్మిక చట్టాలను రద్దు చేయడం కాదనీ, కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. కోవిడ్–19, లాక్డౌన్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న వాణిజ్య కార్యకలాపాలు తిరిగి వేగవంతం చేసే చర్యల్లో భాగంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్మిక చట్టాల సవరణకు యత్నించడంపై ఆయన స్పందించారు. ‘అంతర్జాతీయ కార్మిక సంఘం(ఐఎల్వో)లో భారత్ సభ్యదేశం అయినందున కార్మిక చట్టాలను రద్దు చేయడం కుదరదని కేంద్రం తన వైఖరిని రాష్ట్రాలకు ఇప్పటికే స్పష్టం చేసింది. కార్మిక చట్టాల్లో సంస్కరణలు తేవడం అంటే పూర్తిగా ఆ చట్టాలను రద్దు చేయడం కాదు. ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను రక్షించేందుకు కట్టుబడి ఉంది’అని అన్నారు. -
ఈ నెల 8న బ్యాంక్‌లు, ఏటీఎమ్‌లు బంద్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాలను, బ్యాంకింగ్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ బ్యాంక్ యూనియన్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బ్యాంక్‌లు బంద్ చేపడుతున్నాయి. ఈ నెల 8న(బుధవారం) విధులకు రావొద్దని బ్యాంక్ యూనియన్లు ఉద్యోగులకు సూచించాయి. కేంద్ర ట్రేడ్ యూనియన్లు చేపడుతోన్న ఆల్ ఇండియా జనరల్ స్ట్రయిక్‌లో పాల్గొనాలని బ్యాంక్ యూనియన్లు కూడా నిర్ణయించాయి. దీంతో సమ్మె ప్రభావం దేశవ్యాప్తంగా బ్యాంకులపై పడనున్నాయి. బుధవారం రోజున బ్రాంచ్‌ల్లో జరిగే సాధారణ బ్యాంకింగ్ సేవలన్నీ నిలిచిపోనున్నాయి. ఈ సమ్మె ప్రభావం ఏటీఎం సేవలపై కూడా చూపనున్నట్టు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు మాత్రం ఈ సమ్మెకు ప్రభావితం కావు. స్ట్రయిక్ రోజు ఎలాంటి క్లరికల్ వర్క్‌ను చేపట్టవద్దని తమ సభ్యులను ఆదేశించినట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్(ఏఐబీఓసీ) జనరల్ సెక్రటరీ సౌమ్య దత్తా చెప్పారు. -
కేంద్రం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తోంది: నాయిని
సాక్షి, హైదరాబాద్: కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి, వారి హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ చాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రాజ్‌బహదూర్ గౌర్ శతజయంత్యుత్సవాల ప్రారంభానికి నాయిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూమి, భుక్తి కోసం నైజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి రాజ్‌బహదూర్ అని నాయిని అన్నారు. కేంద్ర విధానాలతో కార్మిక చట్టాలు అమలుకు నోచుకోకుం డా పోతున్నాయన్నారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్‌కుమార్ అంజాన్, తమ్మినేని వీరభద్రం, నవ తెలంగాణ సంపాదకుడు వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
మేడే వేడుకల్లో పాల్గొన్న పొన్నం
సాక్షి, రాజన్నసిరిసిల్ల : రాబోయే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మంగళవారం సిరిసిల్ల బివైనగర్‌లో మేడే సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గతంలో ఉన్న కార్మిక చట్టాలను , సంక్షేమాలను మరించ మెరుగు పరిచి కార్మికులకు అందేవిధంగా కృషిచేస్తామన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సిరిసిల్ల కార్మికులకు ఏం ప్రయోజనం కలుగుతుందని ఊహించామో, అదంతా ఇపుడు శూన్యమన్నారు. రాబోయే కాలంలో నేత కార్మికులకు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఉండే సమస్యలను పరిష్కరిస్తామన్నారు. నేత కార్మికులందరికీ గుర్తింపు కార్డులను అందిస్తామని తెలిపారు. -
అన్ని రంగాల్లో మహిళలకు రాత్రి విధులు
