National Youth Day 2022: Significance, Theme, Success Stories - Sakshi
Sakshi News home page

National Youth Day: నారీ యువ శక్తి గెలుస్తుంది

Published Wed, Jan 12 2022 1:23 AM | Last Updated on Wed, Jan 12 2022 6:05 PM

National Youth Day 2022: Wins power of young womens - Sakshi

‘లే.. మేలుకో... లక్ష్యం చేరుకునే దాకా విశ్రమించకు’ అన్నారు స్వామి వివేకానంద. ‘వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం’ అన్నాడాయన. మన దేశంలో 15–25 ఏళ్ల మధ్య యువత 20 కోట్లు. వీరిలో 10 కోట్ల మంది యువతులు. ఇంటర్‌ వయసు నుంచి ఉద్యోగ వయసు మీదుగా వివాహ వయసు వరకు అమ్మాయిలకు ఎన్నో సవాళ్లు. వివక్షలు. ప్రతికూలతలు. కాని నారీ యువశక్తి వీటిని ఛేదించి ముందుకు సాగుతోంది. జనవరి 12– స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జరుపుకునే ‘జాతీయ యువజన దినోత్సవం’ యువతులకు స్ఫూర్తినివ్వాలి. మార్గం చూపాలి.

అంతరిక్షాన్ని చుంబించాలనుకున్న ఒక తెలుగు యువతి ఆ ఘనతను సాధించడం చూశాం. ఇంటి నుంచి బస్టాప్‌ వరకూ వెళ్లి కాలేజీ బస్సెక్కడానికి పోకిరీల బెడదను ఎదుర్కొంటున్న యువతి నిస్సహాయతను కూడా చూస్తున్నాం. ఇద్దరూ యువతులే. ఒకరు సాధిస్తున్నారు. మరొకరు సాధించడానికి అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. ఈ రెండు బిందువుల మధ్యే భారతీయ టీనేజ్‌ అమ్మాయిలు, యువతులు తమ గమనాన్ని కొనసాగిస్తున్నారు.

‘కెరటం నాకు ఆదర్శం లేచినా పడినందుకు కాదు... పడినా లేచినందుకు’ అంటారు స్వామి వివేకానంద. గత మూడు నాలుగు దశాబ్దాలలో భారతీయ యువతులు పడినా లేచే ఈ సంకల్పాన్నే ప్రదర్శిస్తున్నారు. బాల్య వివాహాలను నిరాకరిస్తున్నారు. చదువు వైపు మొగ్గుతున్నారు. ఆ తర్వాత ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంకా చెప్పాలంటే జీవిత భాగస్వామి ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. అయితే ఈ పరిస్థితి మధ్యతరగతి, ఆ పై తరగతుల్లో ఎక్కువగా ఉంటే దిగువ, పేద వర్గాలలో సంఘర్షణ కొనసాగించాల్సి వస్తోంది.

దేశంలో ఇంకా చాలాచోట్ల సరైన టాయిలెట్లు లేని బడులు, సురక్షితం కాని రహదారులు, శానిటరీ నాప్‌కిన్‌లు అందుబాటులో లేని పరిస్థితులు ఆడపిల్లలను స్కూల్‌ విద్యకు దూరం చేస్తున్నాయి. కాలేజీ వయసులోకి రాగానే తల్లిదండ్రులు తమ అమ్మాయి ‘ఎటువంటి ప్రభావాలకు లోనవుతుందో’ అనే భయంతో పెళ్లి చేసేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాని నేటి యువతులు చిన్న చిన్న ఉద్యోగాలు చేసైనా సరే ముందు మేము నిలదొక్కుకోవాలి... తర్వాతే వివాహం వైపు రావాలి అని చాలాచోట్ల గట్టిగా గొంతు విప్పగలుగుతున్నారు.

‘నీ వెనుక ఏముంది... ముందు ఏముంది నీకనవసరం... నీలో ఏముంది అనేది ముఖ్యం’ అన్నారు వివేకానంద. ఇవాళ యంగ్‌ అడల్ట్స్‌లోగాని, యువతులలోగాని ఉండాల్సింది ఈ భావనే. ముందు తమను తాము తెలుసుకోవాలి. ఆ సంగతి తల్లిదండ్రులకు తెలియచేయాలి. ఆ తర్వాత ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. దానిని అందుకోవడానికి ప్రయత్నించాలి. కాని నేటి సమస్య ఏమిటంటే యువతులకు తాము ఏమిటో తెలిసినా తల్లిదండ్రుల ఆకాంక్షలకు తల వొంచాల్సి వస్తోంది.

