Indian Youth
-
అవరోధాలు తొలగిస్తూ సంస్కరణలు
న్యూఢిల్లీ: భారత యువత అభివృద్ధి పథంలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించేందుకు కేంద్రప్రభుత్వం సంస్కరణలు తెచ్చిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దైనందిన జీవితంలో ఎదురవుతున్న సవాళ్లకు యువత సరైన పరిష్కారాలు చూపుతూ సాగే ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్(ఎస్ఐహెచ్)’ కార్యక్రమం అంతిమ పోరు సందర్భంగా ప్రధాని మోదీ తుది పోటీదారులతో వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలు చూపే బాధ్యత తమపై ఉందని నేటి యువత బాధ్యతాయుతంగా ఆలోచిస్తోంది. వినూత్న ఆవిష్కరణలు సాధించగల, సాంకేతికత సత్తా ఉన్న యువత భారత్ సొంతం. శాస్త్రీయ దృక్పథాన్ని మరింతగా పెంచేందుకు వీలుగా కేంద్రప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. సంస్కరణలు తెస్తూ భారత యువత అభివృద్ధి పథంలో ఉన్న అవరోధాలను ప్రభుత్వం తొలగిస్తోంది’’ అని మోదీ అన్నారు. ఏడో దఫా ఎస్ఐహెచ్లో దేశవ్యాప్తంగా 51 నోడల్ కేంద్రాల్లో 1,300కుపైగా విద్యార్థి బృందాలు ఫైనల్లో పోటీపడుతున్నాయి. సాఫ్ట్వేర్ ఎడిషన్ పోటీ 36 గంటల్లో ముగుస్తుండగా హార్డ్‌వేర్ ఎడిషన్‌లో పోటీ 15వ తేదీదాకా కొనసాగనుంది. హ్యాకథాన్‌లో భాగంగా జాతీయ ప్రాధాన్యత గల 17 అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, పరిశ్రమలు ఇచ్చి సమస్యలకు అత్యంత ఆమోదయోగ్యమైన పరిష్కారాలు చూపుతూ విద్యార్థి బృందాలు తమ ప్రాజెక్టులను నిర్ణీత కాలంలో పూర్తిచేసి సమర్పించాల్సి ఉంటుంది. పలు రంగాలకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలు చూపాల్సి ఉంటుంది. -
దేశంకాని దేశంలో.. తమది కాని యుద్ధంలో... సమిధలుగా మనోళ్లు
భవిష్యత్తు మీద బంగారు కలలతో ఆశలకు రెక్కలు కట్టుకొని ఆకాశంలోకి ఎగిరారు. ఉపాధి దొరికితే కొత్త ఉషోదయాలు చూస్తామనుకున్నారు. కానీం చివరకు తమది కాని యుద్ధంలో నిస్సహాయంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తరఫున తలపడుతున్న భారత యువకుల విషాదమిది. ఎందుకిలా జరుగుతోంది? తమది కాని దేశంలో, తమకు సంబంధమే లేని యుద్ధంలో వారు ఎందుకిలా బలవుతున్నట్టు...? అతని పేరు రవి మౌన్. హరియాణాకు చెందిన 22 ఏళ్ల యువకుడు. రష్యాలో డ్రైవర్ ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్ చెప్పాడు. నమ్మిన కుటుంబం భూమి తెగనమ్మి మరీ ఏజెంట్‌కు రూ.11.5 లక్షలు ముట్టజెప్పింది. తీరా జనవరి 13న రష్యాకు వెళ్లాక ఏజెంట్ మోసగించినట్టు అర్థమైంది. ఇప్పుడతని ముందు రెండే ఆప్షన్లు. పదేళ్ల జైలు. లేదంటే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరఫున పోరాటం. పదేళ్ల జైలు కంటే తనకిష్టం లేకున్నా యుద్ధ క్షేత్రాన్ని ఎంచుకున్నాడు రవి. ఈ విషయం కుటుంబానికి తెలియనివ్వలేదు. రష్యా సైనిక దుస్తుల్లో ఉన్న భారత యువకుల వీడియోలో అతన్ని చూశాకే వారికి తెలిసింది. చివరగా మార్చిలో కుటుంబంతో మాట్లాడాడు. అప్పటినుంచి వారికతని సమాచారమే లేదు. యుద్ధంలో మరణించిన వారి మృతదేహాలను పూడ్చేందుకు రాత్రంతా గోతులు, కందకాలు తవ్వడమే పని! నాలుగు నెలల తర్వాత యుద్ధభూమిలో ప్రాణాలొదిలాడు. రవి సోదరునితో పాటు రష్యాలోని భారత రాయబార కార్యాలయం కూడా సోమవారం దీన్ని ధ్రువీకరించింది. డ్రైవర్ ఉద్యోగం ఆశ చూపి యుద్ధానికి ఎలా బలి పెడతారన్న రవి కుటుంబం ప్రశ్నకు బదులిచ్చేదెవరు...? భారీ వేతనాలు ఎర చూపి... ఇది ఒక్క రవి కథే కాదు. ఎంతోమంది భారత యువకులకు భారీ వేతనంతో ఉద్యోగాలంటూ ఊరించి రష్యాకు తీసుకెళ్తున్నారు. చివరికిలా బలవంతంగా యుద్ధాన్ని నెత్తిన రుద్దుతున్నారు. 2023 డిసెంబర్ నుంచి 2024 ఫిబ్రవరి మధ్య చాలామంది భారతీయులు ఇలా రష్యా సైన్యంలో చేరారు. వారిక్కూడా అక్కడికి వెళ్లేదాకా ఆ సంగతి తెలియదు! 2023 డిసెంబర్లో హర్‡్ష కుమార్ అనే యువకున్ని బెలారస్కని చెప్పి తీసుకెళ్లిన ఏజెంట్ మధ్యలోనే వదిలేశాడు. రష్యా సైన్యానికి చిక్కడంతో యుద్ధంలో పాల్గొనాల్సి వచి్చంది. అమృత్‌సర్‌కు చెందిన తేజ్‌పాల్‌సింగ్ పరిస్థితీ అంతే. ఏజెంటుకు రూ.2 లక్షలు చెల్లించి మరీ ఉద్యోగం కోసం రష్యా వెళ్లి చివరకు సైన్యంలో తేలాడు. చివరగా మార్చి 3న కుటుంబంతో మాట్లాడారు. జూన్‌లో మరణించాడు. పశి్చమ బెంగాల్‌లోని కాలింపాంగ్‌కు చెందిన ఉర్గెన్ తమాంగ్ క్రిమియా యుద్ధ ప్రాంతం నుంచి మార్చిలో వీడియో పంపాడు. సెక్యూరిటీ గార్డు ఉద్యోగం, మంచి జీతం పేరిట ఏజెంట్ మోసగించాడని వాపోయాడు. 10 రోజులు నామమాత్ర ఆయుధ శిక్షణ ఇచ్చి బలవంతంగా వార్ జోన్లోకి నెట్టారని వెల్లడించాడు. తన యూనిట్‌లోని 15 మంది రష్యనేతర సైనికుల్లో 13 మంది ఎలా దుర్మరణం పాలయ్యారో వివరంగా చెప్పుకొచ్చాడు. ఏపీ నుంచి కూడా పలువురు యువకులు ఈ వలలో చిక్కి ఉక్రెయిన్ యుద్ధక్షేత్రానికి చేరినట్టు చెబుతున్నారు. నేరం నిరుద్యోగానిదే... సంపాదనకు విదేశీ బాట, ప్రవాస భారతీయుని హోదా మన సమాజంలో గౌరవ చిహ్నాలు. గ్రామీణ నిరుద్యోగిత మరీ ఎక్కువ ఉన్న పంజాబ్, హరియాణా యువత కెనడా, యూరప్ దేశాలకు విపరీతంగా వెళ్తుంటారు. కానీ ఆ దేశాలు వీసా నిబంధనలు కఠినతరం చేశాయి. రష్యన్ స్టాంప్ ఐరోపా దేశాలకు వెళ్లడానికి మార్గం సుగమం చేస్తుందనే ఆశతో పంజాబ్, హరియాణా యువకులు రష్యా బాట పడుతున్నారు. తీరా వెళ్లాక ఏజెంట్ల చేతిలో మోసపోయి యుద్ధంలో తేలుతున్నారు. రష్యా సైన్యంలో మనోళ్లు 40 మంది దాకా ఉన్నట్టు విదేశాంగ శాఖ గణాంకాలు చెబుతున్నా వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. 8 మంది భారతీయుల మృతి: కేంద్రం విదేశీ యువతను రష్యా ఇలా ఉక్రెయిన్ యుద్ధానికి బలి పెడుతున్న నేపథ్యంలో తమ పౌరులు ఆ దేశాలకు వెళ్లకుండా పలు దేశాలు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. నేపాల్ వంటి చిన్న దేశాలు కూడా ఈ విషయంలో నిబంధనలను కఠినతరం చేశాయి. మన దేశంలో అలాంటి చర్యల ఊసే లేదు! కనీసం మోసగిస్తున్న ఏజెంట్లపైనా చర్యల్లేవు. సరికదాం, రష్యాలో ఉపాధి కోసం వెళ్లే భారతీయులు జాగ్రత్తగా ఉండాలనే ప్రకటనలతో కేంద్రం సరిపెడుతోంది! మన యువకులు ఉక్రెయిన్ యుద్ధంలో బలవుతున్న వైనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి రష్యా పర్యటన సందర్భంగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రత్యేకంగా చర్చించినా లాభం లేకపోయింది. మనోళ్లను స్వదేశానికి పంపేందుకు రష్యా అధికారులు ససేమిరా అంటున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో 8 మంది భారతీయులు రష్యా తరఫున పోరాడుతూ మరణించినట్టు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తాజాగా గత గురువారం రాజ్యసభలో వెల్లడించారు. ‘‘12 మంది భారతీయులు ఇప్పటికే రష్యా సైన్యాన్ని వీడినట్టు సమాచారముంది. మరో 63 మంది కూడా సైన్యం నుంచి త్వరగా విడుదల చేయాలని రష్యా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు’’ అని వెల్లడించారు. రష్యా సైన్యం తరఫున యుద్ధక్షేత్రంలో పోరాడుతున్న భారతీయులను వెనక్కు పంపేలా ఆ దేశంతో అత్యున్నత స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నట్టు చెప్పారు.ఇలా మోసగిస్తున్నారు... నిరుపేద యువతను వారికే తెలియకుండా రష్యా సైన్యంలోకి పంపేందుకు ఏజెంట్లు ప్రధానంగా లక్షల్లో జీతం, మెరుగైన జీవితాన్ని ఎరగా చూపుతున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో సీబీఐ చేసిన దాడుల్లో భారీ మానవ అక్రమ రవాణా రాకెట్ వెలుగు చూసింది. దాని సభ్యులను విచారించగా ఈ వివరాలు బయటికొచ్చాయి. → ఈ ‘రష్యాలో ఉపాధి’ ప్రచారానికి వారు ప్రధానంగా సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. → ఒకసారి బాధితులు తమ వల్లో పడగానే స్థానిక ఏజెంట్లు రంగంలోకి దిగుతారు. రంగుల కల చూపి ఒప్పిస్తారు.→ పలు సందర్భాల్లో ఉన్నత విద్యను కూడా ఎర వేస్తున్నారు. → రష్యాలో దిగీ దిగగానే స్థానిక ఏజెంట్లు వాళ్ల పాస్‌పోర్టులు లాగేసుకుంటారు. → ఆనక బలవంతంగా రష్యా సైన్యంలో చేరక తప్పని పరిస్థితులు కల్పిస్తారు. ఇతని పేరు సయ్యద్ ఇలియాస్ హుసేనీ. కర్నాటకలోని కలబురిగి వాసి. వెనక ఉన్నది అతని మిత్రులు అబ్దుల్ నయీం, మహ్మద్ సమీర్ అహ్మద్. వీళ్లు, తెలంగాణలోని నారాయణపేటకు చెందిన మొహమ్మద్ సూఫియాన్ దుబాయ్ విమానాశ్రయంలో పని చేసేవారు. రష్యాలో సెక్యూరిటీ గార్డులు కావాలంటూ యూట్యూబ్‌లో ప్రకటనలు చూశారు. నెలకు లక్షకు పైగా జీతం వస్తుందన్న ఏజెంట్ మాటలు నమ్మి నలుగురూ గత డిసెంబర్లో రష్యా వెళ్లారు. వారిని బలవంతంగా సైన్యంలో చేర్చుకుని ఉక్రెయిన్ సరిహద్దులకు పంపారు. అక్కడి నుంచి ఇలియాస్ తమ దుస్థితిని ఇలా గోప్యంగా వీడియో తీసి పంపాడు. ఇలియాస్ తండ్రి నవాజ్ అలీ హెడ్ కానిస్టేబుల్. తన కొడుకును, అతని స్నేహితులను ఎలాగైనా సురక్షితంగా తీసుకు రావాలంటూ అప్పటినుంచీ అతను ఎక్కని గడప లేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆర్థికమాంద్యం హెచ్చరికలున్నా.. భారతీయ యువత ‘సిప్’.. సిప్.. హుర్రే!
సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా మార్కెట్లు తీవ్ర ఒడుదుడుకులకు లోనవుతున్నా... మరోసారి ఆర్థికమాంద్యం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అవుతున్నా.. దేశంలోని యువత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికే మొగ్గు చూపుతోంది. ఇందుకోసం వారు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానం (సిప్)ను ఎంచుకుంటున్నారు. ప్రతీ నెలా నిర్ధిష్ట మొత్తాన్ని క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడాన్ని సిప్ విధానంగా పేర్కొంటారు. బ్యాంకు వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, రియల్ ఎస్టేట్, బంగారం ధరలు ఆకాశాన్నంటడంతో యువత ఇన్వెస్ట్మెంట్ సాధనంగా మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకుంటున్నారు. దీంతో గడిచిన మూడేళ్లలో సిప్ ఖాతాల సంఖ్య రెట్టింపు కావడమే కాకుండా అదే స్థాయిలో నెలవారీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పది నెలల కాలంలో సిప్ ఖాతాల సంఖ్య 82 లక్షలకు పైగా పెరిగినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఆంఫీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2021–22 ఏప్రిల్‌లో 5.39 కోట్లుగా ఉన్న సిప్ ఖాతాల సంఖ్య ఈ ఏడాది జనవరి నాటికి 6.21 కోట్లకు చేరాయి. అంటే సగటున ప్రతీ నెలా 10 లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లు వచ్చి చేరుతున్నారు. భారీగా పెరిగిన ఇన్వెస్ట్మెంట్ దేశంలోని మ్యూచువల్ ఫండ్ ఆస్తుల విలువ జనవరి నాటికి రికార్డు స్థాయిలో రూ. 14,28,43,642 కోట్లకు చేరితే అందులో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ. 6,73,774.80 కోట్లు ఉందంటే మనవాళ్లు సిప్ విధానానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు గడిచిన మూడేళ్లుగా సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే మొత్తంలో కూడా భారీ పెరుగుదల నమోదవుతోంది. 2020–21లో సగటున నెలవారీ ఇన్వెస్ట్ చేసే మొత్తం రూ. 9,000 కోట్లుగా ఉంటే అది ఇప్పుడు ఏకంగా రూ. 13,856.18 కోట్లకు చేరింది. దీర్ఘకాలిక లక్ష్యాలతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య ఏటా క్రమంగా పెరుగుతోందని ఆంఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్.ఎస్ వెంకటేష్ పేర్కొన్నారు. ఒక్క జనవరిలోనే కొత్తగా 23 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభం కావడం దేశీయ స్టాక్‌మార్కెట్ పాజిటివ్ ట్రెండ్‌కు నిదర్శనంగా పేర్కొన్నారు. సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నవారిలో అత్యధికంగా స్మాల్ క్యాప్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రస్తుత గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశ స్టాక్ మార్కెట్ల పతనం తక్కువగా ఉండటానికి సిప్ పెట్టుబడులు కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
యువత‘రంగం’ రియల్ ఎస్టేట్.. సర్వేలో ఆసక్తికర అంశాలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురానికి చెందిన పట్నాల నగేష్ వ్యాపారం చేస్తుంటారు. ఇటీవల వ్యాపారంలో వచ్చిన లాభాలను స్థిరాస్తి రంగంలో పెట్టుబడిగా పెడుతున్నారు. వ్యాపారిగా ప్రతి పైసాకు లెక్క వేసే తాను రియల్ ఎస్టేట్‌లోనే పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు. ‘బ్యాంకు వడ్డీరేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. బంగారం ధరలు భారీగా పెరిగాయి. అందువల్లే వాటిలో పెట్టుబడి పెట్టడంలేదు. చాలా మంది స్టాక్ మార్కెట్ బాగుందంటున్నా, దానిపై నాకు అంతగా అవగాహన లేదు. అందుకే వచ్చిన లాభాలను స్థిరాస్థి రంగంలోనే పెడుతున్నా’ అని నగేష్ చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు మేలని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన కవులూరి ఆదిత్య అంటున్నారు. ‘గతంలో మా నాన్నగారు నా పేరు మీద పోస్టాఫీసులు, బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారు. ఈ మధ్యనే నాకు బాబు పుట్టాడు. నేనూ డిపాజిట్లు పెడతామని అనుకున్నా. పోస్టాఫీసులు, బ్యాంకులకు వెళ్తే వడ్డీరేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. పెరుగుతున్న ధరలు (ద్రవ్యోల్బణం) పరిగణనలోకి తీసుకుంటే వాటిపై రాబడి లేకపోగా నష్టపోతున్నామనిపించింది. అందుకే రిస్క్ ఉన్నా మా బాబు భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే ప్రతి నెలా సిప్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా’ అని వివరించారు. – సాక్షి, అమరావతి వీరిద్దరూ చెప్పింది వాస్తవమే. స్థిరాస్తి రంగం, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకే నేటి యువత ప్రాధాన్యతనిస్తోంది. మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. దేశ యువత పెట్టుబడి తీరులో వచ్చిన స్పష్టమైన మార్పుకు ఇది నిదర్శనమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం వంటి సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపేవారు. ఇప్పుడు రిస్క్ (నష్ట భయం) ఉండే రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ వంటి ఈక్విటీ సాధనాల్లో పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), అన్‌రాక్ సంస్థలు దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 14 పట్టణాల్లో వివిధ ఆదాయ తరగతులకు చెందిన 5,500 మందిపై ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు నిర్వహించిన సర్వేలో పలు అంశాలు వెలుగు చూశాయి. కోవిడ్ సంక్షోభం తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం వంటి సంప్రదాయ పెట్టుబడులు తగ్గాయని, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెరిగాయని సర్వే తెలిపింది. ‘రియల్’నే నమ్ముతున్నారు యువత పెట్టుబడుల్లో రియల్ ఎస్టేట్‌దే అగ్రస్థానమని సర్వే వెల్లడించింది. 59 శాతం మంది రియల్ ఎస్టేట్‌లోనే పెట్టుబడికి మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. 28 శాతం మంది స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి చూపించారు. కోవిడ్ వచ్చిన సంవత్సరం 2020 జనవరి – జూన్ మధ్య రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య 48 శాతం ఉండగా, ఈ ఏడాది జనవరి – జూన్ మధ్య 11 శాతం పెరిగిందని సర్వే తెలిపింది. అత్యధికంగా 33 శాతం మంది సొంతింటి కలను నెరవేర్చుకోవడం కోసం స్థిరాస్తి కొంటున్నట్లు తెలిపారు. 22 శాతం మంది అత్యవసర సమయాల్లో స్థిరాస్తి అక్కరకు వస్తుందని భావిస్తున్నారు. 17 శాతం మంది భవిష్యత్తులో వ్యాపారం మొదలు పెట్టడానికి ముందస్తుగా ఇన్వెస్ట్ చేస్తుంటే, 15 శాతం మంది రిటైర్మెంట్ తర్వాత అండగా ఉంటుందని భావిస్తున్నారు. ఈక్విటీ పెట్టుబడులు కోవిడ్ ఏడాదికి, ఈ ఏడాదికి 3 శాతం పెరిగి 25 శాతం నుంచి 28 శాతానికి చేరినట్లు తేలింది. ఇదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లు 18 శాతం నుంచి 7 శాతానికి పడిపోగా, బంగారంలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య 9 శాతం నుంచి 6 శాతానికి తగ్గిపోయింది. వడ్డీరేట్లు తగ్గి కనిష్ట స్థాయికి చేరడం ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆసక్తి చూపకపోవడానికి ప్రధాన కారణంగా వెల్లడైంది. ఇప్పుడు మళ్లీ వడ్డీ రేట్లు పెరుగుతుండటంతో డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అలాగే బంగారం ధరలు కూడా గరిష్ట స్థాయిలో ఉండటంతో ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయడానికి అంతగా ఆసక్తి చూపడంలేదని సర్వేలో వెల్లడైంది. -
రోల్ మోడల్: తొలి ఇండియన్ అమ్మాయిగా చరిత్ర సృష్టించనున్న రిజా
వయసుకు తగ్గట్టుగా మానసికంగా, శారీరకంగా పరిపూర్ణంగా ఎదగని పిల్లల...మాట, నడక, నవ్వు సాధారణ పిల్లలకంటే విభిన్నంగా ఉంటుంది. కొంతమంది అయితే ఒకటీ రెండు మాటలు కూడా స్పష్టంగా పలకడం కూడా కష్టమే. అటువంటిది డౌన్‌సిండ్రోమ్‌తో బాధపడుతోన్న రిజా రేజి ఏకంగా ప్రీమియర్ ఫ్యాషన్ షోకు ఎంపికైంది. గ్లోబల్ ఈవెంట్లో ర్యాంప్ వాక్ చేయనున్న తొలి ఇండియన్ అమ్మాయిగా రిజా చరిత్ర సృష్టించనుంది. కేరళకు చెందిన వహీద్, అనితారేజి దంపతులకు ఇద్దరు కూతుర్లు రియ, రిజాలు. 2014 నుంచి బెంగళూరులో స్థిరపడిన రేజి దంపతులు క్రియేటివ్ ఆర్ట్స్ వృత్తినిపుణులు. దివ్యాంగ పిల్లల సంక్షేమమే లక్ష్యంగా ‘బ్యూటిపుల్ టుగెదర్’ పేరిట అనితా ఓ ఇనిస్టిట్యూట్‌ను కూడా నడుపుతోంది.పెద్ద కూతురు రియా ముంబైలోని అడ్వరై్టజింగ్ కంపెనీలో అసోసియేట్ క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. చిన్న కూతురైన 23 ఏళ్ల రిజా చిన్నప్పటి నుంచి డౌన్ సిండ్రోమ్ కారణంగా అక్కలా ఎదగలేదు. అయినప్పటికీ మిగతా డౌన్ సిండ్రోమ్ పిల్లలందరిలోకి చురుకుగా ఉండేది. ఇది గమనించిన ఆమె తల్లిదండ్రులు రిజాను డ్యాన్స్, యాక్టింగ్‌లలో శిక్షణ తీసుకునేందుకు ప్రోత్సహించి, ‘క్రిసాలిస్ ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్’లో చేర్పించారు. దీంతో రిజా మనస్సులోని భావాలను వ్యక్తం చేయడానికి మంచి సాధనం దొరికింది. తన డ్యాన్స్ భంగిమలు, నటనతో అనేక విషయాలను వ్యక్తం చేయడం ప్రారంభించింది. ఒకపక్క యాక్టింగ్ నేర్చుకుంటూనే సింగింగ్, డ్యాన్సింగ్, స్టేజి షోల ద్వారా పాపులర్ స్టార్‌గా మారింది. తల్లిదండ్రులతో రిజా తొలి భారతీయురాలిగా.. డౌన్‌సిండ్రోమ్ పిల్లల అభ్యున్నతికోసం నిధులు సేకరించే ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ ‘గ్లోబల్ డౌన్ సిండ్రోమ్ ఫౌండేషన్’. ఉత్తర అమెరికాకు చెందిన ఈ సంస్థ ఏటా ‘బీ బ్యూటిఫుల్ బీ యువర్ సెల్ఫ్’ పేరిట ఫ్యాషన్ షోను నిర్వహిస్తోంది. ఈ షో ద్వారా వచ్చిన నిధులను డౌన్‌సిండ్రోమ్ బాధితుల అభ్యున్నతి కోసం ఖర్చుచేస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఆన్లైన్ ఆడిషన్స్‌లో పాల్గొన్న రిజా..‘కాస్ట్యూమ్, వాకింగ్ స్టైల్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్’లో తన ప్రతిభను ప్రదర్శించి ఇండోవెస్ట్రన్ విభాగంలో ఫ్యాషన్ షోకు ఎంపికైంది. దీంతో ఇప్పటిదాక ఎప్పుడూ మోడలింగ్‌లో పాల్గొనని రిజా అంతర్జాతీయ వేదికపై ర్యాంప్ వాక్ చేయనుంది. డౌన్‌సిండ్రోమ్ కలిగిన వారికి ప్రత్యేకంగా నిర్వహించేæఈ గ్లోబల్ ఈవెంట్లో.. ఇండియా తరపున ప్రాతినిధ్యం వహిస్తోన్న తొలి అమ్మాయి రిజా కావడం విశేషం. అమెరికాలోని కొలరాడోలో ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న ఈ షోలో వివిధ దేశాలకు చెందిన ఇరవై మంది మోడల్స్ పోటీపడనున్నారు. రిజా ఇప్పటి నుంచే దీనికోసం తన వెర్బల్ స్కిల్స్‌ను పెంచుకోవడానికి శిక్షణ తీసుకుంటూ సన్నద్ధమవుతోంది. ఈ ఫ్యాషన్ షోలో విన్నర్‌గా నిలిచి తన కమ్యూనిటీ వారికి ప్రేరణగా నిలవడానికి ప్రయత్నిస్తోంది. ‘‘ఎవరైనా తమ బిడ్డకు మానసిక వైకల్యం ఉందని తెలిసినప్పడు దానిని అంగీకరించడమే అతిపెద్ద సవాలు. సమాజంలో ఎదురయ్యే సానుభూతిని దాటుకుని వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దాలి. ప్రస్తుతం మా రిజా ఇవన్నీ దాటుకుని దేశం తరపును తొలిసారి ఫ్యాషన్ షోలో పాల్గొని తనలాంటి వారందరికి ఆదర్శంగా నిలవబోతోంది. నా కూతురు యాక్టివ్‌గా మాట్లాడడమేకాదు, డ్యాన్స్ కూడా చేస్తోంది. తన మనసులోని భావాలను ఎంతో ఆత్మవిశ్వాసంతో వ్యక్తం చేయగలదు. అలా అని తన వైకల్యాన్నీ దాయలేదు. కానీ తనని తాను నిరూపించుకుని మంచి క్రియేటివ్ ఆర్టిస్ట్‌గా ఎదిగి అందరితో చక్కగా కలిసిపోతుంది’’ – రిజా తల్లి అనితా రేజి అందరితో సమానంగా చూడాలి వైకల్యాలను దృష్టిలో పెట్టుకుని దివ్యాంగుల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటారు. కానీ మానసిక, శారీరక వైకల్యం ఉన్న వారిలో కూడా కొన్ని నైపుణ్యాలు దాగున్నాయి. వాటిని అర్థం చేసుకుని మెరుగు పరిచే దిశగా సంక్షేమ పథకాలను రూపొందిస్తే దివ్యాంగులు సైతం వారి కాళ్ల మీద వాళ్లు నిలబడగలరు. వారు కూడా అందరిలాగే సమాజంలో మనగలుగుతారు. ఫ్యాషన్ షోలో పాల్గొనబోతున్న రిజా ఒంటరిది కాదు. డౌన్‌సిండ్రోమ్ కమ్యూనిటీ తరపున ప్రాతినిధ్యం వహిస్తోంది. వారంతా కూడా ఇలాంటి అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ఇల్లు, కేర్ సెంటర్లకే పరిమితమైన వారంతా వెలుగులోకి రావడం కాస్త కష్టమైనప్పటికీ వారికి ఉన్న అవకాశాలను అందుకునే మార్గాలను చూపితే వారు ఉన్నతంగా ఎదగగలుగుతారు. వీటన్నింటికంటే ముందు వారిని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలుగా అస్సలు చూడకూడదు. అందరితో సమానంగా ఎప్పుడు చూస్తామో అప్పుడే వాళ్లు చక్కగా ఎదగగలుగుతారు. – రిజా తండ్రి రేజి వహీద్ -
Vivan Marwaha: దేశం చుట్టిన యువకుడు
‘యూత్’ అనేది ఒక పుస్తకం అనుకుంటే.. చాలామందికి ముఖచిత్రం మాత్రమే తెలుసు. పుస్తకం లోపలికి వెళితే ఏ పేజీలో ఏముందో ఎవరికెరుక! ఆ యూత్‌లోనే ఒకరైన 26 ఏళ్ల వివన్ మర్వాహ దేశమంతా తిరిగి యూత్‌ను అన్ని కోణాలలో అర్థం చేసుకునే అద్భుతమైన పుస్తకం రాశాడు. తాజాగా అతడి పేరు ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఏషియా’ జాబితాలో చోటుచేసుకుంది... ‘మా జనరేషన్‌కు మీ జనరేషన్‌కు అసలు సంబంధమే లేదు. ఎంతో తేడా కనిపిస్తుంది!’ అంటాడు నాన్న. ‘మారోజుల్లో స్కూల్లో మగపిల్లలతో మాట్లాడడానికి భయపడేవాళ్లం’ అంటుంది అమ్మ. ‘మీ తరానికి ఖర్చు చేయడం తప్ప పొదుపు చేయడం తెలియదు’ అంటాడు తాత. నిజంగా మనకు మిలీనియల్స్ గురించి ఎంత తెలుసు? ఎంత తెలియదు? అసలు వారి ప్రపంచం ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబు వెదుక్కోవడానికి ఆ మిలీనియల్స్‌లో ఒకరైన వివన్ సుదీర్ఘమైన దూరాలు ప్రయాణం చేశాడు. అలా మొదలైంది... దిల్లీలో పెరిగిన వివన్ పైచదువుల కోసం కాలిఫోర్నియా(యూఎస్)కు వెళ్లాడు. అక్కడ తాను గమనించింది ఏమిటంటే మిలీనియల్స్ మానసిక ప్రపంచాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రభుత్వం వివిధ రూపాల్లో నిర్మాణాత్మకమైన కృషి చేయడం. ‘యూత్ ఎక్కువగా ఉన్న మన దేశంలో ఇలాంటి ప్రయత్నం ఎందుకు జరగడం లేదు’ అని ఆశ్చర్యపోయాడు వివన్. కాలేజి చదువు పూర్తయిన తరువాత ‘నెక్స్›్ట ఏమిటీ?’ అనే ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు ఒక పుస్తకం రాయాలనిపించింది. మనదేశంలోని మిలీనియల్స్ ప్రపంచంలోకి వెళ్లాలనుకున్నాడు. దీనికి ముందస్తు సన్నాహంగా మన దేశ మిలీనియల్స్‌కు సంబంధించిన సమాచారం కోసం వెదికితే నిరాశే ఎదురైంది. తనకు లభించిన అరకొర సమాచారంతోనే నోట్స్ రాసుకొని అమెరికా నుంచి బయలుదేరాడు. ఇండియాకు వచ్చి నలుదిక్కులలోని 13 రాష్ట్రాలలో 30,000 కి.మీ దూరం ప్రయాణించాడు.‘మిలీనియల్స్ గురించి తెలుసుకోవాలంటే కాలేజిలకు వెళితే సరిపోతుంది’ అనే కాన్సెప్ట్‌ను నమ్ముకోలేదు వివన్. సెల్‌ఫోన్ రిపేర్ చేసేవారి నుంచి సెలూన్లో పనిచేసేవారి వరకు అందరినీ కలిశాడు. వారి అభిప్రాయాల్లో దాపరికాలు, ముసుగులు లేవు. మనసులో ఉన్నది బయటికి స్వేచ్ఛగా మాట్లాడేస్తున్నారు. ‘ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కనిపించే నిరుద్యోగం ఇప్పుడు లేదు. చాలా అవకాశాలు ఉన్నాయి. నాకు చదువు పెద్దగా అబ్బలేదు. నా ఫ్యూచర్ గురించి ఇంట్లో వాళ్లు బాధ పడ్డారు. ఇప్పుడు నేను సెల్‌ఫోన్ రిపేరింగ్ షాప్ నడుపుతున్నాను. నా సంపాదన ప్రభుత్వ ఉద్యోగి నెలజీతంతో సమానంగా ఉంది’ అంటున్నాడు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన అక్షిత్ అనే కుర్రాడు. బెంగాల్‌లోని కోల్‌కతాకు వెళితే... ‘లవ్మ్యారేజ్ని ఇష్టపడతావా? పెద్దలు కుదిర్చిన పెళ్లి అంటే ఇష్టమా?’ అనే ప్రశ్నకు నీళ్లు నమలకుండా ‘పెద్దలు కుదిర్చిన పెళ్లినే ఇష్టపడతాను’ అన్నాడు ఒక కాలేజి కుర్రాడు. ఇదే అభిప్రాయం చాలా మంది నోటి నుంచి వినిపించింది. ఇంఫాల్(మణిపూర్)లో ఒకచోట...‘మనం ఎక్కడ ఉన్నామనేది సమస్య కాదు. మెగా సీటిలో ఉన్నా మారుమూల పల్లెలో ఉన్నా సామాజిక మాధ్యమాలు, ఇతరత్రా సాధనాల ద్వారా అనేకానేక విషయాలు తెలుసుకోవచ్చు. మనకు కావాల్సింది ఆసక్తి మాత్రమే’ అంటోంది యూత్. అయితే ఒక అంశంపై అన్ని ప్రాంతాలలోనూ ఒకేరకమైన అభిప్రాయాలు వినిపించడం లేదు. ‘మీ లక్ష్యం ఏమిటి?’ అని దిల్లీ, ముంబై యువతరాన్ని ప్రశ్నిస్తే స్టార్టప్‌ల గురించి చెప్పారు. జబల్పూర్లాంటి పారిశ్రామిక పట్టణాల్లో ప్రభుత్వ ఉద్యోగం, భద్రజీవితమే తమ లక్ష్యం అంటుంది యువతరం. ఎన్నో ప్రాంతాలు, ఎన్నో పట్టణాలు తిరిగి...కెరీర్, రాజకీయాలు, మతం, కులం, ఆశలు, ఆశయాలు...మొదలైన వాటిపై మిలీనియల్స్ అభిప్రాయాలను లోతుగా తెలుసుకొని ‘వాట్ మిలీనియల్స్ వాంట్’ పేరుతో పుస్తకం రాశాడు వివన్. ఈ పుస్తకానికి ‘ఇండియన్ మిలీనియల్స్ బయోగ్రఫీ’ అంటూ ప్రశంసలు లభించాయి. జీక్యూ ఇండియా ‘టాప్ నాన్ ఫిక్షన్ బుక్ ఫర్ 2021’ జాబితాలో నిలిచింది. ‘అమెరికా, చైనాలతో పోల్చితే ఇండియన్ మిలీనియల్స్ ఏమిటి?’ వివన్ మాటల్లో చెప్పాలంటే...‘1993లో ఇండియా, చైనా జీడిపి ఇంచుమించుగా ఒకేస్థాయిలో ఉండేది. ఆ తరువాత మాత్రం చైనా దూసుకుపోయింది. ఫలితంగా మన మిలీనియల్స్‌తో పోల్చితే చైనా వాళ్లు ఆర్థికస్థిరత్వంతో ఉన్నారు. వారిలో అభద్రతా కనిపించడం లేదు. అమెరికాలో గత తరాలతో పోల్చితే చాలా స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. మనదేశంలో మాత్రం సంప్రదాయాలను గౌరవించే ధోరణి పెరిగింది’ క్షేత్రస్థాయిలోకి వెళితే ఎన్నో విలువైన విషయాలు తెలుస్తాయి అని చెప్పడానికి బలమైన ఉదాహరణ...వాట్ మిలీనియల్స్ వాంట్. -
యూతమ్మా! యూత్! అట్లుంటది మరి.. ‘అతి’ వద్దు.. తక్కువ మాటలతో..
