16 ఏళ్ల వయసులోనే మౌంటీ మనస్లు పర్వతారోహణ
తాజాగా శిషాపంగ్మాను అధిరోహించిన రింజి
అవమానాలే అవకాశాలుగా మలచుకుని, తండ్రి స్ఫూర్తితో ‘పర్వతా’లంత కీర్తి సాధించాడు నేపాల్‌కు చెందిన పర్వతారోహకుడు నిమా రింజి షెర్పా. తాము కేవలం సహాయకులమే కాదనీ, పర్వతాలనూ అధిరోహించగలమని నిరూపిస్తూ ప్రపంచంలో 8వేల మీటర్ల పైచిలుకు ఉన్న పర్వతాలను ఎక్కి ‘షెర్పా’ కీర్తి పతాకను రెపరెపలాడించాడు. తాజాగా చైనాలోని శిషాపంగ్మా శిఖరాగ్రానికి చేరుకున్న అతి పిన్నవయస్కుడిగా రికార్డ్ సాధించాడు.
నేపాల్‌లోని హిమాలయ పర్వత సాణువుల్లో ‘షెర్పా’ సామాజిక వర్గం పర్వతారోహకులకు సహాయకులుగా ఉంటారు. తరచూ వారి నుంచి ‘షెర్పా’ సామాజిక వర్గానికి చీత్కారాలు ఎదురయ్యేవి. చిన్నప్పటి నుంచి వీటిని కళ్లారా చూసిన రింజి, ఈ పరిస్థితిని మార్చాలనుకున్నాడు. పర్వతారోహకుల నుంచి మెలకువలు నేర్చుకున్నాడు. ఆక్రమంలోనే 2022లో తన 16 ఏట మౌంట్ మనస్లు (8163మీ) శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించాడు . – ఏపీ సెంట్రల్ డెస్క్
మరిన్ని పర్వతాల అధిరోహణ..
2022లో మౌంట్ మనస్లు (8163మీ) శిఖరాన్ని అధిరోహించడం ద్వారా అతి పిన్న వయసులో ఈ పర్వతాన్ని ఎక్కిన యువకుడిగా రికార్డు సాధించాడు. అనంతరం మే 2023లో 17 సంవత్సరాల వయసులో కేవలం 10 గంటల వ్యవధిలో మౌంట్ ఎవరెస్ట్ (8848.86మీ), మౌంట్ లోట్సే (8516మీ) పర్వతాలను అధిరోహించడంతో అతని కెరీర్‌లో అతి పెద్ద విజయాన్ని సాధించినట్లయింది.
స్ఫూర్తినిచ్చిన విజయం..
తాను సాధించిన విజయాలను బాటలుగా ఎంచుకుని 2023 జూలైలో మౌంట్ గాషెర్‌బ్రీమ్–1 (8068మీ), మౌంట్ గషెర్‌బ్రీమ్–2 (8035మీ), మౌంట్ బ్రాడ్‌పీక్ (8047మీ), మౌంట్ కె–2 (8611మీ), సెప్టెంబర్‌లో మౌంట్ ధౌలగిరి (8167మీ), అక్టోబర్‌లో చో–ఓయు పర్వతం (8188మీ)లను అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
కలతచెందిన మనసు
అయితే శిషాపంగ్మా పర్వతాన్ని అధిరోహిస్తున్న సమయంలో హిమపాతం కారణంగా నలుగురు అధిరోహకులు మరణించడంతో తాత్కాలికంగా విరామం తీసుకున్నాడు. దీనిపై స్పందిస్తూ మరణించిన నలుగురిలో తనకు ఒకరు స్నేహితుడని, అతడితో కలిసి పాకిస్తాన్‌లో ఐదు పర్వతాలను అధిరోహించినట్లు తెలిపాడు.
తనకు మార్గదర్శిలాంటివాడని, కానీ హిమపాతంలో చిక్కుకుని మరణించడం మనసును కలచివేసిందని రింజి షెర్పా చెప్పాడు. ఇక 2024 ఆరంభంలో మళ్లీ పర్వతారోహణకు అవకాశం రాగా, ఏప్రిల్‌లో మౌంట్ అన్నపూర్ణ (8091), మే 4లో మకాలు (8485మీ) పర్వతాలను అధిరోహించగా, తాజాగా శిషాపంగ్మాను అధిరోహించడం ద్వారా రికార్డు నెలకొల్పాడు.
Comments
Please login to add a commentAdd a comment