- కార్మిక చట్టాల్లో మార్పులు తెచ్చిన కర్ణాటక ప్రభుత్వం - రాత్రి విధులు ప్రస్తుతం ఐటీ, ఆరోగ్య రంగాలకు మాత్రమే పరిమితం - ఇకపై జౌళి, సేవ, రీటైల్ తదితర రంగాలకు కూడా విస్తరణ - ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు - ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన సాక్షి,బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర కార్మిక చట్టాల్లో ప్రభుత్వం మార్పులు తెచ్చింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని రంగాల్లో మహిళలు రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఆరుగంటల వరకూ రాత్రి విధిలు నిర్వహించేలా త్వరలోనే అధికారిక ఉత్తర్వులు విడుదల చేయనుంది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న కార్మిక చట్టాలను అనుసరించి ఐటీ, ఐటీ సంబంధ రంగాలు, వైద్య, ఆరోగ్య తదితర విభాగాల్లో మాత్రమే మహిళలు రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఆరుగంటల వరకూ (నైట్‌షిఫ్ట్‌లో) పనిచేయడానికి అవకాశం ఉంది. మిగిలిన రంగాల్లో ఈ సదుపాయం లేదు. దీని వల్ల పురుషులతో పోలిస్తే మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయని తేలింది. సమస్య పరిష్కారం కోసం స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎస్ఈజెడ్)లోని అన్ని రకాల సంస్థలతో పాటు, జౌళి (వస్త్ర పరిశ్రమ), సేవ, రీటైల్ రంగాల్లోనూ మహిళలు నైట్‌షిఫ్ట్‌లలో పనిచేయడానికి అవకాశం కల్పించనుంది. ఈమేరకు రాష్ట్ర కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకురానుంది. ఇదిలా ఉండగా నైట్‌షిఫ్ట్‌లలో మహిళలను ఉద్యోగులుగా నియమించుకునే సంస్థలు కొన్ని నిబంధనలకు తప్పక పాటించాల్సి ఉంటుంది. ‘నైట్‌షిఫ్ట్‌లో కనీసం ఐదు మందికి తక్కువ కాకుండా మహిళా ఉద్యోగులు ఉండాలి. పనివేళలు ముగిసిన తర్వాత సదరు మహిళా ఉద్యోగులను వారి ఇంటి వద్ద దిగబెట్టడం పూర్తిగా సంస్థయాజమాన్యానిదే బాధ్యత. ఇందుకు ప్రత్యేక రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు ఒకే వాహనంలో కనీసం ఇద్దరు మహిళలు ఉండాలి. మహిళలు ఇంటి వద్ద దిగబెట్టేంత వరకూ వారికి రక్షణ సిబ్బంది ఉండాలి.’ తదితర నిబంధనలు అందులో ముఖ్యమైనవి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాత మహిళలకు అన్ని రంగాల్లోనూ నైట్‌షిఫ్ట్‌కు అనుమతి ఇస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుందని కార్మికశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ నిర్ణయం వల్ల మహిళలకు పురుషులతో సమానంగా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని కొంతమంది చెబుతుండగా నైట్‌షిఫ్ట్‌లో పనిచేసే మహిళల రక్షణ విషయం పట్ల కార్మికశాఖలోని ఉన్నతాధికారులే ఆందోళ వ్యక్తం చేస్తుండటం గమనార్హం. -
సమ్మె సక్సెస్
పది కార్మిక సంఘాల పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా రాస్తారోకో, మానవహారాలు, ర్యాలీలు తిరుపతిలో కార్మిక వ్యతిరేక భూతం దిష్టిబొమ్మ దహనం చిత్తూరు: కార్మిక చట్టాల్లో సవరణలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పది కార్మిక సంఘాలిచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం జిల్లాలో సమ్మె విజయవంతమైంది. సీఐటీయూ, ఏఐటీయూసీ, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్టీయూసీ మొదలుకుని విద్యుత్, తపాలా, మెడికల్ అండ్ హెల్త్, ఎన్జీవో, ఉపాధ్యాయ సంఘా లు, అంగన్వాడీ, ఆశ, నాల్గవ తరగతి ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, పంచాయతీరాజ్, భవన నిర్మాణ కార్మికులు, కలెక్టరేట్ ఉద్యోగులతో పాటు పలు కార్మిక ఉద్యోగ సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల ఎదుట సంబంధిత కార్మిక వర్గాలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనులు కొంతమేర స్తంభించాయి. తిరుపతి నగరంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, టీటీడీ, ట్రేడ్ యూనియన్ల వర్గాలు భారీ ర్యాలీ నిర్వహించి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విధానాలను ఎండగట్టారు. కార్మిక చట్టాల్లో చేసిన సవరణలను తక్షణం ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను వెనక్కు తీసుకోకూడదని నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని నాయకులు కోరారు. అనంతరం కార్మిక వ్యతిరేక భూతం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చిత్తూరులో వామపక్ష పార్టీలు నగరంలో ర్యాలీ నిర్వహించాయి. పలమనేరు నియోజకవర్గంలో చెన్నై-బెంగళూరు ప్రధాన రహదారిపై అంగన్వాడీ, ఆశ వర్కర్లు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసనలు తెలిపారు. చిత్తూరులో సీఐటీయూ, ఏఐటీయూసీ, వైఎస్సార్టీయూసీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు, అంగన్వాడీ, గోపాలమిత్ర ఉద్యోగులు, పంచాయతీరాజ్ ఉద్యోగులు, మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక గాంధీ విగ్రహం వద్ద నుంచి చర్చి వీధి, బజారువీధి ప్రధాన రహదారుల్లో ర్యాలీ కొనసాగింది. కలెక్టరేట్, డీఈవో, ఆర్డీవో, ఆర్టీసీ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పోస్టాఫీసు ఎదుట పోస్టల్ ఉద్యోగులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ అధ్యక్షుడు చైతన్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నాగరాజన్, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి తదితరులు పాల్గొన్నారు. పూతలపట్టులో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశ వర్కర్లు ర్యాలీ నిర్వహించారు. బ్యాంకు సిబ్బం దితో పాటు మిగిలిన ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. చంద్రగిరిలో విద్యుత్ ఉద్యోగులు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కుప్పంలో ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించారు. మదనపల్లెలో వామ పక్ష కార్మిక సం ఘాల నేతృత్వంలో ర్యాలీ నిర్వహిం చారు. అనంతరం ఆర్టీసీ బస్టాండు ఎదుట సమావేశంలో నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక వైఖరి పై ధ్వజమెత్తారు. ఉద్యోగ, కార్మిక వర్గాలు సమావేశంలో పాల్గొన్నాయి. పీలేరులో ఏఐటీయూసీ, సీఐటీ యూ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్క ర్లు, ఉపాధ్యాయులు, ఆటో వర్కర్లు తహశీల్దార్ కార్యాలయం నుంచి క్రాస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. తంబళ్లపల్లెలో వామపక్ష కార్మిక సంఘాల నేతృత్వంలో ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు.సత్యవేడు సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక, ఉద్యోగ సంఘాలు తహశీల్దార్ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మూడు రోడ్ల కూడలిలో నిరసన తెలిపారు. శ్రీకాళహస్తిలో వామపక్షాల నేతృత్వంలో నిరసన ర్యాలీ చేపట్టారు. -
దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం
సెప్టెంబర్ 2న అర్ధరాత్రి నుంచి ప్రారంభం ఆటో నుంచి విమానం సర్వీసుల వరకు నిలిపి వేత జిల్లా వ్యాప్తంగా 2.5 లక్షల మంది కార్మికులు సమ్మెలోకి కార్మిక సంఘాల నాయకుల వెల్లడి ఖమ్మం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను చేసేందుకు 10 ట్రేడ్ యూనియన్లు సిద్ధంగా ఉన్నాయని జిల్లాలోని కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, సీఐటీయూ, టీఎన్టీయూసీ, బీఎంఎస్ సంఘాల జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనం నెలకు రూ. 15 వేలు ఇవ్వాలని, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, వ్యవసాయ రంగం కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో కార్మిక చట్టాలు నీరుగారుతున్నాయన్నారు. 44 చట్టాలను కుదించేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. విదేశీ పెట్టుబడి దారులకు వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వాలు ప్రజలు కష్టాలను తీర్చేందుకు శ్రద్ద పెట్టకపోవడం శోచనీయం అన్నారు. 2010లో నిర్వహించిన సార్వత్రిక సమ్మెను మించిన విధంగా ఈ సమ్మె ఉంటుందని అన్నారు. దేశంలోని సంఘటి, అసంఘటిత రంగాలకు చెందిన కార్మికులు, కర్షకులు ఈ సమ్మెలో పాల్గొంటారని తెలిపారు. ఆటో డ్రైవర్ మొదలుకొని విమానాల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల వరకు ఈ సమ్మెలో ఉంటారన్నారు. సమ్మెను విజయవంతం చేసేందుకు ఈనెల 6 న ఖమ్మం నగరంలోని టీఎన్జీవో భవనంలో నిర్వహించే సభకు కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు హాజరవుతారని చెప్పారు. ఈనెల 10 నుంచి 20 వరకు జిల్లాలోని ప్రతి గ్రామానికి వెళ్లి సభను విజయవంతం చేయాలని ప్రచారం చేస్తామన్నారు. 27న అన్ని సంఘాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 2 అర్ధరాత్రి నుండి 24 గంటల పాటు సమ్మె కొనసాగుతుందన్నారు. దేశంలోని ప్రతిరంగాన్ని స్పందింప చేస్తామన్నారు. ప్రభుత్వాలు దిగి వచ్చి సమస్యలు పరిష్కరించని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా ప్రజలు సమ్మెను విజయవంతం చేసేందుకు సహకరించాలని కోరారు. జిల్లా లో 2.5 లక్షల మంది కార్మికులు సమ్మెలోకి దిగనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఐఎన్టీయసీ నాయకులు కొత్తా సీతారాములు, నున్నా మాధవరావు, ఐఎఫ్టీయూ నాయకులు జి. రామయ్య, ఎ రామారావు, ఏఐటీయూసీ నాయకులు సింగు నర్సింగరావు, సీఐటీయూ నాయకులు కళ్యాణం వెంకటేశ్వర్లు, విష్ణు, టీఎన్టీయూసీ నాయకులు హన్మంతరెడ్డి, వెంకటనారాయణ, బీఎంఎస్ నాయకులు వెంకటప్పయ్య, ఇఫ్టూ నాయకులు పోటు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఏకాభిప్రాయంతోనే సవరణలు
కార్మిక చట్టాలపై ప్రధాని మోదీ * సంఘాలతో సంప్రదింపులు కొనసాగుతాయని వెల్లడి * పెట్టుబడులు ఆగిపోతే ‘ఉపాధి’ ఉండదు: జైట్లీ న్యూఢిల్లీ: కార్మిక చట్టాల్లో సవరణల అంశంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. దీనిపై ఏకాభిప్రాయం ద్వారానే నిర్ణయం తీసుకుంటామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాలం తీరిన, అనవసర చట్టాలను రద్దుచేయడం అవసరమన్నారు. సోమవారం ఢిల్లీలో 46వ జాతీయ కార్మిక సదస్సును మోదీ ప్రారంభించారు.అనంతరం ప్రసంగించారు. ‘‘కార్మికులు, కార్మిక సంఘాల ప్రయోజనాల మధ్య ఒక సన్నని రేఖ ఉంటుంది. దానిని గుర్తించాలి. ఏకాభిప్రాయం ద్వారా కార్మిక చట్టాలను సవరించడంపై దృష్టి పెడతాం. దీనికి సంబంధించి కార్మిక సంఘాలతో సంప్రదింపులు కొనసాగుతాయి..’’ అని అన్నారు. ప్రభుత్వ జోక్యాన్ని తగ్గిస్తూ పాలనను మెరుగుపర్చే చర్యల్లో భాగంగా అనవసరపు చట్టాలను రద్దుచేయాల్సి ఉందన్నారు. కార్మిక సంస్కరణలపై ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ఆధ్వర్యంలో మంత్రిత్వశాఖలతో ఉన్నతస్థాయి కమిటీ వేశామని చెప్పారు. విభిన్న గ్రూపులైన పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వం, కార్మికులు, కార్మికుల ప్రయోజనాల మధ్య సన్నని విభజన రేఖ ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘‘ఒకరు పరిశ్రమను కాపాడాలంటారు, కానీ పారిశ్రామికవేత్తలకు రక్షణ అవసరం లేదంటారు. ఇలాంటి విభజన రేఖను గుర్తించి సమతూకంగా వ్యవహరించే విధానాన్ని అమలు చేసుకోవాల్సి ఉంది..’’ అని మోదీ పేర్కొన్నారు. పరిశ్రమలోని అన్ని స్థాయిల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన, గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉపాధి కష్టమవుతుంది: జైట్లీ వివిధ రంగాల్లోకి పెట్టుబడులు ఆగిపోతే, ఉపాధి కల్పన కష్టమవుతుందని కార్మిక సంఘాలను జైట్లీ హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే అంశాలపై పట్టుబట్టవద్దని సూచించారు. ‘‘ఒకవేళ పెట్టుబడుల ప్రవాహం ఆగిపోతే.. ఉపాధి కల్పన జరగదు. దాంతో ఆర్థిక కార్యకలాపాలు పెరగవు. దానివల్ల ఉన్న ఉద్యోగాలకు కూడా ఎసరు వస్తుంది..’’ అని అన్నారు. అవి తప్పుడు విధానాలు: బీఎంఎస్ కార్మిక ప్రయోజనాలను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాలను అమలు చేయాలని చూస్తోందని బీజేపీ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) జాతీయాధ్యక్షుడు బి.ఎన్.రాయ్ సోమవారం విమర్శించారు. ఈ సంస్కరణలకు కార్మిక సంఘాలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోవని స్పష్టం చేశారు. పీఎఫ్ రుణంపై పన్ను, కనీస వేతనాలను కింది స్థాయి వేతనాలుగా మార్పు చేయడం వంటివి పూర్తి తప్పుడు విధానాలని విమర్శించారు. -
కార్మిక చట్టాల ప్రక్షాళన!
మూడు చట్టాలను ఏకీకృతం చేసే ప్రతిపాదన * కార్మిక నియామక, తీసివేత నిబంధనలు సరళీకృతం న్యూఢిల్లీ: దేశంలో కార్మిక చట్టాలను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కఠినంగా ఉన్న ఉద్యోగుల నియామకం, తీసివేత నిబంధనలను సరళీకృతం చేస్తోంది. సంఘాలను ఏర్పాటుచేసే నిబంధనలను కఠినతరం చేస్తోంది. ఈమేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దేశంలో వ్యాపార కార్యకలాపాలు సులభంగా సాగేలా చేయడం, ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో మూడు చట్టాలను మిళితం చేసేందుకు కార్మిక శాఖ ముసాయిదా బిల్లును సిద్ధం చేసిందన్నారు. పారిశ్రామిక సత్సంబంధాల కోసం కార్మిక సంఘాల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, పారిశ్రామిక ఉపాధి చట్టాలను ఏకీకృతం చేస్తామన్నారు. పరిశ్రమలకు, కార్మికులకు మధ్య సుహృద్భావ వాతావరణం కల్పించే దిశగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ ముసాయిదా బిల్లు గురించి దత్తాత్రేయ ఇంకా ఏమన్నారంటే... ⇒ అధికారిక అనుమతి కోరకుండా కంపెనీ 300 మంది కార్మికులను నియమించుకునేందుకు ఈ ముసాయిదా అనుమతిస్తుంది. ⇒ ఉద్యోగులను తీసివేసేందుకు నెల రోజుల నోటీసు కాలాన్ని 3 నెలలకు పెంచుతాం. ⇒ సిబ్బందిని ఆకస్మికంగా తొలగించాలంటే గతంలో వారి సర్వీసుపూర్తయిన ఏడాది కాలానికి 15 రోజుల వేతనాన్ని ఇవ్వాల్సి ఉండగా, దీన్ని 45 రోజులకు పెంచుతాం. ⇒ కార్మిక సంఘాల సమస్యల పరిష్కారానికి త్రైపాక్షిక సంప్రదింపులు జరుపుతాం. ⇒ ఉద్యోగులందరికీ కనీస వేతనాన్ని అమలుచేస్తాం. ⇒ సంఘాల ఏర్పాటుపై, సమ్మెలపై నిబంధనలు కఠినం చేస్తాం. ఆరు నెలల ముందస్తు నోటీసులేకుండా సమ్మెలకు అనుమతించం. ⇒ సిబ్బంది సామూహికంగా క్యాజువల్ సెల వు పెట్టినా,సగంకంటే ఎక్కువమంది క్యా జువల్ లీవ్‌పై వెళ్లినా సమ్మెగా పరిగణిస్తాం. ⇒ కార్మిక సంఘాల్లో బయటి వ్యక్తులను అనుమతించం. బయటివారెవరూ వ్యవస్థీకృత రంగంలోని సంఘాల్లో ఆఫీస్ బేరర్‌గా ఉండకుండా నిషేధిస్తాం. అవ్యవస్థీకృత రంగంలో మాత్రం బయటి వ్యక్తులు ఇద్దరు ప్రతినిధులుగా ఉండేందుకు వీలుకల్పిస్తాం. -
గంగ శుద్ధికి నిధుల వరద..