లాక్డౌన్ టైమ్‌లో యూత్ వోటీటీ ప్లాట్‌ఫామ్‌లకు అతుక్కుపోయింది. ‘అది కాలమహిమ, అంతే. మళ్లీ థియేటర్లు ఓపెన్ అయితే ఈ ఆకర్షణ పోతుంది. ఎంతైనా థియేటర్ థియేటరే’ అనుకున్నారు చాలామంది. థియేటర్లు తెరుచుకున్నప్పటికీ యూత్‌లో వోటీటీ ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదు. ‘వోటీటీ వోటీటీయే– థియేటర్ థియేటరే’ అనే పరిస్థితి వచ్చింది. వోటీటీ విషయానికి వస్తే...యూత్ ఇష్టపడే వాటిలో మోస్ట్ పాపులర్ జానర్ కామెడీ(సీ). ఆ తరువాత స్థానంలో థ్రిల్లర్(టీ), యాక్షన్(ఏ) ఉన్నాయి. దేశవ్యాప్తంగా యూత్ వోటీటీ సబ్స్క్రిప్షన్ విస్తృతంగా పెరిగింది. జెన్ జెడ్, మిలీనియల్స్ రెండు నుంచి మూడు వరకు వోటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిష్షన్ ఉండడం సహజమై పోయింది. మోస్ట్ పాపులర్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్కు వోటీటీ కేరాఫ్ అడ్రస్ కావడం వల్ల కూడా డెబ్బై శాతం పైగా యూత్ ఈ వేదికలను ఇష్టపడుతుంది. మరోవైపు చూస్తే... వోటీటీ ప్లామ్ఫామ్లకు యూత్ ఆడియెన్స్ టార్గెట్ అయ్యారు. ‘మీరు చెప్పిన సబ్జెక్ట్ తరువాత ఆలోచిద్దాం గానీ, ముందు ఏదైనా యూత్ సబ్జెక్ట్ ఉంటే చెప్పండి’ అనే మాటను విన్నాడు, వింటూనే ఉన్నాడు అభిషేక్ యూదవ్. వోటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై యూత్ పల్స్ తెలిసిన రచయితగా గుర్తింపు పొందాడు అభిషేక్. ‘యూత్ సబ్జెక్ట్ కావాలి’ అనగానే ‘ఛలో రాసేద్దాం’ అంటూ రచయితలు ఒంటిస్తంభం మేడలో కూర్చోవడానికి లేదు. వారికి కచ్చితంగా యూత్పల్స్ ఏమిటో తెలియాలి. అది తెలియాలంటే ఏకాంతవాసానికి స్వప్తి చెప్పాలి. యూత్ జాడలు వెదుక్కుంటూ వెళ్లాలి. కాలేజీ క్యాంటీన్లలో కూర్చొని వారి మాటలు గమనించాలి. ఊతపదాలు క్యాచ్ చేయాలి. కాలేజీ అయిపోగానే రయ్యిమని పరుగెత్తి బస్సులో గందరగోళానికి, సరదా సందడి యాడ్ చేసే స్టూడెంట్స్‌ను గమనించాలి... ఇలాంటి హోమ్‌వర్క్ చేసిన రచయితల్లో అభిషేక్ యాదవ్ కూడా ఒకరు. (చదవండి: Summer Tips: వేసవిలో విజృంభించే కామెర్లు, అతిసార.. ఈ ‘పానీయం’ తాగారంటే!) ‘తెర మీద యూత్ తమను తాము చూసుకోవాలి. నిత్యజీవితంలో తమ అల్లర్లు, ఆలోచనలు తెర మీద చూస్తూ మమేకం కావాలి’ అంటాడు అభిషేక్. భారతీయ జనాభాలో 46.9 శాతం పాతికేళ్లలోపు వారు ఉన్నారు. కంటెంట్ విషయంలో వారి ‘టేస్ట్’ ఏమిటి అనేది విశ్లేషిస్తే...హాస్యమే కాని అది పూర్వపు హాస్యం కాదు. తక్కువ మాటలతో ఎక్కువగా నవ్వించే హాస్యం కావాలి. ‘అతి’ కంటె మితమైన హాస్యంతోనే నవ్వించాలి. ఈ తరాన్ని దృష్టిలో పెట్టుకొని ‘క్యూ ఇండియా’ 24/7 కామెడీ ప్రోగ్రామ్స్‌తో ‘క్యూ కామెడీస్థాన్’ అనే డిజిటల్ చానల్ తీసుకువస్తోంది. దీనికోసం పాపులర్ డిజిటల్ కామెడీ స్టార్స్ రంగంలోకి దిగారు. పంకజ్ శర్మలాంటి కంటెంట్ క్రియేటర్లు యూత్పల్స్ పట్టుకునే పనిలో కసరత్తులు చేస్తున్నారు. మరోవైపు థ్రిల్లర్, యాక్షన్ సబ్జెక్ట్‌లను కూడా ఇష్టపడుతుంది యూత్. ఉదా: స్కాటిష్ మిస్టరీ థ్రిల్లర్ ‘గిల్టీ’ని ఆధారంగా చేసుకొని రూపొందించిన ‘బ్లడీ బ్రదర్స్’ (జీ5), 1957 నవల ‘డీప్ వాటర్’ను అదే పేరుతో తీసిన సైకాలజీ థ్రిల్లర్(అమెజాన్ ప్రైమ్)....మొదలైన వాటికి యూత్ నుంచి మంచి ఆదరణ లభించింది. టీ–సీరిస్ వోటీటీ స్పేస్‌పై గట్టిగా దృష్టి పెట్టింది. కామెడీ, థ్రిల్లర్, యాక్షన్ జానర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ‘‘యూత్‌ను ఆకట్టుకునే ఫ్రెష్, ఒరిజినల్ అండ్ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ మా ప్రథమ ప్రాధాన్యత’ అంటున్నారు టీ–సీరిస్ ఛైర్మన్ భూషణ్ కుమార్. (చదవండి: నోరూరించే చికెన్ బ్రెడ్ పాకెట్స్ తయారీ ఇలా!) -
నారీ యువ శక్తి గెలుస్తుంది
‘లే.. మేలుకో... లక్ష్యం చేరుకునే దాకా విశ్రమించకు’ అన్నారు స్వామి వివేకానంద. ‘వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం’ అన్నాడాయన. మన దేశంలో 15–25 ఏళ్ల మధ్య యువత 20 కోట్లు. వీరిలో 10 కోట్ల మంది యువతులు. ఇంటర్ వయసు నుంచి ఉద్యోగ వయసు మీదుగా వివాహ వయసు వరకు అమ్మాయిలకు ఎన్నో సవాళ్లు. వివక్షలు. ప్రతికూలతలు. కాని నారీ యువశక్తి వీటిని ఛేదించి ముందుకు సాగుతోంది. జనవరి 12– స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జరుపుకునే ‘జాతీయ యువజన దినోత్సవం’ యువతులకు స్ఫూర్తినివ్వాలి. మార్గం చూపాలి. అంతరిక్షాన్ని చుంబించాలనుకున్న ఒక తెలుగు యువతి ఆ ఘనతను సాధించడం చూశాం. ఇంటి నుంచి బస్టాప్ వరకూ వెళ్లి కాలేజీ బస్సెక్కడానికి పోకిరీల బెడదను ఎదుర్కొంటున్న యువతి నిస్సహాయతను కూడా చూస్తున్నాం. ఇద్దరూ యువతులే. ఒకరు సాధిస్తున్నారు. మరొకరు సాధించడానికి అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. ఈ రెండు బిందువుల మధ్యే భారతీయ టీనేజ్ అమ్మాయిలు, యువతులు తమ గమనాన్ని కొనసాగిస్తున్నారు. ‘కెరటం నాకు ఆదర్శం లేచినా పడినందుకు కాదు... పడినా లేచినందుకు’ అంటారు స్వామి వివేకానంద. గత మూడు నాలుగు దశాబ్దాలలో భారతీయ యువతులు పడినా లేచే ఈ సంకల్పాన్నే ప్రదర్శిస్తున్నారు. బాల్య వివాహాలను నిరాకరిస్తున్నారు. చదువు వైపు మొగ్గుతున్నారు. ఆ తర్వాత ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంకా చెప్పాలంటే జీవిత భాగస్వామి ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. అయితే ఈ పరిస్థితి మధ్యతరగతి, ఆ పై తరగతుల్లో ఎక్కువగా ఉంటే దిగువ, పేద వర్గాలలో సంఘర్షణ కొనసాగించాల్సి వస్తోంది. దేశంలో ఇంకా చాలాచోట్ల సరైన టాయిలెట్లు లేని బడులు, సురక్షితం కాని రహదారులు, శానిటరీ నాప్కిన్లు అందుబాటులో లేని పరిస్థితులు ఆడపిల్లలను స్కూల్ విద్యకు దూరం చేస్తున్నాయి. కాలేజీ వయసులోకి రాగానే తల్లిదండ్రులు తమ అమ్మాయి ‘ఎటువంటి ప్రభావాలకు లోనవుతుందో’ అనే భయంతో పెళ్లి చేసేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాని నేటి యువతులు చిన్న చిన్న ఉద్యోగాలు చేసైనా సరే ముందు మేము నిలదొక్కుకోవాలి... తర్వాతే వివాహం వైపు రావాలి అని చాలాచోట్ల గట్టిగా గొంతు విప్పగలుగుతున్నారు. ‘నీ వెనుక ఏముంది... ముందు ఏముంది నీకనవసరం... నీలో ఏముంది అనేది ముఖ్యం’ అన్నారు వివేకానంద. ఇవాళ యంగ్ అడల్ట్స్లోగాని, యువతులలోగాని ఉండాల్సింది ఈ భావనే. ముందు తమను తాము తెలుసుకోవాలి. ఆ సంగతి తల్లిదండ్రులకు తెలియచేయాలి. ఆ తర్వాత ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. దానిని అందుకోవడానికి ప్రయత్నించాలి. కాని నేటి సమస్య ఏమిటంటే యువతులకు తాము ఏమిటో తెలిసినా తల్లిదండ్రుల ఆకాంక్షలకు తల వొంచాల్సి వస్తోంది. మరోవైపు వారి మీద అటెన్షన్, నిఘా, వేయి కళ్ల కాపలా... ఇవన్నీ వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ‘అదొద్దు ఇది చెయ్’ అని అమ్మాయికి చెప్పినంత సులువుగా అబ్బాయికి చెప్పలేని పరిస్థితి నేటికీ ఉందన్నది వాస్తవం. దాంతో పాటు తల్లిదండ్రులు, చుట్టాలు, సమాజం ఆడపిల్లల విషయంలో వారు అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉండాలన్న అంచనా వారిని బాధిస్తోంది. కాని వారికి ఇంట్లో, విద్యాలయాల్లో సరైన దిశ దొరికితే వారు ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారు. ఇవాళ టెక్నికల్ విద్యలో, మెడిసిన్‌లో అమ్మాయిలు రాణిస్తున్నారు. ఎంచుకుని మరీ ర్యాంకులు సాధిస్తున్నారు. మరోవైపు మేనేజ్మెంట్ రంగాల్లో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో యువతులు రాణిస్తున్నారు. కళారంగాలను ఎంచుకుంటున్నారు. సినిమా రంగ దర్శకత్వ శాఖలో గతంలో యువతులు కనిపించేవారు కాదు. ఇవాళ చాలామంది పని చేస్తున్నారు. విదేశాలకు వెళ్లి చదవడానికి, ఉన్నత ఉద్యోగాలు చేయడానికి వారి దగ్గర పుష్కలంగా ప్రతిభ ఉంది. మనం చేయవలసిందల్లా వారు కనుగొన్న మార్గంలో వారిని వెళ్లనివ్వడమే. ‘జీవితంలో రిస్క్ తీసుకో. గెలిస్తే విజేత అవుతావు. ఓడితే ఆ అనుభవంతో దారి చూపగలుగుతావు’ అన్నారు వివేకానంద. ‘ఆడపిల్ల... రిస్క్ ఎందుకు’ అనే మాట గతంలో ఉండేది. ఇవాళ కూడా ఉంది కాని ఎందరో యువతులు ఇవాళ పోలీస్, రక్షణ దళాలలో పని చేస్తున్నారు. విమానాలు, హెలికాప్టర్లు ఎగరేస్తున్నారు. యుద్ధ ఓడలు నడుపుతున్నారు. ఈ స్ఫూర్తి కొనసాగుతూ ఉంది. ఈ స్ఫూర్తి కొనసాగాల్సి ఉంది. పర్వతారోహకులుగా, సోలో ట్రావెలర్సుగా, హెవీ వెహికిల్స్ డ్రైవర్లుగా, ప్రమాదకరమైన అసైన్మెంట్లు చేసే జర్నలిస్టులుగా ఇలా నేటి యువతులు అద్భుతాలు సాధిస్తున్నారు. యుద్ధ ట్యాంకర్లు మోగుతున్న చోట నిలబడి వారు రిపోర్టింగ్ చేసే సన్నివేశాలు స్ఫూర్తినిస్తున్నాయి. స్వామి వివేకానంద ఆశించిన యువత ఇదే. ఇలాంటి యువతకు సమాజం, కుటుంబం దన్నుగా నిలవడమే చేయాల్సింది. ‘మనం ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు కాని వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్టు’ అన్నారు వివేకానంద. స్త్రీ వ్యక్తిత్వ నిర్మాణం కుటుంబ నిర్మాణం అవుతుంది. తద్వారా సమాజ నిర్మాణం అవుతుంది. ఆపై దేశ నిర్మాణం అవుతుంది. నేటి యువతులు కేవలం విద్య, ఉపాధి రంగాలలో రాణించడం కాకుండా ప్రపంచ పరిజ్ఞానం కలిగి, సామాజిక పరిణామాలు గమనిస్తూ, పాటించవలసిన విలువలను సాధన చేస్తూ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి. నాయకత్వం వహించడానికి ముందుకు రావాలి. చట్ట సభలలో కూచునే శక్తి సామర్థ్యాలు పుణికి పుచ్చుకోవాలి. యువశక్తి దేశాన్ని నడిపించాలి. కాని నేటి సోషల్ మీడియా వారిని విపరీతంగా కాలహరణం చేయిస్తోంది. ‘హ్యాపెనింగ్’గా ఉండమని ఛోటోమోటా సరదాలకు ఆకర్షిస్తోంది. మిగిలినవారిని ఇమిటేట్ చేయమంటోంది. అలా ఉండాలేమోనని కొంతమంది యువతులు డిప్రెషన్లోకి వెళ్లాల్సి వస్తోంది. ‘మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులుగా భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు’ అన్నారు వివేకానంద. నేటి యువ మహిళా శక్తి ఈ మాటను తప్పక గుర్తు పెట్టుకుని ముందుకు సాగాలి. మరిన్ని విజయాలు సాధించాలి. మొదటి అడుగులోనే... సక్సెస్ అయ్యాక సొసైటీ నుంచి పొగడ్తలు వస్తాయి. అదే, ముందే ప్రోత్సాహం ఉంటే అమ్మాయిలు ఎదగడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. నేను, నా బిజినెస్ పార్టనర్ శ్రుతి బీటెక్‌లో స్నేహితులం. ఇద్దరం కలిసి ‘మాయాబజార్’ అని ఫొటోషూట్ స్టూడియోను ప్రారంభించాం. మేం ప్రారంభించినప్పుడు ఈ బిజినెస్‌లో పెద్దగా పోటీ లేదు. ఇప్పుడు మేం సక్సెస్ అయ్యాం. అందరూ వచ్చి అమ్మాయిలు ఇంత బాగా చేశారు. ఎంత కష్టపడ్డారు... అని అంటుంటారు. కానీ, దీని ప్రారంభంలో మేం పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మా ఇద్దరి అమ్మానాన్నలు నమ్మారు. డబ్బుల విషయం ఒక్కటే కాదు. అమ్మాయిలు సొంతంగా ఏదైనా పని చేయాలనుకుంటే అందుకు చుట్టుపక్కల అంతా మంచి మద్దతు లభించాలి. మా టెక్నిషియన్స్, వర్కర్స్.. ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. కానీ, మొదట్లో లేదు.‘వీళ్లు అమ్మాయిలు కదా ఏం చేస్తారు?’ అనే ఆలోచన ఉంది. మమ్మల్నే నేరుగా అనేవారు. డబ్బులు పెట్టినా సరే, దాదాపు పదిమందిని అడిగితే ఒకరు ముందుకు వచ్చేవారు. హార్డ్‌వర్క్ చేయడానికి అమ్మాయిలు ముందుకు వచ్చినప్పుడు సమాజం నుంచి ‘మీరు అమ్మాయిలు కదా! ఎందుకు మీకు కష్టం..’ అనే అభిప్రాయం వస్తుంది. మొదటి వ్యక్తి నుంచే సరైన రెస్పాన్స్ వస్తే.. అమ్మాయిలు సొంతంగా ఎదగడానికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. – అనూష, శ్రుతి ‘అమ్మాయి కదా’ అని... అమ్మాయిలు వర్కర్స్‌తో పనిచేయించాలన్నా, ఆర్డర్స్ తీసుకునేటప్పుడు, పేమెంట్ తిరిగి రాబట్టుకోవడానికి.. అన్ని విధాల రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ‘అమ్మాయి కదా, ఏం కాదులే! అని తేలికగా తీసుకుంటారు. సింగిల్‌గా ఎదగాలంటే అబ్బాయిలకు ఉన్నంత సపోర్ట్ ఈ సొసైటీలో అమ్మాయిలకు లేదు. అందుకే ప్రతిభ ఆధారంగానే నా పనితనాన్ని చూపుతాను. మార్కెట్‌ను బట్టి 3–4 ఛాయిస్‌లు వినియోగదారులకు ఇస్తాను. ఇంటీరియర్‌లో అబ్బాయిల కన్నా అమ్మాయిలకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఇంట్లో ఎక్కడ ఏ వస్తువును ఎలా సర్దుకోవాలో అమ్మాయిలకే బాగా తెలుసు. ఆ విధంగా కూడా నా వర్క్‌ను చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే రాత్రి సమయాల్లో మా కుటుంబం నుంచి సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సూపర్వైజర్ ద్వారా హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో ‘నేను అమ్మాయిని’ కాదు, నా పనిని ఒక వృత్తిగా భావించండి అని చెప్పుకోవాల్సి రావడం బాధగా ఉంటుంది.ఈ విధానంలో మార్పు అవసరం. – కాత్యాయని, ఇంటీరియర్ డిజైనర్ -
అమెరికాలోనే ఉండనివ్వండి.. భారతీయ యువత అభ్యర్ధన
వాషింగ్టన్: సరైన అనుమతి పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తూ త్వరలో డిపోర్టేషన్ (బలవంతంగా సొంతదేశానికి తరలించడం)కు గురికానున్న పలువురు భారతీయ యువతీ యువకులు వైట్‌హౌస్‌ను ఆశ్రయించారు. తమను ఎలాగైనా ఇక్కడే ఉండేందుకు అనుమతించాలని బైడెన్ ప్రభుత్వాన్ని కోరారు. దాదాపు 2లక్షల మంది యువత అమెరికాలోనే తమ బాల్యాన్ని, టీనేజ్‌ను గడిపారు. అయితే వీరికి 21 సంవత్సరాలు దాటినందున ఇకపై పేరెంట్స్ వీసాపై అమెరికాలో ఉండేందుకు అనర్హులవుతున్నారు. వీరిలో చాలామంది తల్లిదండ్రులు గ్రీన్‌కార్డు కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ కార్డున్న వారికి తమ కుటుంబంతో పాటు అమెరికాలో నివసించే హక్కు లభిస్తుంది. ఈ నేపథ్యంలో దీప్పటేల్ తదితరులు ద డ్రీమ్ పేరిట ఒక సంఘాన్ని ఏర్పరిచి ఇలాంటి యువతను అమెరికాలో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరుతూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా పలువురు సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులను కలిసి ఈ విషయమై లాబీయింగ్ చేశారు. వీరి యత్నాలకు పలువురు చట్టసభ్యులు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. డాకా(డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్) కింద తమలాంటి వారు అమెరికాలో ఉండేందుకు మార్పులు చేయాలని వీరు కోరుతున్నారు. మైనర్లుగా అమెరికా వచ్చిన వారు మేజర్లయ్యాక దేశం వదిలి వెళ్లాల్సిన పనిలేకుండా గతంలో ఒబామా ప్రభుత్వం డాకా చట్టం తెచ్చింది. కానీ, డొనాల్డ్ ట్రంప్ హయాంలో దీన్ని రద్దు చేశారు. -
కరోనా పుట్టుక: చైనా పుట్టి ముంచింది మనోడే!
కరోనా వైరస్ పుట్టుకలో చైనా పాత్రపై అనుమానం మొదటి నుంచి ఉందే. అయితే మధ్యలో డబ్ల్యూహెచ్‌వో జోక్యం, ట్రంప్ హయాంలో యూఎస్ నిఘా వర్గాల నివేదికల్ని బయటకు రానివ్వకపోవడంతో ఆ ఆరోపణలు కొంత తగ్గుముఖం పట్టినట్లు అనిపించాయి. ఈ తరుణంలో ఉన్నట్లుండి ల్యాబ్ థియరీ ఒక్కసారిగా తెర మీదకు రావడం, మళ్లీ చైనాపై అమెరికా సహా కొన్ని దేశాలు ఆరోపణలతో విరుచుకుపడడం చూస్తున్నాం. ఇంతకీ ఇలా ఎందుకు జరిగింది.. గత నెలరోజుల పరిణామాలే ఇందుకు కారణమా? ఇందులో భారతదేశానికి చెందిన ఓ యువ అన్వేషకుడి పాత్రేంత అనేది పరిశీలిస్తే.. వెబ్‌డెస్క్: ‘‘కరోనా వైరస్ పుట్టుక వుహాన్ ల్యాబ్‌లోనే జరిగింది. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు’’.. ఇది డ్రాగన్ కంట్రీపై అగ్రదేశం అమెరికా చేస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే ఎదురుదాడి ప్రారంభించిన చైనా.. అమెరికాపైనే నిందలు వేయడంతో పాటు ఫౌఛీ మెయిల్స్ లీక్ వ్యవహారాన్ని తమకు అనుగుణంగా మార్చుకోవాలని చూస్తోంది. ఈ తరుణంలో గత నెలరోజుల ల్యాబ్ లీక్ థియరీ అంశం ఎలా ఉప్పెనలా ఎగిసిపడిందో చూద్దాం. డ్రాస్టిక్లో మనోడు! కరోనా పుట్టుక విషయంలో చాలామంది సైంటిస్టులకు, రీసెర్చర్లకు అనుమానాలున్నాయి. ఈ తరుణంలో ఆసక్తి ఉన్నవాళ్లంతా కలిసి డ్రాస్టిక్(DRASTIC) పేరుతో ఒక సైట్ క్రియేట్ చేశారు. కరోనా వైరస్ పుట్టుక తమ తమ అభిప్రాయాల్ని, రీసెర్చ్ ద్వారా తెలుసుకున్న విషయాల్ని ట్విట్టర్ ద్వారా ఆ పేజీలో తెలియజేస్తున్నారు. ఇందులో పలువురు భారతీయులూ ఉండగా, వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఇరవై ఏళ్ల వయసులో ఉన్న ఓ యువకుడు ‘ది సీకర్’(The seeker) పేరుతో తన అభిప్రాయాల్ని వెల్లడించారు. నిజానికి తొలుత ఈ యువకుడు కూడా మార్కెట్ ద్వారానే వైరస్ వ్యాపించిందని నమ్మాడంట. ఆ తర్వాత కొన్ని దర్యాప్తులను, రీసెర్చ్ పత్రాలను, మరికొందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ల్యాబ్ థియరీల వెనుక ఉన్న కథనాల్ని ఉటంకిస్తూ కొన్ని వ్యాసాలు రాశాడు. ఇది న్యూస్‌వీక్ పీస్ వెబ్‌సైట్‌ను ప్రముఖంగా ఆకర్షించడంతో అతని(సైంటిస్ట్/రీసెర్చర్/సాధారణ యువకుడు) ఉద్దేశాల్ని ప్రముఖంగా ప్రచురించింది. ఈ కథనం ఆధారంగానే ప్రధాన మీడియా హౌజ్‌లు ఒక్కసారిగా వుహాన్ ల్యాబ్ థియరీపై పడ్డాయి. దీంతో సోషల్ మీడియా మొత్తం #WuhanLabLeak హ్యాష్‌ట్యాగ్‌తో మారుమోగింది. ఆపై సైంటిస్టులు ల్యాబ్ థియరీని పున:పరిశీలించగా, మరోవైపు యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ మూడు నెలల్లో వైరస్ పుట్టుక వ్యవహారం తేల్చాలని ఇంటెలిజెన్స్ విభాగాల్ని ఆదేశించడం, అమెరికా ఛీప్ సైంటిస్ట్ ఆంటోనీ ఫౌచీ ‘2019 వుహాన్ రీసెర్చర్ల అనారోగ్యం’ రికార్డులను బయటపెట్టాలని చైనాను డిమాండ్ చేయడం ఒకదాని వెంట ఒకటి జరిగాయి. 2012 నుంచే.. చైనాలోని ఓ జంతువుల మార్కెట్ నుంచి వైరస్ వ్యాప్తి మొదలైంది. ఇది అప్పట్లో వినిపించిన వాదన. కానీ, కోవిడ్ 19 పుట్టుక చైనాలోని ల్యాబ్(వుహాన్ పేరు తర్వాత తెరపైకి) పుట్టిందని, దీని వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపణలు ఒక్కసారిగా వెల్లువెత్తాయి. ఈ తరుణంలో నెలరోజులుగా(ముఖ్యంగా ఈ వారం నుంచి) వుహాన్ ల్యాబ్ థియరీపైనే ఎక్కువ ఫోకస్ అవుతోంది. 2012 నుంచే కరోనా వైరస్ పుట్టుకకు బీజం పడిందని, ఓ మైన్లలో పని చేసే ఆరుగురు అస్వస్థతకు గురి అయ్యారన్న వాదన బలంగా వినిపించింది. దీనికితోడు 2019లో యున్నన్ గుహాలను పరిశీలించిన వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ముగ్గురు రీసెర్చర్లు జబ్బు పడడం, వాళ్లకు గోప్యంగా చికిత్స అందించడం, ఆ తర్వాతే కరోనా విజృంభణ.. ఇలా వరుస ఆరోపణలతో చైనా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. చైనా ఎదురుదాడి.. అమెరికా గొంతులో వెలక్కాయ ‘‘2019లో వుహాన్ ల్యాబ్ లో అనారోగ్యానికి గురైన ముగ్గురు వ్యక్తుల మెడికల్ రికార్డులు చూపండి. వారు నిజంగా అనారోగ్యానికి గురయ్యారా? అయితే.. అనారోగ్యానికి కారణమేంటి?’’ అని చైనాను ఆంటోనీ ఫౌచీ డిమాండ్ చేశారు. కరోనా వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయిందా లేదా అనే దానిపై కీలకమైన ఆధారాలు అందించే తొమ్మిది మంది మెడికల్ రికార్డులను రిలీజ్ చేయాలని కోరారు. అయితే ఇదే ఫౌచీ గతంలో ‘ల్యాబ్ థియరీ’ని కొట్టిపడేశాడు. దీనికితోడు వుహాన్ ల్యాబ్ తో సంబంధం ఉన్న ఎకో హెల్త్ అలయన్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్.. థ్యాంక్స్ చెబుతూ ఫౌచీకి పంపిన ఈ మెయిల్ కూడా వివాదాస్పదమైంది. దీంతో ఇప్పుడు ఫౌచీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇక కరోనా వైరస్ పుట్టుక విషయంలో అమెరికా పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని, అక్కడి ల్యాబ్‌లను పరిశీలించాలని చైనా, డబ్ల్యూహెచ్‌వోను కోరడంతో అమెరికా గొంతులో వెలక్కాయపడ్డట్లయ్యింది. అంతేకాదు కరోనా వైరస్ పుట్టుకపై స్టడీ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో)ను ఆహ్వానించాలని అమెరికాకు చైనా పిలుపునిచ్చి గట్టి కౌంటరే ఇచ్చింది. అయితే అమెరికా మాత్రం ఆ పని చేయదని, ఫోర్ట్ డెట్రిక్ ల్యాబ్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200కు పైగా బయో ల్యాబ్‌ల్లో జరిగే అవకతవకలు బయటపడతాయని భయపడుతుందని చైనా గ్లోబల్ టైమ్స్ ప్రముఖంగా ఒక కథనం ప్రచురించింది. -
భారత రాజకీయాలపై ఆర్థిక అభద్రతా ప్రభావం
న్యూఢిల్లీ: భారత్ యువతలో ఆర్థిక అభద్రతాభావం నెలకొందనీ, దేశ రాజకీయాలపై దీని ప్రభావం పెరుగుతోందని ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) పరిశోధనా నివేదిక ఒకటి పేర్కొంది. దేశాభివృద్ధిలో మందగమన ధోరణులు, నిరుద్యోగ సమస్యలను నివేదిక ఈ సందర్భంగా ప్రస్తావించింది. భారత్ నిరుద్యోగ సమస్య దేశ రాజకీయాలతో విడదీయరాని అంశంగా రూపొందుతోందని నివేదిక పేర్కొంది, ఆర్థిక వృద్ధి మందగమనం నిరుద్యోగ సమస్యను తీవ్రతరం చేసిందని వివరించింది. ‘‘పటిష్ట నాయకత్వం, సామాజిక, భద్రతా అంశాల ప్రాతిపదికన ఈ ఏడాది రెండవసారి ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ విజయం సాధించినప్పటికీ, పెద్ద సంఖ్యలో ఉన్న యువత ఆర్థిక అభద్రతాభావమే దేశ రాజకీయాలకు రూపునిస్తున్న పరిస్థితి పెరుగుతోంది’’ అని ఈఐయూ పేర్కొంది. సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటాను ఈఐయూ నివేదిక ప్రస్తావిస్తూ, ‘‘2019 సెప్టెంబర్‌లో 7.2 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు మరుసటి నెల అక్టోబర్‌లోనే మూడేళ్ల గరిష్ట స్థాయి 8.5%కి పెరిగిన విషయాన్ని గుర్తు చేసింది. పెద్ద సంఖ్యలో ఉన్న యువతను చక్కటి మానవ వనరుగా వినియోగించుకుంటూ, రానున్న కొద్ది దశాబ్దాల్లో ఆర్థిక ప్రయోజనాలు పొందాలని దేశం భావిస్తున్నప్పటికీ, ఉపాధి కల్పనలో మాత్రం వెనుకబడుతున్నట్లు విశ్లేషించింది. -
కులాంతరంవైపే యువతరం
భారతీయ యువతరంలో టెక్నాలజీ చైతన్యం నింపుతోందా? ఇందుకు అవుననే సమాధానమిస్తోంది ఢిల్లీ కేంద్రంగా ‘‘పల్స్ ఆఫ్ ద నేషన్’’పేరుతో జరిగిన తాజా అధ్యయనం. ఇన్‌షార్ట్స్ అనే న్యూస్ యాప్ ద్వారా జరిపిన ఈ సర్వేలో 18 నుంచి 35 ఏళ్లలోపు 1,30,000 మంది పాల్గొంటే అందులో 70 శాతం మంది కులాంతర వివాహాలకు సుముఖంగా ఉన్నట్టు తేలింది. అలాగే పెళ్లయ్యాక మహిళలు తమ ఇంటిపేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని కూడా 70 శాతం మంది పురుషులు అభిప్రాయపడ్డారు. పెళ్లి ఖర్చులు వధువు తరఫు వారే భరించాలన్న సనాతన భావజాలానికి భిన్నంగా సర్వేలో పాల్గొన్న పురుషులు స్పందించారు. వారిలో 90 శాతం మంది పెళ్లి ఖర్చులను పంచుకుంటామని చెప్పడం భారతీయ యువతరంలో చైతన్యానికి ఉదాహరణగా సర్వే సంస్థ అభిప్రాయపడింది. దాదాపు 84 శాతం మంది మహిళలు తమ భర్తలు తమకన్నా తక్కువ ఆదాయం ఉన్నా అదేం పట్టించుకోబోమని పేర్కొన్నారు. 7 శాతం మంది పురుషులు మాత్రం తమకన్నా తమ భార్యలకు ఎక్కువ ఆదాయం ఉండటం అభ్యంతరకరమన్నారు. పెళ్లిళ్లు, ఒకే కులం వారిని వివాహం చేసుకోవడం, భార్యలు నిర్వహించాల్సిన పాత్రలు, ఆస్తి హక్కు వంటి విషయాలపై భారతీయుల్లో కనిపించే సంప్రదాయ ఆలోచనలకు భిన్నంగా యువతరం స్పందించడం గమనార్హం. -
కావాల్సినంత డబ్బు, సుఖం
⇒ యువతకు గాలం వేస్తున్న ఐఎస్ఐఎస్ న్యూఢిల్లీ: ‘ఇక్కడ మీకు కావాల్సిన అన్ని సుఖాలు అందుబాటులో ఉన్నాయి. మీరు కోరుకున్న కన్యలను పెళ్లి చేసుకోవచ్చు. కావాలనుకుంటే అమరులైన జిహాదీల భార్యలను పెళ్లి చేసుకోవచ్చు. మన ప్రభుత్వం ఉచితంగా అందించే ఇంట్లో ఉండవచ్చు. చేసే ఉద్యోగానికి కావాల్సినంత డబ్బు చేతికందుతుంది. తిండికి కొదవుండదు. మంచి మాంసం, తాజా కూయగారలు తినవచ్చు. బిస్కట్లు, చాక్లెట్లు కూడా తినవచ్చు. షరియా చట్టానికి లోబడి సుఖంగా జీవించవచ్చు. కలిసొస్తే మనమందరం స్వర్గంలో కలుసుకోవచ్చు’ నేడు ప్రపంచవ్యాప్తంగా మారణహోమం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) టెర్రరిస్టు సంస్థలోకి భారత్ నుంచి ముఖ్యంగా కేరళ నుంచి యువతను లాగేందుకు ప్రలోభ పెడుతున్న పద్ధతి ఇది. కేరళకు చెందిన అబ్దుల్ రషీద్ అబ్దుల్లా ఇరాన్ ఈశాన్య ప్రాంతంలోని ఖొరాసన్ పర్వతాల నుంచి కేరళ యువతతో రహస్యంగా మాట్లాడిన మాటలివి. మాటలు ఇతరులకు పోకుండా కట్టుదిట్టమైన నెట్వర్క్ ఫోన్ల ద్వారా మాట్లాడినప్పటికీ వీటిని నేషనల్ మీడియా ఈ మాటల ఆడియో సంకేతాలను అందుకోగలిగింది. అబ్దుల్ రషీద్ అఫ్ఘానిస్తాన్ ఐఎస్ఐఎస్ తరఫున భారత రిక్రూటర్‌గా వ్యవహరిస్తున్నాడు. కేరళకు చెందిన అబ్దుల్ టెర్రరిస్టు సంస్థలో చేరిన రెండేళ్లలోనే రిక్రూటర్ స్థాయికి ఎదిగిన విషయాన్ని భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గత జనవరి నెలలోనే గుర్తించింది. (ఆ 80 మందిని చంపింది మేమే) కేరళలోని కాసర్‌గాడ్‌కు చెందిన అబ్దుల్లా, కాసర్గాడ్ నుంచి 17 మందిని, పలక్కాడ్ నుంచి నలుగురిని రిక్రూట్ చేసుకొని అఫ్ఘాన్‌కు తరలించిన విషయాన్ని ఎన్ఐఏ గుర్తించింది. వారిలో డాక్టర్లు, ఇంజనీర్లు, మేనేజ్మెంట్ నిపుణులు కూడా ఉన్నారు. ప్రపంచంలోని ముస్లింల అందరి నేత అబూ బకర్ అల్ బగ్ధాది పాలించిన ఇరాక్, శామ్, లిబియా, కొరసామ్, ఆఫ్రికా ప్రాంతాల్లో ఇప్పుడు తమ ఇస్లామిక్ స్టేట్ ప్రభుత్వాలే ఉన్నాయని, విద్యా, ఆరోగ్యం, వ్యవసాయం, పోలీసులు, ఆర్థిక, ధాతృత్వ విభాగాలన్నీ తమ ప్రభుత్వ హయాలోనే కొనసాగుతున్నట్లు మలయాళంలో మాట్లాడిన అబ్దుల్లా తెలిపారు. ‘మిత్రమా, ముర్షీద్ మొన్ననే ఓ కన్య పిల్లను పెళ్లి చేసుకున్నాడు. సజీద్ ఇద్దరు పిల్లలున్న వితంతువును, మంజత్ ఒక పాపున్న వితంతువును పెళ్లి చేసుకున్నాడు. నేను చెప్పొచ్చేదేమిటంటే పెళ్లి చేసుకోవడం ఇక్కడ చాలా ఈజీ’ అని కూడా అబ్దుల్ ప్రలోభపెట్టాడు. (భారత ఎంబసీ వద్ద భారీ పేలుడు!) భారత్ నుంచి ఐఎస్ఐఎస్ టెర్రరిస్టుల్లో చేరేందుకు వెళుతున్న 75 మందిని మార్చి వరకు దేశ సరిహద్దుల్లో భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. వారిలో కేరళకు చెందిన వారు 21 మందికాగా, తెలంగాణకు చెందిన వారు 16, కర్ణాటకకు చెందిన వారు 9 మంది, తమిళనాడుకు చెందిన వారు నలుగురు, మహారాష్ట్రకు చెందిన వారు 8 మంది, మధ్యప్రదేశ్‌కు చెందిన వారు ఆరుగురు, ఉత్తరాఖండ్‌కు చెందిన వారు నలుగురు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు ముగ్గురు, రాజస్థాన్‌కు చెందిన వారు ఇద్దరు ఉన్నారు. జమ్మూ, కశ్మీర్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు ఒక్కరు చొప్పున ఉన్నారు. -
భారతీయ యువతకు అపూర్వ నైపుణ్యం
బిజినెస్ అచీవర్స్ అవార్డ్ కార్యక్రమంలో కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: భారతీయ యువతకు అపూర్వమైన నైపుణ్యం ఉందని, సరైన తోడ్పాటు ద్వారా ఈ నైపుణ్యాన్ని వెలికి తీయవచ్చని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. సింగపూర్ బుధవారం రాత్రి జరిగిన సౌత్ ఇండియా బిజినెస్ అచీవర్స్ అవార్డుల ప్రధానోత్సవంలో 200పైగా కంపెనీల సీఈఓలు, ప్రతినిధులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. ఎకామిక్ టైమ్స్ ఎర్నెస్ట్ యంగ్‌ల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 12 మందికి మంత్రి అవార్డులు అందజేశారు. అనంతరం గుగూల్ ఈశాన్య ఆసియా రిజినల్ హెడ్ విద్యాసాగర్, స్టార్టప్ కమ్యూనిటీ రంగ నిపుణుడు శ్రీధర్ గాంధీలు నిర్వహించిన చర్చలో మంత్రి పాల్గొన్నారు. పరిశ్రమ అవసరాలను అనుగుణంగా విద్యారంగంలో మార్పులు రావాలని, త్వరలో భారత్ నుంచి అద్భుత ఆవిష్కరణలు వస్తాయన్నారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ప్రతినిధి సుచిత్రకు ఫార్మా రంగంలో బిజినెస్ అచీవర్ అవార్డు లభిచింది. సెల్‌కాన్‌కు ఉత్తమ తయారీదారు అవార్డు సెల్‌కాన్‌కు ఉత్తమ తయారీదారు అవార్డు (బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్) లభించింది. దక్షిణ భారతదేశంలో మొట్ట మొదటి యూనిట్‌ను స్థాపించి, నెలకు 5,00,000కు పైగా మొబైల్స్‌ను తయారు చేస్తున్నందుకుగానూ సౌత్ ఇండియా బిజినెస్ అచీవర్స్.. మొబైల్ కేటగిరి విభాగంలో ఈ అవార్డుకు సెల్కాన్ను ఎంపికచేసింది. చిత్రంలో తెలంగాణ పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చేతుల మీదుగా ఉత్తమ తయారీదారు అవార్డును అం దుకుంటున్న సెల్కాన్ సీఎండీ వై.గురు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ.. రానున్న కాలంలో నెలకు 10,00,000లకు పైగా మొబైళ్లను తయారు చేస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. -
'భారత యువతను సానబెడితే తిరుగుండదు'
పుణె: గత ప్రభుత్వాలు సక్రమంగా పనిచేయకపోవడం వల్లే దేశంలో నిరుద్యోగిత విపరీతంగా పెరిగిపోయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. భారత యువతను గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని చెప్పారు. ఆదివారం ఆయన పుణెలో ప్రమోద్ మహజన్ స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రిన్యూర్ మిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశానికి లేనంత యువ జనాభా ఇక్కడ ఉండటం భారత్ అదృష్టం అని అన్నారు. వారందరినీ సరిగా సానబెడితే తిరుగుండదని, భారత్ దృఢమైన దేశంగా మారుతుందని చెప్పారు. గత ప్రభుత్వాలు ఈ పనిచేయకుండా నిర్లక్ష్యం చేశాయని చెప్పారు. ఒక్క స్కిల్ ఇండియా మాత్రమే కాకుండా స్టాండ్ అప్ ఇండియా, ముద్రా బ్యాంక్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు అన్నీ కూడా భారత్‌లోని నిరుద్యోగితన పారద్రోలేవే అని చెప్పారు. -
ఊడిగానికి 'ఉగ్రవాద' షరతు
రెండోమాట ఇక్కడ అమెరికా రాయబారిగా పనిచేసి వెళ్లిపోతూ మల్ఫోర్డ్ చెప్పిన మాటను గుర్తు చేసుకోవాలి. 'ఆప్తవాక్య'మో, ఎగతాళో తెలియదు గాని 'నేడు అమెరికా ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్నది భారతీయ యువతే' అన్నాడాయన. అంటే, భారతీయుల నిరుద్యోగం అమెరికా ఆర్థిక ప్రగతికి 'ఎంత అవసరమో'ఇది నిరూపిస్తోంది? అందుకోసం అమెరికా వాడు 'ఫలానా వాడు ఉగ్రవాది' అంటే మనమూ ఆమోదించాల్సిందే. గుత్తపెట్టుబడులు రావడానికి ఇదో 'మార్గం' కాబోలు! స్వాతంత్య్రోద్యమకాలంలో కూడా దళిత బహుజనులు 'అంటరానితనం' పేరుతో 'వెలి'కి గురి అవుతున్న కాలంలో, అగ్రవర్ణాలు రాక్షస ప్రవృత్తిని ప్రదర్శిస్తున్న కాలంలో బుచ్చిసుందరరామశాస్త్రి అనే కవి ఒక చలోక్తి విసురుతూ ఉండేవాడు- 'అంటరానివారెవరయ్యా అంటే, మా వెంటరాని వారే' అని. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఇదే అమలవుతోంది. తేడా- నాటి సూత్రధారులు అగ్రవర్ణాలు కాగా, నేడు సామ్రాజ్యవాదులూ, అగ్రరాజ్యాలే సూత్రధారులు. తమ శాసనానికి తలొగ్గి, తమ వెంటరాని వారంతా అంట రానివారేనని ప్రతికూల ధోరణితో అంటున్నారు. సెప్టెంబర్ 11, 2001న అమెరికా ట్విన్ టవర్స్ వాణిజ్య కేంద్రం మీద ఉగ్రవాదులు జరిపిన పైశాచిక దాడితో దాదాపు 3,000 మంది చనిపోయారు. టవర్స్ కుప్పకూలాయి. ఇదే '9/11' ఘటనగా చరిత్ర ప్రసిద్ధమైంది. ఈ దాడి వెనుక శక్తులు బయట నుంచి వచ్చినవా? అమెరికా వ్యవస్థ పట్ల ఉన్న తీవ్ర అసంతృప్తితో నిరంతర యుద్ధాలకీ, అశాంతికీ నిరసనగా లోపలి శక్తులే తెగించి చేసిన దాడులా? అన్నది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ నీయాంశమైంది. ఇలాంటి అనుమానాన్ని 'వాషింగ్టన్ జర్నల్' వ్యక్తం చేసింది కూడా. ఆ తరువాత అమెరికా పాలకులు బుష్, క్లింటన్లు ఒక నినాదం మొదలుపెట్టారు: ఇది బయట నుంచి ఉగ్రవాదులు తలపెట్టిన కిరాతక చర్య కాబట్టి, 'ఇక నుంచి ప్రపంచ ఉగ్రవాదంపైనే అమెరికా యుద్ధం ప్రకటిస్తోంది. ఈ పోరాటంలో మాతో (అమెరికాతో) చేతులు కలపని దేశాధినేతలనూ, దేశాలనూ, ప్రభుత్వాలనూ అమెరికా ఉగ్రవాదులుగా ప్రకటిస్తుంది' ప్రెసిడెంట్ జార్జి బుష్ ఈ మేరకు బహిరంగ ప్రకటనే చేశాడు. 1812 యుద్ధం తరువాత అమెరికా భూభాగం ఎన్నడూ పరాయివారి దాడులకు గురికాలేదు. ఈ సందర్భంగా కొందరు వ్యాఖ్యాతలు రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి పెరల్ హార్బర్‌పై దాడి ఘటనను గుర్తు చేశారు. కానీ, డిసెంబర్ 7, 1941న రెండు అమెరికా వలసలలోని సైనిక కేంద్రాల పైనే దాడులు జరిగాయి. కాబట్టి అమెరికా భూభాగం మీద నేరుగా దాడి జరగడం 2001లోనే. ఆ రెండు కాలనీలు (వలసలు)హవాయ్, ఫిలిప్పీన్స్. వీటి మీద ఎందుకు దాడి జరపవలసి వచ్చింది? వందల ఏళ్లుగా అక్కడే నివసిస్తున్న లక్షలాది మంది స్థానికులను ఆక్రమణ దరిమిలా అమెరికా మట్టుపెట్టిం ది. మెక్సికో మీద దాడి చేసి సగభాగాన్ని ఆక్రమించుకుంది. ఇలా అరవై ఏళ్లకు పైగా ప్రపంచంలో అమెరికా ఆయుధ బలంతో సామ్రాజ్యాన్ని విస్తరించింది. షరతుల ఆయుధంతో కొత్త దురాక్రమణ కానీ, అమెరికా చరిత్రలోనూ, ప్రపంచ చరిత్రలోనూ 2001లో కొత్త పరిణా మం చోటుచేసుకుంది. యూరప్ ఆత్మహత్యా సదృశమైన అంతర్గత యుద్ధాల తో వినాశకర పంథాకు మళ్లింది. అవి సద్దుమణిగిన తరువాత ఇతరత్రా సామ్రాజ్య విస్తరణ కోసం ప్రపంచ దేశాల మీద దాడులు నిర్వహించింది. ఇలా అమెరికా, యూరోపియన్ వలస సామ్రాజ్యవాదులు రెండో ప్రపంచ యుద్ధం దాకా, ఆ తరువాత పారిశ్రామిక, సైనిక, యుద్ధతంత్ర వ్యవస్థల ద్వారా నిరంతరం విస్తరణపైనే దృష్టి కేంద్రీకరించారు. కానీ ‘రవి అస్తమిం చని సామ్రాజ్యం’ అంటూ విర్రవీగిన బ్రిటన్ వలసవాదం ప్రధాన భూమిక నుంచి తోక ముడిచింది గానీ, అమెరికా మాత్రం స్వతంత్ర దేశాలతో పోరులో ప్రాణవాయువును నిలుపుకునే ఆఖరియత్నంలో ఉంది. 90 దేశాలలో సైనిక, నావికా స్థావరాల ద్వారా తుది సమరం నిర్వహించాలని వారికి ఉందిగానీ, ప్రపంచ పరిస్థితులూ లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఖండాలలో తమకు అనుకూ లత లేకపోవడం వంటి కారణాలతో పంటి బిగువున బతుకుతున్నారు. అం దుకే ఆర్థిక సంక్షోభాల కాలవ్యవధి కుదించుకుపోకుండా గతంలో కంటే మరింత విస్తరిస్తున్నది. ప్రసిద్ధ ఇండియన్-అమెరికన్ ఆర్థిక నిపుణుడు డాక్టర్ రవి బాత్రా పదిహేనేళ్ల నాడే జోస్యం చెప్పారు: ‘యుద్ధానంతర కాలంలో అమెరికా మీద ఆధారపడుతూ వస్తున్న బడుగు, పేద స్వతంత్ర దేశాలు దీర్ఘ కాలిక ఆర్థిక సంక్షోభంలో ప్రవేశించినందున, ముందుగా ఇవే పెట్టుబడుల కోసం పరాధార స్థితి వల్ల పతనదశలో ప్రవేశిస్తాయి. ఆ తరువాత నిరంతర సంక్షోభాలకు కేంద్ర స్థానంగా ఉన్న అమెరికా పతనమవుతుంది. 'డాక్టర్ బాత్రా జోస్యం ఏ రూపంలో ఫలించినా ఈ కారణాల వల్లనే బ్రెటన్ ఉడ్ (అమెరికా) మంతనాల ఫలితంగా అవతరించిన ప్రపంచ బ్యాంక్, అంత ర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)ల ద్వారా ప్రజా వ్యతిరేక సంస్కరణలను బలవంతంగా ప్రవేశపెట్టించి అమెరికా, యూరప్ గుత్త పెట్టుబడులకు ఆసి యాలోని ఇండియా లాంటి దేశం ద్వారా, ఆఫ్రికా దేశాల ద్వారా ద్వారాలు తెరిపించింది. అయితే ఆ గుత్త పెట్టుబడులు అంత సులభంగా వచ్చి పడవు. అవి కుప్పలుగా వచ్చి పడాలంటే స్వతంత్ర దేశాలని మురిసిపోతూ చెప్పు కునే ఇండియా వంటి వర్ధమాన దేశాలు కొన్ని షరతులను ఆమోదించి తీరాలి. ఆ షరతులన్నీ కూడా పెట్టుబడి దేశాల వారి రాజకీయ, వ్యూహాత్మక, వ్యాపార ప్రయోజనాల, సైనిక సంబంధాల రూపంలో ఉంటాయి. ఇండియా తన బాలబాలికలను పరిశ్రమలలో నియమించరాదనీ, ప్రపంచ వాణిజ్య సంస్థకు ఎగుమతిదారుగా అర్హత సాధించాలంటే సంపన్న దేశాల వస్తూత్పత్తి ప్రమాణాలతో సరుకులు తులతూగాలనీ, పేటెంట్ హక్కుల పేరుతో సం పన్న పారిశ్రామిక దేశాలను శాసించరాదనీ చెప్పే ఇలాంటి షరతులు విధించి అమెరికా ఈరోజుకీ అమలు చేస్తున్నది. ఇండియా వంటి దేశాల సాంకేతిక పరిజ్ఞానం కంటే 80 ఏళ్లకు ముందుకు పోయి వస్తూత్పత్తి చేస్తున్నప్పటికీ అమె రికా వర్ధమాన దేశాల ఉత్పత్తులపైన ఆ మూడు వాణిజ్య సంస్థల ద్వారా నేటికీ ఆంక్షలు విధిస్తున్నది. అమెరికా వర్ధమాన దేశాలపై కప్పిన ‘మాయ జలతారు’ ముసుగే- గుత్త పెట్టుబడుల సామ్రాజ్య 'ప్రపంచీకరణ'. ప్రపంచీకరణ నిజస్వరూపం గత శతాబ్దాలలో కూడా దేశాల మధ్య పరస్పరం వస్తూత్పత్తుల మార్పిడీ, సమాన స్థాయిలో వస్తుమార్పిళ్లూ జరగకపోలేదు. కానీ నేటి ఆంగ్లో-అమెరి కన్ సామ్రాజ్యశక్తులు రుద్దుతున్న 'ప్రపంచీకరణ' వర్ధమాన దేశాల ఉద్ధరణ కోసం కాదు. గుత్త పెట్టుబడుల ద్వారా సంపన్న దేశాల లాభాల కోసం మరో సారి ఆ దేశాలను ముడిసరుకులు సరఫరా చేసే వలసలుగా మిగిల్చడమే. ఇది ఆ సంపన్న దేశాల సరుకులతో మన సంతలను నింపే 'ప్రపంచీకరణ' ఇరాక్, ఇరాన్, ఎమెన్, అఫ్ఘ్ఘానిస్తాన్, అల్జీరియా, ట్యునీషియా తదితర దేశా లలో చమురు, సహజ సంపదలను దోచుకునేందుకు 1990ల నుంచి ఆంగ్లో- అమెరికన్ దుష్ట కూటమి సాగించిన దురాక్రమణలున్నాయి. ఆయుద్ధాలు తలపునకు రాకుండా జాగ్రత్తపడుతూ, తన దురాక్రమణను ప్రతిఘటించే శక్తులకు అమెరికా పెట్టిన కొత్త పేరే 'టైజం' అయితే తాను చేస్తున్న ఈ దురాక్రమణ యుద్ధాలను మాత్రం ఉగ్రవాదంగా పరిగణించరాదని అమెరికా కోరిక. 'తాలిబాన్'ను, ముజాహిదీన్లను పెంచిన వారు అమెరికా అధ్యక్షులే. పెంచిన ఆ చేతులు వారిపై కత్తిదూసినట్టే దూసి, మళ్లీ ఆ తాలిబాన్లతోనే నిస్సిగ్గుగా మంతనాలు జరుపుతున్నాయి. అఫ్ఘానిస్తాన్‌కు కొత్త తలనొప్పులు వారే తెచ్చి పెడుతున్నారు. క్లింటన్ అధ్యక్షహోదాలో (1993) ఐక్యరాజ్య సమితి వేదిక నుంచి ప్రసంగిస్తూ- 'దేశాలపై యుద్ధం ప్రకటించవలసివస్తే సాధ్యమైనప్పుడు మిత్రదేశాలతో కలసి యుద్ధం చేస్తాం. సాధ్యం కానప్పుడు అవసరాన్ని బట్టి ఏకపక్షంగా కూడా అమెరికా యుద్ధం ప్రకటిస్తుంది' అన్నాడు. ఉగ్రవాదమూ పెట్టుబడేనా? కాని మన పాలకులు మాత్రం (యూపీఏ-ఎన్డీయే) అప్పుడూ ఇప్పుడూ కూడా అమెరికా ఎత్తుగడల పట్ల 'సాఫ్ట్వేర్' మార్గాన్నే అనుసరిస్తున్నారు. పైగా ఏ గుత్తవర్గాలు సైనిక-పారిశ్రామిక (అమెరికా) వ్యవస్థకు కాపలాదా ర్లుగా, పోషకులుగా ఉన్నారో ఆ వర్గాలనే 'వాస్కోడిగామా'లై తరలిరమ్మని ఆహ్వానించడం ఎందుకు? ఇంకా, భారత పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు సుఖంగా, దేశీయ పరిజ్ఞానంతోనే ఉత్పత్తి చేసుకోగల 2,000 పైచిలుకు వస్తు వులను దిగుమతి చేసుకునే ఖర్మ ఎందుకు పట్టిందో పాలకులు చెప్పరు. ఈ పరాధార స్థితి ఎలాంటిదంటే- విక్టోరియా మహారాణి పెంపుడు పిల్లి పాల కయ్యే ఖర్చును కూడా ఇండియా బకాయిగానే జమకడితే నోరెళ్లబెట్టిన (ఇం డియా నుంచి వెళ్లిపోయేప్పుడు) రాజకీయ నాయకత్వం మనది. అలాగే అమె రికన్ అధికారి, యూనియన్ కార్బయిడ్ కంపెనీ చైర్మన్ వారెన్ ఆండర్సన్ - భోపాల్ విషవాయువు విడుదలకు కారకుడై 16,000 మంది దారుణ మర ణానికి బాధ్యుడైనప్పుడూ అతడిని మన చట్టాల కింద శిక్షించడానికి పాల కులకు దమ్ములు లేకపోవడానికి కారణం-ఈ పరాధారస్థితే! మనం ఆరోపించి, రుజువులతో శిక్షించవలసిన చోట కూడా నోరు మెదపని బలహీనులం మనం. అఫ్ఘానిస్తాన్‌లో, అంటే దాదాపు మన ముంగిట్లోనే అమెరికా పెట్టు కున్న 'నాటో' సైనిక కూటమి సేనలు జమ్మూ-కశ్మీర్లో ప్రవేశానికి ఎంతో వ్యవధి పట్టదు. మన దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో ఒబామా జోక్యానికి, కశ్మీర్‌పై ఆయాచిత సలహాలు ఇవ్వడానికి, భారత్-పాక్ జాతీయ భద్రతా సంఘాల సమావేశం విఫలం కావడం పట్ల ‘తీవ్ర అసంతృప్తి’ ప్రకటించడా నికి, నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించడానికి కారణం ఏమిటి? ఆర్థికవ్యవస్థ పెట్టే ఇబ్బందులతో మనం సతమతమవుతున్న సమయం లో; ఇక్కడ అమెరికా రాయబారిగా పనిచేసి వెళ్లిపోతూ మల్ఫోర్డ్ చెప్పిన మాటను గుర్తు చేసుకోవాలి. 'ఆప్తవాక్య'మో, ఎగతాళో తెలియదు గాని 'నేడు అమెరికా ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్నది భారతీయ యువతే' అన్నాడా యన. అంటే, భారతీయుల నిరుద్యోగం అమెరికా ఆర్థిక ప్రగతికి 'ఎంత అవ సరమో' ఇది నిరూపిస్తోంది? అందుకోసం అమెరికా వాడు 'ఫలానా వాడు ఉగ్రవాది' అంటే మనమూ ఆమోదించాల్సిందే. గుత్తపెట్టుబడులు రావడా నికి ఇదో 'మార్గం' కాబోలు! (వ్యాసకర్త మొబైల్: 9848318414) -
గ్లోబల్... నోబెల్
యువత 2014 శాంతిస్థాపన యత్నానికి అత్యున్నత పురస్కారం.. అపారమైన ప్రతిభకు అవధుల్లేని అవకాశాలు.. ఎవరెస్ట్ స్థాయి సాహసాలు.. ఆటల్లోనూ అబ్బురపరిచే విన్యాసాలు.. మొత్తంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో యువతకు కలిసొచ్చిన సంవత్సరం 2014. ఈ ఏడాదిలో అనేక యువకిరణాలు ఉదయించాయి. వ్యాపార, క్రీడ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అనేక మంది యువతీయుకులు తమ ప్రతిభాపాటవాలను చాటారు. నోబెల్ బహుమతి... ఈ బహుమతి స్థాయిని బట్టి, తలపండిన వారికే దక్కుతుందనుకోవడం చాలా సహజమైన అభిప్రాయం. అయితే అలాంటి అంచనాలకు భిన్నంగా ఒక 17 యేళ్ల యువతికి నోబెల్ బహుమతి దక్కింది. అది కూడా శాంతి పరిరక్షణకు గానూ.. దక్కిన నోబెల్ శాంతి బహుమానం. ఈ ఏడాది యువతకు సంబంధించి ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సిన విషయం ఇది. యువ శక్తి ఉద్యోగం సంపాదించుకొనేంత స్థాయికో, కొత్త ఆవిష్కరణ చేపట్టడానికో పరిమితం కాదు... టీనేజ్లోనే నోబెల్‌ను సాధించుకొనే స్థాయి వరకూ ఎదిగిందనే సందేశాన్ని ఇచ్చింది పాకిస్తాన్ యువతి మలాలాకు దక్కిన ఈ ఖ్యాతి. మలాలానే ఈ ఏడాదికి ‘యూత్ ఆఫ్ ది ఇయర్’ అని చెప్పవచ్చు. ఎవరెస్ట్నూ అధిరోహించేశారు! ఈ ఏడాది భారతీయ యువతకు దక్కిన ఖ్యాతి ఇది. తెలుగువాళ్లు అయిన మలావత్ పూర్ణ, సద్దనపల్లి ఆనంద్‌లు ఎవరెస్ట్‌ను అధిరోహించి ఆ శిఖర స్థాయి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొన్నారు. టీనేజర్ పూర్ణ ఎవరెస్ట్‌ను అధిరోహించిన అత్యంత పిన్నవయస్కురాలు కూడా. వీరి విజయానికి తెలుగుగడ్డ నీరాజనాలు పల్కింది జీతాలు కోట్లకు చేరాయి! ఐదంకెల జీతం ఇన్ని రోజులకూ గొప్ప. అయితే ఇప్పుడు ఐదుకు మరో రెండంకెలను జోడించి ఆ మొత్తాన్ని భారతీయ విద్యార్థులకు ప్యాకేజీలుగా ఇవ్వడానికి ముందుకొచ్చాయి అనేక కంపెనీలు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యాభ్యాసం చేస్తున్న అనేక మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కు చదువు పూర్తి కాకుండానే ఇలాంటి ఆఫర్లు వచ్చాయి. గూగుల్ వంటి దిగ్గజాలు భారతీయ విశ్వవిద్యాలయాల్లో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో సంచలనాలే నమోదయ్యాయి. వార్షిక వేతనం కోటి, కోటిన్నర రూపాయల స్థాయిలో ఉండే ఉద్యోగాలు మనవాళ్లను పలకరించాయి. కోటి రూపాయల వేతనం! 2014 మెమరబుల్ ఇయర్.. ఇదే ఏడాది స్టూడెంట్స్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఒక సెమిస్టర్ సింగపూర్‌లో చదివాను. సామ్‌సంగ్‌లో ఇంటర్న్‌షిప్ చేయడం మంచి అనుభవాన్ని మిగిల్చింది. అందులోనే ఉద్యోగం రావడం, అదీ కోటి రూపాయల భారీ వేతనంతో ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. ఈ ఏడాదితో నా విద్యార్థి జీవితం ముగుస్తుంది. 2015 నుంచి బాధ్యత గలిగిన ఉద్యోగిగా మారాలి. అయితే నా జీవితంలో ఇది ఒక మైలురాయి అని చెప్పడం కష్టం. ప్రతిదీ ఒక లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్ అనే చెప్పాలి. ఐఐటిలో సీటు కోసం కోచింగ్ దగ్గర నుంచి ఐఐటి క్యాంపస్‌లో చదువు అన్నీ ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్పించాయి. - ఇమ్మడి పృథ్వితేజ్, ముంబయి ఐఐటి విద్యార్థి -
మీ ఇష్టమే.. మా ఇష్టం...
మీరు చూసిన సంబంధమే చేసుకుంటాం. మీ ఇష్టమే మా ఇష్టం.... వివాహాల విషయంలో గతంలో ఎక్కువగా యువతీయువకుల నోటివెంట ఈ మాటలు తల్లిదండ్రుల వద్ద వినబడేవి. కాలం మారింది. జీవిత భాగస్వాముల ఎంపికలో యువత తమకు తామే స్వంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ వచ్చింది. తమకు నచ్చిన వారిని పెద్దలను ఎదరించైనా పెళ్లిచేసుకునే జంటలు పెరుగుతున్నాయి. మారిన కాలంతో పాటు పిల్లల ఇష్టానికే తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారు. కాలం ఎంతమారినప్పటికీ వివాహం విషయంలో తల్లిదండ్రుల మాటే తమ బాటగా భావిస్తున్నారు యువతలో ఎక్కువ మంది. తమ జీవిత భాగస్వామి ఎంపిక విషయం ఎక్కువ మంది తల్లిదండ్రులకే వదిలేస్తున్నారు. షాది డాట్‌కామ్ పోర్టల్ నిర్వహించిన సర్వేలో ఈ వియషం వెల్లైడైంది. భాగస్వామి ఎంపికలో ఉత్తమైన మార్గం ఏమిటని ప్రశ్నించగా అత్యధికంగా 50.1 శాతం మంది తల్లిదండ్రులు చూసిన సంబంధానికే ఓటు వేశారు. తమిష్ట ప్రకారం ఆన్లైన్ లో భాగస్వామిని వెతుక్కుంటామని 31 శాతం మందిపైగా పేర్కొన్నారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా సంబంధం కలుపుకుంటామని 12 శాతం మంది, పనిచేసే కార్యాలయాల్లోనే భాగస్వామిని వెతుక్కుంటామని 6 శాతం మంది వెల్లడించారు. జీవిత భాగస్వామి ఎంపికలో అభిప్రాయాలు, అభిరుచులకే ప్రాధాన్యం ఇస్తామని అధికంగా 37 శాతం మంది తెలిపారు. విద్యార్హతలకు ప్రాధాన్యం ఇస్తామని 30 శాతం మంది, జీవిత భాగస్వామి వృత్తికి ప్రాధాన్యం ఇస్తామని 21 శాతం మంది పేర్కొన్నారు. ఆకర్షణీయంగా ఉండాలని 11 శాతం మంది చెప్పారు. తరాలు మారినా, టెక్నాలజీ పెరిగినా భారత యువత పెద్దలను గౌరవిస్తోందని, అదే సమయంలో తమ అభిప్రాయాలను కాపాడుకుంటున్నారు.