ఏకాభిప్రాయంతోనే సవరణలు
కార్మిక చట్టాలపై ప్రధాని మోదీ
* సంఘాలతో సంప్రదింపులు కొనసాగుతాయని వెల్లడి
* పెట్టుబడులు ఆగిపోతే ‘ఉపాధి’ ఉండదు: జైట్లీ
న్యూఢిల్లీ: కార్మిక చట్టాల్లో సవరణల అంశంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. దీనిపై ఏకాభిప్రాయం ద్వారానే నిర్ణయం తీసుకుంటామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాలం తీరిన, అనవసర చట్టాలను రద్దుచేయడం అవసరమన్నారు. సోమవారం ఢిల్లీలో 46వ జాతీయ కార్మిక సదస్సును మోదీ ప్రారంభించారు.అనంతరం ప్రసంగించారు. ‘‘కార్మికులు, కార్మిక సంఘాల ప్రయోజనాల మధ్య ఒక సన్నని రేఖ ఉంటుంది.
దానిని గుర్తించాలి. ఏకాభిప్రాయం ద్వారా కార్మిక చట్టాలను సవరించడంపై దృష్టి పెడతాం. దీనికి సంబంధించి కార్మిక సంఘాలతో సంప్రదింపులు కొనసాగుతాయి..’’ అని అన్నారు. ప్రభుత్వ జోక్యాన్ని తగ్గిస్తూ పాలనను మెరుగుపర్చే చర్యల్లో భాగంగా అనవసరపు చట్టాలను రద్దుచేయాల్సి ఉందన్నారు. కార్మిక సంస్కరణలపై ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ఆధ్వర్యంలో మంత్రిత్వశాఖలతో ఉన్నతస్థాయి కమిటీ వేశామని చెప్పారు.
విభిన్న గ్రూపులైన పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వం, కార్మికులు, కార్మికుల ప్రయోజనాల మధ్య సన్నని విభజన రేఖ ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘‘ఒకరు పరిశ్రమను కాపాడాలంటారు, కానీ పారిశ్రామికవేత్తలకు రక్షణ అవసరం లేదంటారు. ఇలాంటి విభజన రేఖను గుర్తించి సమతూకంగా వ్యవహరించే విధానాన్ని అమలు చేసుకోవాల్సి ఉంది..’’ అని మోదీ పేర్కొన్నారు. పరిశ్రమలోని అన్ని స్థాయిల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన, గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఉపాధి కష్టమవుతుంది: జైట్లీ
వివిధ రంగాల్లోకి పెట్టుబడులు ఆగిపోతే, ఉపాధి కల్పన కష్టమవుతుందని కార్మిక సంఘాలను జైట్లీ హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే అంశాలపై పట్టుబట్టవద్దని సూచించారు. ‘‘ఒకవేళ పెట్టుబడుల ప్రవాహం ఆగిపోతే.. ఉపాధి కల్పన జరగదు. దాంతో ఆర్థిక కార్యకలాపాలు పెరగవు. దానివల్ల ఉన్న ఉద్యోగాలకు కూడా ఎసరు వస్తుంది..’’ అని అన్నారు.
అవి తప్పుడు విధానాలు: బీఎంఎస్
కార్మిక ప్రయోజనాలను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాలను అమలు చేయాలని చూస్తోందని బీజేపీ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) జాతీయాధ్యక్షుడు బి.ఎన్.రాయ్ సోమవారం విమర్శించారు. ఈ సంస్కరణలకు కార్మిక సంఘాలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోవని స్పష్టం చేశారు. పీఎఫ్ రుణంపై పన్ను, కనీస వేతనాలను కింది స్థాయి వేతనాలుగా మార్పు చేయడం వంటివి పూర్తి తప్పుడు విధానాలని విమర్శించారు.