రాజకీయ పార్టీలకు ఎన్నికలలో ఖర్చు నిమిత్తం విరాళాలు ఇచ్చే పద్ధతిలో మార్పు తేవలసిన అవసరం ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పలు సందర్భాలలో ఉద్ఘాటించారు. నిరుడు కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెం టులో సమర్పించిన సందర్భంలో ఆర్థిక మంత్రి కొన్ని సూచనలు సైతం చేశారు. నగదు విరాళాలు రూ. 2,000 నుంచి రూ. 20,000లకు మించరాదనే నిబంధన విధించాలని ప్రతిపాదించారు. ఎలక్టొరల్ బాండ్లు జారీ చేసే విధానం ప్రవేశపెట్టా లని అనుకున్నట్టు కూడా చెప్పారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారా నికి చేస్తున్న ఖర్చుపైన ఎటువంటి పరిమితి లేదు.
ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థి చేసే ఖర్చుపైన మాత్రం పరిమితి ఉంది. విరాళాలన్నీ నగదు రూపంలోనే రాజకీయ పార్టీలు స్వీకరిస్తున్నాయి. దాతల పేర్లు గుట్టుగానే ఉంచుతున్నాయి. పాలకులు రూపొందించే విధానాలను గమనిస్తే ఏ కార్పొరేట్ సంస్థ అధికార పార్టీకి అధికంగా విరాళం ఇచ్చిందో ఊహించుకోవడం కష్టం కాదు. కానీ ఆ విధానాన్ని చట్ట ప్రకారం ప్రశ్నించే అవకాశం లేదు. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించడం ద్వారా కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టినట్లయితే విరాళాల విషయంలో పారదర్శకత ఎంతో కొంత పెరిగే అవకాశం ఉంటుందనడంలో సందేహం లేదు.
ఏదైన వ్యవస్థను సంస్కరించే సమయంలో లోపాలు లేకుండా, తప్పుకునే అవకాశాలు లేకుండా పకడ్బందీగా చేయాలి. ఇప్పటి కంటే కొంత మెరుగైన విధానం ప్రవేశపెట్టాలని తలపోస్తున్నారే తప్ప ఆదర్శవంతమైన పక్కా విధానం రూపొందించే ప్రయత్నం జరగడం లేదు. జైట్లీ ప్రతిపాదిస్తున్న సంస్కరణల ప్రకారం 1934 నాటి రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్‌ను సవరించి ఎలక్టొర ల్‌బాండ్స్ జారీకి అవకాశం కల్పిస్తారు. కడచిన ఎన్నికలలో ఒక శాతం కంటే ఎక్కువ ఓట్లు సంపాదించిన పార్టీకి ఎలక్టొరల్‌బాండ్ ద్వారా విరాళాలు స్వీకరించే అర్హత ఉంటుంది. కొర్పొరేట్ సంస్థలు ఈ బాండ్లను ప్రతి సంవత్సరం జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ మాసాలలో ప్రతి మాసంలోనూ పది రోజుల పాటు కొను గోలు చేయవచ్చు. ప్రతి రాజకీయ పార్టీ ఒక బ్యాంకు అకౌంట్ వివరాలను ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలి.
ఆ ఖాతాలో దాత ఇచ్చే ఎలక్టొరల్‌బాండ్‌ను సొమ్ము చేసుకోవచ్చు. ఇందుకు 15 రోజుల గడువు ఉంటుంది. స్వీకర్త పేరు బ్యాంకులో నమోదు అవుతుంది. దాత పేరు కూడా బ్యాంకుకు తెలుస్తుంది. ఇతరులకు మాత్రం తెలియదు. ఈ సంస్కరణలో ఉన్న ఇబ్బంది ఏమంటే ఎవరు ఎవరికి ఎంత విరాళం ఇస్తున్నారో బ్యాంకులకు, వాటి ద్వారా ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉంటుంది. మరో రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాలకు ఏ కార్పొరేట్ సంస్థ ఎంత విరాళం ఇస్తున్నదో తెలుసుకునే అవకాశం అధికార పార్టీకి ఉంటుంది. అధికార పార్టీకి ఏ సంస్థ ఎంత విరాళం ఇస్తున్నదో తెలుసుకునే వీలు ప్రతిపక్షాలకు ఉండదు.
అధికార పార్టీ తెలుసుకునే అవకాశం ఉన్నదనే ఎరుకే కార్పొరేట్ సంస్థలను ప్రతి పక్షాలకు దూరంగా ఉంచుతుంది. అధికార పార్టీకి వచ్చే విరాళాల కంటే ప్రతి పక్షాలకు చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంది. మార్చి 9న పార్లమెంటు బడ్జెట్ సమావేశం ద్వితీయార్థం ఆరంభం అవుతుంది. అప్పుడు ఆర్థిక బిల్లుపైన చర్చ జరిగే క్రమంలో ఈ అంశాలు పరిశీలనకు వస్తాయి. అన్ని పక్షాలు అన్ని కోణాలనూ సాకల్యంగా పరిశీలించి ఎన్నికలలో ధన ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు తీసు కుంటే ప్రజాస్వామ్యం బలపడుతుంది. సాధారణ పౌరులు సైతం ఎన్నికల బరిలో నిలబడి గెలిచే అవకాశం ఉంటుంది. ఎన్నికల సంస్కరణలపైన సుదీర్ఘమైన అధ్య యనం చేసిన దినేశ్ గోస్వామి కమిటీ, ఇంద్రజిత్‌గుప్తా కమిటీ సిఫార్సులను అమలు చేసే ప్రయత్నం ఎన్‌డీఏ సర్కార్ చేయడం లేదు.
అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ప్రభుత్వమే భరించాలని ఈ రెండు కమిటీలూ సిఫార్సు చేశాయి. అభ్యర్థులకు లేదా పార్టీలకూ ఉన్న ప్రజాదరణ ప్రకారం ఎన్నికల ఖర్చు కింద ఎంత మొత్తం ఇవ్వవచ్చునో నిర్ణయించేందుకు ఒక సూత్రాన్ని రూపొందించడం కష్టం కాదు. కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యత (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద ఎన్నికల విరాళాలను ప్రభుత్వానికి అందజేయాలి. ఆ విధంగా జమ అయిన మొత్తానికి ప్రభుత్వ నిధులు జోడించి అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుల కింద నిర్ణీత నిధిని అందించాలి. ఈ పద్ధతి జర్మనీలో అమలు చేస్తున్నారు.
జైట్లీ ప్రతిపాదించినవి అరకొర సంస్కరణలు. అవి సైతం నిజాయితీగా అమలు జరుగుతాయన్న భరోసా ప్రజలకు లేదు. అధికార, ప్రతిపక్షాలకు ఈ విష యంలో చిత్తశుద్ధి లేదని అనేక సందర్భాలలో రుజువైంది. విదేశాల నుంచి విరాళాల సేకరణకు సంబంధించిన (ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్)యాక్ట్‌ను ఉల్లం ఘించి బీజేపీ, కాంగ్రెస్‌లు బ్రిటన్‌కు చెందిన వేదాంత కార్పొరేషన్ నుంచి 2014 ఎన్నికలలో భారీ విరాళం అందుకున్నాయి. లోగడ కూడా రూ. 20,000కు మించి ఎన్నికల విరాళం ఇచ్చినట్లయితే ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలనే నిబంధన 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 29 (సి) సెక్షన్‌లో ఉంది.
ఎవరైనా లక్ష రూపాయల నగదు విరాళంగా ఇస్తే ఆ మొత్తానికి ఆరు రసీదులు ఇచ్చి ప్రతి రసీ దులోనూ రూ. 20 వేల కంటే తక్కువ మొత్తం ముట్టినట్టు బొంకుతారు. సంస్క రణలు చేయడం, చట్టాలను సవరించడం, కొత్త చట్టాలు చేయడంతో సరిపోదు. వాటిని మనస్ఫూర్తిగా అమలు జరపాలి. ఫిరాయింపుల నిరోధక చట్టం ఎంత దివ్యంగా అమలు జరుగుతోందో చూస్తూనే ఉన్నాం. అరుణాచల్‌ప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ ఈ చట్టాన్ని అన్ని పార్టీలూ కనికరం లేకుండా కుళ్ళ బొడు స్తుంటే అడిగే నాథుడు లేడు.
చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా నిష్కర్షగా శిక్షించే వ్యవస్థ లేనంత వరకూ రాజకీయ పార్టీలు బుద్ధిగా వ్యవహరించవు. ‘మీ కంటే మేము పవిత్రులం’ అంటూ అతిశయానికి పోకుండా ఎన్నికలలో నల్లధనం పాత్రను అరికట్టేందుకు అన్ని పార్టీలూ, అందరు నాయకులూ కలసిరావాలంటూ నిరుడు ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. ప్రధాని సహా రాజకీయ నేతలందరూ ఈ వాక్కును శిరసావహించి ఎన్నికలలో ధన ప్రభావాన్ని తగ్గించగలిగితే చరితార్థుల వుతారు.
Comments
Please login to add a commentAdd a comment