‘నమామి గంగే’కు రూ. 20 వేల కోట్లు కార్మిక చట్టాల్లో మార్పులకు ఆమోదం బినామీ లావాదేవీలపై ఉక్కుపాదం.. రియాల్టీ రంగమే లక్ష్యం యూరియాపై నూతన విధానం పలు నిర్ణయాలు తీసుకున్న కేంద్ర మంత్రి మండలి న్యూఢిల్లీ: గంగానదిని పరిశుభ్రం చేయటం, పరిరక్షించాలన్న ప్రధాని నరేంద్రమోదీ కలల పథకం ‘నమామి గంగే’కు రూ. 20వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తూ కేంద్ర మంత్రి మండలి బుధవారం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఒక సమగ్రమైన విధానంలో గంగానది పరిరక్షణ, శుద్ధి జరిగేలా ‘నమామి గంగే’ కార్యక్రమాన్ని అమలు పరచాలని భావిస్తున్నట్లు కేబినెట్ సమావేశం అనంతరం విడుదలైన ప్రభుత్వ ప్రకటనలో వెల్లడించారు. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం గంగానదిలో అనుమతించే స్థాయి కంటే కూడా మూడు వేల రెట్లు కలుషితాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. మెరుగైన ఫలితాలు రావటానికి గంగా పరీవాహక ప్రాంతంలోని ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయటానికి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకోసం అమలు చేసే వివిధ ప్రాజెక్టులకు, నిర్వహించే కార్యక్రమాలకు నూరు శాతం నిధులను కేంద్రం అందిస్తుంది. చైనాతో ఒప్పందాలకు ఓకే గురువారం నుంచి ప్రారంభం కానున్న ప్రధాని మోదీ చైనా పర్యటన సందర్భంగా ఆ దేశంతో కుదుర్చుకోనున్న ఒప్పందాలకు కేబినెట్ లాంఛనంగా ఆమోదం తెలిపింది. గనులు-ఖనిజాలు, పర్యాటకం, సంప్రదాయ ఔషధాలు తదితర ఒప్పందాలను మోదీ పర్యటన సందర్భంగా చైనాతో భారత్ కుదుర్చుకోనుంది. బాల కార్మిక చట్టంలో మార్పులకు ఓకే బాల కార్మిక చట్టంలో సమూల మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. వివిధ రంగాల్లో 14 ఏళ్ల లోపు బాలలను పనిలో పెట్టుకోవటంపై పూర్తిస్థాయి నిషేధాన్ని విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, సొంత కుటుంబానికి సంబంధించిన వ్యాపారాల్లో, వినోద, క్రీడా వ్యవహారాలకు సంబంధించిన వాటిలో మాత్రం మినహాయింపునిచ్చారు. అది కూడా పాఠశాల గంటలు ముగిసిన తరువాత మాత్రమే వారితో పని చేయించుకోవలసి ఉంటుంది. టీవీ సీరియళ్లు, సినిమాలు, ప్రకటనలు, సర్కస్ మినహా మిగతా క్రీడా కార్యక్రమాల్లో కొన్ని షరతులతో బాలలను పనికి అనుమతిస్తారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏ రంగంలోనైనా బాలలను పనిలో పెట్టుకుంటే కనీసం మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 50వేల జరిమానా విధిస్తూ బాల కార్మిక చట్టాల్లో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రానున్న కొత్త చట్టం ప్రకారం మొదటి సారి బాలలను పనిలోకి పంపి నేరం చేసిన తల్లిదండ్రులకు శిక్ష నుంచి మినహాయించారు. అయితే రెండోసారి కూడా అదే నేరానికి పాల్పడితే ఇక శిక్ష తప్పదు. 30 ఏళ్ల నాటి పాత చట్టానికి చేస్తున్న ఈ సవరణలపై హక్కుల సంఘాలు, విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. బినామీ లావాదేవీలపై ఉక్కుపాదం దేశీయంగా నల్లధనాన్ని నిరోధించే ప్రయత్నాల్లో భాగంగా బినామీ లావాదేవీల నియంత్రణ చట్టానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ముఖ్యంగా రియాల్టీ రం గంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న బినామీ లావాదేవీలకు చెక్ పెట్టడం కోసమే ఈ చట్టాన్ని తీసుకురానున్నారు. దీని ప్రకారం బినామీ ఆస్తులని తేలితే ఆ ఆస్తి ని జప్తు చేయటంతో పాటు న్యాయవిచారణ చేపట్టి, జరిమానా, జైలు శిక్ష కూడా విధిస్తారు. దీని ద్వారా పన్ను ఎగవేయటానికి.. ఆస్తుల వివరాలను గోప్యం గా ఉంచటానికి ఇతరుల పేరుమీదకు ఆస్తులను బదలాయించటం లాంటి చర్యలను నిరోధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అధికార వర్గాలు తెలిపాయి. త్వరలో నూతన యూరియా విధానం దేశంలో సమృద్ధిగా యూరియా ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా నూతన యూరియా విధానానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వచ్చే నాలుగేళ్లలో రైతులకు తగిన సమయానికి యూరియా సరఫరా జరగటం లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందించారు. ప్రస్తుతం మన దేశం సంవత్సరానికి 22మిలియన్ మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తోంది. 8 మెట్రిక్ టన్నులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. యూరియా ఉత్పత్తిని గణనీయంగా పెంచటంతో పాటు, యూరియా యూనిట్లలో ఇంధన సామర్థ్యాన్ని పెంచటం ప్రభుత్వ లక్ష్యాలని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డెరైక్టర్ జనరల్ ఫ్రాంక్ నోరోన్హా కేబినెట్ సమావేశం తరువాత ట్వీట్ చేశారు. పాస్ఫేట్, పొటాషియం ఎరువులకు 2015-16 సంవత్సరానికి స్థిరమైన సబ్సిడీని కేంద్రం నిర్ణయించిందని, దీని వల్ల ఎరువుల కంపెనీలు లిక్విడిటీ సమస్యల నుంచి బయటపడతాయన్నారు. దేశీయంగా యూరియా ఉత్పత్తిని పెంచేందుకు తెలంగాణ లోని రామగుండం, ఒడిశాలోని తాల్చర్ ప్లాంట్లను సంయుక్త భాగస్వామ్యంతో పునరుద్ధరించేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయని, మరో రెండు ప్లాంట్ల పునరుద్ధరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం ఇప్పుడు లభించిందని ఫ్రాంక్ తెలిపారు. -
కార్మిక దినోత్సవాలు ఎన్ని వచ్చినా మారని బతుకు..
ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్న నినాదం విన సొంపుగా ఉన్నా... ఆచరణలో సాధ్యం కావడం లేదు. కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమంటూ దశాబ్దాలుగా చెబుతున్న పాలకుల్లో చిత్తశుద్ధి లోపించింది. దీంతో కార్మిక చట్టాలు కాస్తా అభాసుపాలవుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని మారినా... ఏ రోజుకారోజు కష్టపడందే పూట గడవని బతుకులు ఎన్నో ఉన్నాయి. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని వాడవాడలా ఘనంగా జరుపుకుంటున్నా... బతుకుబండిని లాగాలంటే శ్రమదోపిడీ తప్పడం లేదు. బెంగళూరులోని కేఆర్ మార్కెట్ వద్ద కాయగూరలను శుక్రవారం బండిలో తరలిస్తున్న కార్మికుడు. - బెంగళూరు -
కార్మిక చట్టాలకు ప్రభుత్వాల తూట్లు
నరసరావుపేట వెస్ట్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా వ్యవహరిస్తూ కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పీజే చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. స్థానిక ఏంజెల్ టాకీసు సెంటర్లో శనివారం రాత్రి ఏఐటీయూసీ జిల్లా 9వ మహాసభల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు, రక్త తర్పణం చేసి సాధించుకున్న చట్టాలను ప్రభుత్వాలు అమలు చేయకుండా కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాల పేరుతో పారిశ్రామిక కార్పొరేట్లకు లక్షల కోట్లు దోచిపెడుతున్నాయని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను రద్దుచేసి వారి గొంతునొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇన్సూరెన్స్, రైల్వే, డిఫెన్స్, ఆయిల్ వంటి కీలక పరిశ్రమలన్నింటిని ఆక్రమించేందుకు విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నాయని విమర్శించారు. ధరలు ఆకాశాన్నంటుతుండడంతో కార్మికుల బతుకులు దయనీయంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కార్మికులందరూ ఏకమై నిలదీయాలని చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామిక వర్గాలను మరింత దుర్భర స్థితిలోకి నెట్టేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. గుంటూరు జిల్లా రాజధానిగా ఏర్పడడం వల్ల ఈ ప్రాంతానికి ఎన్నో పరిశ్రమలు, కేంద్ర, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు వస్తాయని, రానున్న పదేళ్లలో జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోట మాల్యాద్రి సభకు అధ్యక్షత వహించగా.. జిల్లా ప్రదాన కార్యదర్సి వెలుగూరి రాధాకృష్ణమూర్తి, రాష్ట్ర నాయకులు జీవీ కృష్ణారావు, వర్కింగ్ అధ్యక్షుడు చల్లా చినఆంజనేయులు, నియోజకవర్గ గౌరవాధ్యక్షుడు సీహెచ్ఎల్కాంతారావు, షేక్ సైదా, ఉప్పలపాటి రంగయ్య, కాసా రాంబాబు, సీఆర్‌మోహన్, మారుతీవరప్రసాదు, జి.సురేష్, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. తొలుత ఏఐటీయూసీ మహాసభలు సందర్భంగా పట్టణంలో కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుటనున్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. మల్లమ్మ సెంటర్లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. -
కార్మిక చట్టాల మార్పులను ఉపసంహరించుకోవాలి:దాస్‌గుప్తా
ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి గురుదాస్ దాస్‌గుప్తా సాక్షి, హైదరాబాద్: కార్మిక చట్టాల్లో మార్పులు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి గురుదాస్ దాస్‌గుప్తా అన్నారు. ఏఐటీయూసీ 95వ వార్షికోత్సవ కార్మిక బహిరంగ సభ శుక్రవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో జరిగింది. ఈ సందర్భంగా హాజరైన గుప్తా మాట్లాడుతూ.. కేంద్రం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమాలను తీవ్రతరం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం రక్షణ, ఎల్లైసీ, బ్యాంకు, రైల్వే వంటి రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 26 శాతం నుంచి 46 శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ తెలంగాణ అధ్యక్షులు నరసింహన్, ప్రధాన కార్యదర్శి రత్నాకర్, నేతలు ఓబులేషు, పీజే చంద్రశేఖర్‌రావు, మహాదేవన్, డాక్టర్ బీవీ విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. వేలాది మంది కార్మికులు సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకూ ఎర్రచొక్కాలు ధరించి కవాతు నిర్వహించారు. -
డిసెంబరు 5 నిరసనలో జర్నలిస్టులు పాల్గొనాలి: ఐజేయూ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో డిసెంబరు 5న తలపెట్టిన నిరసనలో జర్నలిస్టులందరూ పాల్గొనాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), పలు జర్నలిస్టు సంఘాలు పిలుపునిచ్చాయి. యాజమాన్యాలకు అనుగుణంగా కార్మిక చట్టాలు మారిస్తే.. కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఇందుకు వ్యతిరేకంగా పోరాడాలని ఐజేయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.ఎన్. సిన్హా, దేవులపల్లి అమర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబరు 5న జరిగే నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని ఏపీ న్యూస్‌పేపర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆంజనేయులు, ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమసుందర్, ఐవీ సుబ్బారావు, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శేఖర్, విరహత్ అలీ వేర్వేరు ప్రకటనల్లో పిలుపిచ్చారు.