మరోవైపు వారి మీద అటెన్షన్, నిఘా, వేయి కళ్ల కాపలా... ఇవన్నీ వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ‘అదొద్దు ఇది చెయ్‌’ అని అమ్మాయికి చెప్పినంత సులువుగా అబ్బాయికి చెప్పలేని పరిస్థితి నేటికీ ఉందన్నది వాస్తవం. దాంతో పాటు తల్లిదండ్రులు, చుట్టాలు, సమాజం ఆడపిల్లల విషయంలో వారు అన్ని విధాలుగా పర్‌ఫెక్ట్‌గా ఉండాలన్న అంచనా వారిని బాధిస్తోంది. కాని వారికి ఇంట్లో, విద్యాలయాల్లో సరైన దిశ దొరికితే వారు ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారు.

ఇవాళ టెక్నికల్‌ విద్యలో, మెడిసిన్‌లో అమ్మాయిలు రాణిస్తున్నారు. ఎంచుకుని మరీ ర్యాంకులు సాధిస్తున్నారు. మరోవైపు మేనేజ్‌మెంట్‌ రంగాల్లో, సాఫ్ట్‌వేర్‌ ఇండస్ట్రీలో యువతులు రాణిస్తున్నారు. కళారంగాలను ఎంచుకుంటున్నారు. సినిమా రంగ దర్శకత్వ శాఖలో గతంలో యువతులు కనిపించేవారు కాదు. ఇవాళ చాలామంది పని చేస్తున్నారు. విదేశాలకు వెళ్లి చదవడానికి, ఉన్నత ఉద్యోగాలు చేయడానికి వారి దగ్గర పుష్కలంగా ప్రతిభ ఉంది. మనం చేయవలసిందల్లా వారు కనుగొన్న మార్గంలో వారిని వెళ్లనివ్వడమే.

‘జీవితంలో రిస్క్‌ తీసుకో. గెలిస్తే విజేత అవుతావు. ఓడితే ఆ అనుభవంతో దారి చూపగలుగుతావు’ అన్నారు వివేకానంద. ‘ఆడపిల్ల... రిస్క్‌ ఎందుకు’ అనే మాట గతంలో ఉండేది. ఇవాళ కూడా ఉంది కాని ఎందరో యువతులు ఇవాళ పోలీస్, రక్షణ దళాలలో పని చేస్తున్నారు. విమానాలు, హెలికాప్టర్లు ఎగరేస్తున్నారు. యుద్ధ ఓడలు నడుపుతున్నారు. ఈ స్ఫూర్తి కొనసాగుతూ ఉంది. ఈ స్ఫూర్తి కొనసాగాల్సి ఉంది.

పర్వతారోహకులుగా, సోలో ట్రావెలర్సుగా, హెవీ వెహికిల్స్‌ డ్రైవర్లుగా, ప్రమాదకరమైన అసైన్‌మెంట్లు చేసే జర్నలిస్టులుగా ఇలా నేటి యువతులు అద్భుతాలు సాధిస్తున్నారు. యుద్ధ ట్యాంకర్లు మోగుతున్న చోట నిలబడి వారు రిపోర్టింగ్‌ చేసే సన్నివేశాలు స్ఫూర్తినిస్తున్నాయి. స్వామి వివేకానంద ఆశించిన యువత ఇదే. ఇలాంటి యువతకు సమాజం, కుటుంబం దన్నుగా నిలవడమే చేయాల్సింది.

‘మనం ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు కాని వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్టు’ అన్నారు వివేకానంద. స్త్రీ వ్యక్తిత్వ నిర్మాణం కుటుంబ నిర్మాణం అవుతుంది. తద్వారా సమాజ నిర్మాణం అవుతుంది. ఆపై దేశ నిర్మాణం అవుతుంది. నేటి యువతులు కేవలం విద్య, ఉపాధి రంగాలలో రాణించడం కాకుండా ప్రపంచ పరిజ్ఞానం కలిగి, సామాజిక పరిణామాలు గమనిస్తూ, పాటించవలసిన విలువలను సాధన చేస్తూ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి.

నాయకత్వం వహించడానికి ముందుకు రావాలి. చట్ట సభలలో కూచునే శక్తి సామర్థ్యాలు పుణికి పుచ్చుకోవాలి. యువశక్తి దేశాన్ని నడిపించాలి. కాని నేటి సోషల్‌ మీడియా వారిని విపరీతంగా కాలహరణం చేయిస్తోంది. ‘హ్యాపెనింగ్‌’గా ఉండమని ఛోటోమోటా సరదాలకు ఆకర్షిస్తోంది. మిగిలినవారిని ఇమిటేట్‌ చేయమంటోంది. అలా ఉండాలేమోనని కొంతమంది యువతులు డిప్రెషన్‌లోకి వెళ్లాల్సి వస్తోంది.

‘మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులుగా భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు’ అన్నారు వివేకానంద.
నేటి యువ మహిళా శక్తి ఈ మాటను తప్పక గుర్తు పెట్టుకుని ముందుకు సాగాలి. మరిన్ని విజయాలు సాధించాలి.
 
మొదటి అడుగులోనే...
సక్సెస్‌ అయ్యాక సొసైటీ నుంచి పొగడ్తలు వస్తాయి. అదే, ముందే ప్రోత్సాహం ఉంటే అమ్మాయిలు ఎదగడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. నేను, నా బిజినెస్‌ పార్టనర్‌ శ్రుతి బీటెక్‌లో స్నేహితులం. ఇద్దరం కలిసి ‘మాయాబజార్‌’ అని ఫొటోషూట్‌ స్టూడియోను ప్రారంభించాం. మేం ప్రారంభించినప్పుడు ఈ బిజినెస్‌లో పెద్దగా పోటీ లేదు. ఇప్పుడు మేం సక్సెస్‌ అయ్యాం. అందరూ వచ్చి అమ్మాయిలు ఇంత బాగా చేశారు. ఎంత కష్టపడ్డారు... అని అంటుంటారు. కానీ, దీని ప్రారంభంలో మేం పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మా ఇద్దరి అమ్మానాన్నలు నమ్మారు. డబ్బుల విషయం ఒక్కటే కాదు.

అమ్మాయిలు సొంతంగా ఏదైనా పని చేయాలనుకుంటే అందుకు చుట్టుపక్కల అంతా మంచి మద్దతు లభించాలి. మా టెక్నిషియన్స్, వర్కర్స్‌.. ఇప్పుడు సపోర్ట్‌ చేస్తున్నారు. కానీ, మొదట్లో లేదు.‘వీళ్లు అమ్మాయిలు కదా ఏం చేస్తారు?’ అనే ఆలోచన ఉంది. మమ్మల్నే నేరుగా అనేవారు. డబ్బులు పెట్టినా సరే, దాదాపు పదిమందిని అడిగితే ఒకరు ముందుకు వచ్చేవారు. హార్డ్‌వర్క్‌ చేయడానికి అమ్మాయిలు ముందుకు వచ్చినప్పుడు సమాజం నుంచి ‘మీరు అమ్మాయిలు కదా! ఎందుకు మీకు కష్టం..’ అనే అభిప్రాయం వస్తుంది. మొదటి వ్యక్తి నుంచే సరైన రెస్పాన్స్‌ వస్తే.. అమ్మాయిలు సొంతంగా ఎదగడానికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.

– అనూష, శ్రుతి

‘అమ్మాయి కదా’ అని...
అమ్మాయిలు వర్కర్స్‌తో పనిచేయించాలన్నా, ఆర్డర్స్‌ తీసుకునేటప్పుడు, పేమెంట్‌ తిరిగి రాబట్టుకోవడానికి.. అన్ని విధాల రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ‘అమ్మాయి కదా, ఏం కాదులే! అని తేలికగా తీసుకుంటారు. సింగిల్‌గా ఎదగాలంటే అబ్బాయిలకు ఉన్నంత సపోర్ట్‌ ఈ సొసైటీలో అమ్మాయిలకు లేదు. అందుకే ప్రతిభ ఆధారంగానే నా పనితనాన్ని చూపుతాను. మార్కెట్‌ను బట్టి 3–4 ఛాయిస్‌లు వినియోగదారులకు ఇస్తాను.

ఇంటీరియర్‌లో అబ్బాయిల కన్నా అమ్మాయిలకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఇంట్లో ఎక్కడ ఏ వస్తువును ఎలా సర్దుకోవాలో అమ్మాయిలకే బాగా తెలుసు. ఆ విధంగా కూడా నా వర్క్‌ను చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే రాత్రి సమయాల్లో మా కుటుంబం నుంచి సపోర్ట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. సూపర్‌వైజర్‌ ద్వారా హ్యాండిల్‌ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో ‘నేను అమ్మాయిని’ కాదు, నా పనిని ఒక వృత్తిగా భావించండి అని చెప్పుకోవాల్సి రావడం బాధగా ఉంటుంది.ఈ విధానంలో మార్పు అవసరం.

– కాత్యాయని, ఇంటీరియర్‌ డిజైనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement