Mountaineers
-
వర్చువల్ ఎవరెస్ట్ జర్నీ
ఎవరెస్ట్ శిఖరం 360 డిగ్రీల కెమెరా వ్యూ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. వర్చువల్ జర్నీ రూపంలో సరికొత్త అనుభవాన్ని అందిస్తోంది. పర్వతారోహకులు ఎదుర్కొనే కఠినమైన వాతావరణ పరిస్థితులను అనుభవంలోకి తెచ్చేలా ఉంటుంది ఈ వర్చువల్ జర్నీ. స్కిల్డ్ మౌంటెనీర్స్ టీమ్ ఈ ఫుటేజీని కాప్చర్ చేసింది. ‘ఏ 360 డిగ్రీ కెమెరా వ్యూ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్’ కాప్షన్‌తో అష్రఫ్ జక్ర ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వేలాది వ్యూస్‌ను సొంతం చేసుకుంది. పర్వతారోహక బృందం ధైర్యసాహసాలకు, సాంకేతిక నైపుణ్యానికి నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘టాప్ ఆఫ్ ది వరల్డ్! థ్యాంక్‌ఫుల్ ఫర్ గాడ్స్ క్రియేషన్’... నెటిజనుల నుంచి ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. -
1,968 అడుగుల ఎత్తు నుంచి పడ్డా ఏమీ కాలేదు
వెల్లింగ్టన్: భూమి మీద నూకలు ఉండాలేగానీ ఆకాశం నుంచి పడ్డా నిక్షేపంగా ఉంటారనడానికి ప్రబల నిదర్శనమీ ఘటన. ఆశ్చర్యపరిచే ఈ ఘటన న్యూజిలాండ్‌లోని పర్వతసానువుల్లో శనివారం జరిగింది. నార్త్ ఐలాండ్‌లోని టరనకీ పర్వతంపైకి అధిరోహించేందుకు శనివారం పర్వతారోహకుల బృందం బయలుదేరింది. మధ్యాహ్నం సమయంలో 1,968 అడుగుల మేర ఎక్కాక ఓ పర్వతా రోహకుడు అనూహ్యంగా జారి పడిపోయాడు. అయితే, అతడికి స్వల్పంగానే గాయాలయ్యాయి. అక్కడి వాతావరణ పరిస్థితుల ప్రభావంతో అతడు పడిన చోట మంచు మెత్తగా మారడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. అతడు ప్రాణా లతో ఉండటం అద్భుతమైన విషయమని, అతడు చాలా అదృష్టవంతుడని పోలీసులు అంటున్నారు. న్యూజిలాండ్‌లోని అత్యంత ప్రమాదకరమైన పర్వతాల్లో టరనాకీ ఒకటిగా పేర్కొంటారు. ఇదే ప్రాంతం నుంచి 2021లో ఇద్దరు పర్వతారోహకులు జారిపడి మృతి చెందారు. నార్త్ ఐలాండ్‌లోనే నిద్రాణ అగ్నిపర్వతం కూడా ఉంది. ఇతర పర్వతాల నుంచి వేరుపడినట్లుగా దూరంగా ఉండటం, తీరానికి సమీపంలో ఉండటం, వేగంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించడం వంటి పరిస్థితులు న్యూజిలాండ్‌లో టరనాకీ వద్దతప్ప మరెక్కడా లేవని మౌంటెన్ సేఫ్టీ కౌన్సిల్ పేర్కొంది. -
పర్వత పుత్రికలు: శశి, గునిత్, అనుష.. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లకు సైతం
హిమాలయాలు... వింధ్య పర్వతాలు... వీటిని చూడాలని ఎవరికి ఉండదు? రాబోయే వేసవి సెలవుల్లో పర్వత సౌందర్యం చూడాలని చాలామంది అనుకుంటారు. కాని ఆరోగ్య, వయసు సమస్యలు, దివ్యాంగ పరిమితులు కొందరిని భయపెట్టవచ్చు. అయితే ఎవరికైనా సరే పర్వతాలను దగ్గరుండి చూపిస్తాం అంటున్నారు ముగ్గురు మహిళా ట్రెక్ గైడ్లు – శశి, గునిత్, అనుష. పిల్లల నుంచి వృద్ధుల వరకూ అందరికీ వీరు అపరేట్ చేస్తున్న ట్రెక్ టూర్లు అద్భుత పర్వత దర్శనం చేయిస్తున్నాయి. ‘కలగను.. కనుగొను’ అనే ట్యాగ్‌లైన్ ఉంటుంది అనుష, శశి, గునీత్ నడిపే ‘బొహెమియన్ అడ్వంచర్స్’ అనే ట్రెకింగ్ ఏజెన్సీకి. లోకాన్ని చూసి రావాలన్న కలను నెరవేర్చుకోవడానికి దారిని కనుగొనమని, ఆ దారి కనుగొనడంలో తాము సాయం చేస్తామని అంటారు వీరు ముగ్గురు. మన దేశంలో పూర్తిగా స్త్రీలు మాత్రమే నడుపుతున్న ట్రెకింగ్ ఏజెన్సీలలో వీరిది ఒకటి. అయితే వీరి ప్రత్యేకత అంతా పర్వతాలే. ‘డెహరాడూన్లో మా ఆఫీస్ ఉంటుంది. ఉత్తరాఖండ్‌లో, లద్దఖ్‌లో, హిమాలయాల బేస్ క్యాంప్ వరకు, వింధ్య పర్వతాల్లో మేము పర్వతారోహణకు తీసుకెళతాం. ప్రతి ముగ్గురు టూరిస్టులకు ఒక గైడ్ అనే పద్ధతిని మేము పాటిస్తాం.అందుకే వృద్ధులు, పిల్లలు, ఒంటరి స్త్రీలు... ఎవరైనా సరే క్షేమంగా మాతో పాటు ట్రెకింగ్ చేయవచ్చు. మా గైడ్లు కూడా స్ట్రీలే. అందుకే మేము నిర్వహించే పర్వత యాత్రలకు విశేషంగా టూరిస్టులు వస్తారు’ అంటుంది శశి బహుగుణ. 2013లో మొదలు బ్యాంకింగ్ రంగంలో పని చేసే శశి బహుగుణది డెహ్రాడూన్. పబ్లిషింగ్ రంగంలో పని చేసిన గునిత్ పురిది రుద్రపూర్ (ఉత్తరాఖండ్). గతంలో బిజినెస్ జర్నలిస్ట్‌గా పని చేసిన అనుష సుబ్రమణియన్ది ముంబై. వీరు ముగ్గురికీ పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. తరచూ చేసే ట్రెక్కింగ్‌లో ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు. అయితే 2013లో ఉత్తరాఖండ్‌లో వచ్చిన వరదలు వీరు ముగ్గురిని కదిలించాయి. వెంటనే పనులన్నీ ఆపి వరద ప్రాంతాలకు చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పర్యాటకులను కాపాడారు. ఆ సమయంలోనే వారికి అనిపించింది పర్యాటకులను సురక్షితంగా ఉంచే పర్వతారోహణ యాత్రలను నడిపే సంస్థను ప్రారంభించాలని. ‘అబ్రహం లింకన్‌ను గుర్తు చేసుకున్నాం. పర్వతాల వలన పర్వతాల చేత పర్వతాల కొరకు ఇకపై బతకాలని నిర్ణయించుకున్నాం’ అంది శశి బహుగుణ. ట్రెకింగ్‌ను ఎక్కువగా శశి ప్లాన్ చేస్తుంది. గునిత్ వాహనాలు నడపడంలో ఎక్స్పర్ట్. వంటలో కూడా. అనుష మంచి గైడ్. ‘అందువల్ల మేము కారులో హిమాలయాల్లోని ప్రతి మూల తిరిగాము. మాకు తెలియని పర్వత దారులు లేవు’ అంటారు వారు. ప్రతి ఒక్కరికి హక్కుంది ‘పర్వతారోహణ అంటే వయసు, ఆరోగ్యం ఉన్నవాళ్లనే అందరూ అనుమతిస్తారు. కాని మేము ఆ నియమం పెట్టుకోలేదు. ఇన్‌క్లూజివ్ ట్రెకింగ్స్ను నిర్వహించాలనుకున్నాం. అనారోగ్యం ఉన్నవారిని, దివ్యాంగులను కూడా ఆరోహణకు తీసుకెళ్లాలనుకున్నాం. ఎందుకంటే పర్వతాలు అందరివి. అందరికీ వాటిని చూసే హక్కుంది. అందుకే పర్వతాలు చూడాలనుకుని వచ్చేవారి హెల్త్ హిస్టరీ అంతా చెక్ చేస్తాం. వారికి ఇవ్వాల్సిన శిక్షణ ఇస్తాం. అంధులను కూడా చేయి పట్టి 50 కిలోమీటర్ల దూరం మేరకు ట్రెకింగ్‌కు తీసుకెళ్లిన అనుభవం మాకు ఉంది. పార్కిన్సన్ వ్యాధి ఉన్నవాళ్లను కూడా తీసుకెళ్లాం. డయాబెటిక్ పేషెంట్లు కూడా వచ్చారు. అయితే ప్రతి దశలో ఆరోగ్యం చెక్ చేయిస్తూ తీసుకెళతాం. మరీ జటిలంగా మారితే వెంటనే హెలికాప్టర్ తెప్పించి వెనక్కు పంపించేస్తాం’ అంటారు వారు. పహాడీ గైడ్లు అనుష, శశి, గునిత్లు తాము నడుపుతున్న ట్రెకింగ్‌ల కోసం స్థానిక యువతులను గైడ్లుగా తీసుకుని వారికి ఉపాధి కల్పిస్తున్నారు. ‘అందరూ కొండప్రాంతం వారే. లోకల్ గిరిజన యువతులు. వారికి పర్వతాలు కొట్టిన పిండి. అందుకని వారికి తగిన శిక్షణ ఇచ్చి మా టీమ్‌లో కలుపుకున్నాం. మా దృష్టి ముఖ్యంగా 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీలపై ఉంటుంది. వీరు పిల్లలు ఎదిగొచ్చాక పర్యటనలకు వెళదామనుకుంటారు. అటువంటి వారికి సురక్షితమైన ఏజెన్సీలు ఉన్నాయని తెలియాలి. వారు ఊపిరి పీల్చుకుంటే కుటుంబ కార్యక్రమాల్లో మళ్లీ ఫ్రెష్‌గా పడతారు. మా విన్నపం ఏమంటే ఒంటరిగా తిరగాలనుకున్నా మంచి ఏజెన్సీలను చూసి వెళ్లండి వెళ్లనివ్వండి అని చెప్పడమే’ అంటారు. పర్వతాలను చూపడానికి చుక్కానులుగా మారిన ఈ ముగ్గురు అభినంద నీయులు. -
63 ఏళ్ల వయసులో 6,000 కిలో మీటర్ల సైక్లింగ్
ఆయన వయసు 63 సంవత్సరాలు. జెట్ స్పీడ్‌తో సైకిల్ తొక్కుతూ రయ్ రయ్ అంటూ దూసుకెళ్తున్నారు. తొక్కుతున్న సైకిల్ స్పీడ్ చూస్తే 25 ఏళ్ల వయసు ఉన్న యువకుడు అనుకుంటారు. తన ఫేస్‌కు ఉన్న మాస్క్ తీస్తే కానీ తెలియదు ఆయన 60 ఏళ్ళకి పైబడిన వ్యక్తి అని. ఆయనే హైదరాబాద్‌కు చెందిన మేజర్ జనరల్ డాక్టర్ ఆలపాటి వెంకటకృష్ణ (ఏవీకే) మోహన్. సోమవారం హైదరాబాద్ నుంచి సిద్దిపేటలోని రంగనాయకసాగర్‌కు సైక్లింగ్ చేసుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా సాక్షి పలకరించింది. వివరాలు ఆయన మాటల్లోనే... సాక్షి, సిద్దిపేట: మా నాన్న దేవాదాయ శాఖలో విధులు నిర్వర్తించేవారు. కాకినాడలో ఎంబీబీఎస్ పూర్తి చేశాను. 1984లో సికింద్రాబాద్‌లోని మిలటరీ హాస్పిటల్లో డాక్టర్‌గా జాబ్ వచ్చింది. 37 ఏళ్ల పాటు ఆర్మీలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించి ఆర్మీ సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ పుణేలో మెడికల్ హెడ్‌గా మేజర్ జనరల్‌గా ఉద్యోగ విరమణ తీసుకున్నాను. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కౌకూర్‌లో నివాసం ఉంటున్నాను. నా కూతురు ప్రసన్న డెంటల్ స్పెషలిస్ట్ గౌహతిలో ప్రాక్టీస్ చేస్తోంది. పర్వతారోహణ...బైకింగ్: 1991లో ఇటాలియన్లతో కలిసి మౌంట్ సతోపంత్‌కు పర్వతారోహణ యాత్ర చేశా. 2000 సంవత్సరం ప్రారంభంలో కాంగోలోని మౌంట్ నైరాగాంగోలో ప్రత్యక్ష అగ్నిపర్వతం అధిరోహించిన ఆర్మీ బ్రిగేడ్‌లో మొదటి వ్యక్తి నేనే. ఈశాన్యంలోని మొత్తం ఎనిమిది రాష్ట్రాలల్లో బైకింగ్ చేసుకుంటూ తిరిగి వచ్చాను. 2019లో దే«శంలోని మూడు కార్నర్లు తూర్పు, పడమర దక్షణంలో 11,500 కిలో మీటర్లు మోటార్ బైకింగ్ చేశాను. సైక్లింగ్ అంటే ఇష్టంతో: నాకు చిన్నప్పటి నుంచి సైక్లింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. డిసెంబర్ 2014లో చెన్నైకి బదిలీపై వచ్చాను. అప్పటికే చెన్నై నగరంలో ప్రసిద్ధ సైక్లింగ్ గ్రూప్ అయిన చెన్నై జాయ్ రైడర్జ్ ఉంది. అందులో చేరాను. చెన్నై నుంచి విజయవాడ , 2015లో కర్ణాటక, కేరళ , తమిళనాడులో 900 కి.మీ, టూర్ ఆఫ్ నీలగిరీస్ సైక్లింగ్ పర్యటన చేశాను. 2016లో స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైక్లింగ్ చేశాను. జలశక్తి మిషన్ కింద 2019లో కచ్(గుజరాత్) నుంచి గౌహతి(అస్సాం) వరకు 3,200 కిలోమీటర్లు సైక్లింగ్ చేశాను. ఈ నెల 20 నుంచి నెల రోజుల పాటు గోల్డెన్ క్వాడ్రీలెట్రల్ ఈ నెల 20వ తేదీ నుంచి నెల రోజుల పాటు గోల్డెన్ క్వాడ్రీలెట్రల్ సైక్లింగ్ చేయనున్నాను. 6 వేల కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. ఔరంగాబాద్‌లో ప్రారంభమై జార్ఖండ్, వెస్ట్‌బెంగాల్, కోల్‌కతా, చెన్నై, ముంబై, ఢిల్లీ మీదుగా మళ్లీ ఔరంగాబాద్‌కు చేరుకుంటాను. ఇలా నెల రోజుల పాటు సైక్లింగ్ చేస్తాను. ఫిట్నెస్ ఔత్సాహికులకు సలహాలు, మెరుగైన జీవనం వైపు అడుగులు వేసేందుకు ఇతరులకు ఆదర్శంగా ఉండాలనేదే ఆలోచన. (చదవండి: గిన్నిస్ రికార్డు...ఒక్క నిమిషంలో 1,140!) -
నారీ యువ శక్తి గెలుస్తుంది
‘లే.. మేలుకో... లక్ష్యం చేరుకునే దాకా విశ్రమించకు’ అన్నారు స్వామి వివేకానంద. ‘వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం’ అన్నాడాయన. మన దేశంలో 15–25 ఏళ్ల మధ్య యువత 20 కోట్లు. వీరిలో 10 కోట్ల మంది యువతులు. ఇంటర్ వయసు నుంచి ఉద్యోగ వయసు మీదుగా వివాహ వయసు వరకు అమ్మాయిలకు ఎన్నో సవాళ్లు. వివక్షలు. ప్రతికూలతలు. కాని నారీ యువశక్తి వీటిని ఛేదించి ముందుకు సాగుతోంది. జనవరి 12– స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జరుపుకునే ‘జాతీయ యువజన దినోత్సవం’ యువతులకు స్ఫూర్తినివ్వాలి. మార్గం చూపాలి. అంతరిక్షాన్ని చుంబించాలనుకున్న ఒక తెలుగు యువతి ఆ ఘనతను సాధించడం చూశాం. ఇంటి నుంచి బస్టాప్ వరకూ వెళ్లి కాలేజీ బస్సెక్కడానికి పోకిరీల బెడదను ఎదుర్కొంటున్న యువతి నిస్సహాయతను కూడా చూస్తున్నాం. ఇద్దరూ యువతులే. ఒకరు సాధిస్తున్నారు. మరొకరు సాధించడానికి అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. ఈ రెండు బిందువుల మధ్యే భారతీయ టీనేజ్ అమ్మాయిలు, యువతులు తమ గమనాన్ని కొనసాగిస్తున్నారు. ‘కెరటం నాకు ఆదర్శం లేచినా పడినందుకు కాదు... పడినా లేచినందుకు’ అంటారు స్వామి వివేకానంద. గత మూడు నాలుగు దశాబ్దాలలో భారతీయ యువతులు పడినా లేచే ఈ సంకల్పాన్నే ప్రదర్శిస్తున్నారు. బాల్య వివాహాలను నిరాకరిస్తున్నారు. చదువు వైపు మొగ్గుతున్నారు. ఆ తర్వాత ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంకా చెప్పాలంటే జీవిత భాగస్వామి ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. అయితే ఈ పరిస్థితి మధ్యతరగతి, ఆ పై తరగతుల్లో ఎక్కువగా ఉంటే దిగువ, పేద వర్గాలలో సంఘర్షణ కొనసాగించాల్సి వస్తోంది. దేశంలో ఇంకా చాలాచోట్ల సరైన టాయిలెట్లు లేని బడులు, సురక్షితం కాని రహదారులు, శానిటరీ నాప్కిన్లు అందుబాటులో లేని పరిస్థితులు ఆడపిల్లలను స్కూల్ విద్యకు దూరం చేస్తున్నాయి. కాలేజీ వయసులోకి రాగానే తల్లిదండ్రులు తమ అమ్మాయి ‘ఎటువంటి ప్రభావాలకు లోనవుతుందో’ అనే భయంతో పెళ్లి చేసేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాని నేటి యువతులు చిన్న చిన్న ఉద్యోగాలు చేసైనా సరే ముందు మేము నిలదొక్కుకోవాలి... తర్వాతే వివాహం వైపు రావాలి అని చాలాచోట్ల గట్టిగా గొంతు విప్పగలుగుతున్నారు. ‘నీ వెనుక ఏముంది... ముందు ఏముంది నీకనవసరం... నీలో ఏముంది అనేది ముఖ్యం’ అన్నారు వివేకానంద. ఇవాళ యంగ్ అడల్ట్స్లోగాని, యువతులలోగాని ఉండాల్సింది ఈ భావనే. ముందు తమను తాము తెలుసుకోవాలి. ఆ సంగతి తల్లిదండ్రులకు తెలియచేయాలి. ఆ తర్వాత ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. దానిని అందుకోవడానికి ప్రయత్నించాలి. కాని నేటి సమస్య ఏమిటంటే యువతులకు తాము ఏమిటో తెలిసినా తల్లిదండ్రుల ఆకాంక్షలకు తల వొంచాల్సి వస్తోంది. మరోవైపు వారి మీద అటెన్షన్, నిఘా, వేయి కళ్ల కాపలా... ఇవన్నీ వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ‘అదొద్దు ఇది చెయ్’ అని అమ్మాయికి చెప్పినంత సులువుగా అబ్బాయికి చెప్పలేని పరిస్థితి నేటికీ ఉందన్నది వాస్తవం. దాంతో పాటు తల్లిదండ్రులు, చుట్టాలు, సమాజం ఆడపిల్లల విషయంలో వారు అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉండాలన్న అంచనా వారిని బాధిస్తోంది. కాని వారికి ఇంట్లో, విద్యాలయాల్లో సరైన దిశ దొరికితే వారు ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారు. ఇవాళ టెక్నికల్ విద్యలో, మెడిసిన్‌లో అమ్మాయిలు రాణిస్తున్నారు. ఎంచుకుని మరీ ర్యాంకులు సాధిస్తున్నారు. మరోవైపు మేనేజ్మెంట్ రంగాల్లో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో యువతులు రాణిస్తున్నారు. కళారంగాలను ఎంచుకుంటున్నారు. సినిమా రంగ దర్శకత్వ శాఖలో గతంలో యువతులు కనిపించేవారు కాదు. ఇవాళ చాలామంది పని చేస్తున్నారు. విదేశాలకు వెళ్లి చదవడానికి, ఉన్నత ఉద్యోగాలు చేయడానికి వారి దగ్గర పుష్కలంగా ప్రతిభ ఉంది. మనం చేయవలసిందల్లా వారు కనుగొన్న మార్గంలో వారిని వెళ్లనివ్వడమే. ‘జీవితంలో రిస్క్ తీసుకో. గెలిస్తే విజేత అవుతావు. ఓడితే ఆ అనుభవంతో దారి చూపగలుగుతావు’ అన్నారు వివేకానంద. ‘ఆడపిల్ల... రిస్క్ ఎందుకు’ అనే మాట గతంలో ఉండేది. ఇవాళ కూడా ఉంది కాని ఎందరో యువతులు ఇవాళ పోలీస్, రక్షణ దళాలలో పని చేస్తున్నారు. విమానాలు, హెలికాప్టర్లు ఎగరేస్తున్నారు. యుద్ధ ఓడలు నడుపుతున్నారు. ఈ స్ఫూర్తి కొనసాగుతూ ఉంది. ఈ స్ఫూర్తి కొనసాగాల్సి ఉంది. పర్వతారోహకులుగా, సోలో ట్రావెలర్సుగా, హెవీ వెహికిల్స్ డ్రైవర్లుగా, ప్రమాదకరమైన అసైన్మెంట్లు చేసే జర్నలిస్టులుగా ఇలా నేటి యువతులు అద్భుతాలు సాధిస్తున్నారు. యుద్ధ ట్యాంకర్లు మోగుతున్న చోట నిలబడి వారు రిపోర్టింగ్ చేసే సన్నివేశాలు స్ఫూర్తినిస్తున్నాయి. స్వామి వివేకానంద ఆశించిన యువత ఇదే. ఇలాంటి యువతకు సమాజం, కుటుంబం దన్నుగా నిలవడమే చేయాల్సింది. ‘మనం ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు కాని వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్టు’ అన్నారు వివేకానంద. స్త్రీ వ్యక్తిత్వ నిర్మాణం కుటుంబ నిర్మాణం అవుతుంది. తద్వారా సమాజ నిర్మాణం అవుతుంది. ఆపై దేశ నిర్మాణం అవుతుంది. నేటి యువతులు కేవలం విద్య, ఉపాధి రంగాలలో రాణించడం కాకుండా ప్రపంచ పరిజ్ఞానం కలిగి, సామాజిక పరిణామాలు గమనిస్తూ, పాటించవలసిన విలువలను సాధన చేస్తూ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి. నాయకత్వం వహించడానికి ముందుకు రావాలి. చట్ట సభలలో కూచునే శక్తి సామర్థ్యాలు పుణికి పుచ్చుకోవాలి. యువశక్తి దేశాన్ని నడిపించాలి. కాని నేటి సోషల్ మీడియా వారిని విపరీతంగా కాలహరణం చేయిస్తోంది. ‘హ్యాపెనింగ్’గా ఉండమని ఛోటోమోటా సరదాలకు ఆకర్షిస్తోంది. మిగిలినవారిని ఇమిటేట్ చేయమంటోంది. అలా ఉండాలేమోనని కొంతమంది యువతులు డిప్రెషన్లోకి వెళ్లాల్సి వస్తోంది. ‘మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులుగా భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు’ అన్నారు వివేకానంద. నేటి యువ మహిళా శక్తి ఈ మాటను తప్పక గుర్తు పెట్టుకుని ముందుకు సాగాలి. మరిన్ని విజయాలు సాధించాలి. మొదటి అడుగులోనే... సక్సెస్ అయ్యాక సొసైటీ నుంచి పొగడ్తలు వస్తాయి. అదే, ముందే ప్రోత్సాహం ఉంటే అమ్మాయిలు ఎదగడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. నేను, నా బిజినెస్ పార్టనర్ శ్రుతి బీటెక్‌లో స్నేహితులం. ఇద్దరం కలిసి ‘మాయాబజార్’ అని ఫొటోషూట్ స్టూడియోను ప్రారంభించాం. మేం ప్రారంభించినప్పుడు ఈ బిజినెస్‌లో పెద్దగా పోటీ లేదు. ఇప్పుడు మేం సక్సెస్ అయ్యాం. అందరూ వచ్చి అమ్మాయిలు ఇంత బాగా చేశారు. ఎంత కష్టపడ్డారు... అని అంటుంటారు. కానీ, దీని ప్రారంభంలో మేం పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మా ఇద్దరి అమ్మానాన్నలు నమ్మారు. డబ్బుల విషయం ఒక్కటే కాదు. అమ్మాయిలు సొంతంగా ఏదైనా పని చేయాలనుకుంటే అందుకు చుట్టుపక్కల అంతా మంచి మద్దతు లభించాలి. మా టెక్నిషియన్స్, వర్కర్స్.. ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. కానీ, మొదట్లో లేదు.‘వీళ్లు అమ్మాయిలు కదా ఏం చేస్తారు?’ అనే ఆలోచన ఉంది. మమ్మల్నే నేరుగా అనేవారు. డబ్బులు పెట్టినా సరే, దాదాపు పదిమందిని అడిగితే ఒకరు ముందుకు వచ్చేవారు. హార్డ్‌వర్క్ చేయడానికి అమ్మాయిలు ముందుకు వచ్చినప్పుడు సమాజం నుంచి ‘మీరు అమ్మాయిలు కదా! ఎందుకు మీకు కష్టం..’ అనే అభిప్రాయం వస్తుంది. మొదటి వ్యక్తి నుంచే సరైన రెస్పాన్స్ వస్తే.. అమ్మాయిలు సొంతంగా ఎదగడానికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. – అనూష, శ్రుతి ‘అమ్మాయి కదా’ అని... అమ్మాయిలు వర్కర్స్‌తో పనిచేయించాలన్నా, ఆర్డర్స్ తీసుకునేటప్పుడు, పేమెంట్ తిరిగి రాబట్టుకోవడానికి.. అన్ని విధాల రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ‘అమ్మాయి కదా, ఏం కాదులే! అని తేలికగా తీసుకుంటారు. సింగిల్‌గా ఎదగాలంటే అబ్బాయిలకు ఉన్నంత సపోర్ట్ ఈ సొసైటీలో అమ్మాయిలకు లేదు. అందుకే ప్రతిభ ఆధారంగానే నా పనితనాన్ని చూపుతాను. మార్కెట్‌ను బట్టి 3–4 ఛాయిస్‌లు వినియోగదారులకు ఇస్తాను. ఇంటీరియర్‌లో అబ్బాయిల కన్నా అమ్మాయిలకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఇంట్లో ఎక్కడ ఏ వస్తువును ఎలా సర్దుకోవాలో అమ్మాయిలకే బాగా తెలుసు. ఆ విధంగా కూడా నా వర్క్‌ను చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే రాత్రి సమయాల్లో మా కుటుంబం నుంచి సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సూపర్వైజర్ ద్వారా హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో ‘నేను అమ్మాయిని’ కాదు, నా పనిని ఒక వృత్తిగా భావించండి అని చెప్పుకోవాల్సి రావడం బాధగా ఉంటుంది.ఈ విధానంలో మార్పు అవసరం. – కాత్యాయని, ఇంటీరియర్ డిజైనర్ -
స్విస్ ఆల్ఫ్స్ సాహస యాత్రకు సైఅంటున్న ట్విన్ సిస్టర్స్..
స్విట్జర్లాండ్ టూరిజం బోర్డ్ ‘హండ్రెడ్ పర్సంట్ ఉమెన్ పీక్ ఛాలెంజ్’ కార్యక్రమాన్ని చేపట్టింది. సాహసిక బాటలో ‘ఉమెన్–వోన్లీ’ బృందాలను నడిపించడానికి ఈ సవాలుకు శ్రీకారం చుట్టారు. ప్రపంచవ్యాప్తంగా 250 మంది మహిళలు ఈ ఛాలెంజ్‌లో భాగం అయ్యారు. ఈ బృందంలో కాలు తిరిగిన పర్వతారోహకులతో పాటు, ఇప్పుడిప్పుడే సాహసానికి సై అంటున్న ఉత్సాహవంతులూ ఉన్నారు. స్విస్ ఆల్ఫ్స్లో 48కి పైగా ఉన్న నాలుగువేల మీటర్ల ఎత్తయిన పర్వత శిఖరాలను అధిరోహించడం వీరి లక్ష్యం. మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి సౌదీ అరేబియా మహిళ రహ మెహ్రక్ కూడా ఈ బృందంలో ఉంది. ‘ఆల్ఫ్స్ పర్వతశ్రేణులు అంటే భౌగోళిక ప్రాంతాలు కాదు. నిజంగా మనం జీవించే ప్రదేశాలు’ అంటుంది మెహ్రక్. ఇక మనదేశం విషయానికి వస్తే తషి, నుంగ్షీ మాలిక్‌లు ఈ బృందంలో ఉన్నారు. వీరి పేరు కనిపించగానే వినిపించే మాట... ఎవరెస్ట్ ట్విన్స్! మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి ట్విన్ సిస్టర్స్‌గా వీరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ‘ఈ సంవత్సరం మాకు చిరకాలం గుర్తు ఉంటుంది. దీనికి కారణం హండ్రెడ్ పర్సంట్ ఉమెన్ పీక్ ఛాలెంజ్. ఎంతో ఉత్సాహంతో ఇందులో భాగం అయ్యాం’ అంటుంది తషి మాలిక్. ‘కన్న కల త్వరగా సాకారం అయితే ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పడానికి మాటలు చాలవు. నిజానికి పర్వతారోహణ విషయంలో మా ప్రాధాన్యతల జాబితాలో స్విస్ ముందు వరసలో ఉంది. ఈ గ్లోబల్ ఛాలెంజ్‌లో భాగం కావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాం’ అంటుంది నుంగ్షీ మాలిక్. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్)కు చెందిన మాలిక్ సిస్టర్స్ పద్ధెనిమిది సంవత్సరాల వయసులో సరదాగా పర్వతారోహణ మొదలుపెట్టారు. అయితే మౌంట్ రుదుగైరను తొలిసారి అధిరోహించిన తరువాత వారి దృక్పథంలో మార్పు వచ్చింది. ‘సరదా’ స్థానంలో ‘అంకితాభావం’ వచ్చి చేరింది. ‘ఈ ఛాలెంజ్‌లో భాగం కావడం వల్ల, మాలాంటి భావాలు ఉన్న ఎంతోమందితో పరిచయం ఏర్పడింది. కొత్త విషయాలు తెలుసుకున్నాం. కొత్త ఉత్సాహం వచ్చింది’ అంటుంది తషి. పర్వతారోహణ... అనగానే అదేదో పురుషులకు మాత్రమే సంబంధించిన అంశంగా చూసేవారు. ఈ ధోరణిని చెరిపేసి మహిళలు రికార్డ్‌లు సృష్టించారు. తమ సత్తా చాటారు. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వతారోహకులలో పురుషులతో పోలిస్తే స్త్రీలు చాలా తక్కువగా ఉన్నారు. ‘హండ్రెడ్ పర్సంట్ ఉమెన్ పీక్ ఛాలెంజ్’లాంటివి విరివిగా చేపడితే రానున్న పదిసంవత్సరాల కాలంలో పర్వతారోహణలో స్త్రీల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందనేది ఒక అంచనా. ఇప్పటివరకు మాలిక్ సిస్టర్స్ మూడు శిఖరాలను విజయవంతంగా అధిరోహించారు. వారి కోసం మరిన్ని విజయాలు ఎదురుచూస్తున్నాయి -
ఎవరెస్ట్.. ఇక అందరూ ఎక్కలేరు!
కాఠ్మండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని ఇకపై ఎవరు పడితే వారు అధిరోహించే అవకాశం లేదు. ఎవరెస్ట్ శిఖరంపై పర్వతారోహకుల మరణాలు, ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో ఎవరెస్ట్ అధిరోహణపై కొన్ని నిబంధనలు విధించాలని నేపాల్ పర్యాటక శాఖ ఆలోచిస్తుంది. అధిరోహకులకు కనీస అర్హతలు ఉండేలా చూడనుంది. ఎక్కువ తాళ్ల ఏర్పాటు, ఆక్సిజన్, ఎక్కువ షెర్పాలను తీసుకెళ్లడం వంటి నిబంధనలు తీసుకురానున్నట్లు నేపాల్ పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు. టిబెట్ ప్రభుత్వం కేవలం 300 మందికి ఎవరెస్ట్‌ను అధిరోహించే అవకాశం కల్పిస్తుండగా నేపాల్ అపరిమితంగా పర్వతారోహకులకు అనుమతి మంజూరు చేస్తోంది. 11 వేల కిలోల చెత్త: ఎవరెస్ట్‌ను శుద్ధి చేసేందుకు నేపాల్ ప్రభుత్వం రెండు నెలల పాటు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా మొత్తం 11 వేల కిలోల చెత్తతో పాటు నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. -
శిఖరం అంచున విషాద యాత్ర..
ఎడ్ డ్రోహింగ్.. అమెరికాలోని అరిజోనాకు చెందిన వైద్యుడు.. అతడి జీవిత కాల స్వప్నం ఒక్కటే.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్టును అధిరోహించాలని.. సరిగ్గా రెండ్రోజుల క్రితం.. ఎడ్ డ్రోహింగ్ ఎవరెస్టు శిఖరాగ్రానికి చాలా దగ్గరగా వచ్చేశాడు.. యాహూ అందామనుకున్నాడు. కానీ అక్కడి పరిస్థితిని చూసి షాక్ తిన్నాడు.. తన కళ్లను తానే నమ్మలేకపోయాడు.. కూరగాయల మార్కెట్లా కిటకిటలాడుతోంది.. శిఖరాగ్రంపై పర్వతారోహకులు సెల్ఫీలు తీసుకోవడానికి ఒకరినొకరు తోసుకుంటున్నారు... గట్టిగా చూస్తే.. రెండు టేబుల్ టెన్నిస్ టేబుల్స్ పట్టేంత జాగా ఉంటుందేమో అక్కడ.. ఓ 20 మంది పర్వతారోహకులు.. వారి గైడ్లు.. షెర్పాలు కిక్కిరిసిపోయారు.. దీంతో అందరిలాగే తానూ లైనులో వెయిట్ చేయాల్సి వచ్చింది.. చాలా నెమ్మదిగా కదులుతోంది లైను.. దారిలో ఓ మహిళ శవం.. ఎవరెస్టును అధిరోహించి.. తిరిగి వస్తూ.. చనిపోయిందట.. తొక్కేయాల్సిందే.. జస్ట్‌లో మిస్సయ్యాడు.. అక్కడి పరిస్థితి చాలా దారుణంగా కనిపించింది..అదొక జూలాగ అనిపించింది. తోటి వారి శవాలు పక్కనే పడి ఉన్నా..పట్టనట్లుగా.. ఎవరికివారు పోతున్నారు.. మానవత్వం అక్కడే గొంతు కోసుకుని మరణించినట్లు అనిపించింది. – ఎడ్ డ్రోహింగ్.. ఎవరెస్టుపై గత వారం రోజుల్లో 11 మంది చనిపోయారు.. కొందరు తమ కలను సాకారం చేసుకునే ప్రయత్నంలో.. కొందరు విజయగర్వంతో తిరిగివస్తూ.. అశువులు బాసారు.. ఇందులో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. 1922 నుంచి ఇప్పటివరకూ ఇక్కడ 200 మందికిపైగా చనిపోయి ఉంటారని అంచనా. కానీ ఇక్కడ వారంలోనే ఇంతమంది చనిపోయారు. అలాగని ఈ మరణాలకు కారణం.. మంచు తుపాన్లు కాదు.. అతి వేగంగా వీచే శీతల గాలులు కానే కాదు.. మరేంటి? ఎన్నడూ లేనంత రద్దీనా.. ప్రభుత్వ నిర్లక్ష్యమా? ఇంకేంటి? గతంలో పలుమార్లు ఈ శిఖరాన్ని అధిరోహించినవారు ఏం చెబుతున్నారు? ఓసారి చూద్దామా.. 26 వేల అడుగులు దాటితే.. ఈసారి ఎవరెస్టుపై ఎన్నడూ లేనంత రద్దీ కనిపించిందని చెబుతున్నారు. దీనికితోడు పర్వతారోహణ విషయంలో సరైన అనుభవం లేని వారు ఎక్కువగా ఉండటం కూడా మరణాలకు ప్రధాన కారణమని అనుభవజ్ఞులైన పర్వతారోహకులు చెబుతున్నారు. ‘ఈ మధ్య థ్రిల్ కోరుకునేవారు ఎక్కువైపోయారు. దీన్ని క్యాష్ చేసుకునే కంపెనీలు కూడా ఎక్కువయ్యాయి. ఈ అడ్వెంచర్ కంపెనీలకు డబ్బే ప్రధానమైపోయింది. అర్హత లేని గైడ్లు, షెర్పాలను పనిలో పెట్టుకున్నారు. అటు పర్వతారోహణ చేయాలనుకుంటున్నవాళ్లకు సరైన అనుభవం ఉందా వారు ఎవరెస్టు వంటి శిఖరాన్ని అధిరోహించగలరా వంటివేమీ చూసుకోవడం లేదు’ అని ఎవరెస్టును పలుమార్లు అధిరోహించిన అలెన్ చెప్పారు. నువ్వు పోలీసు అవ్వాలంటేనే పలు టెస్టులు పాసవ్వాలి.. అలాంటిది ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం అధిరోహించడానికి నీకు తగిన అర్హత ఉండాల్సిన అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. నిజానికి 25–26 వేల అడుగులు దాటామంటే.. పర్వతారోహకులకు అది డెత్ జోన్ కిందే లెక్క. మైండ్, బాడీ సరిగా పనిచేయవు. ప్రతి నిమిషం విలువైనదే. ఎవరెస్టు ఎత్తు 29,029 అడుగులు.. అంత పైకి వెళ్తున్నప్పుడు చివరి దశలో వారు తమ వద్ద ఉన్న బ్యాగేజీనంతటినీ వదిలేస్తారు.. వెళ్లి, తిరిగిరావడానికి వీలుగా కంప్రెస్డ్ ఆక్సిజన్ క్యాన్లను మాత్రమే తీసుకెళ్తారు. వారు నిర్ణీత సమయంలో శిఖరాగ్రానికి వెళ్లి తిరిగి వచ్చేయాలి. లేదంటే.. ఆక్సిజన్ అయిపోయి చనిపోతారు. అనుభవం లేని పర్వతారోహకులు వేగంగా తిరిగి రాలేకపోవడం వంటివి జరిగాయని షెర్పాలు చెబుతున్నారు. అదే సమయంలో అనుభవజ్ఞులైన వారు కూడా చనిపోయారు. దీనికి కారణం.. ఎప్పుడూ లేనంత ట్రాఫిక్ జామే.. లైనులో గంటల తరబడి వేచి ఉండటం వల్ల ఆక్సిజన్ అయిపోయి ఉంటుంది.. లేదా శరీరంలో విపరీతమైన మార్పులు ఏర్పడటం వంటివి జరిగి ఉంటాయని పేర్కొంటున్నారు. ట్రాఫిక్ జామ్ వల్ల ఇబ్బంది ఉంటుందని తెలిసినా.. చివరి దశకు వచ్చేసరికి కొందరు మొండిగా ముందుకు పోతారని.. దాని వల్ల కూడా మరణాలు సంభవిస్తాయని చెబుతున్నారు. ‘మే నెల ఎవరెస్టు అధిరోహణకు సరైన సమయం.. ఆ నెలలోనూ కొన్ని రోజుల్లోనే అక్కడంతా క్లియర్‌గా.. గాలులు తక్కువగా ఉంటాయి.. ఆ సమయంలో శిఖరాగ్రం చేరుకోవడం సులభం.. దాంతో.. ఒకే సమయంలో ఎక్కువ మంది అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నించారు. దీంతో చాలామంది చనిపోయారు’ అని అలెన్ చెప్పారు. నేపాల్ ప్రభుత్వ నిర్లక్ష్యం.. ‘ఎవరెస్టును రెండువైపుల నుంచి ఎక్కవచ్చు. ఒకటి నేపాల్.. మరొకటి చైనా వైపు నుంచి.. నేపాల్ ఓ పేద దేశం.. దీనిపై వచ్చే డాలర్ల కొద్దీ ఆదాయాన్ని మాత్రమే చూస్తోంది తప్ప.. నిబంధనలను పట్టించుకోవడం లేదు. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 400 మందికి పర్మిట్లు జారీ చేసింది. అదే చైనా చూస్తే 150 మందికే అనుమతి ఇచ్చింది. జామ్‌కు ఇదీ ఒక కారణం. ఇలా నిబంధనలను ఉల్లంఘిస్తూ పోతే.. మరణాలు పెరుగుతూనే ఉంటాయి’ అని మరో పర్వతారోహకుడు ఆడ్రియన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మధ్య అర్హత లేని కొన్ని కంపెనీలపై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది.. అందులో నేపాల్‌కు చెందినవి అత్యధికంగా ఉన్నాయి. మరణాలు కూడా ఇటు వైపు నుంచి అధిరోహించినవారివే ఉండటం ఇక్కడ గమనార్హం. అయితే.. నేపాల్ ఉన్నతాధికారులు దీన్ని కొట్టిపడేస్తున్నారు. మరణాలకు కారణం.. ఓవర్‌క్రౌడింగ్ కాదని.. శిఖరాగ్రాన్ని అధిరోహించేందుకు వాతావరణపరంగా అనుకూలించే రోజులు పరిమితంగా ఉండటం వల్ల ఇలా జరిగిందని అంటున్నారు. పర్వతారోహకుల సంఖ్యను నియంత్రించడం ఎందుకు.. పూర్తిగా ఆపేస్తే పోలా అంటూ తేలికగా తీసిపారేస్తున్నారు. కళ్లముందే కూలిపోయినా సాయం చేయలేని పరిస్థితి..నీ దగ్గర ఉన్న ఆక్సిజన్ ఇస్తే..తర్వాత ఆక్సిజన్ అయిపోయి..చనిపోయేది నువ్వే.. ఏది ముఖ్యం.. మానవత్వమా? లేక మనం బతికుండటమా అన్న ప్రశ్న వచ్చినప్పుడు.. మానవత్వాన్ని మంచులో సమాధి చేసి ముందుకు సాగాల్సిందే. ఫాతిమా, పర్వతారోహకురాలు, లెబనాన్ - సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఎవరెస్ట్‌పై ట్రాఫిక్ జామ్.. ఇద్దరి మృతి
కఠ్మాండు: ఎవరెస్ట్ పర్వతంపై ట్రాఫిక్ ఏంటని ఆలోచిస్తున్నారా? మీరు చదివింది నిజమే..! ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ అనే విషయం మీలో చాలా మందికి తెలిసిందే. ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ఎంతోమంది పర్వతారోహకులు ఆసక్తి చూపిస్తూంటారు. అయితే తాజాగా వివిధ దేశాలకు చెందిన 200 మంది పర్వతారోహకులు ఒకేసారి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నించారు. ఒకేసారి వందల సంఖ్యలో ట్రెక్కర్స్ రావడంతో.. పర్వత శిఖరానికి చేరుకునేమార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో గంటలపాటు ముందుకు వెళ్లలేక, వెనక్కు వెళ్లలేక క్యూలో వేచి ఉన్నారు. ఈ విషయాన్ని పర్యాటకశాఖకు చెందిన అధికారి జ్ఞానేంద్ర శ్రేష్ఠ తెలిపారు. వసంత రుతువు కావడంతో ప్రభుత్వం 381 మందికి పర్వతాన్ని అధిరోహించడానికి అనుమతి ఇచ్చింది. ఈ కారణంగానే వందలాది మంది ఒకేసారి పర్వతంపైకి చేరుకోడానికి ఆసక్తి కనబర్చారు. ప్రతి ఏడాది మార్చి నుంచి జూన్ వరకు మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించే వారి సంఖ్య వందల్లో ఉండటం విశేషం. ఇదిలా ఉంటే... 1953 నుంచి ఇప్పటివరకు 4,400 మందికిపైగా మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఇద్దరి భారతీయుల మృతి ఓవైపు ట్రాఫిక్ జామ్ ఎక్కువవగా... దురదృష్టం కొద్దీ అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంచుతో కూడిన గాలులు ప్రాణాలు తీస్తున్నాయి. శిఖరాన్ని అధిరోహించి గురువారం మధ్యాహ్నం తిరిగి కిందకి వస్తున్న భారతీయ మహిళ కల్పనా దాస్(52) అనే చనిపోయారు. మరో భారతీయుడు నిహాల్ భగవాన్(27) కూడా అదే విధంగా మృతిచెందారు. ఆయన కిందకి వస్తున్నప్పుడు దాదాపు 12 గంటల పాటూ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. చివరకు చనిపోయారు. -
ఎవరెస్ట్‌పై అదనపు నిచ్చెనలు, తాళ్లు
కఠ్మాండు: గతేడాది సంభవించిన భూకంపంతో దెబ్బతిన్న ఎవరెస్ట్ శిఖరంపై అవసరమైన చోట్ల నిచ్చెనలు, తాళ్లను బిగిస్తున్నట్లు నేపాల్ పర్వతారోహణ అసోసియేషన్ తెలిపింది. పర్వతంపై వాలులో పగుళ్లు, రంధ్రాలు ఏర్పడడంతో పర్వతారోహణకు ఎక్కువ సమయం పడుతోందని అసోషియేషన్ ఛైర్మన్ అంగ్ షేరింగ్ షేర్పా చెప్పారు. పగుళ్ల వల్ల ఈ సారి మరిన్ని నిచ్చెనల అవసరముందని అడ్డంకుల్ని తొలగించే బృందాలు చెప్పాయన్నారు. ప్రతి ఏటా అల్యూమినియం నిచ్చెనలు, తాళ్ల ఏర్పాటుకు ఆరుగురి బృందం పనిచేసేదని, ఈ సారి పదిమంది అవసరమయ్యారన్నారు. పర్వతారోహకుల కోసం ప్రతి ఏడాది మరమ్మతుల బృందం బేస్ క్యాంప్ నుంచి మార్గాన్ని సిద్ధం చేస్తుంది. అవసరమైన చోట్ల నిచ్చెనలు, తాళ్లు అమరుస్తుంది.