స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత యువత అభివృద్ధి పథంలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించేందుకు కేంద్రప్రభుత్వం సంస్కరణలు తెచ్చిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దైనందిన జీవితంలో ఎదురవుతున్న సవాళ్లకు యువత సరైన పరిష్కారాలు చూపుతూ సాగే ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్(ఎస్‌ఐహెచ్)’ కార్యక్రమం అంతిమ పోరు సందర్భంగా ప్రధాని మోదీ తుది పోటీదారులతో వర్చువల్‌గా మాట్లాడారు.
‘‘ దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలు చూపే బాధ్యత తమపై ఉందని నేటి యువత బాధ్యతాయుతంగా ఆలోచిస్తోంది. వినూత్న ఆవిష్కరణలు సాధించగల, సాంకేతికత సత్తా ఉన్న యువత భారత్ సొంతం. శాస్త్రీయ దృక్పథాన్ని మరింతగా పెంచేందుకు వీలుగా కేంద్రప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. సంస్కరణలు తెస్తూ భారత యువత అభివృద్ధి పథంలో ఉన్న అవరోధాలను ప్రభుత్వం తొలగిస్తోంది’’ అని మోదీ అన్నారు.
ఏడో దఫా ఎస్‌ఐహెచ్‌లో దేశవ్యాప్తంగా 51 నోడల్ కేంద్రాల్లో 1,300కుపైగా విద్యార్థి బృందాలు ఫైనల్‌లో పోటీపడుతున్నాయి. సాఫ్ట్‌వేర్ ఎడిషన్ పోటీ 36 గంటల్లో ముగుస్తుండగా హార్డ్‌వేర్ ఎడిషన్‌లో పోటీ 15వ తేదీదాకా కొనసాగనుంది. హ్యాకథాన్‌లో భాగంగా జాతీయ ప్రాధాన్యత గల 17 అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, పరిశ్రమలు ఇచ్చి సమస్యలకు అత్యంత ఆమోదయోగ్యమైన పరిష్కారాలు చూపుతూ విద్యార్థి బృందాలు తమ ప్రాజెక్టులను నిర్ణీత కాలంలో పూర్తిచేసి సమర్పించాల్సి ఉంటుంది. పలు రంగాలకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలు చూపాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment